నియమ నిబంధనలు పెట్టుకునేది ఏ పనైనా సజావుగా పూర్తికావడానికే. అంతేతప్ప అందుకు ఆటంకాలు ఏర్పడేందుకు కాదు. నిబంధనలను రూపొందించేటపుడు ఊహకు రానివి అనంతరకాలంలో సంభవిస్తే అం దుకు తగినట్టుగా మార్పులు చేసుకోవడానికి వెనకాడవలసిన పనిలేదు. అయితే, అలాంటి మార్పులు చేయడానికి అధికారమున్నవారు కాస్త విశాల దృక్పథంతో వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. ఆ విశాల దృక్పథం కొరవడబట్టే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చునా, లేదా అనే అంశం చివరకు న్యాయస్థానం ముంగిటకు చేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నడూ లేనంత స్థాయిలో కేవలం 44 స్థానాలు మాత్రమే లభించాయి.
ఆ షాక్‌నుంచి ఇంతవరకూ ఆ పార్టీ కోలుకోలేదు. ఇప్పుడు గోరుచుట్టు మీద రోకటి పోటులా ఆ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా ఇచ్చేది లేదని, అందుకు నిబంధనలు అంగీకరించడంలేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం సభలోని మొత్తం సభ్యుల సంఖ్య(545)లో పదోవంతు(55)లభిస్తేనే అది సాధ్యమవుతుంది. నిబంధనలంటూ ఏర్పర్చినప్పుడు దానికి మినహాయింపులు కూడా ఉంటాయి. కానీ, ఎందుకనో ఈ నిబంధనకు అలాంటివేమీ లేవు. ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకుని గతంలో రెండు సందర్భాల్లో-1980, 1984 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉనికిని గుర్తించనిరాకరిం చింది. ఇప్పుడు తన వంతు వచ్చింది గనుక కాంగ్రెస్‌కు ‘అలాంటి మర్యాద’ చేయడానికి బీజేపీ వెనకాడలేదు.
నిజానికి ఈ హోదా దక్కనంత మాత్రాన సభలో కాంగ్రెస్‌కొచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. సభలో ఉన్న పార్టీల్లో అత్యధిక స్థానాలు న్నది కాంగ్రెస్‌కే గనుక ఆ నిష్పత్తికి అనుగుణంగా వివిధ సభా సంఘాల్లో ఆ పార్టీకి ఎటూ చోటు దక్కుతుంది. అయితే, ప్రతిపక్ష నాయకత్వ హోదా వల్ల దక్కేవి ఇతరత్రా చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల అధినే తలు వచ్చినప్పుడు వారితో ప్రతిపక్ష నేత సమావేశం కావడమనే సంప్ర దాయం రెండు దశాబ్దాలుగా ఏర్పడివుంది. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్ప రం ఆలోచనలను పంచుకోవడం, వైఖరు లను తెలుపుకోవడం ఈ సమావేశాల ఉద్దేశం. దీంతోపాటు ప్రతిపక్ష నాయకత్వ స్థానంలో ఉన్న పార్టీయే అధికార పక్షానికి ప్రత్యామ్నా యమనే అభిప్రాయం సహజంగానే ఆ వచ్చిన విదేశీ అతిథులకు కలుగుతుంది. మన దేశ రాజకీయ వ్యవస్థపై ఆసక్తి గల విదేశీయులకు కూడా ఆ ప్రతిపక్షం వేసే అడుగులపై, దాని రాజకీయ వ్యూహాలపై దృష్టి పడుతుంది. వీటన్నిటికీ మించి మన దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ అమలులో ఉన్నదన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడుతుంది. ప్రతిపక్షాన్ని గుర్తించి గౌరవించడమంటే అసమ్మతిని గుర్తించడం... ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాన్ని ఆహ్వానించడం. అంతేకాదు... ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే తమ పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులను మార్చడానికి సిద్ధపడటం. ఎన్నో దశాబ్దాల తర్వాత సంకీర్ణ కూటమి కూడా అవసరం లేని స్థితిలో సంపూర్ణ మెజా రిటీని తెచ్చుకున్న బీజేపీ ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సిద్ధపడి ఉంటే హుందాగా ఉండేది. తాను అధికా రంలో ఉండగా విపక్షాలకు తగిన సంఖ్యా బలం లేదన్న కారణంతో కాంగ్రెస్ సంకుచితంగా వ్యవహరించడమూ, వాటి మనోభావాలను పరిగణనలోకి తీసుకోకపోవడమూ నిజమే. అయితే, తాము కూడా అచ్చం అలాగే వ్యవహరించాలని అనుకోవడం ఎంత వరకూ సబబో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి.
పైగా ప్రతిపక్ష హోదా అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు ముఖ్య భూమికను పోషించాల్సిన స్థితిలో ఉన్నది. లోక్‌పాల్ మొదలుకొని వివిధ రాజ్యాంగ పదవులకు వ్యక్తులను ఎంపిక చేయడంలో ప్రతిపక్ష నేత ప్రమేయం ఉండితీరాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యులు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సీబీఐ డెరైక్టర్, లోక్‌సభ సెక్రటరీ జనరల్, జాతీయ మానవహక్కుల సంఘం సభ్యుల ఎంపికలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రభుత్వం సంప్రదించడం తప్పనిసరి. ఇక ఈమధ్యే పార్లమెంటు ఆమోదం పొందిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు కూడా న్యాయమూర్తుల ఎంపిక కోసం ఏర్పడే ఆరుగురు సభ్యుల కమిటీలో విపక్ష నేతకు చోటుకల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరించడమంటే ఈ నియామకాల విషయంలో విపక్షం స్వరాన్ని వినబోమని చెప్పడమే అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్‌కు లేకపోయినా...అత్యధిక స్థానాలున్న పార్టీగా ఈ పదవుల ఎంపికలో దానికి స్థానం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొనివుంటే వేరేవిధంగా ఉండేది. అలా చేయని కారణంగా సర్కారు ఏకపక్షంగా వ్యవహరించదల్చుకున్నదన్న సంకేతాలు వెళ్తున్నాయి.
ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది కూడా ఈ కోణంలోనే. లోక్‌పాల్ ఎంపిక కోసం ఏర్పడే అయిదుగురు సభ్యుల ప్యానెల్‌లో ప్రతిపక్ష నాయకుడికి స్థానం కల్పించాలన్న నిబంధన చట్టంలో ఉన్నప్పుడు దాన్ని వమ్ముచేసే పరిస్థితులు ఏర్పడితే ఎలాగని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విపక్ష నేత ఉండరు గనుక లోక్‌పాల్‌వంటి పదవులకు ఎంపికను నిరవధికంగా వాయిదా వేస్తారా అని కూడా అడిగింది. సాంకేతిక అంశాలను ఆధారం చేసుకుని లేదా కక్ష తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది కదా అని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించడం సరికాదని ఇప్పటికైనా ఎన్డీయే సర్కారు గుర్తించాలి. అసమ్మతికి, భిన్నాభిప్రాయానికి తావీయని ప్రజాస్వామ్యం అర్ధంలేనిదవుతుందని తెలుసుకోవాలి. తన వైఖరిని పునరాలోచించుకోవాలి.
విపక్షం... వలపక్షం!
Published Sun, Aug 24 2014 1:59 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement