జాతరను తలపించేలా సాగుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రచార హోరులో జనం సమస్యలు తప్ప అన్నీ ప్రస్తావనకొస్తున్నాయి. క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖంగా చర్చకొచ్చిన మహిళల భద్రత అంశం ఈసారి ఎటో కొట్టుకుపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినందువల్ల ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే అంశాన్ని బీజేపీ ఇప్పుడు ప్రస్తావించడమే మానుకుంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు చెక్కుల రూపంలో వచ్చిన రూ. 2 కోట్ల విరాళాలపై మూడు రోజులుగా మోత మోగుతోంది. దీనికి ‘అర్ధరాత్రి హవాలా’ అని ఒక పేరు కూడా పెట్టారు. ఈ విరాళాల సంగతి బయటపెట్టింది ఆప్‌కు ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన ఆప్ వలంటీర్ యాక్షన్ మంచ్(ఆవామ్) అయినా అందిపుచ్చుకున్నది మాత్రం బీజేపీనే! ఇతర పార్టీలకన్నా నీతిమంతులమని చెప్పుకునే ఆప్ అసలు రూపం బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. 2013 ఎన్నికల్లో ఇలా ఆప్ ‘అసలు రూపాన్ని’ బయటపెట్టే బాధ్యతను అప్పుడు యూపీఏ సర్కారుకు నేతృత్వం వహించిన కాంగ్రెస్ స్వీకరించింది. పెద్ద గొడవచేసింది. చేతిలో ప్రభుత్వం ఉన్నది గనుక దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇలా గొడవ చేయడంవల్ల ఆప్ తప్ప మిగిలిన పార్టీలన్నీ నిజాయితీగా ఉంటున్నాయని అందరూ భావించారు. తీరా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఏడబ్ల్యు) సంస్థలు విడుదల చేసిన గణాంకాలు బీజేపీ, కాంగ్రెస్‌లతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ చట్టాలను బేఖాతరుచేసి విరాళాలు ఎలా స్వీకరిస్తున్నాయో వెల్లడించాయి. మరి ఆప్ తీసుకున్న విరాళాలపైనే ఎందుకింత రగడ చేయాల్సివస్తున్నదో ప్రధాన రాజకీయ పార్టీలే చెప్పాలి. రూ. 2 కోట్ల విరాళంపైన మాత్రమే కాదు... తమకొచ్చిన చందాల న్నిటిపైనా దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ ప్రకటించడంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి రాజకీయ పార్టీల విరాళాలపై ఆరా తీయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టానికి 2003లో చేర్చిన సెక్షన్ 29సీ ప్రకారం రూ.20,000కు మించి విరాళాలిచ్చినవారి పేర్లను ప్రతి పార్టీ ఎన్నికల సంఘానికి వెల్లడించాలి. అలాంటివారి పాన్ నంబర్లను, చిరునామాలను అందించాలి. చిన్న మొత్తాలే అయినా ఏడాదిలో ఒకసారికన్నా ఎక్కువ సందర్భాల్లో ఇస్తే అలాంటి సంస్థ లేదా వ్యక్తి పేరును కూడా వెల్లడించాలి. ఇక విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టమైతే విదేశీ సంస్థలనుంచి లేదా ఇక్కడున్న వాటి అనుబంధ సంస్థల నుంచీ విరాళాలు తీసుకోవడం నిషిద్ధమని చెబుతున్నది. కేవలం మన దేశంలోని ప్రైవేటు కంపెనీల నుంచి మాత్రమే పార్టీలు విరాళాలు సేకరించవచ్చు. రూ. 20,000 లోపు విరాళా లిచ్చిన వారి పేర్లు ఇవ్వనవసరం లేదన్న లొసుగు ఉన్నది గనుక చాలా పార్టీలు అలాంటి విరాళాల ద్వారా సమకూరిన మొత్తం ఎంతో చెప్పడంలేదు. ఆ మొత్తానికి పైబడి ఇచ్చే వారికి సంబంధించిన వివరాలను కూడా చాలా సందర్భాల్లో అసం పూర్తిగా ఇస్తున్నాయి. ఇచ్చినవారెవరో... వారికి ఆ పార్టీతో ఉన్న అనుబంధం ఎలాం టిదో ఆరా తీయడం అసాధ్యమవుతున్నదని ఏడీఆర్ వాపోయింది. 2004-13 మధ్య జాతీయ పార్టీలకు మొత్తం రూ. 4,368.75 కోట్లు వచ్చాయని, ఇందులో 73 శాతం ‘గుర్తు తెలియని వర్గాల’నుంచి ఆ పార్టీలకు అందాయని వివరించింది. ఇందులో సగానికిపైగా మొత్తం ఎన్నికలకు నాలుగు నెలల ముందు వచ్చాయని విశ్లేషణలో తేలింది. నిబంధనలైతే చాలానే ఉన్నాయి. కానీ ప్రధాన రాజకీయ పార్టీలే విరాళాల విషయంలో పారద ర్శకతను పాటించడం లేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది.
ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికి నిర్ణీత కాల వ్యవధిలో చట్టసభలకు ఎన్నికలు జరుగుతుంటాయి. చిత్రమేమంటే ఈ ఎన్నికల సమయంలోనే భారీ యెత్తున నల్లధనం రంగు మార్చుకుని మొత్తం వ్యవస్థనే బలహీనపరుస్తున్నది. ఈ నల్లధనానికి... దాంతోపాటు సాగే అవినీతికి, నేర కార్యకలాపాలకూ పార్టీల కొచ్చే లెక్కచూపని విరాళాలే ప్రధాన వనరు అని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 45 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు కంపెనీలు విరాళాలివ్వడాన్ని నిషేధిస్తూ కంపెనీల చట్టానికి సవరణ తీసుకొచ్చింది. అంత వరకూ కొద్దో గొప్పో పారదర్శకత ఉండేదంతా దాంతో తుడిచిపెట్టుకు పోయింది. ఆనాటినుంచి కంపెనీలు ‘గుప్త దానాలు’ చేయడం మొదలెట్టాయి. అటు తర్వాత చాన్నాళ్లకు కంపెనీల చట్టాన్ని సవరించి ప్రతి సంస్థా లాభనష్టాల పట్టికలో పార్టీలకిచ్చిన విరాళాల వివరాలివ్వాలన్న నిబంధనపెట్టారు. కంపెనీలకూ, రాజకీయ పార్టీలకూ మధ్య సాగే అక్రమ వ్యవహారాలను నిరోధించడానికి 1964లో సంతానం కమిటీ విలువైన సిఫార్సులు చేసింది. 1978లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పార్టీలకొచ్చే నిధులపై తార్కుండే కమిటీ ఏర్పాటుచేశారు. ఆ కమిటీ ఎన్నో సూచనలు చేసింది. 1980లో గోస్వామి కమిటీ కూడా ఎన్నికల్లో నల్లధనం ప్రభావం తగ్గించడానికంటూ ఎన్నో సిఫార్సులు చేసింది. కంపెనీలు విరాళాలిచ్చే విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వమే నిధులు సమకూర్చేలా చట్ట సవరణ జరగాలని సూచించింది. ఏ ప్రభుత్వాలూ ఈ సూచనలనూ, సిఫార్సులనూ పట్టించుకున్న పాపాన పోలేదు. చెప్పాలంటే ఆప్ విరాళాలిచ్చిన దాతల పేర్లను తన వెబ్‌సైట్‌లో మొదటినుంచీ పొందుపరుస్తున్నది. చెక్కుల రూపంలో సొమ్ము వచ్చిన పక్షంలో ఆ చెక్కు నంబర్లను సైతం ఇస్తున్నది. ఈ వెబ్‌సైట్ ద్వారా లభించిన సమాచారంతోనే ఆప్ ప్రత్యర్థులు ‘అర్థరాత్రి హవాలా’ గురించి హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే చర్చకొచ్చి అటు తర్వాత ఎవరూ పట్టించుకోని ఈ విరాళాల అంశంపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టిపెట్టాలి. పార్టీలన్నీ విరాళాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా చట్టానికి సవరణలు తీసుకురావాలి. ఇలాంటి సంస్కరణలకు సిద్ధపడకపోతే ఎన్నికల విధానంలోనే ఈ దేశ పౌరులు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి.
విరాళాల హోరు!
Published Thu, Feb 5 2015 12:40 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement