‘నీలి’ విహారం అయ్యేనా స్వేచ్ఛ? | is porn sites continuetion canbe freedon | Sakshi
Sakshi News home page

‘నీలి’ విహారం అయ్యేనా స్వేచ్ఛ?

Published Tue, Aug 11 2015 11:30 PM | Last Updated on Tue, Sep 18 2018 7:50 PM

‘నీలి’ విహారం అయ్యేనా స్వేచ్ఛ? - Sakshi

‘నీలి’ విహారం అయ్యేనా స్వేచ్ఛ?

సందర్భం
 
ఇంటర్‌నెట్ స్వేచ్ఛ మరోమా రు చర్చనీయాంశంగా మారిం ది. నెట్‌లో నీలి చిత్రాల సైట్ల విశృంఖలత్వానికి సంకెళ్లు వేయడమంటే నెట్ స్వేచ్ఛను హరించడమేనా? అనేది ప్రస్తు త చర్చకు కేంద్ర బిందువు. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం నేప థ్యంలో ప్రభుత్వం ఇటీవల 875 సైట్లను నిషేధించడం తో ఈ చర్చ మొదలైంది.

వెబ్ సైట్లను నిషేధించే హక్కు ను ప్రయోగించడం అలవాటైతే అది చివరికి సోషల్ మీడియాలో ప్రభుత్వాలపై విమర్శలను అణగదొక్కే ఆయుధంగా మారుతుందనే ఆందోళన నిరాధారమైన దేంకాదు. ఇంతకూ నీలి చిత్రాలు లైంగిక నేరాలకు కార ణమవుతున్నాయా? వాటిపై నిషేధంతో ఇక లైంగిక నేరాలు ఆగిపోతాయా? బూతు సినిమాల ద్వారా లైం గిక ప్రేరణను పొంది చట్టబద్ధంగా లైంగిక వాంఛలను తీర్చుకోవడం తప్పవుతుందా? నిషేధం అలాంటి వారి స్వేచ్ఛను హరించడం లేదా?  

నెట్‌లోని నాలుగు కోట్లకుపైగా నీలిసైట్లను నిషేధిం చడం సాధ్యం కాని పని. పాతవి నిషేధిస్తే కొత్తవి పుట్టు కొస్తూనే ఉంటాయి. ఆ విషయాన్ని పక్కనబెడితే ఐక్య రాజ్యసమితి సహా ప్రపంచంలోని అత్యధిక దేశాలు చైల్డ్ పోర్న్ (బాలల నీలిచిత్రాల) సైట్లపై నిషేధం విషయం లో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. చైల్డ్ పోర్న్ సైట్లకు చేర్చే లక్ష పదాల్ని సెర్చ్ ఇంజన్ల నుంచి తొలగించారు. చాలా దేశాలు బాలల నగ్న, అర్ధనగ్న చిత్రాలను, నీలి చిత్రా లను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయి. ఈ సైట్లు బాలల అక్రమ రవాణా, వ్యభిచారాలకు ప్రచార, సమాచార సాధనాలుగా మారాయి. బాలలపై లైంగిక దాడులు పెరగడానికి చైల్డ్ పోర్న్ ముఖ్య కారణమనేది అన్ని దేశా ల అనుభవం.

నీలి చిత్రాలకు, లైంగిక దాడులకు సంబం ధంలేదని వాదిస్తున్న వారు ఇది విస్మరిస్తున్నారు. నిర్భ య ఘటన తదుపరి ఢిల్లీలోనే చాక్లెట్ ఇస్తామని 5 ఏళ్ల బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నేరస్తులు... రోజంతా నీలిసైట్లను చూశారని తెలిసింది. ఇటీవలే కర్నూలులో రంజాన్ రోజునే జరిగిన దుర్మార్గం కూడా సరిగ్గా అలాంటిదే. చైల్డ్‌పోర్న్ సైట్లపై నిషేధంతో ఆ దాడులు ఆగిపోలేదు కదా? అనే వారూ ఉన్నారు. అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులపై ఎన్నో ప్రభావాలు అప్పటికే పనిచేస్తున్నా, నీలిచిత్రాలు పలు సందర్భాల్లో లైంగిక దాడులకు పాల్పడేలా చేసే ట్రిగ్గర్‌లా పనిచేస్తు న్నాయనేది వాస్తవం. అది గుర్తించ నిరాకరిస్తూ చైల్డ్ పోర్న్ నిషేధం నా స్వేచ్ఛకు భంగమనడం అర్థరహితం.

ఎదిగే పిల్లలలో లైంగికపరమైన ఆసక్తి సహజం. వారికి శాస్త్రీయమైన లైంగిక విద్యను అందించడంలో సమాజం విఫలం అవుతోంది. పైగా, తెలిసీ తెలియని వయసులో విశృంఖల, వికృత శృంగారం, ఉన్మత్త హిం స, క్రూరత్వం నెట్ ద్వారా అందుబాటులోకి వస్తున్నా యి. ఫలితంగా అపరిణత హృదయాల్లో నిజానికి, కల్ప నకూ మధ్య అంతరాలు, ఊహలకు ఉండే హద్దులూ తుడిచిపెట్టుకు పోతున్నాయి. ఇలాంటి వాతావర ణంలో వయసు పెరిగినా పలువురిలో పరిణతికి బదులుగా విప రీత ధోరణులు పెరిగే అవకాశాలే ఎక్కువ.

‘‘మీ లైంగిక సాహసాలను అందరితో పంచుకోం డి’’ అని పిలిచే నీలి సైట్లలో తమ ‘ప్రతాపం’ చూపడం కోసం సామూహిక రేపిస్టులు వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తుండటం తరచూ వార్తలకెక్కుతోంది. అంతేకాదు, నమ్మిన మహిళలను వంచించి వారితో గడిపిన వీడియో లను నెట్‌లో పెట్టడమూ పెరిగిపోయింది. నీలి చిత్రాల వికృత ప్రభావం స్త్రీ, పురుష సహజ లైంగిక వాంఛను లైంగిక దాడుల స్థాయికి దిగజారుస్తున్నదనే కఠోర వాస్త వాన్ని గ్రహించాలంటే మహిళా సంఘాల లీగల్ సెల్స్ వద్ద ఉన్న వేలాది కేసులను ఒక్కసారి చూస్తే చాలు.

సంసారం నాలుగ్గోడల మధ్య పేట్రేగిపోతున్న లైంగిక హిం సకు నీలి చిత్రాలు ఎలా ప్రత్యక్ష ప్రేరణ అవుతున్నాయో కనబడుతుంది. సంప్రదాయక వైవాహిక బంధంలో శృం గారం ఎక్కువగా మగాడి ఇష్టాయిషాలకు లోబడే ఉం టుంది. దీనికి తోడు బూతు మరిగిన ఆధునిక మగతనం ప్రదర్శించే అసహజ, వికృత, హింసాత్మక లైంగిక క్రీడకు మహిళలు బెంబేలెత్తి పోతున్నారు. నీలిచిత్రాలు మగా ళ్లను కాముక యంత్రాలుగానూ, మహిళలను మగాడు ఎంత హింసాత్మకంగా, వికృతంగా శృంగారం సాగిస్తే అంతగా సంతృప్తి చెందేవారుగానూ చూపుతాయని అధ్యయనాలన్నీ చెబుతున్నాయి. అదే పడక గదుల్లోకి దిగుమతై మహిళలకు నరకం చూపిస్తోంది.

ఇక చట్టబద్ధమైనవిగానే, గౌరవనీయమైనవిగానే మీడియాలో ైస్వైర విహారం చేస్తున్న వ్యాపార ప్రకట నలు మోడల్స్ శరీరాలను సాఫ్ట్ పోర్న్ (అర్ధ బూతు) సరుకులుగా మార్చి నిత్యమూ అమ్మేస్తూనే ఉన్నాయి. మితిమీరిన హింస, శృంగారం, అర్ధనగ్నత్వాలకు చిరు నామాలుగా మారిన టీవీ కార్యక్రమాలు, సినిమాలు వీక్ష కులలోని మగాడిని మరింత ‘గొప్ప మగాడి’గా మార మని ప్రబోధిస్తున్నాయి.    

అసలు నీలి చిత్రాల కృత్రిమ ప్రేరణ అవసరం ఎవ రికి? ఏ పనీ లేకుండానే కావాల్సినంత సంపద, డబ్బు, అధికారం ఉన్న కుటుంబాల్లోని వారికి సాధారణ సంసా రిక సుఖం చాలదు. విశృంఖల లైంగిక సంబంధాలు, వికృత లైంగిక క్రీడ, వాటికోసం నీలి చిత్రాల ప్రేరణ అవసరం. అలాంటి కొద్ది మంది అవసరాల కోసం నీలిై సెట్లపై ఎలాంటి నియంత్రణ ఉండరాదనడం అసమం జసం. ‘‘నీలిచిత్రాల వీక్షణం ఒక చాయిస్’’ అనే మహా మేధావులు ఆ కొద్ది మంది ప్రయోజనాలను కాచేవారు కావడం కాకతాళీయం కాదు. అలా అని ప్రభుత్వం, పోలీసు వ్యవస్థా నైతిక పరిరక్షకులుగా ఏది నీలి చిత్రం? ఏది కాదు? అని నిర్ధారించడమూ అనర్థదాయకమే. నీలి సైట్ల నియంత్రణను అర్హతగలిగిన, నిపుణుల స్వతంత్ర సంస్థలకు అప్పగించాలి. అంతకుమించి ఆ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండటం అవసరం.


- దేవి
(వ్యాసకర్త సామజిక కార్యకర్త) 98486 22829

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement