బీహార్‌లో ఆనంద్ మోహన్ అనే నాయకుడుండేవాడు. ఒక దఫా ఎంపీగా పనిచేసినా నేరస్తుడిగానే అతను అపకీర్తి గడించాడు. ఆ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య అనే దళిత ఐఏఎస్ అధికారిపై 1994లో జనాన్ని ఉసిగొల్పి దాడిచేయించి హతమార్చిన కేసులో నేరగాడిగా రుజువైన ఆనంద్ మోహన్‌కు ఉరిశిక్ష పడింది. ఉన్నత న్యాయస్థానంలో అది యావజ్జీవ శిక్షగా మారింది. నిజాయితీగల అధికారిగా పేరున్న కృష్ణయ్య తెలుగువాడు. బీహార్ ఇప్పుడు మెరుగుపడిన దాఖలాలు కనిపిస్తుండగా... టీడీపీ పాలన పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ పాత బీహార్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్టు కనబడుతోంది.
అక్రమ ఇసుక మైనింగ్‌ను ఆపడానికి ప్రయత్నించిన ఒక మహిళా అధికారిపైనా, రెవెన్యూ సిబ్బందిపైనా, పాత్రికేయుడిపైనా పోలీసుల సాక్షిగా బుధవారం కృష్ణాజిల్లా రంగంపేటలో జరిగిన దాడి, దౌర్జన్యం దీన్నే ధ్రువపరుస్తున్నది. డ్వాక్రా మహిళల పేరిట తన అనుచరులను పోగేసుకుని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రెవెన్యూ సిబ్బందిని నానా దుర్భాషలాడి దౌర్జన్యం చేస్తున్నారని తెలిసి స్థానిక తహసీల్దార్ వనజాక్షి ధైర్యంగా అక్కడికెళ్లారు. వెళ్లడమే కాదు... ప్రభాకర్‌ను నిలదీశారు. అక్రమంగా ఇసుకను తరలించుకుపోతున్న ట్రాక్టర్ల ఎదుట బైఠాయిం చారు. అదే పెద్ద నేరమైంది. ఆమెను దుర్భాషలాడారు. మందిని ఉసిగొల్పారు. మహిళలు కొందరు ఆమెను కొట్టి గాయపరచడంతోపాటు ఈడ్చుకెళ్లారు. వనజాక్షికి సాయపడటానికి ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిని, ఈ రాక్షసత్వాన్ని చిత్రీకరిస్తున్న ‘సాక్షి’ విలేకరిని తీవ్రంగా కొట్టారు. కెమెరాను ధ్వంసం చేశారు.
చిత్తశుద్ధిగల వనజాక్షి వంటి అధికారి మాఫియా తరహాలో రాజ్యమేలుతున్న నాయకగణానికి కంట్లో నలుసులా మారడంలో వింతేమీ లేదు. వింతల్లా ఏమంటే... పట్టపగలు ఒక మహిళా అధికారిపైనా, ఆమె సిబ్బందిపైనా, పాత్రికేయుడిపైనా రాక్షస దాడి జరుగుతుంటే ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం! ఘటన జరిగి 24 గంటలు దాటుతున్నా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం చేవచచ్చి, చేష్టలుడిగినట్టు ఉలక్కుండా పలక్కుండా మిగిలిపోవడం!! నెల తిరిగేసరికల్లా లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకుంటున్న ఉన్నతాధికారులంతా ఏమైనట్టు?
ఒక మహిళా అధికారి కన్నీరుమున్నీరైతే... ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని వాపోతే వీళ్లంతా ఎటుపోయినట్టు? ముఖ్య మంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకెళ్లారు సరే... అయినదానికీ, కానిదానికీ విలేకరుల సమావేశాలు పెట్టి ఆవేశంతో ఊగిపోయే మంత్రులెక్కడ? ఇద్దరు డిప్యూటీ సీఎంలున్నా... వారిలో ఒకరు హోంమంత్రి అయినా స్పందనలేదేమి? ఘటన జరిగిననాడే వనజాక్షి ముసునూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా చర్యలెందుకు లేవు? ప్రభాకర్‌నూ, అతని అనుచరులనూ ఎందుకు అరెస్టు చేయలేదు? ఆమె ఫిర్యాదు ఇచ్చేవరకూ ఆగనవసరం లేదు. నిజాయితీగా వ్యవహరించదల్చుకున్న ఉన్నతాధికారులకు చానెళ్లు ప్రసారం చేసిన కథనాలే చాలు. అలాంటి చర్యలేమీ లేకపోబట్టే ప్రభాకర్‌కు మరింత ధైర్యం వచ్చింది. చేసింది చాలదన్నట్టు గురువారం మరింతగా రెచ్చిపోయారు. ఆమెను వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటమే కాదు...తన అనుచరణగణంతో ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయించారు. తహసీల్దార్ వనజాక్షిపై ఇద్దరు మహిళలతో ఎదురు కేసు పెట్టించారు. ఆ కేసు రిజిస్టరైందంటేనే ప్రభుత్వ వైఖరి ఎవరికి అనుకూలంగా ఉన్నదో అర్థమవుతుంది.
రంగంపేటకు వనజాక్షి తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి వెళ్లారా? తన బంధుగణం ప్రయోజనాలు రక్షించడానికి వెళ్లారా? ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని ఆపడానికెళ్లారు. లారీలతో, ట్రాక్టర్లతో నిత్యమూ వేలాది టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికెళ్లారు. ప్రజలందరికీ న్యాయంగా చెందాల్సిన సహజ సంపద అన్యాక్రాంతం కాకుండా కాపాడటాని కెళ్లారు. పర్యావరణానికి ప్రజాప్రతినిధి కలిగిస్తున్న నష్టాన్ని నివారించడానికెళ్లారు. అలాంటి అధికారిని గూండాల, రౌడీల ఆగడాలనుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? వనజాక్షి సాధారణమైన అధికారి కాదు. తహసీల్దార్‌గా తనకు సంక్రమించిన అధికారాలరీత్యా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. తన పరిధిలోని ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే పౌరుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోగలిగినవారు. అలాంటి అధికారిపై దాడి జరిగిందంటే ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? తన అధికారం అపహాస్యం పాలయినట్టు కాదా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆచరిస్తున్న రాజకీయాల పర్యవసానంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. చింతమనేని ప్రభాకర్‌పై ఇప్పటికి 34 కేసులున్నాయి. రౌడీషీట్ కూడా ఉంది. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాదు...ప్రభుత్వ విప్ పదవి కూడా కట్టబెట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇసుక విక్రయాలను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నట్టు నిరుడు అక్టోబర్‌లో చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. విక్రయాల్లో వచ్చిన సొమ్ములో 25 శాతాన్ని డ్వాక్రా సంఘాలకు ఇస్తామన్నారు. మహిళా సాధికారతను సాధించడమే తమ లక్ష్యమన్నట్టు మాట్లాడారు.
ఇసుక తవ్వకాలవద్ద సీసీ కెమెరాల నిఘా పెట్టి మాఫియాల అంతు చూస్తామన్నారు. నిజంగా అలా కెమెరాలు పెట్టి ఉంటే... ప్రభాకర్, ఆయన అనుచరులు చానెళ్ల కెమెరాలను విరగ్గొట్టినా, తహసీల్దార్ సెల్‌ఫోన్ విసిరికొట్టినా జరిగిందేమిటో ప్రపంచానికి తెలిసేది. టీడీపీ నేతల నిజస్వరూపం బయటపడేది. డ్వాక్రా సంఘాల నోట మన్నుగొట్టి ప్రతిచోటా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే ఇసుక దందా సాగిస్తున్నారని, పరిమితులకు మించి తవ్వకాలు జరిపి అటు పర్యావరణానికి హాని కలిగించడంతోపాటు ఇటు ఖజానాకు గండికొడుతున్నారని వివిధ జిల్లాలనుంచి వచ్చే సమాచారం వెల్లడిస్తోంది. ఇలాంటి ధోరణిని నిలువరించడానికి ప్రయత్నించడమే వనజాక్షి నేరమైంది. మాఫియాల అక్రమాలను అడ్డుకోవడానికి నిజాయితీగా ప్రయత్నిస్తున్న వనజాక్షి వంటి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కర్తవ్యం ఉద్యోగ సంఘాలది మాత్రమే కాదు... బాధ్యతగల పౌరులందరిదీ, ప్రజా సంఘాలదీ, పార్టీలదీ కూడా.
మాఫియా రాజ్యం!
Published Fri, Jul 10 2015 1:10 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
Advertisement
Advertisement