గత రెండేళ్లుగా దూకుడుగా వెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశంలోని మధ్యంతర ఎన్నికల ఫలితాలు తొలిసారి ‘చెక్’ పెట్టాయి. సెనేట్‌లో తమ బలం సుస్థిరం చేసుకున్నామని, ఈ ఫలి తాలు తమకే అనుకూలమని ట్రంప్ చెప్పుకుంటున్నా, ప్రతినిధుల సభపై ఆయన పార్టీ పట్టు కోల్పోయింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ సభలో డెమొక్రాట్లకు ఆధిపత్యం లభించింది. ఈ ఎన్నికల్లో ఏం చేసైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ తాపత్రయపడ్డారు. ఆయన ప్రచారం పర్యవ సానంగా దేశంలో జాతి, మత, సాంస్కృతిక, వలస విషయాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ ప్రత్యర్థులకు గుర్తుతెలియని వ్యక్తులు పైప్ బాంబులు పంపడం, పిట్స్‌బర్గ్ యూదుల ప్రార్థనా మందిరం కాల్పులు జరిగి 11మంది మరణించడం వంటి ఉదంతాలు జనాన్ని ఆలోచింపజేశాయి. అమెరికాలో ఆశ్రయం పొందటానికొస్తున్న మధ్య అమెరికా దేశస్తుల విషయంలో ట్రంప్ చేసిన ప్రక టనలు బెడిసికొట్టాయి.
ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి నిర్వహించిన మీడియా సమావేశంలో సైతం ట్రంప్ అతిశయోక్తులకు పోయారు. అతిగా స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబు చెప్పలేక ఆయన అసహనంతో ఊగిపోయారు. ట్రంప్‌ను ప్రశ్నిస్తుండగా మైక్ తీసుకునేందుకు వచ్చిన వైట్‌హౌస్ ఉద్యోగినిని నిలువరించడానికి ప్రయత్నించిన సీఎన్‌ఎన్ ప్రతినిధిపై అసభ్యంగా ప్రవర్తించాడని నిందలేసి అతని గుర్తింపు కార్డును రద్దు చేయించారు. ఇతర మీడియా ప్రతినిధులపై సైతం ఆయన అదే విధంగా విరుచుకుపడ్డారు. ‘మీరు ప్రజా శత్రువుల’ని దూషించారు. పైకి ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శించినా, ఈ ఎన్నికల ఫలి తాలు ఆయన్ను ఎంతగా నిరాశపరిచాయో ఈ మీడియా సమా వేశమే వెల్లడించింది. రెండేళ్లనాటితో పోలిస్తే ట్రంప్ రాజకీయంగా బలహీనపడినట్టు ఈ ఫలితాలు రుజువు చేశాయి. వందమంది సభ్యులుండే సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యులు 51మంది. డెమొక్రాట్ల బలం 49. కానీ తాజా ఎన్నికలతో రిపబ్లికన్‌ల బలం యధాతథంగా 51 ఉండగా, డెమొక్రాట్లు 46కి పడిపోయారు. మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 435 స్థానాలుండే ప్రతినిధుల సభలో రిప బ్లికన్లకు 235 స్థానాలుంటే డెమొక్రాట్లు 193మంది ఉండేవారు.
తాజా ఫలితాలతో డెమొక్రాట్ల బలం 255కి చేరుకుంటే, రిపబ్లికన్లు 197కి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల విశిష్టత ఏమంటే.. ప్రతినిధుల సభకు ఎన్నడూలేని స్థాయిలో వందమంది మహిళలు విజయం సాధించారు. వీరిలో అత్యధికులు డెమొక్రాట్లే. అలాగే 28మంది తొలిసారిగా ఎన్నికైనవారు. అంతేకాదు... తొలిసారిగా ఒక ముస్లిం మహిళ గెలిచారు. ట్రంప్‌కు తుపాకి తయారీదారుల సంస్థ నేషనల్ రైఫిల్ అసో సియేషన్(ఎన్‌ఆర్‌ఏ) కూడా తోడ్పాటునందించింది. సెనేట్‌లో ఆ సంస్థ చలవతో కొందరు రిప బ్లికన్లు సెనేట్‌కు, గవర్నర్ పదవులకూ ఎన్నికైనా కొన్ని స్థానాల్లో దాని ఎత్తులు పారలేదు. ఇండి యానా, మిస్సోరి, టెనెస్సీ వంటి స్థానాల్లో ఎన్‌ఆర్‌ఏ మద్దతున్నవారు నెగ్గగా... వర్జీనియా, నెవడా, విస్కాన్సిన్, కొలరాడో, సౌత్ కరొలినా, కాన్సాస్‌లలో ఎన్‌ఆర్‌ఏ ఎత్తులు పారలేదు. తుపాకుల కొనుగోలును నియంత్రించాలని గట్టిగా వాదించిన డెమొక్రాట్లే అక్కడ విజయం సాధించారు.
నిజా నికి సౌత్ కరొలినా, కాన్సాస్‌లు రిపబ్లికన్లకు బాగా పట్టున్న ప్రాంతాలు. తుపాకుల అమ్మకాలను నియంత్రించాలని కోరుకునేవారు వాటి కొనుగోలుకు అర్హమైన వయసును 18 ఏళ్లనుంచి 21 ఏళ్లకు మార్చాలని, మానసిక ఆరోగ్యం సరిగా లేనివారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అడు గుతున్నారు. ఇలా డిమాండ్ చేయటమంటే ఆత్మరక్షణ హక్కుకు పౌరుల్ని దూరం చేసినట్టే అవు తుందని ఎన్‌ఆర్‌ఏ వాదిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్లారిడాలోని ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి 17మంది విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని కాల్చిచంపిన ఉదంతం తర్వాత తుపాకి సంస్కృతిపై దేశ మంతా నిరసనలు మిన్నంటాయి. ఎన్‌ఆర్‌ఏకు మద్దతిస్తున్నారని గుర్తించిన అభ్యర్థులకు వ్యతి రేకంగా చాలాచోట్ల విద్యార్థులే ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేయ డానికి డెమొక్రాట్లు జంకారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఉపాధి అవకాశాలు కొద్దో గొప్పో పెరగడం అందుకు కారణం. అందుకే పేదవర్గాలకుండే ఆరోగ్యబీమా, సామాజిక భద్రత వగైరా అంశాల్లో కోత పెట్టడం, ఆహార పదార్థాల ధరలు పెరగడం వంటి అంశాలపై డెమొ క్రాట్లు దృష్టి సారించారు.
ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు ఆధిక్యత రావడంతో డోనాల్డ్ ట్రంప్‌కు ఇక కష్టకాలం మొద లైనట్టే. రెండేళ్లుగా ఉభయ సభల్లో ఉన్న మెజారిటీని ఆసరా చేసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆయన ఇకపై ఆచి తూచి అడుగులేయాల్సి ఉంటుంది. వలస చట్టాల్లో కఠినమైన నిబంధనలు, పన్ను కోతలు, ఆరోగ్యబీమా సంస్కరణలు వగైరా అంశాల్లో తాను ఆశించిన మార్పులు తీసుకు రావడం అంత సులభం కాదు. విపక్షంతో ఓపిగ్గా చర్చించడానికి, అవసరమైతే రాజీ పడటానికి ఆయన సిద్ధమైతే తప్ప ఆశించినవి అమల్లోకి తీసుకురావడం కష్టం. వీటి సంగతలా ఉంచి 2016 నాటి అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీని ఓడించడానికి రష్యాతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై మ్యూలర్ ఏడాదిన్నరగా సాగిస్తున్న దర్యాప్తును అడుగడుగునా ట్రంప్ ఆటంకపరిచే యత్నం చేస్తున్నారు. దాని దర్యాప్తు దాదాపు పూర్తయింది. అదిచ్చే నివేదిక ట్రంప్‌పై నిందలు నిజమని నిర్ధారించిన పక్షంలో ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించే అవకాశం ఉంది. అయితే అధ్యక్ష పదవినుంచి తొలగించాలంటే సెనేట్‌లో మూడింట రెండువంతుల మంది మద్దతు అవసరం. అది ఎటూ అసాధ్యం. కానీ ప్రతినిధుల సభలో ఎదురైన భంగపాటుకు ట్రంప్ ప్రతీకార చర్యలు మొదలుపెడతారు. మొత్తానికి రాబోయే రెండేళ్లూ ఆయనకు అగ్నిపరీక్షే. ఆయ నకు వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పీఠం దక్కకపోవచ్చునని ప్రస్తుత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చేసు కున్నవారికి చేసుకున్నంత!
Comments
Please login to add a commentAdd a comment