లంక పయనం ఎటు?
మైకుల రొద...ఫ్లెక్సీల ఆర్భాటం...జాతరను తలపించే ఊరేగింపులు దాదాపు లేకుండా సాగిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసి సోమవారం పోలింగ్ జరగబోతోంది. ప్రచారార్భాటం లేకపోవడంవల్ల సాధారణ ఓటరు నాడిని పసిగట్టడం కష్టమైందన్న కొందరు పరిశీలకుల మాటల సంగతలా ఉంచి... గత ఎన్నికల్లో ఖర్చు రాసేసిన మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స దేశ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషిస్తాడేమోనన్న గుబులు అందరినీ పట్టిపీడిస్తోంది.
పదేళ్లపాటు దేశాధ్యక్షుడిగా ఏలిన రాజపక్సకు ఏడు నెలలక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి సంభవించింది. అవినీతి, బంధుప్రీతివంటి ఆరోపణలతోపాటు టైగర్ల అణచివేత పేరిట లంక తమిళులపై సాగించిన దురంతాలు రాజపక్స ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. సరిగ్గా అదే సమయంలో ఆయన కేబినెట్‌లో ఆరోగ్యమంత్రిగా ఉన్న మైత్రిపాల సిరిసేన హఠాత్తుగా రాజీనామా చేసి విపక్ష శిబిరంలో చేరి అధ్యక్ష పదవికి పోటీచేసి విజయం సాధించారు. ఆ ఓటమితో తెరమరుగైన రాజపక్స ఇక అవినీతి కేసుల్లో, మానవ హక్కుల ఉల్లంఘన నేరారోపణల్లో కటకటాలు లెక్కించాల్సి వస్తుందని అందరూ వేసిన అంచనాలు తలకిందులయ్యాయి.
అనూహ్యంగా ఆయన అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) నేతృత్వంలోని యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్(యూపీఎఫ్‌ఏ) అభ్యర్థిగా రంగం మీదికొచ్చారు. ఆయన ప్రత్యర్థిగా యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నాయకత్వంలోని యునెటైడ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ గుడ్ గవర్నెన్స్(యూఎన్‌ఎఫ్‌జీజీ) అభ్యర్థి రణిల్ విక్రంసింఘే తలపడుతున్నారు. విక్రంసింఘే ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.
జనాభాలో మెజారిటీగా ఉన్న సింహళుల్లో ఈసారి రాజపక్సపై సానుభూతి ఉన్నదని జూలై నెలాఖరున సెంటర్ ఫర్ పాలసీ అనాలిసిస్(సీపీఏ) నిర్వహించిన సర్వే తేల్చడం ఒక్కటే ఆయనకు ఆశలు కల్పిస్తోంది. ఆ సర్వే ఫలితం వెల్లడయ్యాక తమ కూటమికి 117 స్థానాలు ఖాయమని రాజపక్స చెప్పుకున్నారు. ఏడు నెలలక్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సింహళ ఓటర్లు చీలి రాజపక్సకు ఎదురుతిరిగారు. తాను ఓటమిపాలైతే మరోసారి తమిళ టైగర్లు విజృంభిస్తారని హెచ్చరించినా ఫలితం లేకపోయింది. అయితే, ఈసారి మాత్రం సింహళులను మచ్చిక చేసుకోగలిగానని రాజపక్స విశ్వసిస్తున్నారు.
లంక రాజకీయాలు చిత్రమైనవి. శ్రీలంక ఫ్రీడం పార్టీ నుంచి అధ్యక్షుడిగా ఉన్న రాజపక్సను ధిక్కరించి బయటికొచ్చిన సిరిసేనను విపక్షాలన్నీ ఏకమై గెలిపిస్తే ఆయన మళ్లీ ఫ్రీడం పార్టీలోనే చేరి ఆ పార్టీ అధ్యక్ష పదవితోపాటు దాని నేతృత్వంలోని కూటమి అధినేతగా కూడా ఎన్నికయ్యారు. తాను అధ్యక్షుడ య్యేందుకు సహకరించిన విపక్ష యూఎన్‌పీ నేత రణిల్ విక్రం సింఘేకు సిరిసేన ప్రధాని పదవిని కట్టబెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో రాజపక్సకు పార్టీ అభ్యర్థిత్వం రానీయరాదని ఎంత ప్రయత్నించినా సిరిసేన కృతకృత్యులు కాలేకపోయారు. అయితే, రాజపక్స ఎంపీ అయితే కావచ్చునేమో గానీ... ప్రధానిగా మాత్రం ఛాన్సివ్వబోనని సిరిసేన కుండ బద్దలు కొడుతున్నారు.
రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరు నియమిస్తే వారే ప్రధాని అవుతారని ఆయన గుర్తు చేస్తున్నారు. కనుక ఎంపీగా నెగ్గినా ప్రధాని పదవి వస్తుందన్న గ్యారెంటీ రాజపక్సకు లేదు. తర్వాత ఏమైతే కానీ...ముందు ఎంపీగా నెగ్గి తీరాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే సింహళులు అధికంగా ఉండే కురునేగల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ సైనిక కుటుంబాలు అధికం గనుక తన గెలుపు ఖాయమన్న విశ్వాసంతో ఆయన ఉన్నారు. రాజపక్స అధికారంలో ఉండగా సాగిన లంక తమిళుల ఊచకోతలో సైన్యానిదే ప్రధాన పాత్ర అన్న సంగతిని గుర్తుంచుకుంటే రాజపక్స ఆ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలోని ఆంతర్యం వెల్లడవుతుంది.
సిరిసేన అధ్యక్షుడయ్యాక ఈ ఏడు నెలల పాలన అత్యద్భుతమని అంటున్నవారితోపాటే పెదవి విరుస్తున్నవారూ ఉన్నారు. ఆయన నియమించిన విక్రంసింఘే ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయగలిగింది. అధ్యక్షుడూ, ప్రధాని వేర్వేరు పార్టీలకు చెందినవారైనా సమన్వయం బాగుంది. రాజపక్స హయాంలో రద్దయిన హక్కులను పునరుద్ధరించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘానికుండే అధికారాలను పునరుద్ధరించారు. అందువల్లనే ఈసారి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఫ్లెక్సీల ఏర్పాటు, సామాన్య జనజీవితానికి ఆటంకం కలిగే ర్యాలీలు వగైరా లేవు. పార్టీలన్నీ నిబంధనలకు లోబడి పరిమిత సంఖ్యలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసుకున్నాయి.
చాలామందికి అసలు దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరు గుతున్నాయా, లేదా అని అనుమానం కలిగేంత ప్రశాంతంగా ప్రచారం సాగింది. కానీ, అదే సమయంలో అవినీతి చీడ ఈ ప్రభుత్వాన్నీ వదల్లేదు. వివిధ పథకాల అమలులో అవినీతి చోటు చేసుకుంటున్నదని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇంకా నెరవేరలేదు.
అయితే ఎంతో పరిమితంగా నైనాసాగుతున్న ఈ సంస్కరణలన్నిటికీ రాజపక్స తిరిగొస్తే బ్రేకు పడుతుందని లంకలోని ఉదారవాదులు ఆందోళన పడుతున్నారు. అధ్యక్ష పదవిలో ఉండగా రాజ్యాంగాన్ని ఇష్టానుసారం సవరించి రాజపక్స అపరిమిత అధికారాలను పొందారు. సిరిసేన అధ్యక్షుడయ్యాక ఇదంతా మారింది. ప్రధానిగా ఉండేవారికే ఎక్కువ అధికారాలుండేలా మొన్న ఏప్రిల్‌లో రాజ్యాంగాన్ని సవరించారు. ఇలాంటి సమయంలో మళ్లీ రాజపక్స ప్రధాని కావడం ప్రమాదకరమన్న భావన అందరిలోనూ ఉంది. శ్రీలంక అంత త్వరగా గతాన్ని మరువదని, కళ్ల ముందటి వాస్తవాన్ని గుర్తించకపోదని...కనుక రాజపక్స విజయం అసాధ్యమని అలాంటివారి విశ్వాసం. లంక ఓటరు మొగ్గు ఎటువైపో చూడాల్సి ఉంది.