ఎన్నాళ్లీ ఉదాసీనత? | Editorial On Delhi Pollution | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఉదాసీనత?

Published Fri, Nov 8 2019 12:49 AM | Last Updated on Fri, Nov 8 2019 12:49 AM

Editorial On Delhi Pollution - Sakshi

మాటలే తప్ప చేతలు కనబడని స్థితిలో దేశ రాజధాని నగరంలో కాలుష్యం తన పని తాను చేసుకు పోతోంది. ప్రాణాలు కొంచెం కొంచెం తోడేస్తూ నగర పౌరులను బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల పాటు నగరంలో కాలుష్యం స్థాయి ‘తీవ్రంగా’ ఉన్నదని వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) వెల్లడిం చాక ఆ నగరాన్ని ‘ఎమర్జెన్సీ జోన్‌’గా ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం గత ఆదివారం ఏక్యూఐ రీడింగ్‌ 495గా, ఆ మరుసటి రోజు 407గా నమోదైంది. 2016 తర్వాత ఈ స్థాయిలో వాయు నాణ్యత క్షీణించడం ఇదే ప్రథమం. అయితే మంగళవారానికి పరిస్థితి మారింది. నిన్నటికి అది మరింత మెరుగైంది. కానీ 24 గంటలు గడవకుండానే మళ్లీ అందరినీ అక్కడి వాతావరణం ఆందోళనపరుస్తోంది. వాయు కాలుష్యం ఇంతగా విజృంభించడానికి ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను తగల బెట్ట డమే కారణమని నిపుణులు చెబుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీన్ని నిరోధిం చాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతోపాటు కటువైన వ్యాఖ్యలు చేసింది.

జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహించింది. పంటలు కోత కొచ్చే సమయంలో చేసే ప్రయత్నాల వల్ల ఫలితం ఉండదని ప్రభుత్వాలకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏటా ఇదే తంతు నడు స్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టరాదని చాలా ముందుగానే రైతుల్లో ప్రచారం చేయడం, ఆ వ్యర్థా లను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఎంతో కొంత ఫలితాన్నిస్తాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టు వ్యర్థాలను తగలబెట్టని రైతులకు క్వింటాల్‌కు రూ. 100 చొప్పున ఇవ్వడం కూడా మంచి ఆలోచన. ఇటువంటి ప్రయత్నాలు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేసిన దాఖలా లేదు. రైతుల జోలికెళ్తే ఓటుబ్యాంకుకు ముప్పు కలుగుతుందని భయపడి మౌనంగా ఉండిపోవడం, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చునన్న ధోరణి ప్రభుత్వాల్లో పెరుగుతోంది. కేవలం పంజాబ్, హరియాణాల్లో ఏడు వేల ప్రాంతాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టారని కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. ప్రభుత్వాల నిర్వాకం ఎలా ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. 

