ప్రతీకాత్మక చిత్రం
మన దేశంలో విమానయాన భద్రతకు సంబంధించి అనుసరిస్తున్న విధానాల్లో లోపాలున్నాయని అమెరికాకు చెందిన ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) రెండు నెలలక్రితం చెప్పింది. వచ్చే 65 రోజుల్లోగా వాటిని సరిదిద్దుకోవాలని కోరింది. ఈలోగానే వెంట్రుకవాసిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. గురువారం ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న జెట్ ఎయిర్‌వేస్ సంస్థ బోయింగ్ 737 శ్రేణి విమానంలో ఒక్కసారిగా పీడనం పడిపోవటంతో అందులోని 168 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. వారిలో 30 మందికి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు స్రవించింది.
విమానంలో గాలి పీడనాన్ని నియంత్రించే మీట నొక్కటం మరిచిపోవటంవల్ల ఈ పరిణామం ఏర్పడింది. ఇలాంటి పొరపాట్ల పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2005లో సైప్రస్ నుంచి గ్రీస్‌లోని ఏథెన్స్‌కు 115 మందితో వెళ్తున్న హెలియోస్ ఎయిర్‌వేస్ బోయింగ్ విమానంలో ఇలాంటి పొర బాటే జరిగి అది కుప్పకూలింది. పైలెట్లు మీట నొక్కడం మర్చిపోవటమే కాక పీడనం తగ్గుతున్నా గమనించలేకపోయారు. అంతే కాసేపటికి హైపోక్సియా (ఆక్సిజెన్ లోపించటం) ఏర్పడి వారు స్పృహ కోల్పోయారు. విమానాన్ని ఆటో పైలెట్ పద్ధతిలో ఉంచటంతో అది ఇంధనం అయిపోయేంతవరకూ గాల్లో ఎగిరి గ్రీస్ పర్వతాల్లో కూలిపోయింది. ఆ ప్రమాదంలో సిబ్బంది సహా 121 మంది మరణించారు.
విమానయాన భద్రత వ్యవహారాలను దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలోని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. ఆ సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ విధానాలు సంతృప్తికరంగా లేవని ఎఫ్‌ఏఏ తేల్చింది. ఎఫ్‌ఏఏకన్నా ముందు అంతర్జా తీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ) సైతం ఈ తరహా అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. విమా నయాన భద్రత పర్యవేక్షణలో భారత్ స్థితి పాకిస్తాన్, నేపాల్ దేశాలతో పోల్చినా నాసిరకంగా ఉన్న దని వ్యాఖ్యానించింది. వైమానిక భద్రతలో మన స్కోరు 65.82 నుంచి 57.44కు పడిపోయిందని అది తేల్చింది. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు రోజూ వేలాది విమానాల రాకపోకలు సాగు తుంటాయి. ఇంతవరకూ ఈ మాదిరి ఘటన ఎప్పుడూ జరగలేదు.
విమానం ఇంజిన్ ఆన్ చేసే ముందు క్యాబిన్‌లో ఒత్తిడి ఏమేరకు ఉందో పైలెట్లు చూసుకుంటారు. టేకాఫ్‌కు ముందు గాలి పీడ నాన్ని నియంత్రించే బటన్ నొక్కుతారు. దాంతో ఇంజిన్ నుంచి వేడి గాలి ఏసీ వ్యవస్థలోని హీట్ ఎక్స్చ్‌ంజర్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ వ్యవస్థ దాన్ని చల్లగా మార్చి కేబిన్‌లోకి పంపుతుంది. పర్యవసా నంగా కేబిన్‌లో ఉష్ణోగ్రత, పీడనం నియంత్రణలో ఉంటాయి. ఇదంతా నిత్యం యధావిధిగా సాగి పోతుంది. కానీ జెట్ ఎయిర్‌వేస్ విమానం ప్రధాన పైలెట్ దీన్ని మరిచిపోయారు. విమానం గాల్లో 10,000 అడుగులు లేచాక పది నిమిషాల్లోనే ఆ ప్రభావం ప్రయాణికుల అనుభవంలోకొచ్చింది. ఆక్సిజెన్ స్థాయి పడిపోయింది.
