పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్ | 2013- person of the year Pope Francis | Sakshi
Sakshi News home page

పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్

Published Thu, Jan 2 2014 1:31 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఒబామా ప్రమాణం.. యూన్‌డీపీ నివేదిక..పాకిస్థాన్‌లో పూర్తి కాలం కొనసాగిన ప్రభుత్వం.. అమెరికా షట్‌డౌన్.. దౌత్యవేత్త దేవయాని అరెస్ట్.. అంతర్జాతీయంగా ప్రధాన ఘట్టాలుగా నిలిచాయి..

 అంతర్జాతీయం- 2013
 
ఒబామా ప్రమాణం.. యూన్‌డీపీ నివేదిక..పాకిస్థాన్‌లో పూర్తి కాలం కొనసాగిన ప్రభుత్వం.. అమెరికా షట్‌డౌన్.. దౌత్యవేత్త దేవయాని అరెస్ట్.. అంతర్జాతీయంగా ప్రధాన ఘట్టాలుగా నిలిచాయి..
 
దేశం హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ మద్దతిచ్చిన నేపథ్యంలో పాలస్తీనా ప్రాధికార సంస్థ అధికారికంగా ‘స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ అనే పేరును ఖరారు చేసుకుంది. ఇకపై అన్ని అధికార పత్రాల్లో ఈ పేరునే వినియోగిస్తారు.
 
సింగపూర్ పార్లమెంట్ తొలి మహిళా స్పీకర్‌గా భారత సంతతికి చెందిన హలిమా యాకోబ్ బాధ్యతలు జనవరి 14న స్వీకరించారు.
 
హానికరమైన పాదరసం వినియోగాన్ని పరిమితం చేస్తూ రూపొందించిన ఒప్పందం ‘మినమటా కన్వెన్షన్ ఆన్ మెర్క్యురీ’ను 140 దేశాలు జనవరి 19న అంగీకరించాయి. దశాబ్దాలుగా మినమటా(జపాన్) ప్రజలు పాదరస ప్రభావానికి గురయ్యారు.
 
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ హుస్సేన్ ఒబామా జనవరి 20న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడైన 21వ వ్యక్తిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. అదే రోజు అమెరికా ఉపాధ్యక్షుడిగా జోయ్ బిడెన్ ప్రమాణ స్వీకారం చేశారు.
 
ఆహార పదార్థాల వ్యర్థానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం; ఆహార, వ్యవసాయ సంస్థలు సంయుక్తంగా ప్రచారాన్ని చేపట్టాయి. ‘థింక్-ఈట్-సేవ్-రెడ్యూజ్ యువర్ ఫుడ్ ప్రింట్’ అనే నినాదంతో జనవరి 22న దీన్ని ప్రారంభించాయి.
 
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. ‘రిపోర్టర్స్ విత్ ఔట్ బోర్డర్స్’ అనే సంస్థ జనవరి 30న విడుదల చేసిన ‘2013 వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్’ ఈ విషయాన్ని పేర్కొంది. దీని ప్రకారం ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వేలు మొదటి మూడు స్థానాల్లో.. తుర్క్‌మెనిస్థాన్, ఉత్తర కొరియా, ఎరిత్రియాలు చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.
 
 రోమన్ కేథలిక్ మతాధిపతి పోప్ బెనడిక్ట్- 16 తన పదవికి ఫిబ్రవరి 28న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గత 600 ఏళ్లలో పోప్ తన పదవికి రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
 
 దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ గెయున్ హై ఫిబ్రవరి 25న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 మార్చి 9న విడుదలైన కెన్యా దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల్లో ఉహురు కెన్యాట్ట విజయం సాధించారు.
 
 కొత్త పోప్‌గా అర్జెంటీనా మతాధికారి జార్జి మారియో బెర్గోగ్లియో మార్చి 13న ఎన్నికయ్యారు. ఆయనను ఇక నుంచి పోప్ ఫ్రాన్సిస్-1గా వ్యవహరిస్తారు.
 
 భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజులపాట మారిషస్‌లో పర్యటించా రు. ఈ పర్యటనలో మారిషస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రణబ్‌కు గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది.
 
చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైనా నూతన ప్రధానమంత్రిగా లీ కెకియాంగ్ మార్చి 15న ఎన్నికయ్యారు.
 
యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక-2013లో భారత్‌కు 136వ స్థానం (గతంలో 134వ స్థానం) లభించింది. ఈ సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. ఈ నివేదికలో చైనా స్థానం 101.
 
శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) లో మార్చి 21న అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. భారత్ తీర్మానికి అనుకూలంగా, పాకిస్థాన్ వ్యతిరేకంగా ఓటు వేసింది.
 
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా(బ్రిక్స్) దేశాల ఐదో సదస్సు దక్షిణాఫ్రికా నగరం డర్బన్‌లో 2013 మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. ‘బ్రిక్స్, ఆఫ్రికా-అభివృద్ధి ఏకీకరణ, పారిశ్రామికీకరణ కోసం భాగస్వామ్యం’ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించారు.
 
ఏప్రిల్ 14న జరిగిన వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించారు.
 
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అశోక్ కుమార్ ముఖర్జీ ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు.
 
ఇటలీ అధ్యక్షుడిగా జియోర్జియో న పోలిటానో ఏప్రిల్ 20న ఎన్నికయ్యారు.
 

సెర్బియా, కొసావో ప్రధాన మంత్రులు ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొల్పుకోవాలని ఏప్రిల్ 19న బ్రస్సెల్స్‌లో ఒప్పందానికి వచ్చారు.
 
 ఇటలీ కొత్త ప్రధానమంత్రిగా ఎన్రికో లెట్టా ఏప్రిల్ 28న ప్రమాణ స్వీకారం చేశారు.
 
 మలేసియా ప్రధానమంత్రిగా నజిబ్ రజాక్ మే 6న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
 
 బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్‌గా డాక్టర్ షిరిన్ షర్మిన్ చౌదురి ఏప్రిల్ 30న ఎన్నికయ్యారు.
 
 అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో హైదరాబాదీ అమెరికన్ అరవింద్ మహంకాళి విజేతగా నిలిచాడు. నెడైల్ (Knaidel) అనే జర్మన్ పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి అరవింద్ చాంపియన్‌షిప్ సాధించాడు.
 
 పాకిస్థాన్ 27వ ప్రధానమంత్రిగా పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ జూన్ 5న ఎన్నికయ్యారు.
 
 జూన్ 14న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో  హసన్ రోహనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
 
 ప్రపంచ శాంతి సూచీ (జీపీఐ) లో భారత్‌కు 141వ స్థానం దక్కింది. సిడ్నీ కేంద్రంగా పనిచేసే ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్’ జూన్ 11న విడుదల చేసిన ఈ రేటింగ్స్‌లో ఐస్‌లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ మొదటి స్థానాల్లో ఉన్నాయి.
 
 త్రైపాక్షిక సహకారంపై భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య జూలై 8న కొలంబో (శ్రీలంక రాజధాని)లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సముద్ర భద్రతకు సంబంధించిన సమాచారాన్ని, సామర్థ్యాన్ని ఈ మూడు దేశాలు పరస్పరం పంచుకుంటాయి.
 
 తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ 16వ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో జూలై 12న ‘మలాలా డే యూత్ అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించారు.
 
 జూలై 30న జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ 12వ అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ ఎన్నికయ్యారు.  హుస్సేన్ భారత్ (ఆగ్రా)లో జన్మించారు.
 
 జీ-20 దేశాల సమావేశం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సెయింట్‌పీటర్స్‌బర్గ్(రష్యా)లో జరిగింది. వచ్చే సమావేశం 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరపాలని నిర్ణయించారు.
 
 ఆస్ట్రేలియా 28వ ప్రధానమంత్రిగా టోనీ అబోట్ సెప్టెంబర్ 18న ప్రమాణస్వీకారం చేశారు.
 
 కంబోడియా ప్రధానిగా హున్‌సేన్‌ను పార్లమెంట్ సెప్టెంబర్ 23న ఎన్నుకుంది. గత 30 ఏళ్లుగా హున్‌సేన్ ప్రధానిగా కొనసాగుతున్నారు.
 
 ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ).. భూ వాతావరణం వేగంగా వేడెక్కుతున్నట్లు హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన నివేదికను స్టాక్‌హోమ్‌లో సెప్టెంబర్ 27న విడుదల చేసింది. భూతాపానికి మానవులు కారణంగా పేర్కొంటూ ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రత 0.3 నుంచి 4.8 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని అంచనా వేసింది. సముద్ర మట్టాలు 2100 నాటికి 26 నుంచి 82 సెంటీమీటర్లకు పెరుగుతాయి.
 
 అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సెప్టెంబర్ 30న కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. గతంలో 1996లో క్లింటన్ కాలంలో షట్‌డౌన్ విధించారు.
 
 భారత మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యూకేలో భారత హైకమిషనర్‌గా అక్టోబర్ 1న నియమితులయ్యారు.
 
 ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) 23వ సదస్సు ‘మన ప్రజలు, సమష్టిగా మన భవిష్యత్తు’ అనే ఇతివృత్తంతో బ్రూనైలో అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగింది. 2014 సదస్సు అధ్యక్ష బాధ్యతలను మయన్మార్‌కు బ్రూనై అప్పగించింది. ఈ సందర్భంగా ఐదో ఆసియాన్ - యూఎన్ సదస్సు కూడా జరిగింది.
 
 భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్య దేశాలుగా చాద్, చిలీ, లిథువేనియా, నైజీరియా, సౌదీ అరేబియాలు అక్టోబర్ 17న ఎన్నికయ్యాయి.
 
 భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం అక్టోబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది.
 
 నవంబర్ 2న జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి బోర్డ్ ఆఫ్ ఆడిటర్స్‌కు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శశికాంత్ శర్మ ఎన్నికయ్యారు.
 
 ఆసియా- ఐరోపా విదేశాంగ మంత్రుల, అధికారుల సమావేశం న్యూఢిల్లీలో న వంబర్ 11, 12 తేదీల్లో జరిగింది. ఈ 11వ ఆసియా - ఐరోపా సమావేశం (ఆసెమ్)లో ‘ఆసెమ్ వృద్ధి, అభివృద్ధి కోసం భాగస్వామ్య నిర్మాణం’ అనే అంశాన్ని ఇతివృత్తంగా చేపట్టారు.
 
 మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ గయూం నవంబర్ 17న ఎన్నికయ్యారు.  
 
 భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్ 5న చైనాలోని చెగ్దూ పట్టణ సమీపంలో ప్రారంభమయ్యాయి.
 
 2013 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘సెల్ ఫీ (్ఛజజ్ఛీ)’ పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ నవంబర్ 19న ప్రకటించింది. తనంత తానుగా తీసుకునే ఫొటోను సెల్‌ఫీగా నిర్వచించారు.
 
 కామన్‌వెల్త్ దేశాధినేతల సదస్సు (చోగమ్) నవంబర్ 15 నుంచి 17 వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగింది. న్యాయమైన వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి అనే అంశం ఇతివృత్తంగా సదస్సును నిర్వహించారు. 2015 సదస్సు మాల్టాలో జరగనుంది.
 
 ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కమిటీ తొలిసారిగా మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానాన్ని నవంబర్ 27న ఆమోదించింది.
 
 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్‌ను టైమ్ పత్రిక ప్రకటించింది. రెండో స్థానంలో అమెరికా రహస్యాలను బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ నిలిచాడు.
 
 అమెరికాలో భారత దౌత్యఅధికారి దేవయాని ఖోబ్రాగడెని వీసా అక్రమాలపై ఆ దేశ పోలీసులు డిసెంబర్ 12న అరె స్ట్ చేశారు.  భారత్ నుంచి దేవయాని ఇంట్లో పని మనిషిగా వచ్చిన సంగీతఫిలిప్స్ వీసా విషయంలో దేవయాని అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెకు అమెరికా చట్టాల ప్రకారం చెల్లించాల్సిన వేతనాలను చెల్లించకుండా వేధిస్తున్నారని దేవయానిపై అమెరికా మోపిన అభియోగాలు. దేవయానిని న్యూయార్క్ ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌కు బదిలీ చేసి భారత ప్రభుత్వం పూర్తిస్థాయి దౌత్యరక్షణ కల్పించింది.  
 
 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి పప్పుదినుసల సంవత్సరంగా డిసెంబర్ 21న ప్రకటించింది.
 
 
 
 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా బహుళ ప్రచారం పొందిన ట్వీట్ పదం ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ నిఘంటువులో స్థానం దక్కించుకుంది. జూన్ 2013 సంచికలో ఈ పదాన్ని నిఘంటువులో చేర్చింది. ట్వీట్‌కు డిక్షనరీలో చోటు కల్పించడం కోసం నిబంధనలను మార్చడం విశేషం.
 
 
 ప్రపంచంలో తొలిసారి రెండు ఖండాలను కలుపుతూ నిర్మించిన సముద్ర గర్భ సొరంగ రైలు మార్గాన్ని టర్కీ అక్టోబర్ 29న ప్రారంభించింది. ఐరోపా- ఆసియాలను కలిపే 13.6 కి.మీ మార్గాన్ని బస్పొరస్ జలసంధికి 60 మీటర్ల లోతులో నిర్మించారు. ఈ మార్గానికి మర్మరేగా పేరు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement