కొన్ని నిర్వచనాలకు అందవు. మూసలో ఇమడవు. సంప్రదాయాలకూ, నియమా లకూ లొంగవు. ఈమధ్యకాలంలో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సాగుతున్న దౌత్యం ఎలాంటిదో, దానికి ఏం పేరు పెట్టాలో తెలియక చాలామంది విశ్లేషకులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ శుక్ర వారం ఉన్నట్టుండి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టి అందరినీ చకితుల్ని చేశారు. రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకున్నాక అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ వెళ్లి అక్కడి కార్యక్రమాలు ముగిశాక ఢిల్లీకి బయల్దేరినట్టే కనబడి మార్గమధ్యంలో లాహోర్ వెళ్తున్నట్టు మోదీ ట్వీట్ చేశారు.
అప్పటివరకూ ప్రధానులిద్దరూ కలవబో తున్నారని అటు పాకిస్థాన్‌లోగానీ, ఇటు భారత్‌లోగానీ ఎవరికీ తెలియదు. ఈ హఠాత్తు పరిణామం వెనకున్న కారణాన్ని మోదీ ట్విటర్ సందేశం ద్వారానే చెప్పారు. నవాజ్ షరీఫ్‌కు ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు... తన మనవరాలి పెళ్లి వేడుకలు కూడా జరుగుతున్నాయని కనుక తప్పకరావాలని షరీఫ్ ఆహ్వానించడంతో వెళ్లానన్నది మోదీ చెబుతున్న మాట. ఇదంతా నిజమని, యాదృచ్ఛికంగా జరిగిందేనని నమ్మేవాళ్లున్నట్టే...అందులో వాస్తవం లేదని వాదించేవారూ ఉంటారు.
‘ఒక ప్రోటోకాల్ లేదు...ఒక పద్ధతీ లేదు, ఇదేం దౌత్యమ’ంటూ విమర్శలకు దిగిన కాంగ్రెస్ నేతల సంగతలా ఉంచితే... ఇరు దేశాలమధ్యా సత్సంబంధాలను కాంక్షించే ప్రతి ఒక్కరూ ఇప్పుడు మోదీ పాకిస్తాన్ పర్యటనతోసహా ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. చైనా నాయ కుడు డెంగ్ జియావో పెంగ్ వేరే సందర్భంలో అన్నట్టు ‘పిల్లి నల్లదైతేనేం, తెల్లదై తేనేం...కావలసింది ఎలుకల్ని పట్టడం’. దశాబ్దాలుగా పరస్పరం విద్వేషాగ్నులతో రగిలిపోతున్న రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొనడం, చెలిమి చిగురించటం ముఖ్యంగానీ అందుకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారన్నది అంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. అధికార పీఠం అధిష్టించిననాటినుంచీ దౌత్యరంగంలో తనదైన శైలిలో వ్యవహరిస్తూ వస్తున్న మోదీ...పాకిస్థాన్‌తో చర్చల విషయంలోనూ వినూత్న విధానాన్ని అవలంబి స్తున్నారు. ముందూ, మునుపూ ఇలాంటి పద్ధతుల్లో దౌత్యాన్ని నెరపలేదు గనుక ఇప్పుడూ వీల్లేదనడం సరికాదు.
దౌత్య పరిభాషలో మోదీ లాహోర్ సందర్శనను దేశాధినేత పర్యటనగా పరిగణించడం సాధ్యంకాదు. అధికారికంగా ఖరారయ్యే అలాంటి పర్యటనల వెనక బోలెడు లాంఛనాలుంటాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు మొదలుకొని అనేకమంది ఉన్నతాధికారులు చర్చించుకుని వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అంగీకారయోగ్యమైన ఎజెండాను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రధాని స్థాయి నేత పర్యటన తేదీలు ఖరారవుతాయి. ఇప్పుడు అటువంటివేమీ లేవు. అలాగని తెరవెనక ఏమీ జరగకుండానే యథాలాపంగా మోదీ అటువైపు విమానం మళ్లించమన్నారని నమ్మనవసరం లేదు. ఈమధ్య ఇరు దేశాల సంబంధాల్లోనూ చోటుచేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా గమని స్తున్నవారికి తాజా ఉదంతంలోని ఆంతర్యం బోధపడుతుంది. దౌత్యంలో పైకి కనబడేది వేరు...వెనక జరిగేది వేరు. ముఖ్యంగా పరస్పరం కత్తులు నూరుకునే దేశాలైతే వేర్వేరు స్థాయిల్లో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ చర్చలకు ప్రచారం ఉండదు. ప్రకటనలుండవు. అసలు వాటిల్లో పాల్గొనేది అధికారులు కాదు.
దౌత్య రంగంలో నిపుణులైన ప్రభుత్వేతర వ్యక్తుల పాత్రే అందులో ఉంటుంది. సమ స్యలపై ఎవరి అవగాహనేమిటో...వాటి పరిష్కారానికి ఏ ఏ మార్గాలున్నాయని అవతలి పక్షం అనుకుంటున్నదో తెలుసుకోవడం ఈ మంతనాల ఆంతర్యం. వాటిపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుని చివరకు చర్చల కోసం నిర్దిష్టమైన ప్రాతిప దికను ఏర్పర్చుకోవడం పరిపాటి. ఇలాంటి మంతనాలను నిర్వహించే పక్షాలకు ఎంతో ఓపిక అవసరమవుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడానికి సిద్ధపడవలసి ఉంటుంది. ఒక మెట్టు దిగక తప్పదని అనుకున్నప్పుడు అలాంటి పరిణామానికి పౌరుల్ని సంసిద్ధుల్ని చేయాల్సి ఉంటుంది. ‘ట్రాక్-2 దౌత్యం’గా పిలిచే ఈ వ్యవహారం సహజంగానే అత్యంత రహస్యంగా సాగుతుంది. ఇందులో విజయం సాధించాకే ఆయా దేశాల్లోని అధికార యంత్రాంగాల పాత్ర మొదల వుతుంది. ఆ స్థాయిలో కూడా అంతా సవ్యంగా ముగిశాక అధినేతల సమావేశం సాధ్యపడుతుంది. 90వ దశకంలో ఇజ్రాయెల్, పాలస్థీనా విమోచనా సంస్థ (పీఎల్‌ఓ) మధ్య కుదరిన ఓస్లో ఒప్పందాలైనా, 2000 సంవత్సరంలో ఇజ్రాయెల్- పాలస్థీనాల మధ్య కుదిరిన కేంప్‌డేవిడ్ ఒప్పందమైనా నెలల తరబడి సాగిన ‘ట్రాక్-2 దౌత్యం’ వల్లనే సాధ్యమయ్యాయి.
అంతర్జాతీయ సదస్సుల సందర్భాల్లో భారత్-పాకిస్తాన్ అధినేతలు కలుస్తు న్నారు. అయితే నిర్దిష్టమైన సమస్యలపై ఇరు దేశాలమధ్యా అధికారుల స్థాయి సంప్రదింపులు జరిగి ఏడేళ్లు కావస్తున్నది. అనేకసార్లు వీటిపై సంకేతాలు రావడం... చివరి నిమిషంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగానో, కొన్ని అంశాల్లో పాకిస్తాన్ అవలంబిస్తున్న వైఖరి కారణంగానో నిలిచిపోవడం సర్వసాధారణమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు...గత నెలాఖరున థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకా క్‌లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులూ, విదేశాంగ కార్యదర్శులూ గుట్టుచప్పుడు కాకుండా భేటీ అయి నిర్ణయాలు ప్రకటించారు. దానికి కొనసాగిం పుగానే ఈమధ్య విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ పర్యటించడం, ఇప్పుడు మోదీ లాహోర్ సందర్శనవంటివి చోటుచేసుకున్నాయి. క్రిస్మస్ పర్వదినాన, ఇరు దేశాల సఖ్యతకూ కృషి చేసిన మాజీ ప్రధాని వాజపేయి పుట్టినరోజున తాజా పరిణామం చోటుచేసుకోవడం శుభదాయకం. ఈ పరిణామాలన్నీ రెండు దేశాల సాన్నిహిత్యానికీ దారితీయాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు.
మోదీ మ్యాజిక్!
Published Sat, Dec 26 2015 12:46 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement