మూకీ చిత్రంలా సాగుతున్న మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారపర్వం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశించాక ఉరుములు, మెరుపులతో సందడిగా మారింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థులపై పిడుగులు కురిపించి వారిని గుక్క తిప్పుకోకుండా చేసిన మోదీ అటు తర్వాత మాట్లాడటమే దాదాపు తగ్గించారు. ఈ నాలుగు నెలల కాలంలో మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని అందుకు సంబంధించిన అంశాలకు పరిమితమై ప్రసంగించడం తప్ప ఇతరత్రా విషయాలు మాట్లాడలేదు. మళ్లీ ఎన్నికల సీజన్ వచ్చేసరికి మోదీ మాటల దాడి మొదలైంది. మోదీ ప్రసంగాలపై ఎలా స్పందించాలో అర్ధంకాక రెండుచోట్లా ప్రత్యర్థులు అయోమయంలో పడిపోయారని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఎన్సీపీలను తూర్పారబట్టిన మోదీ తాను శివసేన జోలికి మాత్రం వెళ్లేదిలేదని ప్రకటించారు. రాష్ట్రంలో బాల్‌ఠాక్రే లేకుండా జరుగుతున్న ఈ తొలి ఎన్నికల్లో ఆయనకు నివాళిగా శివసేనపై ఒక్క మాట కూడా మాట్లాడరాదని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కూడా గుజరాత్ వారేనని...ఈ ఎన్నికల ద్వారా వారు మరాఠీ ప్రజలపై గుజరాతీ ఆధిపత్యాన్ని ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న శివసేనకు ఈ పరిణామం మింగుడు పడనిది. తమతో పొత్తుకు స్వస్తి చెప్పి విడిగా పోటీచేస్తున్న బీజేపీని దెబ్బతీయాలంటే ‘గుజరాతీ ఆధిపత్యం’ ఆరోపణ ఎత్తుకోవడం శివసేనకు తప్పనిసరి. బొంబాయి ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ‘మరాఠీ మను’ నినాదాన్ని ఎజెండాలోకి తెచ్చి గుజరాత్ మర్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర శివసేనది. అప్పట్లో ముంబైలోని వ్యాపార వర్గానికీ, మరాఠాలే ప్రధానంగా ఉండే కార్మికవర్గానికీ మధ్య వైషమ్యాలు తీవ్రస్థాయిలో ఉండేవి. సరిగ్గా దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఆదినుంచీ జాగ్రత్తగా అడుగులేస్తున్నది. శివసేన ఆరోపణల ప్రభావం పడని రీతిలో ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అసలు సిసలు వారసులం తామేనని ప్రకటించుకుంది. దానికి అనుగుణంగా రాష్ట్రమంతా హోర్డింగులు ఏర్పాటుచేసింది. ఒకపక్క శివసేనపై ఒక్క మాట కూడా మాట్లాడనంటూనే ఎన్నికల తర్వాత ఆ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశమే లేదని చెప్పడం మోదీ చాణక్యానికి నిదర్శనం. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తామే అతి పెద్ద పార్టీగా అవతరించబోతున్నామన్న అభిప్రాయం కలిగించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది.
అందుకే ఆలస్యంగానైనా శివసేన మేల్కొంది. మోడీ, ఆయన కేబినెట్ సహచరుల ఎన్నికల ప్రచారాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే శివాజీ రాజ్యంపై పదిహేడో శతాబ్దంలో దండెత్తిన బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్ సైన్యంతో పోల్చడం ఇందులో భాగమే. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమంలో గుజరాతీ నృత్యం గర్బాను మాత్రమే చేర్చడం, అమెరికా అధ్యక్షుడు ఒబామా మోదీని గుజరాతీలో ‘ఎలా ఉన్నారు’అని ప్రశ్నించడం వంటివి కూడా శివసేన ప్రస్తావించడం మరాఠీ ప్రజల్లో ఉండే గుజరాతీ వ్యతిరేకతను మేల్కొల్పడానికే. అలాగే, ప్రత్యేక విదర్భకు మద్దతిస్తున్న బీజేపీ తీరుపై కూడా శివసేన విరుచుకుపడుతున్నది. రాష్ట్రాన్ని చిన్నాభిన్నంచేసి బలహీనపర్చడమే ఆ పార్టీ ధ్యేయమని విమర్శిస్తున్నది. మహారాష్ట్రలో గోపీనాథ్ ముండే మరణం తర్వాత చెప్పుకోదగ్గ నాయకుడే లేక మోదీపైనే ప్రచార భారాన్నంతా వేసిన బీజేపీకి ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొనవలసి రావడం ఇబ్బందికరమే. రాగల రోజుల్లో ఇలాంటివి మరిన్ని వినవలసి రావడం తప్పదు గనుకనే మోదీ ముందు జాగ్రత్తపడ్డారనిపిస్తుంది. బాల్‌ఠాక్రేపై గౌరవ భావమున్నదని మోదీ చెప్పాక శివసేన చేసే ఎంత తీవ్రమైన ఆరోపణలైనా వీగిపోగలవన్న నమ్మకం బీజేపీ సీనియర్ నేతల్లో ఉన్నట్టు కనబడుతున్నది.
మహారాష్ట్రతో పోలిస్తే హర్యానా ఎన్నికలు బీజేపీకి నల్లేరు మీద నడకలాంటివే. అక్కడ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా జరిపారంటున్న అక్రమ భూ లావాదేవీలు బీజేపీకి ఇప్పుడు శక్తిమంతమైన ఆయుధాలు. మోదీ చేస్తున్న విమర్శల జడిని తట్టుకుని నిలబడటానికి ప్రయత్నించడం తప్ప ఎదురుదాడి చేయడానికి తగిన సామగ్రి కాంగ్రెస్ వద్దలేదు. అధికారంలోకొచ్చిన ఈ నాలుగు నెలల కాలంలోనూ మీరేం చేశారని సోనియాగాంధీ ప్రశ్నించకపోలేదుగానీ అరవైయ్యేళ్ల పాలనలో అన్ని రంగాలనూ ధ్వంసం చేసింది మీరు కాదా అని మోదీ ప్రతి దాడి చేశారు. ఈ నాలుగు నెలలూ మోదీ ప్రభుత్వం ఏం సాధించిందనే అంశాన్ని ప్రజలు గమనిస్తారు. అందులో సందేహం లేదు. ద్రవ్యోల్బణం తాకిడి ఇంకా తగ్గలేదు. ధరలింకా నేలకు దిగిరాలేదు. ఈ అంశాలకు సంబంధించి ప్రజల్లో ఎన్డీయే సర్కారుపై అసంతృప్తి లేకపోలేదు. అయితే, ఇంత స్వల్ప వ్యవధిలోనే ఏ ప్రభుత్వమైనా అన్నీ చేయగలదని వారు భావించడంలేదు. మోదీ ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ప్రస్తుతానికైతే ఉంది. తాను ప్రారంభించిన ఉపాధి హామీ పథకం, ఆహారభద్రతవంటివి తనవేనని చెప్పుకోవడంలో యూపీఏ సర్కారు విఫలం కాగా... సామాన్యులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించడానికి వీలు కల్పించిన జన్‌ధన్ యోజన మొదలుకొని స్వచ్ఛ్ భారత్ వరకూ ఏ కార్యక్రమాన్నయినా పద్ధతి ప్రకారం అమలు చేయడం, కావలసినంత ప్రచారాన్ని రాబట్టుకోవడంలో తనకెవరూ సాటిరారని ఎన్‌డీఏ సర్కారు నిరూపించుకుంది. మొత్తానికి మరో పదిరోజుల్లో జరగబోయే మహారాష్ట్ర, హర్యానా ఎన్నిక ల్లో ప్రజల మొగ్గు ఎటు ఉన్నదో తేలిపోతుంది. ఇవి కచ్చితంగా ఎన్డీయే పాలనపైనా, మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రచార సారథ్యాన్ని స్వీకరించిన మోదీ తీరుపైనా రెఫరెండం వంటివి. అందువల్లే బీజేపీ జాగ్రత్తగా అడుగులేస్తున్నది.
ఎన్నికలకు మోదీ కళ!
Published Mon, Oct 6 2014 11:21 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement