ఇంజనీరింగ్.. విద్యార్థుల కల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం సాధించడం! క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం లభించకుంటే..
ఇంజనీరింగ్.. విద్యార్థుల కల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం సాధించడం! క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగం లభించకుంటే.. ఇక అంతేనా..! మైక్రోసాప్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీల్లో జాబ్ కలలు, క ల్లలేనా అంటే..!! కచ్చితంగా కాదంటున్నారు.. నిపుణులు! ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా మైక్రోసాఫ్ట్ వంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నవారు ఉన్నారు!! క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం లభించని ఇంజనీరింగ్ విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ద్వారా టాప్ కంపెనీల్లో ఉద్యోగం సొంతం చేసుకోవడానికి మార్గాలేమిటో ఇప్పుడు చూద్దాం..!!
రమేష్ సిద్ధవటం,
ప్లేస్‌మెంట్ మేనేజర్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తో పోల్చినప్పుడు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కఠినంగా ఉంటుంది. పోటీ తీవ్రంగా ఉంటుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సదరు కంపెనీ ఏ కాలేజీకి వెళ్తుందో.. ఆ కాలేజీ విద్యార్థులు మాత్రమే పాల్గొంటారు. కాబట్టి పోటీ తక్కువ. కాని, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో పోస్టులు పరిమితమైతే.. పోటీమాత్రం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆఫ్ క్యాంపస్ ద్వారా ఉద్యోగం పొందాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థి.. పోటీకి తగ్గట్టు ప్రతిభను ప్రద ర్శించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి.
ఆఫ్ క్యాంపస్ జాబ్.. మార్గాలివిగో..
ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్:
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లేని విద్యార్థులకు చక్కని అవకాశం ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. సర్వీసింగ్ కంపెనీలు, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలు ఈ పద్ధతిలో ఎక్కువగా ఉద్యోగులను నియమించుకుంటాయి. కొన్ని కోర్ ఇంజనీరింగ్ కంపెనీలు కేవలం ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారానే ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సదుపాయం లేని విద్యార్థులు ఆయా కంపెనీల వెబ్‌సైట్లలోని కెరీర్ పేజ్ ద్వారా కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా కంపెనీలు ఇంటర్వ్యూకు పిలుస్తాయి.
కోర్ కంపెనీలు కూడా కెరీర్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నాయి. ఇటువంటి 100 దరఖాస్తుల్లోంచి దాదాపు 70 మంది విద్యార్థులకు కంపెనీలు ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తున్నాయి. చాలా మంది ప్రతిభావంతులు ఈ విధానం ద్వారా వెలుగులోకి వస్తుండడంతో ఈ తరహా పద్ధతికి కంపెనీలు ప్రాధాన్యతిస్తున్నాయి. ఈ విధానం ద్వారా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
ఇటువంటి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌లను కంపెనీలు సాధారణంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహిస్తాయి. ఈ విధానంలో ఉద్యోగం సాధించే క్రమంలో విద్యార్థులు ముందుగా చేయాల్సింది.. టాప్ పది కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసుకోవాలి. ఆయా కంపెనీలకు సంబంధించిన కెరీర్ పేజ్‌ను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ కంపెనీకి రెజ్యూమెను పంపాలి. స్నేహితులు, వివిధ సోర్సెస్ ద్వారా ఆయా కంపెనీల రిక్రూట్‌మెంట్ విధానంపై అవగాహన ఏర్పర్చుకోవాలి. అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్ సాగించాలి.
కాంపిటీషన్స్ టు జాబ్:
వివిధ రకాల టెక్నికల్ కాంపిటీషన్స్ కూడా ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఉద్యోగ సాధనకు దోహదం చేస్తాయి. ప్రస్తుతం వివిధ వేదికలపై ట్రేడింగ్ కాంపిటీషన్స్, వెబ్ బేస్డ్ కాంపిటీషన్స్, కోడింగ్ కాంపిటీషన్స్ వంటి టెక్నికల్ పోటీలను వివిధ సంస్థలు నిర్వహించడం జరుగుతుంది. వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులకు పాల్గొనే అవకాశం ఉంటుంది. తద్వారా మీ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు చక్కని వేదికగా ఈ తరహా పోటీలు ఉపయోగపడతాయి. ఇక్కడ ఇంకొక సదుపాయం ఉంది.. ఆది ప్రతిభను అన్వేషిస్తూ వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ తరహా ఈవెంట్లకు హాజరవుతుంటారు.
అందులో పాల్గొనే విద్యార్థుల ప్రతిభను గమనిస్తూంటారు. కాబట్టి మీ ప్రతిభతో వారిని ఆకట్టుకుని జాబ్‌ను సొంతం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇంకో కీలకమైన విషయం.. కొంత మంది విద్యార్థులు రాత పరీక్షల్లో విఫలమైనా.. ఇంటర్వ్యూల్లో గట్టెక్కే ప్రతిభను కలిగి ఉంటారు. అటువంటి విద్యార్థులకు ఈ తరహా ఈవెంట్లు చక్కగా సరిపోతాయి. ఈ తరహా ఈవెంట్లలో టాప్-50లో నిలిచిన విద్యార్థులకు ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ సైకిల్ ఆగస్టులో ప్రారంభమై జనవరిలో ముగుస్తుంది. ఇటువంటి కాంపిటీషన్స్ కారణంగా కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కంటే ముందే విద్యార్థులకు అవకాశం కల్పిస్తుండడం గమనించాల్సిన అంశం.
మరో అవకాశం ఆన్‌లైన్ ట్రేడింగ్ కాంపిటీషన్స్. వీటిని కొన్ని బ్రాండెడ్ కంపెనీలు నిర్వహిస్తాయి. ఇందులో చదివిన బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. మెరుగైన స్కోర్ చేసిన వారందరికి ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ లేదా సర్వీస్ కంపెనీలు ప్రతిభావంతులను గుర్తించే లక్ష్యంతో అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఫెస్టివల్స్ పేరిట పోటీలను నిర్వహిస్తాయి. ఇందులో మెరుగైన ప్రతిభను చూపిన వారికి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే నేరుగా టెక్నికల్/పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు..వివిధ కంపెనీలు, కెరీర్ వెబ్‌సైట్స్, టెక్నికల్ క్లబ్‌లు నిర్వహించే టెక్నికల్ కాంపిటీషన్స్‌లో పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సబ్జెక్ట్‌లోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించండి. కోడింగ్, టెస్టింగ్, కోర్ టెక్నికల్ కాంపిటీషన్స్‌లో పాల్గొనే విధంగా టెక్నికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలి.
స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్:
సాధారణంగా క్యాంపస్ డ్రైవ్ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్ లేదా జనవరిలో ముగుస్తుంది. దీని తర్వాత కంపెనీలు తమ నియామక విధానాలను సమీక్షించుకుంటాయి. వారు ఆశించిన మేర హైరింగ్ ట్రెండ్ లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ కోసం సన్నాహాలను ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియలో కంపెనీలు స్వయంగా క్యాంపస్ డ్రైవ్ చేపట్టని కాలేజీలను ప్రాంతాల వారీగా ఎంపిక చేసుకుంటాయి. ఈ విధానంలో విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్‌ను ఆఫర్ చేస్తాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కాకుండా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలు, సర్వీస్ కంపెనీలు, కోర్ ఇంజనీరింగ్ కంపెనీలు.. ఫ్రెష్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లను నిర్వహిస్తాయి. కొన్ని కంపెనీలు కేవలం ఇంటర్న్‌షిప్ ఆధారంగా మాత్రమే ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ఆయా కంపెనీలు నిర్వహించే వ్యాపారం, తయారు చేసే ఉత్పత్తులు, అనుసరించే విధానాలనే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. ఈ తరహా కంపెనీల కోసం కెరీర్ వెబ్‌సైట్స్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పూల్ క్యాంపస్ డ్రైవ్:
ఆఫ్ క్యాంపస్ మోడల్ ఉద్యోగ సాధనకు మరో అవకాశం.. ‘పూల్ క్యాంపస్ డ్రైవ్’. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ విధానంలో నియామక ప్రక్రియను చేపడతాయి. ఈ ప్రక్రియలో ఒక కాలేజీ లేదా ఇన్‌స్టిట్యూట్ వేదికగా చేసుకుని దరఖాస్తులను ఆహ్వానిస్తాయి. ఇందుకోసం కాలేజీ/ ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎంతమంది విద్యార్థులైనా హాజరు కావచ్చు. దీనికి సంబంధించిన ప్రకటనలను కంపెనీలు స్థానిక పత్రికల్లో ప్రచురించడం లేదా వెబ్ పోర్టల్స్‌లో సంబంధిత కంపెనీలు అందుబాటులో ఉంచుతాయి. ఇందులో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మాదిరిగానే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఇక్కడ వేల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ప్రిపరేషన్ సాగించాలి.
ఎంప్లాయ్ రిఫరల్..
కంపెనీలో అనుకోకుండా కొంతమంది ఉద్యోగులు మానేసినప్పుడు.. లేదా ప్రత్యేక స్కిల్స్ కలిగిన మ్యాన్‌పవర్ అవసరమైనప్పుడు.. పరిమిత స్థాయిలో ఉద్యోగుల నియామకం కోసం ఎంప్లాయ్ రిఫరల్ విధానాన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఎంప్లాయ్ రిఫరల్ అంటే... ఇప్పటికే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సూచించిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకోవడం. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగికి సదరు కంపెనీ పనితీరు, విధివిధానాలు తెలిసి ఉంటాయి.. కాబట్టి అందుకు తగిన అభ్యర్థినే సూచిస్తారు. కాబట్టి తమ ఉద్యోగి సూచించిన అభ్యర్థిని రిక్రూట్ చేసుకునేందుకు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి విధానం మీడియా, ఐటీ రంగాల్లో బాగా అమలవుతోంది. ఇంజనీరింగ్ అభ్యర్థులు తమకు తెలిసిన వారు ఆయా కంపెనీల్లో పనిచేస్తుంటే.. వారి ద్వారా సంస్థలకు రెజ్యూమెలు పంపించేందుకు ప్రయత్నించాలి. తమకు అందిన రెజ్యూమెలను షార్ట్‌లిస్ట్ చేసి.. మొదట టెలిఫోన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ప్రక్రియ జరుపుతాయి.
ఇంటర్న్‌షిప్ కూడా:
మరో కీలక అంశం.. ఇంటర్న్‌షిప్. ఇంజనీరింగ్ విద్యార్థి ప్రతిభను అంచనా వేయడానికి ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ ఇవ్వడానికి కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మూడో సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నాయి. వీటిల్లో మెరుగైన ప్రతిభను ప్రదర్శించిన వారికి తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. క్యాంపస్ డ్రైవ్ జాబితాలో లేని కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ కోసం కంపెనీలు టెక్నికల్ టెస్ట్‌లను నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సాధారణంగా వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు ఉంటుంది. కొన్ని రకాల కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ ద్వారా మాత్రమే జాబ్ దక్కించుకునే వీలు ఉంది. కొన్ని కంపెనీలు కేవలం ఇంటర్న్‌షిప్ ద్వారానే రిక్రూట్‌మెంట్ చేపడతాయి.
ఈ తరహా కంపెనీల్లో వాటి కెరీర్ పేజ్ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోవలోకి మైక్రో ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ కంపెనీలు వస్తాయి. వీటిల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ అనే విధానం కనిపించదు. ఈ కంపెనీలు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలపాటు ఉండే ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తాయి. ఇంటర్న్‌షిప్ సమయంలో చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే అవి ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయి. సెమికండక్టర్ వంటి కంపెనీల్లో కూడా వాటి కెరీర్ పేజీ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కంపెనీలు మే నుంచి జూలై వరకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో ప్రతిభ చూపిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కంటే ముందే జాబ్‌ను ఆఫర్ చేస్తాయి.
స్పష్టత ఆధారంగా:
అన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ కోసం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించవు. కాబట్టి ఆయా కంపెనీల వెబ్‌సైట్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని కంటే ముందు విద్యార్థులు చేయాల్సింది.. ఏ ఉద్యోగం? ఎటువంటి కంపెనీలో చేయాలనుకుంటున్నారనే అంశంపై స్పష్టత తెచ్చుకోవాలి. దీని ఆధారంగా ఇంటర్న్‌షిప్ చేసే కంపెనీని ఎంచుకోవాలి. కొన్ని కంపెనీలు మాత్రమే ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసేందుకు అనుమతినిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. చాలా కంపెనీలు తమ దగ్గర ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఉద్యోగులుగా నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థుల్లో దాదాపు 60 శాతం మందికి పూర్తి స్థాయి ఉద్యోగులుగా అవకాశం ఇస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు.
ఫినిషింగ్ స్కూల్స్:
కొన్ని కంపెనీలు నేరుగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పద్ధతిలో కాకుండా ఫినిషింగ్ స్కూల్స్ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ విధానంలో కంపెనీలు ఫినిషింగ్ స్కూల్స్‌కు తమకు కావల్సిన ఉద్యోగుల వివరాలతో కూడిన ఒక ప్రతిపాదనను పంపిస్తాయి. ఆ మేరకు ఫినిషింగ్ స్కూల్స్ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తాయి. వీరందరికి ప్రత్యేక రాత పరీక్షను నిర్వహిస్తాయి. ఇందులో మెరుగైన ప్రతిభను చూపిన వారికి ఫినిషింగ్ స్కూల్స్ సదరు కంపెనీల అవసరాలకనుగుణంగా వివిధ అంశాలపై శిక్షణనిస్తాయి. ఆ తర్వాత వీరందరికి ఆయా కంపెనీలు కొన్ని రకాల పరీక్షలను నిర్వహించి వారం/ రెండు వారాలు శిక్షణనిచ్చి జాబ్ ఆఫర్ చేస్తాయి.
అపోహలు:
అన్ని కీలకమైన స్థానాలను క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారానే భర్తీ చేస్తారు. అంతగా ప్రాధాన్యత లేని ఉద్యోగాలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో చోటు కల్పిస్తారు.
ఈ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం సమయం వృథా వంటిది.
జాబ్‌పోర్టల్స్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను రిక్రూటర్లు పట్టించుకోరు.
టైర్-3 కాలేజీల విద్యార్థులు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కంటే తక్కువ వేతనాన్ని ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఆఫర్ చేస్తుంటారు.
ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఎందుకు?
ప్రతిభావంతులందరికీ అవకాశం కల్పించడం.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరిధిలో లేని కాలేజీల్లోని విద్యార్థులకు కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో కూడా రిక్రూట్‌మెంట్‌ను కంపెనీలు చేపడతాయి.
అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థుల ప్రతిభను నిరంతరం పరీక్షించేందుకు కూడా ఆఫ్ క్యాంపస్‌ను ఒక సాధనంగా కంపెనీలు వినియోగించుకుంటాయి.
జాబ్ మార్కెట్ కనుగుణంగా నైపుణ్యాలు ఉన్న విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న కాలేజీలను గుర్తించడం కోసం కంపెనీలు ఈ విధానాన్ని అనుసరిస్తాయి.
నచ్చిన జాబ్, మెచ్చిన కంపెనీలో చేరేందుకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ సదుపాయం లేని కాలేజీల్లోని ప్రతిభావంతులకు ఆఫ్ క్యాంపస్ పద్ధతి ఒక చక్కని మార్గంగా పేర్కొనవచ్చు.