వాయు కాలుష్యంపై బ్రిటిష్‌ వలసపాలకుల హయాంలో 1905లో బెంగాల్‌ పొగ పీడ చట్టం వచ్చింది. అప్పట్లో కలకత్తా, హౌరా వంటి ప్రాంతాల్లోని ఫర్నేస్‌ల వల్ల జనం ఆరోగ్యం పాడవు  తోందని వారు ఈ చట్టం తీసుకొచ్చారు. అటు తర్వాత 1912లో బొంబాయిలోనూ ఇదే తరహా చట్టం వచ్చింది. ఢిల్లీ గాలుల్లో ధూళి కణాలు బాగా ఉన్నాయని తొలిసారి 1952లో గమనించారు. అయితే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి 1981లో తొలిసారి చట్టం తీసుకురాగా, వాతావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చింది. రాజస్తాన్‌ ఎడారి ప్రాంతం నుంచి వచ్చే పడమటి గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణంలో ధూళి కణాలు బాగా పెరుగుతున్నాయని 1950లోనే గుర్తించారు. అటువైపు దట్టంగా చెట్లుంటే దీన్ని నివారించడం వీలవుతుందని భావించారు. కానీ అనంతరకాలంలో తీసుకున్న చర్య లేమీ లేవు. సరిగదా అప్పటితో పోలిస్తే కాలుష్యాన్ని పెంచే కార్యకలాపాలే అధికమయ్యాయి. కర్మాగా రాల సంఖ్య, వాహనాల వినియోగం వందలరెట్లు పెరిగింది. అభివృద్ధి పేరు చెప్పి వృక్ష సంహారం సరేసరి. వాయు కాలుష్యం గురించిన భావనకు మన దేశంలో దాదాపు నూట పదిహేనేళ్ల చరిత్ర ఉన్నా దాన్ని నియంత్రించాలన్న జ్ఞానం కలగలేదంటే ఎవరిని నిందించాలి? రెండురోజులపాటు ఢిల్లీలో వాయు నాణ్యత కాస్త మెరుగైందని వెల్లడయ్యేసరికి అందరూ సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమని ప్రకటించారు. కానీ గాలుల తీవ్రత అంతక్రితంతో పోలిస్తే పెరగడం, ఆకాశంలో మేఘాల జాడ లేకపోవడం వగైరా కారణాల వల్లనే పరిస్థితి కాస్త మెరుగైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. కాలుష్యానికి కారణం మీరంటే మీరని రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకోవడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. ఇప్పుడది అవధులు దాటింది. ఎంతసేపూ ఇక్కడ పరస్పరం నిందించుకోవడం కంటే పాకిస్తాన్‌నూ, చైనానూ ఇందులో ఇరికిస్తే మేలని అనుకున్నట్టున్నారు. బీజేపీ నాయకుడు వినీత్‌ అగర్వాల్‌ ఆ రెండు దేశాలూ ‘విషవాయువుల’ను విడిచిపెడుతున్నాయని ఆరోపించారు. కాలు ష్యంపై మన నేతల అవగాహన ఇంత అధ్వాన్నంగా ఉన్నప్పుడు, ఇక నియంత్రణ గురించి ఏం ఆశించగలం?

వాయు కాలుష్యం వల్ల బాధితులుగా మారేది వ్యక్తులు మాత్రమే కాదు. దాని వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. భారత్‌లో వాయు కాలుష్యం ఏటా మూడు వేల కోట్ల డాలర్లను హరిం చేస్తున్నదని ప్రపంచబ్యాంకు ఆమధ్య హెచ్చరించింది. వాతావరణంలోని నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, కాడ్మియం, పాదరసం వగైరా అణువులు మనిషిని ఆపాదమస్తకమూ పీల్చిపిప్పి చేస్తాయి. పొగ, దుమ్ము వగైరాల్లో కేన్సర్‌ కారక కార్సినోజెన్‌లు విశేషంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పారు. ప్రపంచ కాలుష్య భరిత నగరాల్లో 14 మన దేశంలోనే ఉన్నాయని నిరుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఢిల్లీతోపాటు ఉత్తరాది నగరాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నగరాల్లో కూడా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పరిమితికి మించి ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోనట్టయితే అవి కూడా కాలుష్య భరిత నగరాలుగా మారడం ఎంతో దూరంలో లేదని ఆ నివేదిక  హెచ్చరించింది. బయో సైన్స్‌ జర్న ల్‌లో ఈమధ్య వివిధ దేశాల్లోని భిన్నరంగాలకు చెందిన 11,000మంది శాస్త్రవేత్తలు విడుదల చేసిన లేఖ అందరి కళ్లూ తెరిపించాలి. వాయు కాలుష్యంతోపాటు అనేకానేక కాలుష్యాలు భూగోళానికి ముప్పు తెచ్చే ప్రమాదం అంతకంతకు పెరుగుతోందని ఆ లేఖ హెచ్చరించింది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉదాసీనతను విడనాడి పకడ్బందీ చర్యలకు ఉపక్రమించవలసి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement