పదిలమైన కెరీర్‌కు పట్టుగొమ్మలైన బ్రాంచ్‌లు | best branches secure best career | Sakshi
Sakshi News home page

పదిలమైన కెరీర్‌కు పట్టుగొమ్మలైన బ్రాంచ్‌లు

Published Thu, May 29 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

పదిలమైన కెరీర్‌కు పట్టుగొమ్మలైన బ్రాంచ్‌లు

పదిలమైన కెరీర్‌కు పట్టుగొమ్మలైన బ్రాంచ్‌లు

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషికి నిత్య జీవితంలో అవసరమయ్యే నిర్మాణాలు, యంత్రాలు, వస్తులు,  పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగపడే అధ్యయన శాస్త్రమే ఇంజనీరింగ్! నాడు పారిశ్రామిక  విప్లవానికి చోదకశక్తిగా నిలిచిన జేమ్స్ వాట్ ఆవిరియంత్రం నుంచి నేడు అంతరిక్ష ప్రయోగాలకు ఊపిరిగా  నిలుస్తున్న పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ నౌకల వరకు అన్నీ జనీరింగ్ నిపుణుల పనితనానికి తార్కాణాలే.  మనిషి మనుగడ దిశ, దశలను మార్చడంలో ఇంజనీరింగ్‌ది కీలక పాత్ర. అలాంటి ఇంజనీరింగ్‌కు పట్టుగొమ్మలుగా ఉన్న బ్రాంచ్‌లు, కెరీర్ అవకాశాలపై ఫోకస్..
 
 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

 భారత్‌లో టెలికం మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వీఎల్‌ఎస్‌ఐ/ఎంబెడెడ్ సిస్టమ్స్ హబ్‌గా మారుతుండటంతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. మన నిత్యజీవితంలో భాగమైన కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లు, సెల్‌ఫోన్లు, టీవీలు వంటి వాటిలో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీ) వంటివి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
 
 ఇంజనీర్ల కృషి ఫలితమే!
 కోర్సులు: బ్యాచిలర్ స్థాయిలో ఈసీఈ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రంలో ఎంసెట్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. రాష్ర్టంలో 70 వేలకు పైగా సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్‌లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.కోర్ సబ్జెక్టులు: ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెషీన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆప్టికల్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ.
 
 కెరీర్: ఈసీఈ కోర్సు పూర్తిచేసిన వారు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ ఏవియానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, టెలీ కమ్యూనికేషన్స్, రేడియో అండ్ టీవీ, కంప్యూటర్ అప్లికేషన్స్, హాస్పిటల్ డయాగ్నోస్టిక్ ఎక్విప్‌మెంట్, ఆఫ్‌షోర్ ఇండస్ట్రీలు తదితరాలతో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఉద్యోగాలను పొందొచ్చు. సాధారణంగా ట్రైనీ ఇంజనీర్‌కు ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది.
 
 టాప్ రిక్రూటర్స్:
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  ఇన్ఫోసిస్, టీసీఎస్, మోటరోలా, శాంసంగ్, టెక్ మహీంద్ర    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌డీఆర్‌డీవో  ఇస్రో  హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ఉన్నతవిద్య: బీటెక్‌లో ఈసీఈ పూర్తయితే ఎంఎస్/ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తర్వాత పరిశోధన రంగంలోకి అడుగుపెట్టొచ్చు.
 
 ఈసీఈ మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్
 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్. విభిన్న రంగాల్లో అవకాశాలు లభిస్తుండటం దీనికి కారణం. బీటెక్ ఈసీఈ పూర్తిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక పరీక్షల్లో ప్రతిభ కనబరచడం ద్వారా వీటిని చేజిక్కించుకోవచ్చు. టెలికం కంపెనీలు, త్రివిధ దళాలు, సివిల్ ఏవియేషన్, డీఆర్‌డీవో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తదితర సంస్థల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దిశగా సాగితే ఉన్నత కెరీర్ సొంతం చేసుకోవచ్చు.- ప్రొఫెసర్ కె.రాజరాజేశ్వరి,
 రిటైర్‌‌డ ప్రిన్సిపాల్,
 ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఉమెన్).
 
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
 కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ).. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రక్రియలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత సమాచార వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటి వాటిని వివరిస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగింది. కంప్యూటర్ ఆధారిత సేవలు మానవ జీవితంలో భాగమైపోయాయి. దీంతో సీఎస్‌ఈ కోర్సు చేసిన వారికి అవకాశాలు పెరిగాయి.కోర్సులు: గ్రాడ్యుయేషన్ స్థాయిలో సీఎస్‌ఈ బ్రాంచ్ లో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రం లో ఎంసెట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో దాదాపు 67 వేల సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్‌లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి.కోర్ సబ్జెక్టులు: కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్; ఎలక్ట్రానిక్స్;ఆపరేటింగ్ సి స్టమ్స్; నెట్‌వర్కింగ్;ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్‌సిస్టమ్స్; జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్‌సైట్ డిజైన్; ఈ-కామర్స్ - ఈఆర్‌పీ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్.
 
 కెరీర్: నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో సీఎస్‌ఈ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదు. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీలు, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ తదితర కంపెనీల్లో టెక్నికల్ రైటర్, సాఫ్ట్‌వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్‌సైట్ డెవలపర్/ డిజైనర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం రూపంలో అందుతుంది.
 టాప్ రిక్రూటర్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, అసెంచర్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టెక్ మహీంద్ర... ఉన్నత విద్య: బీటెక్-సీఎస్‌ఈ పూర్తిచేసిన వారు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్లతో ఎంటెక్/ఎంఎస్ చేసి ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేసి, వ్యాపార నిర్వహణ దిశగా అడుగులేయొచ్చు.
 
 ఉన్నత కెరీర్‌కు ఉజ్వల అవకాశం
 నేడు కంప్యూటర్ మనిషి జీవితంలో భాగమైపోతోంది. అందుకే ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి నమోదవుతోంది. శరవేగంగా కంప్యూటర్ రంగం దూసుకెళ్తున్నా ఇప్పటికీ కంప్యూటరీకరణ జరిగింది కేవలం 20 శాతమే. అంటే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అందిపుచ్చుకునే ఓర్పు, నేర్పు ఉండాలేగానీ యువతకు అద్భుత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంటర్ డిసిప్లినరీ కోర్సు లు చేయడం వల్ల కొత్త ఆవిష్కరణలకు, తద్వా రా ఉన్నత వృత్తి జీవితానికి బాటలు వేసుకునే అవకాశముంటుంది. కానీ, ఇలాంటి కోర్సులు ఇప్పుడు అందుబాటులో లేవు. ఉదాహరణకు బీటెక్ (సీఎస్‌ఈ)/ మెకానికల్ పూర్తిచేసిన వారు ఎంబీబీఎస్‌లోని అంశాలున్న కోర్సులు చేస్తే కొత్త ఆవిష్కరణలకు (ఉ్ఠ: వివిధ వ్యాధులకు శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి)అవకాశముంటుంది. ఇలాంటి కోర్సులను తక్కువ కాల వ్వవధితో, పీజీ స్థాయిలో ఏర్పాటు చేసి, కరిక్యులం ప్రాథమిక అంశాల నుంచి మొదలయ్యేలా ఉండాలి. ఇలాంటి కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలి.
 - ఎం.వెంకట్ దాస్, హెచ్‌వోడీ,
 సీఎస్‌ఈ, ఉస్మానియా యూనివర్సిటీ.
 
 సివిల్ ఇంజనీరింగ్
 సివిల్ ఇంజనీరింగ్.. రహదారులు, భవంతులు, విమానాశ్రయాలు, వంతెనలు, కాలువలు.. ఇలా వివిధ నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికల రచన, రూపకల్పన, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలను వివరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో అదే స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2/తత్సమాన అర్హత ఉండాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర ఎంట్రన్స్‌లతో కోర్సులో ప్రవేశించవచ్చు. రాష్ట్రంలో 27 వేలకు పైబడి సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.

 కోర్ సబ్జెక్టులు: సర్వేయింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, బిల్డింగ్ టెక్నాలజీ, స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైన్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్. సివిల్ ఇంజనీరింగ్- ముఖ్యమైన విభాగాలు: కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, కోస్టల్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్, అర్బన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్.  కెరీర్: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి రహదారులు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, ఇండియన్ రైల్వే, నేషనల్ హైవేస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి.

యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ సేవలు అందించవచ్చు. ప్రారంభంలో సివిల్ ఇంజనీర్లకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనం వస్తుంది. అనుభవం, అదనపు అర్హతలతో నాలుగైదేళ్లలో 40 వేల వరకు సంపాదించవచ్చు. టాప్ రిక్రూటర్స్: ఎల్ అండ్ టీ; రిలయన్స్ ఇన్‌ఫ్రా; ఎల్‌ఎన్‌జే భిళ్వారా గ్రూప్; జైపీ గ్రూప్; గామన్ ఇండియా లిమిటెడ్.. ఉన్నత విద్య: బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) అనంతరం ఎంటెక్/ఎంఈ చేసి, ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు.
 
 నిర్మాణ రంగంపై ఆసక్తి ఉండాలి
  సివిల్ ఇంజనీరింగ్ కెరీర్‌లో రాణించాలంటే నిర్మాణ రంగంపై ఆసక్తి, డిజైనింగ్‌లో సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తి అవసరం. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ విసృ్తత అవకాశాలుంటాయి. ఉన్నత విద్య పరంగా చూస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లతో ఎంటెక్/ఎంఎస్ పూర్తి చేసి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
 - డాక్టర్ ఎం.వి.శేషగిరిరావు, ప్రొఫెసర్,
 సివిల్ ఇంజనీరింగ్, జేఎన్‌టీయూహెచ్.
 
 కెమికల్ ఇంజనీరింగ్
 కెమికల్ ప్లాంట్ల నిర్వహణ, రసాయన ముడిపదార్థాలను పెద్ద ఎత్తున వినియోగ వస్తువులుగా మార్చే ప్రాసెసింగ్ విధానం మొదలైన అంశాలు కెమికల్ ఇంజనీరింగ్‌లోకి వస్తాయి. రసాయనాలు, వాటికి సంబంధించిన ఉప ఉత్పత్తుల తయారీకి రసాయనిక విజ్ఞానాన్ని ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా వినియోగించుకుంటారు. బయోటెక్నాలజీ నుంచి నానోటెక్నాలజీ, మినరల్ ప్రాసెసింగ్‌ల వరకు కెమికల్ ఇంజనీరింగ్‌తో సంబంధం లేని రంగమంటూ లేదు.
 
 కోర్సులు: బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2/తత్సమాన అర్హత ఉండాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర ఎంట్రన్స్‌లతో కోర్సులో ప్రవేశించవచ్చు. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్ సబ్జెక్టులు: కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపుల్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ అండ్ పార్టికల్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, బయో కెమికల్ ఇంజనీరింగ్.
 
 కెరీర్: ప్రస్తుతం కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు, అలాగే మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ రంగాల్లో కెమికల్ ఇంజనీర్లకు అవకాశాలుంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్ ప్రిపరేషన్, మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫెర్టిలైజర్ పరి శ్రమలు, పెయింట్లు, డైలు, ల్యూబ్రికెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, ఫొటోగ్రాఫిక్ ఎక్విప్‌మెంట్ తయారీ పరిశ్రమలు, క్లాథింగ్, పల్ప్, పేపర్ తయారీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు అనేకం.
 
 వేతనాలు: విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా వేతనాల్లో వ్యత్యాసం ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రారంభంలోనే ఇతర అలవెన్సులు మినహాయించి నెలకు 15 వేల నుంచి 25 వేల రూపాయల వేతనం అందుతోంది.టాప్ రిక్రూటర్స్: ఐఓసీఎల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, బార్క్, డీఆర్‌డీఓ, ఇస్రో, సీఎస్‌ఐఆర్ ల్యాబ్స్, ఎన్‌పీసీఎల్, ఎన్‌ఎఫ్‌సీ, ఫ్యాక్ట్, బీపీసీఎల్, ఆర్‌ఐఎల్, హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్, ర్యాలీస్, బీఏఎస్‌ఎఫ్, నాల్కో, బాల్కో, సెయిల్, ఈఐఎల్..
 
 ఏరోనాటికల్ ఇంజనీరింగ్
  ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అత్యంత ప్రతిష్టాత్మక రంగాల్లో ఒకటి. ఈ బ్రాంచ్ చదివిన విద్యార్థులకు కెరీర్ వృద్ధి బాగుంటుంది. ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇది చాలా ప్రాధాన్యం ఉన్న కెరీర్. ఇందులో ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్లను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. అర్హత: ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు కనీస అర్హత 10+2/ ఇంటర్. మన రాష్ట్రంలో ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను కల్పిస్తారు.

 నిట్, ఐఐటీలకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ తప్పనిసరి. రాష్ట్రంలో 1,200కు పైగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి.  కోర్ సబ్జెక్టులు: ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్స్ సైన్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ప్రొపల్షన్, ఆటోమేటిక్ కంట్రోల్ అండ్ గెడైన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ పెర్‌ఫార్మెన్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్.కెరీర్: ఏరోనాటికల్ ఇంజనీర్స్‌కు విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్‌లో మంచి డిమాండ్ ఉంది.టాప్ రిక్రూటర్స్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్, డీఆర్‌డీవో, ఇస్రో, ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్.ఉన్నత విద్య: ఎంటెక్/ఎంఎస్ చేయొచ్చు.
 స్పెషలైజేషన్లు: ఏరోడైనమిక్స్, డైనమిక్స్ అండ్ కంట్రోల్, ఏరోస్పేస్ ప్రొపల్షన్.
 
 మెకానికల్
 ఇంజనీరింగ్‌కు చెందిన పురాతన బ్రాంచ్‌ల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి. ప్రాచీన కాలంలోని దాదాపు అన్ని ఆవిష్కరణలు, ఆధునిక యుగంలోని అధిక భాగం ఆవిష్కరణలు ప్రత్యక్షంగా మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్‌తో సంబంధం ఉన్నవే. ఇంజిన్లు; యంత్రాలు; వేడి పుట్టించే, చల్లబరిచే వ్యవస్థలు; రోబోటిక్స్ తదితరాల రూపకల్పన (డిజైన్), తయారీ, ఏర్పాటు, నిర్వహణ వంటివి మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించినవే. చిన్నపాటి సైకిళ్ల నుంచి, సూపర్ సానిక్ జెట్ యుద్ధ విమానాల వరకు అవసరమైన యంత్రాల రూపకల్పన, అభివృద్ధి మెకానికల్ ఇంజనీరింగ్‌తోనే ముడిపడి ఉంటుంది. ఓ అంచనా ప్రకారం 2020 నాటికి భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా గుర్తింపు సాధించనుంది. ఈ తరుణంలో మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.
 
 కోర్సులు: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంసెట్‌కు 75 శాతం, ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయిస్తారు. దీనిద్వారా సీటు కేటాయిస్తారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా మెకానికల్ సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్‌లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.కోర్ సబ్జెక్టులు: స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ కంట్రోల్, థర్మో డైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్స్ సైన్స్, థియరీ ఆఫ్ డిజైన్ వంటివి.
 
 కెరీర్: కోర్సు పూర్తయ్యాక ఆటోమోటివ్, ఏరోస్పేస్, స్టీల్, పవర్ జనరేషన్, బయో మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ఉద్యోగ నియామక సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రారంభంలో రూ.15 వేల నంచి రూ.25 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.టాప్ రిక్రూటర్స్: టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, హోండా, అశోక్‌లే లాండ్, డీఆర్‌డీవో, ఇండియన్ ఆయిల్, గెయిల్, ఎన్టీపీసీ...ఉన్నత విద్య: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత టర్బో మెకానిక్స్, మెకట్రానిక్స్, టూల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ తదితర స్పెషలైజేషన్లతో ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలు పొందొచ్చు.
 
 విస్తృత అవకాశాలకు వారధి
 మెకానికల్ ఇంజనీరింగ్‌లో విసృ్తత అవకాశాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎస్‌యూ).. ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్) పోస్టుల భర్తీలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందువల్ల బీటెక్ తర్వాత గేట్‌లో మంచి స్కోర్ సాధించడం ద్వారా ఆకర్షణీయమైన ఉద్యోగాలను అందుకోవచ్చు. బీటెక్ పూర్తయిన వారికి ఆటోమొబైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్ జనరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితరాలతో సంబంధమున్న సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
 - వి.ఉమామహేశ్వర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్,
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఓయూ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement