
నిరంకుశ ఆర్డినెన్స్
సంపాదకీయం
అధికారంలో ఉన్నవారు తాము ఏదనుకుంటే అది చేయగలుగుతున్నామని సంబరపడుతున్నారు తప్ప ఆ క్రమంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నామన్న స్పృహను కోల్పోతున్నారు. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలను నిర్దేశిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ చుట్టూ సాగుతున్న వివాదం దీన్ని మరోసారి రుజువుచేసింది. అసలు ఆర్డినెన్స్ జారీకి అక్కడి ప్రభుత్వం ఎన్నుకున్న సమయాన్ని గమనిస్తే దాని అంతరంగమేమిటో సులభంగానే అర్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడానికి సరిగ్గా పక్షంరోజులముందు...న్యాయస్థానాలు సెలవులో ఉన్నప్పుడు గత నెల 20న ఆర్డినెన్స్ జారీ అయింది. దానిపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రూపొందించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన సమయానికే నామినేషన్ల ఘట్టం మొదలైంది. ధర్మాసనం పరిశీలనకొచ్చిన మంగళవారానికి ఆ ఘట్టం ముగిసిపోయింది కూడా. ఈ ఆర్డినెన్స్‌పై ముందుగా రాజస్థాన్ హైకోర్టులో సవాల్‌చేసి, అక్కడ వెలువడిన నిర్ణయంపై తమవద్దకు రావాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే, పిటిషనర్లు న్యాయస్థానాలచుట్టూ తిరిగేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ నెల 16న మొదలై మూడు దశల్లో ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల ప్రక్రియ మధ్యలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కూడా కాదు. ఇంతమాత్రానికే సత్యం జయించిందంటూ ఆ రాష్ట్ర బీజేపీ సంబరపడుతున్నది.
రాజస్థాన్ ఆర్డినెన్స్‌లోని నిబంధనలు చిత్రంగా ఉన్నాయి. సర్పంచ్‌గా పోటీచేసే వ్యక్తి కనీసం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. గిరిజన ప్రాంతాల్లో ఈ అర్హతను అయిదో తరగతికి పరిమితం చేశారు. జిల్లా పరిషత్ లేదా పంచాయతీ సమితికి పోటీచేసేవారు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. పునాది స్థాయిలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తే దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతి పరిఢవిల్లుతుందన్న సదుద్దేశంతో రాజ్యాంగ నిర్మాతలు పంచాయతీ వ్యవస్థకు ప్రాధాన్యమిచ్చారు. అనంతరకాలంలో పార్లమెంటుతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలన్నీ ఆమోదించిన 73 వ రాజ్యాంగ సవరణ కూడా ఈ వ్యవస్థ పటిష్టతపై దృష్టిపెట్టింది. ఈ చర్యల వెనకున్న స్ఫూర్తిని మొత్తం రాజస్థాన్ ఆర్డినెన్స్ దెబ్బతీస్తున్నది. దేశంలో ఓటు హక్కు ఎవరికివ్వాలన్న చర్చ జరిగినప్పుడు రాజ్యాంగ సభ సభ్యులు అందుకు కేవలం నిర్దిష్ట వయసును సూచించారు తప్ప విద్యార్హతలు అవసరమని భావించలేదు. అలాగే స్త్రీ, పురుష వివక్షనూ...గ్రామాలు, పట్టణాలన్న విభజనను వారు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రజాస్వామ్య యజ్ఞంలో అన్ని వర్గాలవారికీ సమానమైన ప్రాధాన్యమివ్వాలనీ, అన్ని గొంతులూ వినాలనీ విశ్వసించడమే అందుకు కారణం. పాలక వ్యవస్థ తమకు సంబంధించినది కాదనీ...అందులో తమ మాటకు విలువలేదనీ ఏ ఒక్క వర్గమైనా భావిస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందన్న ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు వయోజన ఓటు హక్కును కల్పించారు. ఓటేయడానికి పనికొచ్చే విచక్షణా జ్ఞానం పాలించడానికి పనికిరాదనుకోవడం...విద్యార్హతలు లేనివారే అవినీతికి పాల్పడతారని చెప్పడం పాలకుల సంకుచిత స్వభావానికి చిహ్నం. ఇవే అర్హతలను ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేస్తే ఆ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, 23మంది ఎమ్మెల్యేలు అనర్హులవుతారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండేందుకు అడ్డురాని విద్యానర్హతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేవారికి మాత్రమే వర్తింపజేయడం ఎందుకన్న స్పృహ కూడా రాజస్థాన్ ఏలికలకు లేదు. ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి బీజేపీ సర్కారు చెబుతున్న కారణాలు ఎంతో అసంబద్ధంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ సంస్థల్లో బాధ్యతాయుత పదవుల్లో ఉంటున్నవారు అవినీతికి పాల్పడుతూ, దర్యాప్తు సమయంలో మాత్రం తమకు చదువురాకపోవడంవల్ల చట్టాలపై అవగాహన కొరవడిందని చెబుతున్నారని అంటున్నది. ఇది నిజానికి సాకు మాత్రమే. రాజస్థాన్‌లోని దాదాపు 6,000మంది సర్పంచ్‌లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది కొన్ని వందలమంది మాత్రమే.
రాజస్థాన్‌లో నిరక్షరాస్యతకు సంబంధించిన గణాంకాలు గమనిస్తే అక్కడి సర్కారు నిర్ణయం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో అంచనావేయొచ్చు. అది గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో దాదాపు 24 శాతంకాగా, మహిళల్లో అది 54.2 శాతం. అక్షరాస్యుల్లో కూడా ఆర్డినెన్స్ సూచిస్తున్న విద్యార్హతలున్నవారు చాలా తక్కువమంది ఉంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రాజస్థాన్‌లో 20 ఏళ్లు పైబడినవారిలో 82.5 శాతంమంది అయిదో తరగతికి మించి చదువుకోలేదని సామాజిక ఉద్యమకారులు చెబుతున్నారు. ఇలా చదువుకు దూరమైనవారిలో అత్యధికులు సహజంగానే మహిళలు, దళితులు, ఆదివాసీలు ఉంటారు. పంచాయతీరాజ్ సంస్థల్లో భాగస్వాములుకాకుండా ఇంతమందిని అడ్డుకుంటున్న ఈ ఆర్డినెన్స్ ఎంతటి అప్రజాస్వామికమైనదో వేరే చెప్పనవసరం లేదు. అసలు ఇలాంటి అంశంపై ఆర్డినెన్స్ తోవను ఎంచుకోవడమే తప్పు. ఏ బిల్లునైనా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగినంత మెజారిటీ అక్కడి ప్రభుత్వానికి ఉంది. అసలు ఇది మెజారిటీకి సంబంధించిన సమస్య కూడా కాదు. కీలకమైన విషయాలను చట్టసభలో చర్చించి అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలకు అనుగుణంగా బిల్లుకు పదునుపెట్టి ఆమోదం పొంది అప్పుడు చట్టరూపం తీసుకురావడం కనీస ధర్మం. అందుకు సమయం పడుతుందనుకుంటే వచ్చే దఫా ఎన్నికలకు వర్తించేలా చట్టాన్ని తీసుకురావొచ్చు. ఈలోగా తమ విద్యార్హతలను పెంచుకునేందుకు కొందరికైనా అవకాశం లభిస్తుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా, చట్టసభలను సైతం ఖాతరు చేయకుండా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ అత్యంత అప్రజాస్వామికమైనది. పాలకులు ఇలాంటి నిరంకుశ పోకడలకు పోవడం దురదృష్టకరం.