రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా? | ramoji rao do have a gj reddy | Sakshi
Sakshi News home page

రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా?

Published Mon, May 5 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా?

రామోజీ! జీజే రెడ్డి గుర్తున్నాడా?

నేటికీ మార్గదర్శి రికార్డుల్లో జీజేఆర్ పేరుతోనే షేర్లు
మార్గదర్శితో పాటు ‘ఈనాడు’ కూడా జీజేఆర్ మానసపుత్రికే!
అతని వద్ద గుమస్తాగా చేరి, అంచెలంచెలుగా ‘ఎదిగిన’ రామోజీ
మార్గదర్శిలో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలే!
పెట్టుబడులన్నీ జీజేఆర్‌వేనంటున్న నాటి రామోజీ సహోద్యోగులు
‘ఈనాడు’ పెట్టుబడులు, మెషినరీ... అన్నీ జీజేఆర్ పుణ్యమే!
దేశం నుంచి సాగనంపి... వాటన్నింటినీ దిగమింగిన రామోజీ!
నమ్మకద్రోహానికి రామోజీ నిలువెత్తు నిదర్శనం: జీజేఆర్ గ్రామస్తులు


రాజగురువు ఎదుగుదల వెనక ‘దేశద్రోహ’ కోణం  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజే రెడ్డి అనే వ్యక్తి పేరిట షేర్లు
దేశద్రోహం కేసులో దేశం వదిలి పరారైన చరిత్ర అతనిది   అతని ఆస్తులు, ఖాతాలు, షేర్లనూ జప్తు చేసిన ప్రభుత్వం
మార్గదర్శిలోని జీజేఆర్ షేర్లను మాత్రం స్వాధీనం చేయని రామోజీ  దేశద్రోహానికి తీసిపోని నేరమేనంటున్న విశ్లేషకులు

నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే... సీఐఏ ఏజెంట్‌గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా... పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా సాయం వంటి సర్వ వనరులూ.. దేశ రహస్యాలను విక్రయానికి పెట్టిన కేసులో ఇరుక్కున్న ఆ వ్యక్తి అందజేసినవే. అసలు మార్గదర్శి, ఈనాడు ప్రాణం పోసుకున్నది కూడా.. ‘అపరాధిగా ప్రకటితుడై’, అరెస్టు భయంతో దేశం వదిలిపోయిన ఆ వ్యక్తి ఆలోచనల్లో నుంచే! అతని పేరు గాదిరెడ్డి జగన్నాథరెడ్డి, ఉరఫ్ జి.జె. రెడ్డి. అతను 1960, 1970ల్లో ఢిల్లీ రాజకీయ, అధికార వర్గాల్లో తిరుగులేని రీతిలో హవా చలాయించిన వ్యక్తి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన హై ప్రొఫైల్ ‘పెద్దమనిషి’!

అలాంటి వ్యక్తి దగ్గర తొలినాళ్లలో గుమస్తాగిరీ చేసిన రామోజీ... ఆనక అతని పెట్టుబడితో, ఆద్యంతం అతని దన్నుతోనే ఇటు చిట్‌ఫండ్, అటు పత్రిక పెట్టి... జీజేఆర్ దేశం వదిలిపోయాక వాటిని సొంతం చేసుకుని... పోటీ పత్రికలను, సంస్థలను అడ్డంగా అణగదొక్కి మరీ ‘పెద్ద’మనిషిగా ఎదిగారు. రాజగురువుగా దర్జాగా రూపాంతరం చెందారు! దేశద్రోహం కేసులో జీజేఆర్ స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థలు, కంపెనీల్లో అతనికున్న వాటాలను కూడా 1977లోనే ప్రభుత్వం స్తంభింపజేసింది. అయినా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జీజేఆర్‌కున్న షేర్లను, అతనివేనని భావిస్తున్న ఇతర పెట్టుబడులను మాత్రం గుట్టుగా దాచేసుకున్న గుండెలు తీసిన బంటు రామోజీ! వాటిని తక్షణం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా దర్జాగా అట్టిపెట్టుకోవడం ద్వారా దేశద్రోహానికి ఏ మాత్రమూ తక్కువ కాని నేరానికి పాల్పడ్డారాయన. మార్గదర్శిలో ఆ షేర్లు ఇప్పటికీ జీజేఆర్ పేరుతోనే కొనసాగుతుండటం విశేషం. తన తండ్రి పెట్టుబడులను తిరిగివ్వండని ఆయన కొడుకు అడిగినా ‘అలాంటివేమీ లేవు పొ’మ్మంటూ ఉత్తి చేతులతో తిప్పి పంపిన కర్కశ హృదయుడు రామోజీ...
 
‘‘అతనికి పలు కంపెనీల్లో భారీ మొత్తంలో షేర్లున్నాయి. పలు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. షేర్లు చేతులు మారకుండా వేగంగా స్పందించండి. బ్యాంకు ఖాతాలను తక్షణం స్తంభింపజేయండి. ఇందుకవసరమైన అన్ని అధికారాలూ సమకూరుస్తూ సీఐడీ డీఎస్పీ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నాం. డీఎస్పీ తక్షణం రంగంలోకి దిగి వివిధ సంస్థల్లోని ఆయన షేర్లను జప్తు చేయాలి. బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలి. ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలి’’
 - ఇవీ ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్

 పి.కె.ధామ్ 1977 ఏప్రిల్ 7న ఇచ్చిన ఉత్తర్వులు!

 ఇందులో పేర్కొన్న ‘భారీ మొత్తంలో షేర్లున్న’ ఆ ‘అతను’ గాదిరెడ్డి జగన్నాథరెడ్డి. ఈయనను చాలా రకాలుగా పరిచయం చేయవచ్చు. జీజే రెడ్డిగా 1960లు, 70ల్లో ఢిల్లీలో బాగా పేరు మోసిన బడా బాబు. పెద్ద పెద్ద వ్యక్తులు, నేతలతో సంబంధాలతో పాటు పలు కమ్యూనిస్టు దేశాలతో మన దేశానికి, ఇక్కడి నాయకులకు మధ్య ‘సంధానకర్త’గా కూడా చక్రం తిప్పిన వ్యక్తి. వీటికి తోడు.. ‘సీఐఏ ఏజెంటు’ అని సాక్షాత్తూ భారత ప్రభుత్వమే పేర్కొన్న వ్యక్తి!! వీటన్నింటికీ మించి.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్‌కు జీజేఆరే ప్రమోటర్ డెరైక్టర్! అంతకంటే కూడా మించి.. రాష్ట్ర రాజకీయాల్లో చిరకాలం పాటు తెర వెనకగా చక్రం తిప్పిన, మళ్లీ తిప్పాలని ఎంతగానో ఆశ పడుతున్న రామోజీకి ఆరంభ దశలో ‘అన్నివిధాలా’ దారి చూపిన ‘మార్గదర్శి’ కూడా ఈయనే!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నేటికీ 288 షేర్లు జీజేఆర్ పేరిటే ఉన్నాయి. దేశద్రోహ చట్టం కింద నేరాభియోగం ఎదుర్కొన్న జీజేఆర్, 1977లో దేశం వదిలిపోయారు. అనంతరం ఆయన ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వం జప్తు చేసింది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన బంగ్లా, హైదరాబాద్ రామచంద్రాపురంలో భూములు, బ్యాంకు ఖాతాలతో పాటు పలు సంస్థల్లో ఆయన పేరిట ఉన్న షేర్లన్నీ జప్తయ్యాయి. కానీ రామోజీ మాత్రం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు. అంతేకాదు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డెరైక్టర్, రామోజీ కోడలు శైలజా కిరణ్‌కు ఆ సంస్థలో కేవలం 100 షేర్లుంటే.. అంతకు దాదాపు మూడు రెట్ల వాటాలు నేటికీ మార్గదర్శి వాటాదారుల జాబితాలో జీజేఆర్ పేరిటే దర్శనమిస్తున్నాయి.

వాటిని 1977లోనే ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన రామోజీ, అలా చేయకపోవడం ద్వారా ఢిల్లీ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కారు! అది తీవ్రమైన నేరమని తెలిసి కూడా అసలే ఖాతరు చేయలేదు. ‘అమ్మ రామోజీ!’ అని ఎవరికైనా అనిపించే ఈ అంశాలన్నీ అసలు వాస్తవాలకు కేవలం ఒక పార్శ్వం మాత్రమే. వీటి ఆధారంగా తీగ లాగితే అసలు డొంకంతా అడ్డంగా బయటపడింది. మార్గదర్శితో పాటు రాజగురువు ఆర్థిక మూలాలన్నీ జీజేఆర్ పెట్టుబడులతోనే ముడిపడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ 1962 ఆగస్టు 31న హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో నమోదైంది. అందులో రామోజీ ప్రారంభ వాటా కేవలం 10 రూపాయలు! ఆయన సోదరుడు కాశీ విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది.
 
 అలా ఇద్దరు సోదరులూ కలిసి కేవలం 20 రూపాయల పెట్టుబడితో సంస్థను స్థాపించారు. వాస్తవానికి సంస్థకు భారీ మొత్తంలో నిధులను ఒంటి చేత్తో సమకూర్చింది.. దాని ప్రమోటర్ డెరైక్టర్‌గా రంగప్రవేశం చేసిన జీజేఆరే అన్నది ఆయన సన్నిహితులతో పాటు అప్పటి రామోజీ సహోద్యోగులు కూడా ఘంటాపథంగా చెప్పేమాట! ‘ఇంతింతై...’ అన్నట్టుగా అనంతర కాలంలో సాగిన మార్గదర్శి, రామోజీ ఎదుగుదలకు జీజేఆర్ పెట్టుబడులే ప్రధాన ఆలంబన! మార్గదర్శితో పాటు రామోజీకి చెందిన డాల్ఫిన్ హోటల్స్‌లోనూ జీజేఆర్ పెట్టుబడులున్నట్టు ఆయన కుమారుడు యూరి రెడ్డి కూడా స్వయంగా ధ్రువీకరించారు. పైగా, తాను పెంచి పోషించిన రామోజీ ఎదుగుదలను చూసి జీజేఆర్ సంతోషించేవారని కూడా ఆయన చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, గుడివాడ తదితర చోట్ల క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ జరిపిన విస్తృత పరిశోధనలో రామోజీ సహచరులు, వ్యాపారంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తులు, వారి పిల్లలు వెల్లడించిన వివరాలు దిగ్భ్రాంతి గొలిపేలా ఉన్నాయి...

 జీజేఆర్‌ను నిచ్చెనలా వాడుకున్న రామోజీ...

 కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని జొన్నపాడుకు చెందిన జీజేఆర్‌కు ఢిల్లీలోని సంపన్నులు, రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ పెద్దలతో కూడా అతి సన్నిహిత సంబంధాలుండేవి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలోకి కూడా నేరుగా వెళ్లగలిగిన సత్తా అతనిది! ఇందిర ఇంటి సమీపంలోనే సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో విశాలమైన బంగ్లాలో ఆయన నివాసం. పైగా ఆమె చిన్న కొడుకు సంజయ్‌గాంధీతో పాటు అప్పట్లో రాజకీయంగా చక్రం తిప్పిన మహ్మద్ యూనస్ వంటి పలువురు రాజకీయ ప్రముఖులతో చెప్పలేనంత చనువు! ఇక రాష్ట్రానికి చెందిన జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, అంజయ్య, రఘురామయ్య వంటి రాజకీయ దిగ్గజాలతో జీజేఆర్‌కున్న పరిచయాలు, సాన్నిహిత్యం గురించైతే చెప్పనవసరమే లేదు! వీటన్నింటినీ తన వ్యాపారాభివృద్ధికి అత్యంత తెలివిగా వాడుకున్నారు రామోజీ. 1960ల తొలి నాళ్లలో కృష్ణా జిల్లా గుడివాడ రోడ్లపై రామోజీ సైకిల్ మీద తిరిగేవారని ఆయన సొంతూరు పెదపారుపూడి వాసులే చెబుతుంటారు. అప్పట్లో రామోజీ ఆర్థికంగా ఏమాత్రమూ స్థితిమంతుడు కాదనేందుకు సొంతూళ్లోని ఆయన ఇల్లే నిదర్శనం. అలాంటి రామోజీ, జొన్నపాడుకే చెందిన ప్రముఖ నక్సలైటు, అప్పటి కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య సిఫార్సు లేఖతో జీజేఆర్ చెంతకు చేరారు. రామోజీని జీజేఆర్ ఢిల్లీలోని తన బంగ్లాలోనే గుమస్తాగా కుదుర్చుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇదంతా 1960ల నాటి సంగతి. అప్పట్లో తాను ఢిల్లీలో ఒక మలయాళీకి చెందిన అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలో పనిచేశానని రామోజీ తనకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా రాసుకున్న ‘75 వసంతాల వెలుగు’ పుస్తకంలో స్వయంగా చెప్పుకున్నారు. వాస్తవానికి మార్గదర్శిని స్థాపించకముందు ఢిల్లీలో రామోజీ పని చేసింది జీజేఆర్ బంగ్లాలోనేనంటారు. అనంతర కాలంలో కూడా రామోజీ ఆ బంగ్లాకు తరచూ వచ్చి వెళ్లేవారని జీజేఆర్ కుమారుడు యూరి వివరించారు.

పైగా మార్గదర్శితో తన సాన్నిహిత్యం గురించి జీజేఆర్ ఇతర డెరైక్టర్లతో తాను రాసుకున్న అవగాహన పత్రంలో స్వయంగా ఇలా పేర్కొన్నారు... ‘‘నాకు కొన్ని కంపెనీల్లో తక్కువ, మరికొన్నింట్లో ఎక్కువ షేర్లు ఉండొచ్చు. నేను చేసే పని స్వభావం మన డెరైక్టర్లందరికీ తెలిసిందే. నేను వ్యవస్థాపకునిగా ఉన్న నవభారత్‌లోనూ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోనూ మనమంతా సమాన భాగస్వాములుగానే చేరాం. సంస్థను నిర్వహించే వారే డెరైక్టర్ల తరఫున ట్రస్టీగా వ్యవహరించాలని కూడా మనం ముందుగా అనుకున్నదే. రష్యా నుంచి అందిన డబ్బే మన సంస్థ ఎదుగుదలకు కారణమన్నది కూడా నేను మళ్లీ చెప్పాల్సిన పని లేదు. అయితే (మన) రెండో తరం వారికి ఈ విషయాలన్నీ తెలియవు. కాబట్టి షేర్లను డెరైక్టర్లందరికీ సమాన నిష్పత్తిలో కేటాయిస్తే వారికి (మున్ముందు) పేచీలుండవు’’ అని! అంతేకాదు, 1976లో జీజేఆర్ సమర్పించిన ఐటీ రిటర్నుల్లో నంబర్‌వన్ కంపెనీ కూడా.. మార్గదర్శి చిట్‌ఫండ్సే!
 
 ఎన్నెన్నో ప్రశ్నలు...!
 జీజేఆర్ ఉదంతానికి సంబంధించి ఇటు రామోజీ తీరుపై,
అటు ప్రభుత్వ వ్యవహార శైలిపై  ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి...


1. మార్గదర్శి చిట్‌ఫండ్స్ తొలి డెరైక్టర్లలో ఒకరు దేశద్రోహానికి పాల్పడి పారిపోయినా, ఆ సంస్థను మాత్రం ప్రభుత్వం విచారించలేదు. ఎందుకు?
2.   దేశం వదిలి వెళ్లేనాటికి మార్గదర్శి డెరైక్టర్ హోదాలో ఆ సంస్థలో జీజేఆర్ పెట్టిన పెట్టుబడులు ఎన్ని? ఇప్పుడు వాటి వాస్తవ విలువెంత?
3.   జీజేఆర్ దేశద్రోహి అని కోర్టే నిర్ధారించిన నేపథ్యంలో, మార్గదర్శిలోని వాటాలు ప్రభుత్వానికే చెందుతాయి కదా! మరి వాటిని ప్రభుత్వం ఎందుకు జప్తు చేయడం లేదు?
4.    జీజేఆర్ వంటి అజ్ఞాత ఇన్వెస్టర్లు మార్గదర్శిలోనూ, రామోజీ గ్రూపులోని ఇతర సంస్థల్లోనూ ఇంకెంతమంది ఉన్నారు?
5.    నవభారత్, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎదుగుదలకు రష్యా నుంచి అందిన డబ్బే కారణమని ఇతర డెరైక్టర్లతో రాసుకున్న అవగాహన ఒప్పందంలో జీజేఆరేస్వయంగా ధ్రువీకరించిన విషయం. దీనిపై కూడా ప్రభుత్వం గానీ, దర్యాప్తు సంస్థలు గానీ ఎందుకు దృష్టి సారించలేదు?
 
తవ్వుకుంటూ పోయేకొద్దీ ఈ అనుమానాల జాబితా పెరిగేదే తప్ప తరిగేది కాదు. పైగా రామోజీ వైపు వేలెత్తి చూపుతున్న ఈ ఉదంతానికి సంబంధించిన కేసు కూడా అలాంటిలాంటిది కాదు. అత్యంత తీవ్రమైన దేశద్రోహ అభియోగం. ఈ నేపథ్యంలో పై సందేహాలకు సమాధానాలు దొరకాలన్నా, రామోజీ అసలు రంగు నిగ్గుదేలాలన్నా.. ఈ మొత్తం బాగోతానికి సంబంధించి 1960 నుంచి నేటిదాకా నిష్పాక్షికంగా లోతైన దర్యాప్తు జరగడమే ఏకైక మార్గం!
 
 జీజేఆర్ పరారీ వెనక ఉన్నదెవరు?

 అరెస్టు ఖాయమని ముందే పక్కా సమాచారం అందడంతో, వారంటు జారీ కాకముందే జీజేఆర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. చెకస్లోవేకియా పాస్‌పోర్టుపై అతను దేశం వదిలి వెళ్లినట్టు చెబుతారు. 1985లో అక్కడే చనిపోయినట్టు కుమారుడు చెప్పారు. అయితే జీజేఆర్ పరారీ వెనక కూడా రామోజీ హస్తమే ఉన్నట్టు చెబుతారు. కేసులోని ఇతర నిందితులు ఢిల్లీ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాలు కూడా ఆ అనుమానాలను బలపరిచేవిగానే ఉన్నాయి. జి.ఎస్.మూర్తి అనే రామోజీ సహచరుడు చెకస్లోవేకియా దౌత్య కార్యాలయంలో పనిచేసే జీజేఆర్ భార్య సాయంతో అతని ప్రయాణానికి డాక్యుమెంట్లు సిద్ధం చేయించారని వారు కోర్టులో వాంగ్మూలమిచ్చారు. హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న జీజేఆర్‌కు వాటిని అందజేశారని కూడా వివరించారు. జీజేఆర్ తొలుత ఢిల్లీ నుంచే పారిపోయేందుకు ప్రయత్నించినట్టు, అశోకా ట్రావెల్స్ సంస్థ ద్వారా టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్టు సమాచారం. కానీ ‘ఎందుకనో’.. చివరి నిమిషంలో వ్యూహం మార్చి, హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి దేశం వదిలి ఉడాయించాడు! ఇదంతా రామోజీయే ఏర్పాటు చేశారని, తదనంతరం ‘తన’ సంస్థల్లోని జీజేఆర్ పెట్టుబడులన్నింటినీ దర్జాగా సొంతం చేసుకున్నారని చెబుతారు.

 

ఇదీ కేసు
 
 దేశ రహస్యాలను ఇతరులకు చేరవేయడం ద్వారా అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే పనులకు పాల్పడ్డాడంటూ జీజేఆర్‌పై 1977లో ఢిల్లీ శ్రీనివాసపురి పోలీస్‌స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం కింద కేసు (ఎఫ్‌ఐఆర్ నంబర్ 26/1977) నమోదైంది. జీజేఆర్‌తో పాటు చెకస్లోవేకియాకు చెందిన ఆయన భార్య నటాషా, నాటి ప్రణాళికా సంఘం టెక్నికల్ డెరైక్టర్ కె.సారిన్‌తో పాటు మరో నలుగురు ఇందులో నిందితులు. 1977 ఏప్రిల్ 7న ఢిల్లీ కోర్టు జీజేఆర్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయన సీఐఏ ఏజెంటుగా పని చేస్తున్నాడని, తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ‘బి-5/23, సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్’లోని జీజేఆర్ ఇంటితో పాటు అక్కడ, హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఇతరత్రా ఆస్తులను, బ్యాంకు ఖాతాలను జప్తు చేశారు. మార్గదర్శి వంటి పలు సంస్థల్లో జీజేఆర్‌కు ఉన్న షేర్లను కూడా జప్తు చేసేందుకు కోర్టు ఒక రిసీవర్‌ను నియమించింది. కోర్టు తీర్పు చాలావరకు అమలైంది. పైగా, జప్తు చేసిన బంగ్లాను తమకు తిరిగివ్వాలంటూ కొంతకాలానికి జీజేఆర్ భార్య నటాషా ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసినా లాభం లేకపోయింది. అందులో తాముండేందుకు కనీసం ఒక గదినైనా ఇవ్వాలని కోరినా కోర్టు ససేమిరా అంది. పిటిషన్‌ను నిర్ద్వంద్వంగా కొట్టేసింది. జీజేఆర్ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అప్పగించరాదన్న ప్రభుత్వ కృతనిశ్చయానికి ఇదే నిదర్శనం. అలాంటిది... మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని జీజేఆర్ షేర్లను మాత్రం ప్రభుత్వం ఎందుకనో ‘పట్టించుకోలేదు’. నాటి నుంచీ నేటిదాకా రామోజీ వ్యాపార మూలాలను కదప(లే)కుండా ఉండిపోయింది. మార్గదర్శితో పాటు రామోజీ సంస్థల్లోని ఆస్తులన్నీ జీజేఆర్‌వేనని, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లగానే రామోజీ వాటిని కాజేశారని జొన్నపాడువాసులు   చెబుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement