
పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్ద యుడి సెక్టార్‌లో సర్జికల్ దాడులు నిర్వహించి ఏడాది కావస్తుండగా మన సైన్యం బుధవారం వేకువజామున మయన్మార్ సరిహద్దుల వద్ద నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్)– కప్లాంగ్ వర్గం తీవ్రవాదుల శిబిరాలపై దాడులు నిర్వహించింది. అయితే అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదని, ఇవి సర్జికల్ దాడులు కాదని సైన్యం చెబుతోంది. ఎన్‌ఎస్‌సీఎన్–కే స్థావరాలు సాధారణంగా మయన్మార్‌లో ఉంటాయి. కప్లాంగ్ వర్గం మాత్రం తామే సైన్యంపై దాడిచేసి ముగ్గురు జవాన్లను హతమార్చామని, తమపై సైన్యం చేసిన దాడుల్లో ఎలాంటి నష్టమూ లేదని చెప్పు కుంటోంది. 2015లో మన సైన్యం మయన్మార్ భూభాగంలో ఉన్న మణిపూర్ మిలి టెంట్ల స్థావరాలపై దాడులు చేసి పలువురు మిలిటెంట్లను హతమార్చింది. అయితే అనుమతి లేకుండా తమ భూభాగంలోకి చొరబడటం సరికాదని మయన్మార్ తప్పు బట్టింది.
బహుశా అందుకే కావొచ్చు... ఈసారి సరిహద్దుకు ఈవలే దాడులు చేసి నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్య్రంతోపాటే సంక్రమించి ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న అనే కానేక సమస్యల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని తీవ్రవాద సమస్య ఒకటి. ఈ ఏడు దశా బ్దాల్లోనూ అక్కడ నాగా గ్రూపులు భద్రతా బలగాలపైనా, పౌరులపైనా విచక్షణా రహితంగా దాడులు చేయడం, వాటికి జవాబుగా భద్రతా బలగాలు కూడా ఎదురు దాడులు చేయడం రివాజుగా కొనసాగుతోంది. వాటికి సమాంతరంగా వివిధ మిలి టెంట్ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. 1986లో తొలిసారి ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్)తో శాంతి ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఒప్పందం పర్యవసానంగా లాల్ డెంగా నేతృత్వంలోని ఆ సంస్థ సాయుధ పోరాటాన్ని విరమించినా ఇతర గ్రూపులు మాత్రం తమ హింసాయుత పంథాను విడనాడలేదు. ఆ తర్వాత సైతం వివిధ మార్గాల్లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రెండేళ్ల క్రితం ఎన్‌ఎస్‌సీఎన్(ఇసాక్–మ్యువా) వర్గంతో ఒడంబడిక కుదిరింది.
ఆ ఒడంబడికకు కొన్ని నెలల ముందు కప్లాంగ్ వర్గం కేంద్రంతో 2001 నుంచి కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, తిరిగి ‘స్వాతంత్య్ర సమరాన్ని’ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. నాగాలకు నాయ కత్వం వహించే ఏకైక సంస్థగా తమను మాత్రమే గుర్తించాలన్నది ఆ వర్గం అభి ప్రాయం. నిజానికి ఆ విషయంలో కేంద్రం జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే సమస్య వచ్చేది కాదు. ఇసాక్–మ్యువా వర్గంతో సంబంధాలు ఏర్పడ్డాక కప్లాంగ్ వర్గానికి ప్రాధాన్యం తగ్గించారు. దీంతో ఆ మిలిటెంట్లకు ఆగ్రహం కలిగింది. ఇలా వేర్వేరు వర్గాల మధ్య సాగే ఆధిపత్య పోరు కూడా సమస్యను మొదటికి తెస్తోంది.
నిజానికి నాగా సమస్య అంత సులభంగా పరిష్కారమయ్యేది కాదు. బ్రిటిష్ వలస పాలకులుండగానే అక్కడ తిరుగుబాట్లు రగుల్కొని విస్తరించాయి. ఇప్పటి మయన్మార్‌లోని కొంత ప్రాంతం, ఈశాన్యంలోని మరికొన్ని ప్రాంతాలనూ విలీనం చేసి ఆ భూభాగాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలన్నది వారి ప్రధాన డిమాండు. వారి పోరాటాల ప్రభావం ఈశాన్యంలోని ఇతర జాతులపై కూడా పడింది. వారు కూడా తిరుగుబాటు మార్గాన్నే ఎంచుకున్నారు. నాగా ఉద్యమమైనా, ఈశాన్యంలోని మరే ఇతర తిరుగుబాటు ఉద్యమాలైనా కాలక్రమంలో చీలికలు పేలికలయ్యాయి. అయినా ఏదో ఒక వర్గం పలుకుబడి పెంచుకుని క్రమేపీ బలపడటం, భద్రతా బల గాలకు సవాలుగా మారడం ఈశాన్యంలో ఎప్పటినుంచో కనిపిస్తున్న ధోరణి. హత్యలు, కిడ్నాపులు, దాడులతో అక్కడ నిరంతర హింస సాగుతోంది. 1960లో నాగా సమస్య పరిష్కారానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ప్రయత్నించారు.
దాదాపు ఆరు దఫాలు చర్చలు సాగాయి. కానీ నాగా బృందానికి కేటాయించిన బసను వేరే అవసరం కోసం ఆదరాబాదరాగా ఖాళీ చేయించడంతో వారు దాన్ని అవమానంగా భావించారు. ఒక జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం పోరా డుతున్న తమకు సమాన స్థాయి కల్పించి గౌరవిస్తే తప్ప చర్చలుండవని ఆ నాయ కులు స్పష్టం చేశారు. హింసాయుత చర్యలకు పాల్పడే వర్గాలను అదుపు చేయడానికి బల ప్రయోగం అవసరం కావొచ్చుగానీ అదే ఏకైక పరిష్కారం కాదు. దానికి సమాం తరంగా చర్చలు సాగించడం కూడా తప్పనిసరి. చర్చలు జరపడం, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకోవడం, అందులోని లోటుపాట్ల గురించి తెలియ జెప్పడం నిరంతరంగా సాగవలసిన ప్రక్రియ. వారిలో హేతుబద్ధత తీసుకురా వడం, వారు సాగిస్తున్న పోరాటాల్లోని నిరర్ధకతను ఎత్తిచూపడం ఇందువల్ల సాధ్య మవుతుంది. అదే సమయంలో పాలనాపరంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి సవ రణలు చేసుకోవడానికి ప్రభుత్వాలకూ వీలవుతుంది.
నిరుడు యుడి సెక్టార్‌లో పాకి స్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన తర్వాత కూడా అటు నుంచి చొరబాట్లు ఆగలేదు. సరిహద్దుల్లో రెప్ప వాల్చని నిఘా, చొర బాట్లను ప్రోత్సహిస్తున్న పాక్ వైఖరిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావడం తదితర చర్యలే అంతిమంగా అక్కడ ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి తోడ్పడ తాయి. నిజానికి మన దేశం ఐక్యరాజ్యసమితిలోనూ, వివిధ ప్రపంచవేదికలపైనా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తీరుతెన్నులను ఎండగట్టడం వల్లే ఆ దేశంపై అమెరికా తోసహా పలు దేశాల వైఖరి మారింది. ఈమధ్య జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల అనంతరం వెలువడిన ప్రకటన పాకిస్తాన్ ప్రాపకంతో కొనసాగుతున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహమ్మద్‌ల చర్యలను ఖండించడం మన దౌత్యం సాధించిన విజయమే. మిలిటెంట్‌లు హింసకు పాల్పడుతున్నప్పుడు, పాల నకు ఆటంకాలు సృష్టిస్తున్నప్పుడు చర్యలు తప్పవు. కానీ వాటిపైనే ఆధారపడ కుండా సమాంతరంగా చర్చలు సాగించడం కూడా అవసరం. కప్లాంగ్ వర్గాన్ని దారికి తీసుకొచ్చేందుకు ఆ మార్గంలో కూడా కేంద్రం కృషి చేయాలి.