వెంటనే పొరపాటు గ్రహించి విమానాన్ని వెనక్కి తీసుకురావటంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దీనంతటికీ 23 నిమిషాలు పట్టింది. 30మంది అస్వస్థులయ్యారు. ముక్కు, చెవుల్లోంచి రక్తం వచ్చినవారు కొందరైతే, కొందరికి దాంతోపాటు వినికిడి లోపం కూడా ఎదురైంది. దీన్ని గుర్తించటంలో ఇంకా ఆలస్యమై ఉంటే ముందు ఊపిరితిత్తులకు, తర్వాత మెదడుకు ఇబ్బందులు ఎదురై శాశ్వత అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. బీపీ, హృద్రోగ సమస్యలున్నవారికి ప్రాణాలకే ముప్పు కలగొచ్చు. ప్రధాన పైలెట్‌కు విమానాల్ని నడపడంలో 14 ఏళ్ల అనుభవం ఉంది. అయినా ఈ ఘటన చోటుచేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇటీవలికాలంలో ఎయిరిండియా విమానాన్ని మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయంలో నిర్దేశిత స్థలంలో కాక నిర్మాణంలో ఉన్న వేరే రన్‌వేపై దించటం వివాదాస్పదమైంది. పైలెట్ చేసిన తప్పిదం కారణంగా విమానం ప్రధాన చక్రాలు దెబ్బతిన్నాయి. అనుకోనిదేమైనా జరిగుంటే విమానంలోని 136మంది ప్రయాణికులకు ముప్పు ఏర్పడేది. ఢిల్లీ నుంచి 370మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్లిన మరో ఎయిరిండియా విమానం పదిరోజులక్రితం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ విమానానికున్న బహువిధ వ్యవస్థలు ఒక్కసారిగా విఫలం కావటం, వాతావరణ పరిస్థితి బాగులేక పోవటం, అన్నిటికీ మించి విమానంలో ఇంధనం దాదాపు అడుగంటడం వంటివి ఒకేసారి చుట్టుము ట్టాయి.
అయితే పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడి అనుమతి తీసుకుని జాగ్రత్తగా కిందకు దించాడు. సుదూర ప్రాంతాలకెళ్లే విమానంలో ఇలా బహువిధ వ్యవస్థలు విఫలం కావటం అసాధారణమైన విషయం. విమానం గాల్లోకి లేచాక అందులో ఎదురయ్యే ఏ సమస్య విషయంలోనైనా విమాన సిబ్బంది వ్యవహరించే తీరు చాలా ముఖ్యమైనది. వారు ఏమాత్రం కంగారు పడినట్టు కనిపించినా, సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయినా ప్రయా ణికుల్లో ఉండే కంగారు మరింత పెరుగుతుంది.
ఎఫ్‌ఏఏ ఆడిట్‌లో బయటపడిన అంశాలపై మన డీజీసీఏ శ్రద్ధ పెట్టి గట్టి చర్యలు తీసుకోవడం తప్ప నిసరి. ఆ సంస్థ నిబంధనల ప్రకారం అది ఎత్తిచూపిన లోటుపాట్లపై 30 రోజుల్లోగా నివేదిక పంపాలి. ఆ తర్వాత ఎఫ్‌ఏఏ ప్రతినిధి బృందం మరో నెలరోజుల్లో వచ్చి ఏ తరహా చర్యలు తీసుకు న్నదీ సమీక్షిస్తుంది. దాని ప్రమాణాలకు అనుగుణంగా లేదన్న అభిప్రాయం కలిగితే కొత్తగా మన దేశం నుంచి వెళ్లే విమానాలను అనుమతించటం నిలిపేస్తారు. ఇప్పుడు నడుస్తున్న విమానాలకు కఠినమైన తనిఖీలు మొదలవుతాయి.
పర్యవసానంగా విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ తనిఖీలన్నీ పూర్తయి ప్రయాణికులు దిగి విమానాశ్రయ ప్రాంగణంలోకి చేరుకోవటానికి బోలెడు సమయం పడుతుంది. దాంతో ఆ దేశానికెళ్లే ప్రయాణికులు మన విమానయాన సంస్థల్ని ఎంచుకోవటం మానుకుంటారు. తరచు సమస్యలెదురవుతున్నపుడు, ఎఫ్‌ఏఏ, ఐఓసీఏ వంటి సంస్థలు లోపాలు ఎత్తిచూపినప్పుడు సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టడం అవసరం. ఈ విషయంలో నిర్లక్ష్యం మంచిది కాదు.
Comments
Please login to add a commentAdd a comment