భద్రతే ప్రాణప్రదం | Editorial On two Recent Airline Crashes | Sakshi
Sakshi News home page

భద్రతే ప్రాణప్రదం

Published Thu, Mar 14 2019 2:46 AM | Last Updated on Thu, Mar 14 2019 2:46 AM

Editorial On two Recent Airline Crashes - Sakshi

అయిదు నెలల వ్యవధి...రెండు విమాన ప్రమాదాలు! ఆ రెండూ బోయింగ్‌ సంస్థ ఉత్పత్తి చేసినవే కావడం, పైగా 737 మ్యాక్స్‌–8 మోడల్‌కి చెందినవి కావడంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశంతో సహా 51 దేశాలు ఆ రకం విమానాల వినియోగంపై ప్రస్తుతానికి నిషే«ధం విధించాయి. మరో 11 దేశాల్లో వేర్వేరు విమానయాన సంస్థలు వాటి వినియోగాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించాయి. గత అక్టో బర్‌లో ఇండొనేసియాకు చెందిన లయన్‌ ఎయిర్‌ సంస్థ విమానం జావా సముద్రంలో కుప్పకూలి 189మంది మరణించారు.

మొన్న ఆదివారం ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ రకం విమా నమే కూలి 157మంది దుర్మరణం పాలయ్యారు. ఆ రెండూ బయల్దేరిన కొన్ని నిమిషాలకే అనూ హ్యంగా కూలడంతో సహజంగానే అన్ని దేశాల్లోనూ ఆ మోడల్‌ విమానాలపై సంశయాలు బయ ల్దేరాయి. తమ విమానం డిజైన్‌లో లోపం లేదని, దాన్ని నడుపుతున్న పైలెట్ల అవగాహన లోపం వల్లే ప్రమాదాలు జరిగి ఉండొచ్చునని బోయింగ్‌ సంజాయిషీ ఇస్తోంది. అదొక్కటే కాదు... అమె రికా పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్‌ ఎవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) కూడా దాని తరఫున వకాల్తా తీసుకుని ఆ మాటే చెబుతోంది. కానీ వీటిని విశ్వసించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే నిరుడు అక్టోబర్‌లో కూలిన విమానాన్ని నడిపిన పైలెట్‌కు, కో పైలెట్‌కు కూడా 11,000 గంటలు విమానాలను నడిపిన అనుభవం ఉంది. తాజాగా ప్రమాదానికి లోనైన విమానాన్ని నడిపిన పైలెట్‌కు 8,000 గంటలకు మించి విమానాలను నడిపిన అనుభవం ఉంది.   

బోయింగ్‌ ఉత్పత్తి చేస్తున్న ప్రయాణికుల విమానాల్లో 737 మ్యాక్స్‌–8 తాజా మోడల్‌. రెండేళ్ల క్రితం మార్కెట్లోకొచ్చిన ఆ రకం విమానాలు ఇంతవరకూ ప్రపంచంలో 350 వరకూ ఎగురుతు న్నాయి. మరో 5,000 విమానాలకు ఆర్డర్లున్నాయి. ఇందులో ఇంధనం 15శాతం ఆదా అవుతుందని తేలడమే దీనికి కారణం. కానీ తాజా పరిస్థితి బోయింగ్‌నూ, దాంతోపాటు ఎఫ్‌ఏఏనూ బెంబేలెత్తి స్తున్నాయి. ఈ విమానాల ఆర్డర్లు రద్దయినా, కనీసం ప్రస్తుతానికి వాయిదా వేయమని కొనుగోలు దారులు అడిగినా అది ఇబ్బందుల్లో పడుతుంది. దాని ప్రభావం అది ఉత్పత్తి చేసే ఇతర మోడళ్లపై కూడా ఉంటుంది. ఫలితంగా అది, దానితోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడతాయి. ఏ దేశంలోని విమానయాన సంస్థ అయినా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఓఏ) వెంటనే ఆ దేశాలను అప్రమత్తం చేస్తుంది. విమానయాన సంస్థల తీరుతెన్నులను గమనిస్తూ రేటింగ్‌ ఇస్తుంది.

దాంతోపాటు ఎఫ్‌ఏఏ సైతం ఫిర్యాదులు చేస్తుం టుంది. కానీ ఇప్పుడు మ్యాక్స్‌–8 విమానాల భద్రతపై అనుమానాలు పెట్టుకోవద్దని ఎఫ్‌ఏఏ చెబు తోంది. గత 72 గంటల్లో పలు దేశాలు వీటిని నిలిపివేసినా ఎఫ్‌ఏఏ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ రకం విమానాలను నడుపుతున్న అమెరికాలోని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు రెండూ వాటిని యధావిధిగా ఉపయోగిస్తున్నాయి. అయితే అక్కడి ప్రయాణికులు, ఆ దేశంలోని విమాన సిబ్బంది సంఘాలు బోయింగ్, ఎఫ్‌ఏఏల ప్రకటనలను విశ్వసించడంలేదు. వాటిని నడపడానికి భయపడే పైలెట్లపైనా, అందులో సేవలందించడానికి సందేహించే ఇతర సిబ్బందిపైనా ఒత్తిడి తీసుకురావొద్దని విమాన సిబ్బంది సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందుకు దారితీసిన కారణాలపై పలు రకాల వాదనలు వినబడటం సర్వసాధారణం. వాటికుండే ప్రాతిపదికేమిటని కూడా ఆలోచించకుండా నమ్మేవారూ ఉంటారు. కానీ ఇప్పుడు మ్యాక్స్‌–8 రకం విమానం గురించి తలెత్తిన అనుమానాలు ఆ మాదిరి వేనా? అనుమానాలకు మాత్రమే కాదు... వాటిపై ఇచ్చే భరోసాకు కూడా సహేతుకమైన ప్రాతి పదిక ఉండాలి. మ్యాక్స్‌–8 రకంపై అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదని బోయింగ్‌తో పాటు ఎఫ్‌ఏఏ కూడా ఏ ధైర్యంతో చెబుతున్నట్టు? సుదీర్ఘకాలం నుంచి సర్వీసులో ఉండి, నమ్మ కంగా సేవలందిస్తుంటే ఆ భరోసాను జనం నమ్మడానికి వీలుంటుంది. కానీ మ్యాక్స్‌–8లు మార్కె ట్లోకి వచ్చి నిండా రెండేళ్లు కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న ప్రయాణికుల విమానాల్లో వీటి వాటా ప్రస్తుతానికి 2శాతం మాత్రమే. ఇంత స్వల్ప సంఖ్యలో ఉన్న విమానాల్లో రెండు కేవలం ఆర్నెల్ల వ్యవధిలో ఒకే తరహాలో ప్రమాదానికి గురైనప్పుడు అనుమానాలు తలెత్తడంలో ఆశ్చర్య మేముంది? అయినా తాను అనుకుంటున్నదే సరైందని ఎఫ్‌ఏఏ ఎలా భావిస్తుంది? నిజానికి బోయింగ్‌ సంగతెలా ఉన్నా ఎఫ్‌ఏఏ తనకు తానే అయిదు నెలలక్రితం తొలి ప్రమాదం జరిగి నప్పుడే ఆ మోడల్‌లోని సాంకేతికతపై లోతుగా అధ్యయనం చేయించవలసింది. తమ దేశంలో కూడా వాటి వాడకం పెరిగింది గనుక ఇది అవసరమని ఎఫ్‌ఏఏ గుర్తించి ఉంటే వేరుగా ఉండేది. కనీసం ఇప్పటికైనా ఆ పని చేయకపోగా బోయింగ్‌ను వెనకేసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

గత అక్టోబర్‌లో ప్రాణాలు కోల్పోయినవారికి చెందిన కుటుంబసభ్యులు కొన్ని రోజులక్రితమే బోయిం గ్‌పై అమెరికా న్యాయస్థానాల్లో పరిహారం కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సరిగ్గా ఇదే సమ యంలో తాజా ప్రమాదం చోటుచేసుకుంది. తొలి ప్రమాదం జరిగాక ఆ రకం విమానాలను నడిపేటప్పుడు పైలెట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోయింగ్‌ ఒక బులెటిన్‌ విడుదల చేసింది. ఆ మోడల్‌లో వినియోగించే విమాన నియంత్రణ సాఫ్ట్‌వేర్‌ను ఏప్రిల్‌నుంచి మరింత మెరుగు పరచనున్నట్టు రెండునెలల క్రితం తెలిపింది. ప్రమాదానికి లోనైన మ్యాక్స్‌–8 విమానాలు రెండూ ఒకే తరహాలో టేకాఫ్‌ దశలోనే నియంత్రణకు లొంగలేదని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే కూలి పోయాయని స్పష్టమవుతోంది. కనుక ప్రతిష్టకు పోకుండా ఆ విమానాల సాంకేతిక వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, లోపాలను గుర్తించి సరిచేయడం అవసరమని బోయింగ్‌ సంస్థ గుర్తిం చాలి. అంతవరకూ వాటిని తాత్కాలికంగా నిలిపేయమని వేరే దేశాల విమానయాన సంస్థలనూ కూడా అది కోరాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement