భూగోళంలో ఒక మూలకు విసిరేసినట్టుగా, ఇతర ప్రాంతాలతో సంబంధం లేనట్టుగా, పసిఫిక్ మహా సముద్రంలో ఒంటరిగా కనబడే న్యూజిలాండ్ రెండు వేర్వేరు దీవుల సముదాయం. ప్రపం చంలో ఐస్‌లాండ్ తర్వాత అది అత్యంత శాంతియుతమైన దేశంగా రెండో స్థానంలో ఉంది. ఆ స్థానం గత పదేళ్లుగా చెక్కు చెదరలేదు. అటువంటిచోట నెత్తురు రుచి మరిగిన పులిలా ఒక ఉన్మాది రెండు మసీదుల్లోకి చొరబడి ప్రార్థనల్లో నిమగ్నమైనవారిని తుపాకులతో విచక్షణారహితంగా కాలుస్తూ పోవడమే కాదు... దాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఫేస్‌బుక్‌లో అందరూ వీక్షించేలా వీడియో తీసిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. క్రైస్ట్‌చర్చి నగరంలో జరిగిన ఈ ఊచకోతలో 49 మంది కన్నుమూయగా వారిలో భారతీయులు 9మంది ఉన్నారని చెబుతున్నారు. 40మంది గాయాల పాలయ్యారు. ఈ దుర్మార్గం నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన క్రికెట్ జట్టు సభ్యులు త్రుటిలో తప్పిం చుకోగలిగారు. న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పినట్టు ఆ దేశ చరిత్రలో శుక్రవారం నిజంగా చీకటిరోజు.
హంతకుడు ఈ ఊచకోతకు ముందు ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన 74 పేజీల మేనిఫెస్టో నిండా విద్వేషంతో నిండిన రాతలే ఉన్నాయి. ‘మహా పునఃస్థాపనం’ (ది గ్రేట్ రీప్లేస్ మెంట్) పేరిట ఆన్‌లైన్‌లో ఉంచిన ఆ డాక్యుమెంట్‌లో ముస్లింలపై విస్మయకరమైన వ్యాఖ్యలు న్నాయి. అంతేకాదు... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అందులో ఆకాశానికెత్తారు. ఇదే శీర్షి కతో గతంలో ఫ్రాన్స్‌లో విడుదలైన ఒక డాక్యుమెంటు వలసదారుల జనాభా పెరుగుతూ పోతున్న దని, త్వరలో యూరప్ జనాభాను వారు అధిగమించే ప్రమాదమున్నదని అందరినీ బెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఈ హంతకుడికి ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో పుట్టుకొచ్చిన శ్వేతజాతి దురహంకారులు ఆదర్శమని మేనిఫెస్టో తేటతెల్లం చేస్తోంది. హంతకుడు స్థానికుడు కాడని, ఆస్ట్రే లియా నుంచి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమిక సమాచారాన్నిబట్టి వెల్లడవుతోంది.
అసహనాన్ని నూరిపోయడం, విద్వేషాన్ని వెదజల్లడం పర్యవసానాలెలా ఉంటాయో ఈ ఉదంతం చూస్తే అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూల విద్వేషం పుట్టుకొచ్చినా, ఎక్కడ మతి మాలిన చర్యలు జరిగినా సామాజిక మాధ్యమాల విస్తృతి అపారంగా పెరిగిన వర్తమానకాలంలో అవి క్షణాల్లో ఖండాంతరాలకు చేరుతాయి. ఎక్కడో ఒకచోట వాటిని అనుకరించే ఉన్మాదులూ బయల్దేరతారు. ఇలాంటి ప్రమాదం గురించి ఎందరో తరచు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి హింసాత్మకమైన ఘటనల్ని, అందుకు ప్రోత్సహించేవాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తామని చెబుతూనే ఉన్నాయి. అందుకు అవసరమైన సాంకేతికపరమైన రక్షణ చర్యలు తీసుకున్నామంటున్నాయి.
హింసను ప్రోత్సహించేలా, విద్వేషాలను వ్యాపింపజేసేలా ఉన్న సందేశాలను పసిగట్టే కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెబుతున్నాయి. అందు కోసం ఏటా కోట్లాది డాలర్లు వ్యయం చేస్తున్నాయి. నిరుడు అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటివి అప్‌లోడ్ చేసిన వీడియోల్లో 99 శాతం ఆ మార్గంలోనే తొలగించామని ఫేస్ బుక్ చెప్పింది. కానీ ఆచరణలో అవి అంత ప్రయోజనకరంగా ఉండటం లేదని ఈ ఉదంతంతో రుజువైంది. న్యూజి లాండ్ ఊచకోతకు కారణమైన హంతకుడు ఈ దారుణాన్నంతటినీ 17 నిమిషాలపాటు ప్రత్యక్షంగా చిత్రిస్తున్నా ఈ మాధ్యమాలన్నీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాయి. కనుక తమ సాంకేతికతలో లోపం ఎక్కడుందో ఈ మాధ్యమాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
న్యూజిలాండ్ శాంతియుత దేశమే కావొచ్చుగానీ... అది ఏ క్షణంలోనైనా భగ్నమయ్యేందుకు దారితీసే స్థితిగతులు అక్కడున్నాయి. మతం పేరిట ప్రబలుతున్న ఉగ్రవాదం ఒకపక్కా, దాన్ని సాకుగా తీసుకుని విస్తరిస్తున్న శ్వేతజాతి దురహంకారం మరోపక్కా చుట్టుముడుతున్నా... శ్వేత జాతి దురహంకారం ఉగ్రవాదంగా పరిణమిస్తున్న జాడలు కనిపిస్తున్నా చాలా దేశాలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పైపెచ్చు ట్రంప్ వంటివారు తమ రాజకీయ స్వప్రయోజనాలను ఆశించి అసహనాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వెనకాముందూ చూడకుండా విద్వేషపూరితంగా మాట్లా డుతున్నారు. న్యూజిలాండ్‌లో ఈ ఉదంతం జరిగిన వెంటనే ఆస్ట్రేలియాలో మితవాద పార్లమెంటు సభ్యుడు ముస్లిం వలసదారులే ఈ ఘటనకు కారణమని మాట్లాడాడు. అదే సమయంలో భద్రత సక్రమంగా ఉండటం లేదు. నేరగాళ్లు ఏదైనా చర్యకు పూనుకొనేందుకు భయపడే రీతిలో పోలీసుల్ని వినియోగించే అలవాటు ఎటూ లేదు.
కనీసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తున్న దాఖలాలు లేవు. బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఇటీవలికాలంలో హింసాత్మక ఘటనలు పెరగడం కన బడుతుంది. వీటన్నిటికీ తోడు న్యూజిలాండ్ చట్టాలు తుపాకుల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నాయి. అమెరికా తరహాలోనే ఇక్కడ కూడా జనం వద్ద రిజిస్టర్ కాని తుపాకులు 96 శాతం ఉన్నాయని గతంలో పలువురు హెచ్చరించారు. న్యూజిలాండ్‌లో పదహారేళ్లు నిండిన వారెవరైనా స్వేచ్ఛగా షాట్‌గన్‌లు, రైఫిళ్లు కొనుగోలు చేయవచ్చు. దగ్గర ఉంచుకునే మారణాయుధాల సంఖ్యపై కూడా పరిమితి లేదు. 2017నాటి గణాంకాల ప్రకారం 46 లక్షల జనాభాగల న్యూజి లాండ్‌లో పౌరుల వద్ద 12 లక్షల రిజిస్టర్డ్ ఆయుధాలున్నాయి. 1990లో ఒక పౌరుడు తమ పొరు గింటివారితో ఘర్షణ పడి 13మందిని కాల్చి చంపాక తుపాకుల చట్టాలను సవరించారు. అప్పటినుంచీ సైన్యం వాడే సెమీ ఆటోమేటిక్ ఆయుధాల కొనుగోలుపై ఆంక్షలున్నాయి. లైసెన్స్ ఉన్నవారికి తప్ప వాటిని విక్రయించరు. తుపాకులు అందరికీ అందుబాటులో ఉంటున్నా న్యూజి లాండ్‌లో జరిగే హత్యల సంఖ్య స్వల్పం. ఏదేమైనా అసహనం, విద్వేషం, ప్రతీకారం వంటివి ప్రబోధించే వారిపట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో... వాటిని మొగ్గలోనే తుంచకపోతే ఎటువంటి పరిస్థితులు దాపురిస్తాయో తాజా ఉదంతం వెల్లడిస్తోంది. న్యూజిలాండ్ ఉదంతం ప్రపంచ దేశా లన్నిటికీ గుణపాఠం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment