పెద్దవాళ్ల దగ్గర వినయంగా, విధేయతగా, అణకువగా మెలగడం మంచి లక్షణమంటారు. ఆ పెద్దవాళ్లు తమ పెద్దరికం నిలుపుకునేంతవరకూ... చిన్నవాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనంతకాలమూ ఇది నిజంగా మంచి లక్షణమే. ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నా అగ్రరాజ్యం అమెరికా దగ్గర దశాబ్దాలుగా వినయాన్ని, విధేయతనూ ప్రదర్శించడం మాత్రమే అలవాటైన మన పాలకులు తొలిసారి జూలువిదిల్చారు. అమెరికాపై దౌత్యయుద్ధానికి దిగారు. న్యూయార్క్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే విషయంలో అతిగా ప్రవర్తించిన అమెరికా చర్యను నిరసిస్తూ వరస చర్యలు తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రతినిధి బృందాన్ని కలవడానికి లోక్‌సభ స్పీకర్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ వరకూ అందరూ నిరాకరించారు.
నరేంద్రమోడీనుంచి రాహుల్‌గాంధీ వరకూ అధికార, విపక్ష నేతలందరూ తొలిసారి ఒకే మాట మాట్లాడారు. అంతేకాదు... మన ప్రభుత్వం అమెరికా రాయబార కార్యాలయంవద్ద చాన్నాళ్లుగా ఉంటున్న బారికేడ్లను తీయించింది. అమెరికా దౌత్యకార్యాలయాల్లో, వారి ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి చెల్లిస్తున్న వేతనాల వివరాలూ, వారి బ్యాంకు ఖాతాల వివరాలూ ఇవ్వాలని హుకుంజారీచేసింది. అమెరికా సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకూ ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డుల్ని వెనక్కు ఇవ్వాలని ఆదేశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇన్నాళ్లుగా అమెరికా దౌత్య సిబ్బంది అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాలన్నిటికీ స్వస్తి పలికింది. అంతక్రితం భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి దేవయాని విషయంలో వ్యవహరించిన తీరుకు తీవ్ర నిరసనను, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్యల్లో ఉక్రోషం కనబడవచ్చు. ఉద్రేకం కనబడవచ్చు. మనవాళ్లలో తరచుగా దర్శనమిచ్చే నెమ్మదితనం మాయమైనట్టు అనిపించవచ్చు. కానీ, ఎప్పుడూ మృదువుగానే మాట్లాడదామనుకుంటే కుదరదు. మంద్రంగా ఉన్నా సరిపోదు. ఒక్కోసారి పొలికేక అవసరమవుతుంది. చెవులు చిల్లులుపడేలా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు మన దేశం ఆ పనేచేసింది.
దేవయాని ఖోబ్రగడే తనవద్ద పనిచేయించడానికి భారత్‌నుంచి తీసుకెళ్లిన సహాయకురాలికి చట్టప్రకారం ఇవ్వాల్సిన వేతనంకంటే తక్కువ ఇచ్చారని, ఆమెకు సంబంధించిన వివరాలను అందజేయడంలో మోసానికి పాల్పడ్డారని అమెరికా ప్రధాన ఆరోపణలు. మన ప్రభుత్వం దౌత్యకార్యాలయాల్లో చెల్లించమని నిర్దేశించిన వేతనాన్నే సహాయకురాలికి చెల్లించామని దేవయాని తండ్రి చెబుతున్నారు. దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానికి మన ప్రభుత్వం చెల్లించే వేతనం నెలకు 4,120 డాలర్లుకాగా, తమ చట్టాల ప్రకారం సహాయకురాలికి ఆమె నెలకు 4,500 డాలర్లు చెల్లించి తీరాలని అమెరికా చేస్తున్న వాదన. ఇందులో సహేతుకత ఏపాటో విచారణ తర్వాత తేలుతుంది. కానీ, ఆ ఆరోపణలను ఆసరాచేసుకుని దేవయానిపట్ల అనుచితంగా ప్రవర్తించారు. పిల్లల్ని దించడానికి పాఠశాలకు వెళ్తే అక్కడికక్కడే ఆమెను చుట్టుముట్టి నిర్బంధంలోకి తీసుకుని సంకెళ్లువేశారు. అటు తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె దుస్తులు తీయించి తనిఖీచేశారు. అనంతరం ఆమెను మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్నవారితోపాటు బంధించారు. డీఎన్‌ఏ శాంపుల్ తీసుకున్నారు. న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇచ్చేలోగానే ఇవన్నీ జరిగిపోయాయి. భారత్ వ్యక్తం చేసిన నిరసన చెవికెక్కకపోగా తమ అధికారులను అమెరికా సమర్థించుకో జూసింది. దేవయాని చేసిన పని దౌత్యవేత్తగా ఆమె విధుల్లో భాగం కాదు గనుక దౌత్యవేత్తలకు వర్తించే వియన్నా ఒప్పందంలోని అంశాలు ఆమెకు వర్తించబోవని దబాయించింది.
నిజానికి అమెరికా మన దేశానికి సంబంధించిన ప్రముఖులతో ఇలా వ్యవహరించడం ఇది మొదటిసారి కాదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఒకటికి రెండుసార్లు తనిఖీల పేరుతో అవమానించారు. అంతక్రితం అప్పటి ప్రధాని వాజపేయికి, అప్పటి రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్, విదేశాంగ శాఖ మాజీమంత్రి ఎస్‌ఎం కృష్ణలకు కూడా ఇలాగే జరిగింది. సుప్రసిద్ధ నటులు షారుఖ్ ఖాన్ , కమల్‌హాసన్‌లకు ఇదే పరాభవం ఎదురైంది. గత మూడేళ్లలో మన దౌత్యవేత్తలను వేర్వేరు కారణాలతో ఇలా వేధించడం ఇది మూడోసారి. ఈ వరస అవమానాలను ఎప్పటికప్పుడు దిగమింగుకోవడం, ఆగ్రహించినవారికి సర్దిచెప్పుకోవడం మన పాలకులకు అలవాటైంది. ఇప్పుడు దేవయాని ఘటన జరిగాక చేపట్టిన చర్యలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఏ దౌత్య కార్యాలయానికైనా పటిష్టమైన భద్రత కల్పించడం సాధారణమే. కానీ, అమెరికా దౌత్య కార్యాలయం వెలుపల బారికేడ్ల నిర్మాణం ఆ పరిమితిని మించిపోయిందని ఇప్పుడు తీసుకున్న చర్యలనుబట్టి అర్ధమవుతుంది. ఎంత మిత్ర దేశమనుకున్నా ఇతర దేశాల దౌత్యవేత్తలకు లభ్యంకాని ప్రత్యేక సౌకర్యాలు అమెరికా దౌత్యవేత్తలకు ఎందుకు కల్పించినట్టు? ఇన్నేళ్లుగా ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పనిమనుషులకు మన చట్టాలు తగిన స్థాయిలో వేతనాలు నిర్ణయించలేదన్నది నిజం. మన దౌత్యకార్యాలయాల్లో పనిమనుషులుగా వెళ్లిన వారికి కూడా ఆ చట్టాలకు అనుగుణంగానే వేతనాలు అందుతున్నాయి. ఇది సరిగా లేదనుకున్నప్పుడు అమెరికా అధికారులు మన దేశంతో సంప్రదింపులు జరపాలి. తమ దేశంలో దౌత్య కార్యాలయం కొనసాగించదలుచుకుంటే తాము నిర్ణయించిన వేతనాలివ్వాలని సూచించాలి. కానీ, అందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను శిక్షించబూనడం అనాగరికం. ఇప్పుడు మనవైపుగా తీసుకున్న చర్యల తర్వాతనైనా అమెరికాకు జ్ఞానోదయం కలగాలి. సరిగా వ్యవహరించడం నేర్చుకోవాలి.
దౌత్య యుద్ధం!
Published Tue, Dec 17 2013 11:05 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement