కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పర్యావరణ శాఖ చూసేవారికి మెడ మీద కత్తి వేలాడుతుంటుంది.
కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పర్యావరణ శాఖ చూసేవారికి మెడ మీద కత్తి వేలాడుతుంటుంది. ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా ఉన్న జయంతీ నటరాజన్‌కు ఉన్నట్టుండి ఉద్వాసన పలికిన తీరు మరోసారి ఆ సత్యాన్ని ఆవిష్కరించింది. శనివారం భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కీ) సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగించడానికి కొన్ని గంటలముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం యాదృచ్ఛికం కాదు. ముంచుకొస్తున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయాలన్నదే ఈ చర్య వెనకున్న ఆంతర్యమని కాంగ్రెస్ వర్గాలు నమ్మబలికినా దాన్నెవరూ విశ్వసించడంలేదు. ఫిక్కీ సమావేశంలో పారిశ్రామిక అధిపతులకంటే రాహుల్ గాంధీయే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎక్కువ మాట్లాడారు. ప్రభుత్వంపరంగా వారికుంటున్న ఇబ్బందులేమిటో విపులంగా చెప్పారు. ప్రాజెక్టుల ఆమోదానికి అవసరమైన సమయంకంటే ఎక్కువ తీసుకోవడం శరవేగంతో దూసుకెళ్లాల్సిన మన ఆర్ధిక వ్యవస్థకు చేటు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కారకులెవరో, కాలపరిమితి ఎంతో నిర్ధారించి ప్రాజెక్టుల అనుమతి విషయంలో జవాబుదారీ తనాన్ని తీసుకురావాలని రాహుల్ చెప్పుకొచ్చారు. పర్యావరణ మంత్రికో, ముఖ్యమంత్రికో ఇష్టమొ చ్చినట్టు నిర్ణయాలు తీసుకునే అధికారాలుండటం పట్ల ఆయన నొచ్చుకున్నారు కూడా. రాహుల్ ఇంతగా మాట్లాడాక జయంతీ నటరాజన్ ఎందుకు నిష్ర్కమించారో ఎవరికీ అనుమానాలుండాల్సిన అవసరం లేదు. ఒకవేళ పార్టీ బలోపేతం తక్షణావసరం అనుకుంటే... ఇలా ప్రాజెక్టుల అను మతి విషయంలో అంతులేని జాప్యం ప్రదర్శించే జయంతికి బదులు అంతకంటే ‘చాలా చురుగ్గా’ ఉండేవారినే ఎంపికచేసుకునేవారు.
అసలు పర్యావరణం అంటూ ఒకటున్నదని, దాన్ని పరిరక్షించుకోవాల్సి ఉన్నదని మనదేశంలో గుర్తించి ఎంతోకాలం కాలేదు. అలా గుర్తించాక కూడా కేంద్రంలో అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయడం 1985 నాటికి గానీ సాధ్యంకాలేదు. ఈలోగా సంస్కరణలకు తలుపులు తెరిచి అభివృద్ధి, వృద్ధిరేటు వంటివి కొత్త అర్ధాలు సంతరించుకున్నాక అభివృద్ధికీ... పర్యావరణ పరిరక్షణకూ మధ్య వైరుధ్యం సాగుతూనే ఉంది. అటు పర్యావరణవాదులనుంచీ, ఇటు పరిశ్రమల అధిపతులనుంచీ ఆ శాఖకు సమానంగా అక్షింతలు పడుతూనే ఉన్నాయి. అభివృద్ధికి పర్యావరణ మంత్రిత్వ శాఖ పెద్ద ఆటంకంగా నిలిచిందని పారిశ్రామిక వేత్తలు తరచు అంటుంటే ఆ శాఖ మొక్కుబడిగా ఉన్నదే తప్ప దేశంలో పర్యావరణ పరిరక్షణ దానివల్ల కావడంలేదని ఉద్యమకారులు ఆరోపిస్తుంటారు. ఏటా వెలువడే కాగ్ నివేదికలు గమనించినా పర్యావరణ శాఖ చేస్తున్నదేమిటో అవగాహన కలుగుతుంది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2006-12 మధ్య 2.57 లక్షల ఎకరాల అడవులను కేటాయిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా సామాజిక వనాల పెంపు కోసం ఆ శాఖ తీసుకున్న భూమి 70,215 ఎకరాలు మాత్రమేనని కాగ్ ఆమధ్య వెల్లడించింది. అందులో సైతం వనాల పెంపకం చేపట్టింది 18,000 ఎకరాల్లో మాత్రమేనని తేల్చింది. పర్యావరణ శాఖ పట్టించుకోని కారణంగా దేశంలో అడవులన్నీ నాశనమవుతున్నాయని తేల్చిచెప్పింది. ఉత్తరాఖండ్‌లో విచ్చలవిడిగా జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడం, భవంతులు నిర్మించడం... అందుకోసం ఎడాపెడా అడవులు నరికేయడం వంటి కారణాలవల్లనే గత జూలైలో పెను ఉత్పాతం సంభవించిందని పర్యావరణవేత్తలు చెబుతున్నమాట. పర్యావరణ శాఖ ఉన్నా విధ్వంసమూ, దాన్ని వెన్నంటే ప్రమాదమూ ముంచుకొస్తున్నాయని వారి ఆరోపణ. మరోపక్క సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ జన్యుపరివర్తిత పంటల క్షేత్రస్థాయి పరిశోధనలకు అనుమతించరాదని నివేదిక ఇచ్చాక... దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేయాలనుకున్న అఫిడవిట్‌కు జయంతి అడ్డుతగలడం ఇటీవలి పరిణామం. ఆమెను తొలగించడానికి ఈ పరిణామం కూడా కారణమంటున్నారు. ఇదికాక దాదాపు రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఇతరేతర అనుమతులొచ్చినా పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయాయని పరిశ్రమాధిపతులు లెక్కలు చెబుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలకు చెందిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులెన్నో పర్యావరణ శాఖవద్ద నిలిచిపోయాయని ఆయా రాష్ట్రా ముఖ్యమంత్రులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇవికాక అటవీ అనుమతుల కోసం ఎన్నో ప్రాజెక్టులు ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాయని కేంద్ర విద్యుత్, గనుల శాఖలు ఫిర్యాదుచేస్తున్నాయి. అంటే, పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనకూ... పరిశ్రమాధిపతుల ఆరోపణలకూ మధ్య పొంతనేలేదు. ఈ రెండింటిలో నిజమేదో తేలేలోగానే జయంతిని పదవినుంచి తప్పించారు.
ఇటీవలి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆర్ధిక మందగమనం ఒక కారణమని, ఆ మందగమనానికి మూలం సర్కారుపరంగా ఏర్పడిన నిర్ణయరాహిత్యంలో ఉన్నదని మన్మోహన్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈమధ్యే చెప్పారు. ఆ నిర్ణయరాహిత్యానికి ప్రధాన బాధ్యత జయంతి పైకి నెట్టి, ఓటమికి మూలం ఆమేనని తేల్చి చివరకు ఈ చర్య తీసుకున్నారని ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే అర్ధమవుతుంది. తన మంత్రి వర్గంలో ఎవరు ఉండాలో, ఉండకూడదో నిర్ణయించుకోవాల్సింది ప్రధానే. దాన్నెవరూ తప్పుబట్టరు. అయితే, అలా చేసేటపుడు అందుకు తగిన కారణాలు కూడా చెప్పగలిగితే ప్రజలు సంతోషిస్తారు. కానీ, జయంతి విషయంలో ప్రభుత్వం ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. ఫిక్కీ సమావేశంలో తమ వైపుగా జరుగుతున్న తప్పుల్ని రాహుల్ ఏకరువు పెట్టడం, ప్రత్యేకించి పర్యావరణ శాఖ తీరును ఎండగట్టడం... సరిగ్గా అంతకు కొన్ని గంటల ముందు ఆదరాబాదరాగా జయంతిని సాగనంపడం ప్రభుత్వ ప్రతిష్టను పెంచదు.