భాషణ కళకు కొత్త భాష్యం కోసం | For a reinterpretation of the art of speech | Sakshi
Sakshi News home page

భాషణ కళకు కొత్త భాష్యం కోసం

Published Wed, Apr 16 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

భాషణ కళకు కొత్త భాష్యం కోసం

భాషణ కళకు కొత్త భాష్యం కోసం

సందర్భం.

 
 అక్షరం స్పష్టతకూ, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికీ  తిరుగులేని పరిష్కారం. అయితే అది చిహ్నాల సముదాయమే! కానీ భాష అంటే సంభాషించేది. మాటలోనే భావవ్యక్తీకరణ సంపూర్ణంగా ఉంటుంది. మానవ స్పందనలన్నీ మనిషి కంఠస్వరంలో మేళవిస్తాయి.
 
 టెలిగ్రాఫ్, టెలిఫోన్, రేడియో, టెలివి జన్, ఇంటర్‌నెట్ ఇదీ ఆధునిక సమాచార వైజ్ఞానిక ఆవిష్కరణల క్రమం! అంతకు ముందు పుస్తకం, పత్రికలు ఉన్నాయి. తీగల సాయంతోనో, లేకుండానో సమాచారం పంపడం, అది కూడా మానవ కంఠస్వరం ఉపయోగించి సాధించడం అనూహ్య పరిణామం. జాన్ గూటెన్ బెర్గ్ 1448లో అచ్చుయంత్రాన్ని ప్రయోగపూర్వకంగా చూపారు. 1456 ఆగస్టు 24న బైబిల్ అచ్చయింది. 1702లో ఇంగ్లడ్ నుంచి ‘ైడైలీ కోరంట్’ అనే మొదటి వార్తా పత్రిక ప్రారంభమైంది. అమెరికాలో 1704లో మొదటి వార్తాపత్రిక ‘బోస్టన్ న్యూస్‌లెటర్’ మొదలైంది. దీనికి ముందు భావ ప్రసారం ప్రధానంగా మానవ కంఠస్వరం ద్వారానే ఉండేది. మనిషి గమనించి, ప్రోది చేసిన జ్ఞానమంతా నోటిమాటగా, చేతిరాతగా వచ్చేది. రాతకు సంబంధించి మెరుగైన సదుపాయాలు, అచ్చు సౌకర్యాలు రావడంతో పరిస్థితి మారిపోయింది. ఇది సుమారు రెండు దశాబ్దాలు అప్రతిహతంగా నడిచింది. టెలిఫోన్, రేడియో, సినిమా, టెలివిజన్, నెట్ రావడంతో మళ్లీ నోటిమాట ప్రధాన భావ ప్రసార వేదికయింది.
 
అక్షరం స్పష్టతకూ, జ్ఞానాన్ని నిక్షిప్తం చేయడానికీ  తిరుగులేని పరిష్కారం. అయితే అది చిహ్నాల సముదాయమే! కానీ భాష అంటే సంభాషించేది. మాటలోనే భావవ్యక్తీకరణ సంపూర్ణంగా ఉంటుంది. మానవ స్పందనలన్నీ మనిషి కంఠస్వరంలో మేళవిస్తాయి. ఈ తేడాను గుర్తించాలంటే అక్షర రూపంలోని నాటకానికీ, నాటక ప్రదర్శనకీ అంతరాన్ని అధ్యయనం చేయాలి. అందువల్ల మానవ గళాన్ని ఎటువంటి సహాయం  లేకుండా ప్రసారం చేయగల సాంకేతిక పరిజ్ఞానం రావడం గొప్ప విప్లవం. రాత అక్షరం మాటను మింగి వేయడంతో అక్షరా స్యత, నిరక్షరాస్యత అనే భేదాలు వచ్చి పడ్డాయి. అయితే ఫోన్,  రేడియో, టెలివిజన్ రాకతో మరలా మనిషి గాత్రం ఈ అవాంతరాలనూ అధిగమించి ముందుకు పోయింది.
 
నేడు మౌఖిక సమాచారం అని పిలిచే వ్యవస్థకు పునాది మాట్లాడగలిగే సామర్ధ్యం. అద్భుతమైన స్పందనలను రంగరించిన భావ వ్యక్తీకరణ మాట్లాడే కళ ద్వారా సాధ్య మైంది. సేల్స్ రిప్రజెంటేటివ్స్, టీవీ యాంకర్లు, రేడియో జాకీలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, నటీన టులను మీరు కొంచెం పరిశీలిస్తే ఈ ‘భాషణకళ’ ఎంతగా పుష్పించి విలసిల్లుతున్నదో సులువుగా గుర్తించవచ్చు.
 కంఠస్వరానికి ఉండే ప్రాధాన్యం తెలియజెప్పడానికి, అవగాహన కల్గించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16ను ‘వరల్డ్ వాయిస్ డే’గా జరుపుకుంటున్నాం. నిజానికి ‘డే’ అనే పదంలో ‘దినం’ అంటే బావుండదు. (కొన్ని ప్రాంతాల్లో మరణానికి సంబంధించి వాడుక పదం కనుక) అలాగే దినోత్సవం అంటే ఇందులో ఉత్సవకోణం కనిపించదు. కనుక అర్థం చక్కగా అమరడానికి ప్రపంచ కంఠస్వర ‘అవగాహన సందర్భం’గా అనువదించవచ్చు. 1999లో ఆరంభమైన ఈ కార్యక్రమం ఇపుడు సుమారు 47 దేశాలలో జరుపుకుంటున్నారు.  ముందుముందు మరిన్ని దేశాలు  చేరతాయి. కంఠస్వరం ప్రాధాన్యం గుర్తించి, సవ్యమైన ధోరణులను ప్రచారంలోకి తేవడమే దీని ఉద్దేశం. మాటను ఎంత జాగ్రత్తగా, పొందికగా, ప్రయోజనాత్మకంగా వినియోగించవచ్చునో అనంతమైన అధ్యయనం సాగింది, సాగుతోంది. అదే సమయంలో గొంతు ఆరోగ్యం గురించి కూడా కొంత దృష్టి పెట్టాల్సి ఉంది. ఒక అంచనా ప్రకారం జనాభాలో 5-6 శాతం గొంతుకు సంబంధించిన సమస్య లతో బాధపడుతూ ఉన్నారు. వీరిలో 70-75 శాతం మంది అవగాహన లోపంతో సమస్యలు తెచ్చుకుంటున్న వారే. అతిగా వాడటం, సరిగా వాడకపోవడం, దుర్వినియోగం చేయడం అనే మూడు రకాలుగా పొరపాట్లు చేస్తున్నాం.
 సంగీత సాధకులు, యోగ నిపుణులు, ఆయుర్వేద వైద్యులు ఎంతోకాలంగా ఉన్న, ఇతరత్రా సమస్యలను గురించి, కంఠస్వరం’ రక్షణ పద్ధతులను గురించి సులువుగా వివరిస్తారు. మారిన జీవనశైలి, ఆహార పదార్ధాల విని యోగం, ఏసీ, ఫ్రిజ్ వంటివి గొంతు ఆరోగ్యాన్ని, మాటలోని ధర్మాలను దెబ్బతీస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి!  ఇలాంటి విషయాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకొని, జాగ్రత్త పడటానికి ఈ సందర్భం దోహదపడుతుంది.
 
డా. నాగసూరి వేణుగోపాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement