ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి! | APPSC Group -2 Notification | Sakshi
Sakshi News home page

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి!

Published Sun, Oct 23 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి!

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి!

 ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అయితే తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీని నుంచి ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన జీవో కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. అయితే అభ్యర్థులు ఈ పరీక్షతో మరింత ఒత్తిడికి గురవుతామని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్క్రీనింగ్ టెస్ట్ అవసరం ఉందా? అభ్యర్థులు, పోటీ పరీక్షల నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
 
 ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మినహా ఇతర ఏ పరీక్షకూ స్క్రీనింగ్ టెస్ట్ లేదు. సంస్కరణలు, ఈ-గవర్నెన్స్, నియామకాల్లో పారదర్శకత పేరుతో గ్రూప్-2కు కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించడం నిరుద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఐదేళ్లుగా గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ నుంచి ప్రకటన వస్తే దరఖాస్తుల సంఖ్య పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమందికి పరీక్ష నిర్వహణ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. నాన్-సీరియస్ అభ్యర్థులను వడపోసి.. సీరియస్ అభ్యర్థులను గుర్తించేందుకు కమిషన్.. స్క్రీనింగ్ టెస్ట్‌ను సాధనంగా చేసుకుంది.
 
 సిలబస్ అదే.. మరి ‘స్క్రీనింగ్’ ఎందుకు?
 పరీక్ష.. పేపర్-పెన్ విధానంలో ఉంటుంది. మూడు సెక్షన్లకు 50 చొప్పున 150 మార్కులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్‌లోని అంశాలు.. దాదాపు ప్రధాన పరీక్ష సిలబస్ నుంచే ఉన్నాయని.. అలాంటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకని అభ్యర్థులు, పోటీపరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నందున అభ్యర్థులపై అదనపు భారం తప్ప మరే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. నాన్-సీరియస్ అభ్యర్థుల వడపోతకు, ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అవకాశముంటుందనే భావనతో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అంటున్నారు.
 
 స్క్రీనింగ్ టు మెయిన్.. 1:12 -1:15
 కొద్ది రోజుల్లో 750 ఉద్యోగాలతో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా సామాజిక వర్గాల వారీగా ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయడానికి సంబంధించిన ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
 
 ప్రిపరేషన్‌పై ప్రభావం
 ఏపీపీఎస్సీ పేర్కొన్న ప్రకారం దరఖాస్తు గడువు తేదీ నుంచి ప్రధాన పరీక్షకు మధ్యలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే అప్లికేషన్ గడువు తేదీకి, మెయిన్ టెస్ట్‌కు మధ్య వ్యవధి స్వల్పంగా ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ తేదీ కూడా మరింత ముందుకు జరుగుతుందని, ఇది తమ ప్రిపరేషన్‌పై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ‘మారథాన్’ అభ్యర్థుల్లో మరింత ఆందోళన
 స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో మరింత ఆందోళన చెందుతున్న వర్గం.. మారథాన్ పరుగు పందెం తరహాలో ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు. మారథాన్‌లో పోటీదారులు తొలుత నెమ్మదిగా పరుగు ప్రారంభించి తర్వాత వేగం పుంజుకుంటారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లోనూ ఇలాంటి అభ్యర్థులు ఉంటారు. వీరు ప్రిపరేషన్‌ను నెమ్మదిగా ప్రారంభించి తర్వాత వేగం పెంచుతారు. ఈ అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్‌లో మెరుగైన ప్రదర్శన చూపడంలో ఇబ్బందికి గురవుతారని ఒక ప్రముఖ శిక్షణ కేంద్రం నిపుణుడు పేర్కొన్నారు. స్క్రీనింగ్ సిలబస్‌లోని అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు.
 
 గ్రామీణ విద్యార్థులకు మరింత ఇబ్బంది
 ప్రధాన పరీక్షను ఆన్‌లైన్లో నిర్వహించాలన్న కమిషన్ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సర్వీస్‌లు అందుబాటులో లేని పరిస్థితి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసినా, కంప్యూటర్ వినియోగంపై చాలామందికి సరైన అవగాహన లేదు. దీంతో దరఖాస్తుదారుల్లో దాదాపు సగం మందిపై ఆన్‌లైన్ టెస్ట్ విధానం ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. సహజంగానే ఇంజనీరింగ్, అర్బన్ నేపథ్యం ఉన్నవారికి సానుకూలంగా మారే అవకాశముంటుందని పేర్కొంటున్నారు.
 
 ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా ఉంటే మంచిది
 అభ్యర్థుల పరిపాలనా దక్షతను పరిశీలించే విధంగా ఆప్టిట్యూడ్‌ను పరీక్షించేలా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే బాగుంటుంది. ప్రధాన పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌లోని అంశాల నుంచే ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. అభ్యర్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు.
 
 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,
 ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement