సామరస్య స్వరం అవసరం | Sakshi Editorial On India Nepal Relations | Sakshi
Sakshi News home page

సామరస్య స్వరం అవసరం

Published Tue, Jun 16 2020 2:15 AM | Last Updated on Tue, Jun 16 2020 2:15 AM

Sakshi Editorial On India Nepal Relations

ఎట్టకేలకు నేపాల్‌ ప్రభుత్వం తాను అనుకుంటున్న భౌగోళిక సరిహద్దులతో ఒక మ్యాప్‌ను విడుదల చేసి, అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందింది. మన ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలాపానీ, లిపులేఖ్‌ ప్రాంతాలు తన మ్యాప్‌లో చూపింది. మొదట్నించీ మన పొడగిట్టని చైనా, పాకిస్తాన్‌లు ఈ మాదిరే చేశాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొంత భూభాగాన్ని చైనా... జమ్మూ–కశ్మీర్‌లోని కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్‌ తమ భూభాగాలుగా చెప్పుకుంటూ మ్యాప్‌లు రూపొందించాయి. అయితే ఆ దేశాల మాదిరే నేపాల్‌ను చూడాల్సిన అవసరం లేదు. నేపాల్‌ అత్యుత్సాహం ప్రదర్శించి చర్చలకు తలుపులు మూసేసిందని మన దేశం కొంత ఘాటుగానే వ్యాఖ్యానించింది. అయినా ఇరు దేశాల మధ్యా వున్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో చర్చలు జరగడమే సరైంది. సరిహద్దు సమస్య హఠాత్తుగా ఉనికిలోనికి వచ్చింది కాదు. ఇరు దేశాల మధ్యా ఎప్పటినుంచో కొనసాగుతోంది. పూర్వపు సోవియెట్‌ యూనియన్, చైనాల మధ్య సిద్ధాంత సారూప్యత వున్నా వాటిమధ్య సరిహద్దు విషయంలో విభేదాలొచ్చిన సంగతి మరిచిపోకూడదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ఇరు పక్షాలూ ప్రదర్శిస్తే పరిష్కారం కష్టం కాదు. భారత్, నేపాల్‌ దేశాలు రెండూ ఆ సంగతి ఇదివరకే నిరూపించాయి. గత 26 ఏళ్లలో చర్చల ద్వారా సరిహద్దుకు సంబంధించిన 98 శాతం సమస్యల్ని పరిష్కరించుకున్నాయి. కేవలం సుస్తా, కాలాపానీ ప్రాంతాల సమస్య మాత్రమే అపరిష్కృతంగా వుండిపోయింది.  మిగిలిన కొద్దిపాటి సమస్యనూ అవి జటిలం చేసుకుంటాయని అనుకోలేం. కానీ విషాదమేమంటే చూస్తుండగానే అది ముదిరిపోయింది. చర్చల ప్రక్రియ ప్రారంభం కావలసిన తరుణంలో ఇరు దేశాల్లోనూ కొందరు అనవసర ఉద్వేగాలు పెంచుకోవడం, అందరిలోనూ పెంచడానికి ప్రయత్నించడం పర్యవసానంగా పరిస్థితి ఇంతవరకూ వచ్చింది.

భారత్, నేపాల్‌ దేశాల మధ్య ఎంతటి బలమైన అనుబంధం వుండేదో చెప్పడానికి చరిత్ర వరకూ పోవాల్సిన అవసరం లేదు. మన సైన్యంలో ఇప్పటికీ నేపాలీలు జవాన్లుగా, అధికారులుగా పనిచేస్తున్నారు. ఏటా నేపాల్‌ యువకులు అనేకులు మన సైన్యంలో సైనికులుగా చేరుతుంటారు. సరిహద్దుపై పెను వివాదం రాజుకున్న ఈ సమయంలో కూడా సైన్యంలో పనిచేస్తున్న ముగ్గురు నేపాలీ కేడెట్లు మన ఇండియన్‌ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) నుంచి పట్టభద్రులై శనివారం అధికారులుగా పదోన్నతి పొందారు. సైన్యంలోని దాదాపు 40,000మంది గూర్ఖా సైనికులు భారత్‌ తరఫున వివిధ యుద్ధాల్లో పాల్గొని, ఈ దేశ సార్వభౌమత్వానికై పోరాడి సాహస అవార్డులు పొందారు. పలువురు తమ ప్రాణాలు బలి ఇచ్చారు. మన సైనిక దళాల చీఫ్‌ నేపాల్‌ ఆర్మీకి... నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ మన దేశ సైనికులకు గౌరవ చీఫ్‌గా వుండటం ఎప్పటినుంచో కొనసాగుతోంది. బ్రిటిష్‌ వలస పాలకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వాతంత్య్రానంతరం మన పాలకులు కూడా నేపాల్‌ సరిహద్దులను ఆంక్షలకు అతీతంగా వుంచారు. నేపాలీలు ఇక్కడ చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి నిషేధాలూ లేవు. సరుకు రవాణా విషయంలోనూ ఇదే విధానం కొనసాగుతోంది. నేపాల్‌కు సముద్ర తీరం లేదు గనుక తనకు కావాల్సిన సరుకుల్ని దిగుమతి చేసుకోవడానికి అది మన దేశంలోని ఓడరేవుల్ని వినియోగించుకుంటుంది. 1950లో ఇరు దేశాల మధ్యా కుదిరిన శాంతి, స్నేహ ఒప్పందంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి. అయితే నేపాల్‌లో హిందూ రాజరికాన్ని కూలదోసి, అది ప్రజా రిపబ్లిక్‌గా అవతరించడానికి కారణమైన అంతర్యుద్ధ సమయంలో అక్కడి ప్రజల మనోభావాల్లో మార్పులొచ్చాయి. ఆధారపడక తప్పని పరిస్థితులున్నాయి గనుక భారత్‌ చిన్నచూపు చూస్తున్నదన్న భావనను నేపాలీ పౌరుల్లో పెంచడంలో అక్కడి పార్టీలు విజయం సాధించాయి. సకాలంలో దీన్ని గ్రహించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో మన పాలకులు విఫలమయ్యారు. అసలు ఆ దేశంతో వున్న సంబంధాలను పటిష్టపర్చుకోవాలన్న ధ్యాస, అపోహలేమైనా వుంటే పోగొట్టాలన్న ఉద్దేశం మన పాలకులకు లేకుండా పోయింది. నేపాల్, భూటాన్‌లతో వున్న ఉమ్మడి సరిహద్దుల నుంచి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు మన దేశానికి అక్రమ రవాణా అవుతుంటాయి. హైదరాబాద్‌లోనూ, ఇతరచోట్లా అప్పుడప్పుడు పట్టుబడే మాదకద్రవ్యాల్లో అత్యధికం ఆ ప్రాంతంనుంచే వస్తాయి. ఇక్కడినుంచి నేపాల్‌కు ఔషధాల అక్రమ రవాణా సాగుతుంటుంది. వీటిని సరిదిద్దడానికైనా మనకు నేపాల్‌ సహకారం అవసరం. 

కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నారన్న అంశంతో నిమిత్తం లేకుండా మన నేతలు  నేపాల్‌తో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకునే అంశంలో విఫలమయ్యారు. ఇరు దేశాల మధ్యా ఏ చిన్న సమస్య రాజుకున్నా లబ్ధి పొందుదామని చైనా కాచుక్కూర్చున్నదని తెలిసి కూడా ఉపేక్షించారు. చైనాతోపాటు నేపాల్‌లోని నేతలు సైతం ఇదే దృష్టితో వ్యవహరిస్తున్నారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి ఒంటెత్తు పోకడలపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వుంది. ఓలి నేతృత్వంలోని సీపీఎన్‌(యూఎంఎల్‌), ప్రచండ సారథ్యంలోని సీపీఎన్‌(ఎంసీ)లు రెండేళ్లక్రితం విలీనమై నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)గా ఏర్పడ్డాయి. ఓలి తీరు నచ్చని ప్రచండ నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో సరిహద్దు సమస్య ఓలికి వరంలా మారింది. మన దేశంలో మీడియా కావొచ్చు...యోగి ఆదిత్యనాథ్‌లాంటి నేతలు కావొచ్చు విపరీత వ్యాఖ్యలకు దిగడాన్ని ఓలి చక్కగా వినియోగించుకున్నారు. నేపాలీ జాతీయతను రెచ్చగొట్టారు. దౌత్యం ద్వారా పరిష్కారం కావలసిన సమస్యల్ని బజారున పడేస్తే అవి మరింత జటిలమవుతాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సామరస్యపూర్వక స్వరం వినిపించారు. ఆ దృక్పథంతో నేపాల్‌తో చర్చిస్తే ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం అసాధ్యమేమీ కాదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement