పరిశోధనలతోనే భవిత బంగారం | Bits hyderabad campus associate prof. thrivikraman interview with sakshi bhavita | Sakshi
Sakshi News home page

పరిశోధనలతోనే భవిత బంగారం

Published Thu, Dec 12 2013 3:53 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Bits hyderabad campus associate prof. thrivikraman interview with sakshi bhavita

 పరిశోధనలు..
 
నవ ఆవిష్కరణలు.. ప్రపంచ ప్రగతిని పరుగులెత్తించి, ప్రజా జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయి. ఎక్కడ పరిశోధనలు సాగుతాయో అక్కడే కొత్త కాంతులకు పునాదులు పడతాయి. అలాంటి పరిశోధనల్లో మన దేశం వెనుకబాటుతనానికి శాస్త్రవేత్తల కొరతే కారణమని, భారతీయ పరిశోధనా రంగానికి యువ శాస్త్రవేత్తలను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అంటున్న బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ అసోసియేట్ ప్రొఫెసర్ పి.కె.త్రివిక్రమన్..


 
 శాస్త్ర (Science), సాంకేతిక (Technology) రంగాల పురోగతిపైనే జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సైన్స్‌లో ఇంజనీరింగ్ ఒక భాగమే. అయితే ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక్క ఇంజనీరింగ్‌ను మాత్రమే కెరీర్‌గా భావిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. సైన్సుకు సంబంధించిన మిగిలిన కోర్సులు కూడా అందమైన భవిష్యత్తును ఇచ్చే చదువుగా గుర్తించాలి.


 
 గతంతో పోలిస్తే ఇప్పటి పిల్లలు చాలా చురుకైనవారు. అయితే వీరిపై తల్లిదండ్రుల ఒత్తిడి బాగా పెరుగుతోంది. తమ పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా, వారి కెరీర్‌ను నిర్దేశిస్తున్నారు. అందుకే పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో 8-9 శాతం మంది ఉన్నత చదువుల్లో వెనుకబడిపోతున్నారు.
 
 శాస్త్రవేత్తలది కీలకపాత్ర:
 అంగారక గ్రహం లక్ష్యంగా చేపట్టిన మంగళయాన్ ప్రయోగం విజయవంతం కావడం, రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన సీఎన్‌ఆర్ రావుకు భారతరత్న పురస్కారం లభించడం శుభపరిణామం. ఈ విషయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత పరిశోధనలు దిశగా అడుగులేస్తే బాగుంటుంది. దేశాభివృద్ధిలో పరిశోధన రంగానిది కీలక పాత్ర.


 
 అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించడం నుంచి అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాల వరకూ శాస్త్రవేత్తల పాత్ర ఎంతో కీలకం. కానీ, ఈ రంగంలో అవసరమైన నిపుణులు, శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీని పరిష్కారానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తున్నా తల్లిదండ్రుల్లో ఇంజనీరింగ్‌పై ఉన్న ప్రత్యేక భావన వల్ల మార్పు రావడం లేదు.


 
 ఇంటర్ నుంచి స్కాలర్‌షిప్స్:
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సైన్సు రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు అందజేస్తున్నాయి. కేవీపీవై, డీఎస్‌టీ, ఇన్‌స్పైర్ వంటి వాటి ద్వారా ప్రభుత్వం ఇంటర్మీడియెట్ నుంచి స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి, చదువు పూర్తయ్యేంత వరకు పూర్తి ఖర్చులు భరిస్తోంది. ప్రయోగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాల స్థాయిలోనే పరిశోధనలకు పునాదులు పడాలి.


 
 ఓర్పు ప్రధానం:
 చేతిలోకి డిగ్రీ రాగానే ఉద్యోగం రావాలి.. పాతికేళ్లకే జీవితంలో స్థిరపడాలి.. ఇదీ ఇప్పటి యువత ఆలోచనా ధోరణి. పరిశోధనా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలంటే కొంత సమయం వెచ్చించాల్సిందే. డిగ్రీ పూర్తయ్యాక కనీసం పదేళ్ల వ్యవధి అవసరం. ఎంత కష్టపడతారో అంత ఫలితం తప్పకుండా ఉంటుం ది. అయితే దీనికి కావాల్సింది ఓర్పు. రాబోయే తరాలకు అవసరమైన ప్రయోగాలు చేయాలి.. కొత్త ఆవిష్కరణలతో దేశాన్ని ప్రగతి దిశగా నడిపించాలనే సంకల్పం ఉన్న యువతకు రీసెర్చ్ రంగం ఆహ్వానం పలుకుతోంది.


 
 అవకాశాలు అపారం:
 రీసెర్చ్‌ను కెరీర్‌గా ఎంచుకొని, ఉన్నత చదువులవైపు వెళ్లిన వారికి అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు పూర్తిచేసేందుకు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో పాటు విదేశాల్లో కూడా అవకాశం ఉంది. పరిశోధనలతో ఇస్రో,  న్యూక్లియర్ ఫిజిక్స్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌తో పాటు బోధనా రంగంలో కూడా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునే వీలుంది.

 

ఉద్యోగం సంపాదించడానికే కాదు.. కెరీర్‌లో నిలదొక్కుకోవాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అవి పుస్తకాల్లో చూసి నేర్చుకునేవి కావు. చుట్టూ ఉన్న సమాజం నుంచే అలవరచుకోవాలి. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ మార్గంలో పయనించాలి. మధ్యలో అపజయాలు ఎదురైనా వాటిని విజయానికి చేరుకునేందుకు అవసరమైన మెట్లుగా భావించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement