
బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో వేధింపులు ఎదుర్కొంటున్న ముస్లిమేతర(హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ) వర్గాల పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త వివాదం రేకెత్తించడం ఖాయమని అక్కడి పరిణామాలు చెబుతున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్‌డీఏ కూటమి నుంచి అసోం గణపరిషత్ (ఏజీపీ) తప్పుకుంది. మేఘాలయ, మిజోరంలలో సైతం కూటమి భాగస్వామ్యపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా, మిజోరం సీఎం జోరం తంగా సవరణ బిల్లు ఈశాన్య ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని చెప్పారు. త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్, మణిపూర్ రాష్ట్రాల్లో సైతం మిత్రపక్షాలనుంచి ఇలాంటి నిరసనలే వ్యక్త మవుతున్నాయి.
2016లో ఈ బిల్లును తొలిసారి పార్లమెంటులో ప్రతిపాదించినప్పుడు అస్సాం లోని వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పటినుంచీ అది సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనలో ఉండిపోయింది. 30మంది సభ్యులున్న జేపీసీ ఆ బిల్లు అస్సాం ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధం కాదని తేల్చాక మంగళవారం దాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం పూర్తయింది. అయితే విపక్షాల ఆధిక్యత ఉన్న రాజ్యసభలో బుధవారం దాన్ని ప్రవేశపెట్టడానికి అవాంతరాలు ఎదురయ్యాయి. ఈలోగా సభ నిరవధిక వాయిదా పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రత్యేకించి అస్సాంలో జాతి సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో బీజేపీ అధి నాయకత్వం సరిగా అంచనా వేయడం లేదని ఈ సవరణ బిల్లు చూస్తే అర్ధమవుతుంది. ఒకపక్క జాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) వ్యవహారం ఇంకా తేలలేదు. ఈలోగా పౌరసత్వ సవరణ బిల్లు రంగంలోకొచ్చింది.
అస్సాంను పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి పొరు గునున్న బంగ్లాదేశ్ నుంచి వలసలను ప్రోత్సహించాయని, అందువల్ల స్వరాష్ట్రంలో తాము మైనారి టీలుగా మారే ప్రమాదం ఏర్పడిందని అక్కడి ప్రజలు ఆందోళన చేశారు. విదేశీయులను తక్షణం బయటికి పంపేయాలంటూ అక్కడ 1979–85 మధ్య మహోధృతంగా ఉద్యమం సాగింది. చివరకు 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి, అస్సాం ఉద్యమకారులకూ మధ్య ఒప్పందం కుదర డంతో ఉద్యమం ఆగింది. దాని ప్రకారం అక్రమ వలసలను నిర్ధారించడానికి 1971ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకున్నారు. తాజా బిల్లు దాన్ని బేఖాతరు చేసి 2014 డిసెంబర్‌కు ముందు వలస వచ్చిన వారికి సైతం పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పిస్తోంది.
జాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) ప్రక్రియపై ఉన్న వివాదమే ఎటూ తేలకుండా ఉన్న స్థితిలో తాజా బిల్లు ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త జగ డానికి కారణమైంది. అస్సాం ఉద్యమం అక్రమ వలసలకు వ్యతిరేకంగా సాగిన మాట వాస్తవమే అయినా దానిలో కేవలం ముస్లిం వ్యతిరేకతను మాత్రమే చూడటం బీజేపీ తప్పిదం. అది మౌలి కంగా జాతి సమస్య. వారు వ్యతిరేకిస్తున్నది ‘విదేశీయులను’ మాత్రమే తప్ప ముస్లింలను కాదు. అక్రమ వలసదారులపై అస్సాంలో ఉన్న వ్యతిరేకతను ఆసరా చేసుకుని ఈ పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో వేధింపులకు గురవుతున్న హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలకు ఈ దేశ పౌరసత్వం ఇస్తామంటే అస్సాం అయినా, ఈశాన్యంలోని ఇతర రాష్ట్రాల ప్రజలైనా అంగీకరించరు.
ఈ సవరణ బిల్లు ఆమోదం పొందకపోతే అస్సాం ‘జిన్నాల’ వశమవుతుందని అస్సాంమంత్రి హిమంత బిశ్వా శర్మ చేసిన హెచ్చరికే బీజేపీ ఉద్దేశాలను బయటపెడుతోంది. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అక్రమ వలసలను ప్రోత్సహిస్తే, బీజేపీ ‘చట్టబద్ధంగా’ ఆ పని చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. పరిమిత వనరులుండి, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నచోట వలసదారులు పెరుగుతుంటే స్థానికుల్లో ఆందోళన సహజం. వారు వనరులపై ఆధిపత్యాన్ని పెంచుకుంటుంటే ఆ ఆందోళన కాస్తా వైషమ్యాలకు బీజం వేస్తుంది. అస్సాంలో జరిగింది ఇదే. అస్సాం ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింల సంగతలా ఉంచి 19వ శతాబ్దిలో అస్సాం టీ ప్లాంటే షన్లలో పనిచేయడానికి వెళ్లిన అవిభక్త బెంగాల్ ముస్లింలను కూడా శతాబ్దాలు గడిచినా విదేశీయు లుగానే చూసే ధోరణి ఏర్పడింది.
దానికి సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనడమే జటిలంగా మారగా...ఇప్పుడు ఆ మూడు దేశాల్లోని ముస్లిమేతర వర్గాలకు చెందిన పౌరుల్ని తీసుకురావడానికి ప్రయత్నించడం కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇలా వచ్చేవారి భారాన్ని ఒక్క అస్సాం మాత్రమే భరించనవసరం లేదని, దేశంలోని అన్ని రాష్ట్రాలూ పంచుకుంటాయని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇస్తున్న హామీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలను సంతృప్తిపరచదు. పైగా ఇతర రాష్ట్రాలు కూడా అంత ఉన్నత స్థితిలో లేవు. ఉన్న జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడమే వాటికి కష్ట మవుతోంది. వేరే దేశాల్లో ప్రాణాలకు ముప్పు ఏర్పడినవారికి ఆశ్రయం ఇవ్వాలనుకోవడం ఉన్నతమైన విలువే. దాన్నెవరూ కాదనరు.
కానీ అందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం అభ్యంతరకరం. ఇక బంగ్లా, పాక్, అఫ్ఘాన్‌లలో ముస్లిమేతర పౌరులే కాదు... ముస్లింలలో భాగంగా ఉంటున్న అహ్మదీయ వంటి తెగలవారు కూడా అణచివేతకు గురవుతున్నారు. వారి విషయంలో అభ్యంతరం ఎందుకుండాలో అర్ధం కాదు. ఒకపక్క ఉన్న సమస్యలనే ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఈశాన్య రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. అరుణాచల్‌లో ఇరుగు పొరుగునుంచి వచ్చి పడే చక్మాల గురించి... మిజోరంలో త్రిపుర నుంచి వలసవచ్చే రీంగ్ తెగ, మయన్మార్ నుంచి వచ్చే బర్మా తెగ పౌరుల గురించి...అస్సాం, మణిపూర్, మేఘాలయల్లో బంగ్లాదేశీయుల గురించి ఆందో ళనలున్నాయి. అవి చాలవన్నట్టు కొత్త సమస్యను రాజేయడం భావ్యం కాదు. ఈ సవరణ బిల్లు ఆలోచనను విరమించుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment