వ్యూహాత్మక ‘కరచాలనం’
వ్యూహాత్మక ‘కరచాలనం’
Published Fri, Apr 15 2016 12:28 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
అమెరికాతో మన సాన్నిహిత్యం మరింత పెరిగే దిశలో మరో అడుగు పడింది. ఆ దేశ రక్షణ మంత్రి ఆష్‌టన్ కార్టర్ మూడురోజుల పర్యటనలో అత్యంత కీలకమైన అంశాలపై రెండు దేశాల మధ్యా సూత్రప్రాయంగా అవగాహన కుదిరింది. రాగల రోజుల్లో ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలవుతాయి. కీలక సందర్భాల్లో తమ తమ సైనిక స్థావరాలనుంచి ఇరు దేశాల సైన్యాలకూ అవసరమైన సరఫరాలు, ఇంధన అవసరాలు సమకూర్చడానికి ఉద్దేశించిన ‘లెమా’ ఒప్పందం ఇందులో ముఖ్యమైనది. దేశాల మధ్య కుదిరే రక్షణ ఒప్పందాలు, ఆ దేశాలు అనుసరించే విదేశాంగ విధానాలు పరస్పర ప్రభావి తాలు. ఇందులో ఒక రంగంలో కుదిరే అవగాహన మరో రంగాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
యూపీఏ హయాంలో పదేళ్లక్రితం...ఇంకా చెప్పాలంటే భారత్- అమెరికాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందానికి ముందే ఇరు దేశాల మధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం పెరగవలసిన అవసరం ఉన్నదని రెండుచోట్లా గుర్తించారు. అణు ఒప్పందం తర్వాత రక్షణ రంగంలో సహకారం పెంచుకుందా మని అమెరికా వైపు నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. అందుకు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ సైతం మొగ్గుచూపారు. కానీ సోనియా ఆశీస్సులు దండిగా ఉన్న ఆనాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ ఈ విషయంలో అడుగు ముందుకు పడనీయలేదని విశ్లేషకులు అంటారు.
మున్ముందు భారత్‌తో పెరగాల్సిన సంబంధాలపై అమెరికాకు చాలా స్పష్టత ఉంది. ఆ విషయంలో ఇప్పుడు పడిన అడుగు చాలా చిన్నదేనన్న అభిప్రాయమూ ఉంది. కనుకనే దీన్ని ప్రతిబింబిస్తూ ‘ఇది దృఢమైన కరచాలనమే తప్ప... గాఢమైన ఆలింగనం కాద’ని కార్టర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కరచాలనం అలాంటి ఆలింగనం దిశగా వెళ్తుందని సులభంగానే చెప్పవచ్చు. లెమా ఒప్పం దం కుదిరితే అమెరికా విమానాలకూ, యుద్ధ నౌకలకూ మన సైనిక స్థావరాల్లో ఇంధనం నింపుకునే సదుపాయంతోపాటు ఇతరత్రా అవసరాలను తీర్చవలసి ఉంటుంది. అమెరికా సైనిక స్థావరాలున్నచోట మన యుద్ధ విమానాలకూ, నౌకలకూ కూడా ఇలాంటి సదుపాయాలే లభిస్తాయి.
1991నాటి గల్ఫ్ యుద్ధం సమయంలో కేంద్రంలో ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం ముంబై, ఆగ్రా, చెన్నై విమానాశ్రయాల్లో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకునే సదు పాయాన్ని ‘రహస్యంగా’ కల్పించినప్పుడు ఎంతో దుమారం రేగింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి ప్రభావం, అలీనోద్యమ ముద్ర వంటివి అప్పటికింకా బలంగా ఉండటం అందుకు కారణం. కాలం మారింది. ఇప్పుడు అలీనోద్యమ ప్రభావం లేదు. అమెరికాకు దీటుగా పోటీ ఇచ్చే దేశమూ లేదు. అందువల్ల మన అవసరాలు, ప్రయోజనాలు కూడా మారాయి. ఈ సంగతిని యూపీఏ ప్రభుత్వం గ్రహించినా...కొత్త బాటన వెళ్లడానికి సిద్ధపడినా ఆచరణలో సాధ్యం కాలేదు.
ఇరు దేశాల మధ్యా కుదరబోయే ఒప్పందం పర్యవసానంగా అమెరికా సైన్యం మన గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంటుందన్న వాదనను రక్షణమంత్రి పారికర్ తోసిపుచ్చుతున్నారు. ఇది సమాన స్థాయిలో పరస్పరం సహకరించుకోవ డానికి ఉద్దేశించినదేనని ఆయనంటున్నారు. అయితే మనకు ఒక్క తజికిస్థాన్‌లో ఉన్న వైమానిక దళ స్థావరం తప్ప మరే దేశంలోనూ స్థావరాలు లేవు. సియాచిన్ మంచు పర్వతశ్రేణిలో ఉన్న వైమానిక దళ స్థావరం మన భూభాగంలోనిదే. అమెరికాకు ప్రపంచం నలుమూలలా స్థావరాలున్నాయి. అవసరాలూ ఉన్నాయి. కనుక ఈ విషయంలో కుదిరే ఏ ఒప్పందమైనా మౌలికంగా అమెరికాకు లాభి స్తుంది తప్ప మనకు కాదు. ఇది మన సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తుందని, మన ఇరుగు పొరుగు దేశాలతో అమెరికాకు పొరపొచ్చాలు ఏర్పడినప్పుడు అందులో అనవసరంగా మన ప్రమేయాన్ని పెంచుతుందని విపక్షాలు విమర్శి స్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా, చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
‘దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం’ ఉండాలన్న అమెరికా వాదనను చైనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చు తోంది. ఆ ప్రాంతం తమ పరిధిలోనిదని వాదిస్తున్నది. అదే సమయంలో చైనాతో మనకు కూడా సమస్యలున్న మాట వాస్తవం. అది పాకిస్తాన్‌తో అత్యంత సన్నిహితంగా ఉండటంతోపాటు అంతర్జాతీయ వేదికల్లో దాని ప్రయోజనాలను నెరవేర్చడానికే ప్రయత్నిస్తోంది. దీనికితోడు చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాను వ్యతిరేకించే అమెరికాతో కలవ డంలో తప్పేమున్నదన్న వాదనలు కూడా వస్తున్నాయి. మన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి కృషి చేయడం వేరు. ఎవరి ప్రయోజనాల పరిరక్షణలోనో భాగస్వాములం కావడం వేరు. మనతో వ్యూహాత్మక సంబంధాలను ఆశిస్తున్న అమెరికా పాకిస్తాన్ విషయంలో మనకు ఏమాత్రం సహకరిస్తున్నదో తెలుస్తూనే ఉంది. భారత్‌లో విధ్వంస చర్యలకు దిగే ఉగ్రవాద శక్తులకు తమ దేశం అడ్డాగా మారనివ్వబోమని నవాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు చెప్పినా అందుకు అనుగుణమైన చర్యలు ఈనాటికీ లేవు. అయినా సరే పాక్‌కు సైనిక, ఆర్ధిక సాయం అందించడంలో అమెరికా ఏమాత్రం సందేహించడంలేదు.
మొన్నీమధ్యే పాకిస్తాన్‌కు అది ఎఫ్-16 యుద్ధ విమానాలను అందించింది. పాక్‌లో పుట్టి విస్తరిస్తున్న ఉగ్రవాదం వల్ల తాము కూడా బాధితులమేనని ఒకపక్క అంటూనే ఇలాంటి సాయం ఎందుకు చేయవలసివస్తున్నదో అమెరికా చెప్పడం లేదు. ఈ విషయంలో మన మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవ డంలేదు. ఆ దేశంతో వ్యూహాత్మక సైనిక బంధాన్ని ఏర్పర్చుకునే ముందు ఇలాంటి అంశాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉండకతప్పదు. మారిన కాలమాన పరిస్థితుల్లో అనేక రంగాల్లో అమెరికాతో మన చెలిమి పెరగవలసిన అవసరం ఉందనడంలో సందేహం లేదు. కానీ అదే సమయంలో ఆ దేశ ప్రయోజనాలను నెరవేర్చే ప్రక్రియలో అనవసర భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిన అవసరమూ లేదు. పాకిస్తాన్ విషయంలో నిర్ద్వంద్వంగా వ్యవహరించకపోతే భారత్‌కు చేరువ కావడం అసాధ్యమని ముందుగా అమెరికా గ్రహించేలా చేయాలి. ఇప్పుడు కుదిరిన అవగాహన ఒప్పందంగా రూపుదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉంది గనుక వీటన్నిటిపైనా సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
Advertisement