మువ్వన్నెల రెపరెపలు | indian flag rises in RIO | Sakshi
Sakshi News home page

మువ్వన్నెల రెపరెపలు

Published Sat, Aug 20 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

indian flag rises in RIO

ఒలింపిక్స్‌ క్రీడలు ప్రారంభమైన పన్నెండు రోజులకు రియోలో భారత జెండా ఎగిరింది. కుస్తీ పోటీల్లో సాక్షి మలిక్‌ కాంస్య పతకం సాధించడంతో మొదలైన మువ్వన్నెల రెపరెపలు  పూసర్ల సింధు బ్యాడ్మింటన్‌లో ఫైనల్స్‌కు చేరి రజతాన్ని ఖాయం చేయడంతో నింగికి ఎగిశాయి. 1996 నుంచి ప్రతి ఒలింపిక్స్‌లోనూ ఒక్క పతకమైనా సాధిస్తున్న భారత్‌ పేరు పతకాల పట్టికలో కనిపించదేమోనని బెంగటిల్లు తున్న కోట్లాది భారతీయులలో ఇద్దరు ఆడపిల్లలు ఆనందోత్సాహాలను నింపారు. శుక్రవారం రాత్రి హోరాహోరీగా సాగిన బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌ పోటీని యావద్భా రతం ఉత్కంఠతో వీక్షించింది. ప్రపంచ నంబర్‌వన్‌ స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో జరిగిన ఫైనల్‌ పోటీలో అద్భుత పోరాట పటిమను కనబరచి ఓడినా, సింధు భారత దేశపు తొలి బ్యాడ్మింటన్‌ రజత పతాక విజేతగా నిలిచింది.


క్రీడాకారులందరి కల ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే. అర్హతను సాధించి ఆ కల నెరవేరేలా చేసుకున్న క్రీడాకారులంతా గెలుపు కోసమే సర్వశక్తులూ ఒడ్డుతారు. భారత క్రీడాకారులు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఒలింపిక్స్‌కు బయల్దేరే ముందు బ్యాడ్మింటన్‌ స్టార్‌ సింధుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందరి దృష్టీ సైనా నెహ్వాల్‌పైనే ఉంది. కష్టమైన  డ్రా వల్ల సింధు నాకౌట్‌ దశలో ఎక్కడి వరకూ వెళుతుందోనని సందేహించారు. రెండు లీగ్‌ మ్యాచ్‌లలో తనతో పోలిస్తే బలహీన ప్రత్యర్థులతోనే ఆడినా.. ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు చైనీస్‌ తైపీ క్రీడాకారిణి, ఎనిమిదో ర్యాంకర్‌ తై జు యింగ్‌పై వరుస గేమ్‌లలో గెలిచింది. అయినా దాన్ని ఒక సంచలన  విజయంగానే భావించారు. క్వార్టర్‌ ఫైనల్లో అసలు సిసలు ప్రత్యర్థి చైనాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ యిహాన్‌ వాంగ్‌పై కూడా నెగ్గడంతో అందరి దృష్టీ సిం«ధుపైనే నిలిచింది. వరుస గేమ్‌లలో వాంగ్‌పై ఆమె గెలిచిన తీరును చూస్తే  సెమీస్‌లోనూ నెగ్గడం ఖాయమనిపించింది. ఆరో ర్యాంకర్‌ ఒకుహారాతో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో సింధు విశ్వరూపమే చూపించింది. అత్యద్భుత ప్రదర్శనతో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది.


దేశానికి తొలి పతకాన్ని అందించిన సాక్షి మలిక్‌ భారత క్రీడారంగంలో పేరున్న క్రీడాకారిణేం కాదు. ఆమె బరిలోకి దిగేసరికి భారత్‌కు ఒక్క పతకమూ రాలేదు. పతకాలు సాధిస్తారనుకున్న షూటర్లు, ఆర్చర్లు, టెన్నిస్‌ క్రీడాకారులు విఫలమ య్యారు. ఇంత పెద్ద క్రీడా సంరంభంలో తొలిసారి పాల్గొంటున్న సాక్షి వరుసగా రెండు పోటీలలో గెలిచినా, క్వార్టర్స్‌లో తనకంటే చాలా బలమైన ప్రత్యర్థి, రష్యా క్రీడాకారిణి  కొబ్లోవా చేతిలో ఓడింది. రెజ్లింగ్‌ క్వార్టర్స్‌లో ఓడినవారు ఎవరైనా తమపై గెలిచిన వారు కచ్చితంగా సెమీస్‌లో గెలవాలని కోరుకుంటారు. క్వార్టర్స్‌లో నెగ్గిన వారు ఫైనల్స్‌కు చేరితే, వారి చేతిలో ఓడినవారు రెప్‌చేజ్‌ ద్వారా కాంస్యం సాధించే అవకాశం ఉంటుంది. కొబ్లోవా ఫైనల్‌కు చేరడంతో ఆమె చేతిలో ఓడిన వారంతా కాంస్యం కోసం తలపడ్డారు. అలా జరిగిన రెప్‌చేజ్‌ తొలి మ్యాచ్‌లో  అద్భుత విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న మంగోలియా క్రీడాకారిణి ఓర్ఖాన్‌పై పోటీకి దిగిన సాక్షి వెనుకబడి కూడా పుంజుకుని గెలిచింది. దీంతో సాక్షి పతకం తెస్తుందన్న ఆశలు కలిగాయి. కిర్గిజిస్తాన్‌ క్రీడాకారిణి తినిబెకోవాతో పోటీలో చివరి ఆరు సెకన్లలో పాయింట్‌ సాధిస్తేనే తప్ప గెలవలేని దశలో ఏకంగా మూడు పాయింట్లు సాధించి సాక్షి పతకంతో పాటు దేశానికి పండుగను తెచ్చింది. ఆడపిల్లలను పురిట్లోనే చంపే హరియాణాకు చెందిన ఓ అమ్మాయి కుస్తీ పోటీల్లో ఒలింపిక్‌ పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్రను సృష్టించింది.  


సాక్షి, సింధు పతకాలు సాధించడానికి ముందు రియోకు వెళ్లిన భారత క్రీడా బృందంపై  చాలామంది తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా బరిలోనే ఉండి పోరాడు తున్న మన క్రీడాకారులపై ఇలా ఒత్తిడిని పెంచడం దురదృష్టకరం. ఒలింపిక్‌ శక్తులుగా ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే మన క్రీడా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితు లను వారు గుర్తించాలి. క్రీడా సంస్కృతి తక్కువగా ఉన్న మన దేశంలో ఆటలతో పిల్లల చదువులు చెడిపోతాయనే భ్రమలున్నవారే ఎక్కువ. ఆర్థిక స్తోమత ఉన్నా క్రీడలను కెరీర్‌గా ఎంచుకోమని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎందరున్నారు? అంతర్జాతీయ వేదికపై తలపడాల్సిన క్రీడాకారులను విశ్రాంతైనా లేకుండా ఎకానమీ క్లాస్‌లో కూర్చోబెట్టి, అధికారులు దర్జాగా బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లే క్రీడా వ్యవస్థ మనది. సౌకర్యాల సంగతి సరే ఒలింపిక్స్‌ బృందంతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యుడిని సైతం పంపలేని అసమర్థతకు సిగ్గుపడాల్సింది క్రీడాకారులు కాదు, బాధ్యులైన అధికార, రాజకీయ యంత్రాంగం.


ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మొట్టమొదటి భారత జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ వంటి క్రీడాకారులు పతకాన్ని సాధించలేకపోయినందుకు దేశానికి క్షమాపణలు చెప్పుకుంటుంటే... అతి పెద్ద క్రీడాధికార యంత్రాంగం మాత్రం ఏ బాధ్యతా వహించని దుస్థితి. నిజానికి దీప మృత్యు విన్యాసంగా పిలిచే ప్రొడునోవాను అలవోకగా చేసిన అసాధారణ క్రీడాకారిణి. భారత్‌లో ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌కు ఊపిరి పోసింది. మన క్రీడాకారులలో ఉండే తపనకు తగ్గ ప్రోత్సాహాన్ని, శిక్షణ, సదు పాయాలను కల్పించలేని అసమర్థత నిర్మూలనకు కావాల్సింది మన క్రీడాధికార వ్యవస్థ ప్రక్షాళన. అంతవరకు మనం వ్యక్తులుగా సింధు, సాక్షి వంటి క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభాపాటవాలు, పట్టుదలను చూసి గర్వించాల్సిందే తప్ప, గొప్ప  క్రీడా దేశంగా తలెత్తుకు తిరగలేం. క్రికెటర్లను మాత్రమే హీరోలుగా ఆరాధించే దేశంలో మన అథ్లెట్లు 118 మంది ఒలింపిక్స్‌కు అర్హతను సాధించారు. అందులో కనీసం 30 మంది టాప్‌–10లో నిలిచారు. వారంతా స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు.  చిన్నతనంలోనే క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తే మరెందరో ఒలింపిక్‌ విజేతలు తయారవుతారు. ఏదేమైనా రియోలో భారత పతాకాన్ని ఎగరేసిన వారందరినీ అభినందిస్తూ పతక విజేతలకు జేజేలు పలు కుదాం. 2020 నాటికైనా గుర్తించదగ్గ ఒలింపిక్‌ శక్తిగా నిలవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement