ప్రతీకాత్మక చిత్రం
నెలరోజులుగా చెవులు చిల్లులు పడేలా హోరెత్తిన తొలి దశ ఎన్నికల ప్రచార యుద్ధం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఇక గురువారం జరగబోయే పోలింగ్‌కు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ప్రచారపర్వం సందర్భంగా ప్రధాన పార్టీల నాయకులు అవిశ్రాంతంగా ప్రచారసభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కింది. కొన్ని సందర్భాల్లో విమర్శలు కట్టుదాటాయి. ఎన్నికల నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని చక్క దిద్దవలసి వచ్చింది. గత నెల 11న కేంద్ర ఎన్నికల సంఘం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వ హించబోతున్నట్టు ప్రకటించింది.
వీటితోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలుంటాయని తెలిపింది. తొలి దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్ని లోక్‌సభ స్థానాలకూ పోలింగ్ జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. మరో 15 రాష్ట్రాల్లోని 49 స్థానాలు కూడా తొలి దశ పోలింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విభజన తర్వాత తొలిసారి అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.
ఎన్నికల్లో పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు రివాజే. సాధారణ సమయాల్లో తమపై వచ్చే ఆరోపణల గురించి పట్టనట్టు ఉండే పాలకపక్షం ఎన్నికల్లో విమర్శలనూ, ఆరోపణ లనూ తీవ్రంగా పట్టించుకుంటుంది. వాటికి జవాబిస్తుంది. కనుకనే ఎన్నికల ప్రచార పర్వంలో ఇంతక్రితం మరుగున పడిపోయిన సమస్యలన్నీ పైకొస్తాయి. తమ పరిష్కారం మాటేమిటని నిల దీస్తాయి. అయితే ఎన్నికల్లో పోటీచేసే పార్టీలు ప్రత్యర్థి పక్షాలే తప్ప శత్రువులు కాదు. కానీ ఏపీలో పాలక తెలుగుదేశం ఇందుకు భిన్నమైన ధోరణి అవలంబించింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ప్రచారాన్ని సాగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చేసిందేమిటో చెప్పుకోలేని స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రజలు నమ్మే అవకాశం లేదని తెలిసినా అబద్ధాలు గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తెలం గాణపై అకారణంగా ఆరోపణలకు దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు బీజేపీ, టీఆర్‌ఎస్‌లతో రహస్య అవగాహన ఉందని ఆరోపించారు.
నరేంద్రమోదీకి లొంగిపోయారని విమర్శించారు. ప్రచారం చివరికొచ్చేసరికి ఆయన మరింత దిగజారారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే హత్యలు, దోపిడీలు జరుగుతాయంటూ ఇష్టానుసారం మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఏం చెప్పినా ప్రజలను నమ్మించలేకపోతున్నానని అర్ధమయ్యాక ఆయన స్వరం మరింత హెచ్చింది. ఆరోపణల తీవ్రత కూడా పెరిగింది. చివరికిది ఏ స్థాయికి చేరుకుందంటే తెలుగుదేశం పార్టీని అమితంగా ఇష్టపడేవారు సైతం ఆయన ప్రసంగాల ధాటికి తట్టుకోలేకపోయారు. ఈ అయిదేళ్లూ చంద్రబాబు నిజంగానే చేసిందేమీ లేదా అన్న మీమాంసలో పడిపోయారు. ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా పచ్చమీడియా నిలబడింది. అబద్ధాలను పుక్కిటబట్టింది. కానీ సామాజిక మాధ్యమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటంతో ఇవన్నీ నీరుగారిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ అధి కార దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఎన్నికల సంఘం పాక్షికంగా మాత్రమే విజయం సాధిం చింది. సకల ఆధారాలనూ చూపినా కొందరు అధికారులపై చర్య తీసుకోవడంలో విఫలమైంది.
చంద్రబాబులో ఏర్పడిన నిరాశానిస్పృహలకు కారణమేమిటో తెలుగు ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. బాబు ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అవరోధాలను అధిగమిస్తూ ప్రత్యేక హోదా అంశంపై జగన్‌మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లపాటు నిలకడగా ఉద్యమం కొనసాగించారు. విద్యా ర్థుల్లో, యువతలో చైతన్యాన్ని నింపారు. పర్యవసానంగా అది ప్రజల బలమైన ఆకాంక్షగా రూపు దిద్దుకుంది. దీనికితోడు ఆయన చేసిన ‘ప్రజాసంకల్పయాత్ర’ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను బట్టబయలు చేసింది. తమ సమస్యలను విని, తమ కష్టాలు తెలుసుకుని భరోసానిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆప్తుడిగా భావించారు. పరిస్థితి చేయిదాటుతున్న ఈ స్థితిలో తన వైఫల్యాలన్నిటినీ కేంద్రంపైకి తోసి, ప్రత్యేకహోదా అంశాన్ని తానూ తలకెత్తుకోవడం ఒకటే పరిష్కారమని చంద్రబాబు అనుకున్నారు.
ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్‌తో ఊరేగితే ఈ కష్టాలనుంచి గట్టెక్కవచ్చునని అంచనా వేసుకున్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయన ఆశల్ని భగ్నం చేశాయి. చెట్టపట్టాలు వేసుకుని వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కూటమిని ఆ ఎన్నికల్లో జనం నిష్కర్షగా తిరస్కరించారు. ఏపీలో ఈ పొత్తువల్ల వీసమెత్తు లాభం లేకపోగా ఉభయత్రా మరింత చేటు కలుగుతుందని గుర్తించి రెండు పక్షాలూ దూరం జరిగాయి. అలాగని ఆయన ఒంటరిగా ఏం లేరు. కాంగ్రెస్‌తో, జనసేనతో రహస్య అవగాహన కొనసాగింది. దాన్ని చాలా సులభంగానే ప్రజలు పసిగట్టారు. బాబు రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగాల్సివచ్చింది. ఈ నిస్సహాయస్థితే ఆయనతో ఇష్టానుసారం మాట్లాడించింది.
డబ్బులు పంచుదామంటే ఐటీ వెన్నాడుతోందని, అందుకే ప్రభుత్వ సొమ్మును ‘శుభ్రం’గా పంచేశానని ఓ సభలో ఆయన స్వయంగా చెప్పుకున్నారు. తన సంపాదన లక్ష కోట్లని ఆయన ఒకచోట నోరుజారారు. వైఎస్సార్‌కాంగ్రెస్ హుందాగా ప్రచారం సాగించింది. ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. సమస్యలపై నిలదీశారు. విమర్శలకు దీటుగా జవాబిచ్చారు. తాము వస్తే ఏం చేయదల్చుకున్నామో చెప్పారు. ఈ అయిదేళ్లూ ఏలికలుగా ఉన్న వారు ఏం చెప్పి అధికారంలోకొచ్చారో, ఏం చేశారో ప్రజలకు తేటతెల్లమే. ఇక తమ వజ్రాయుధం ఓటు హక్కును వినియోగించి తీర్పునివ్వడమే తరువాయి. అందుకు మరొక్క రోజు మాత్రమే గడువుంది.
Comments
Please login to add a commentAdd a comment