తీపిని పంచే కెరీర్.. చాక్లెట్ టేస్టర్! | can we choose as a career to manufacture of Chocolates | Sakshi
Sakshi News home page

తీపిని పంచే కెరీర్.. చాక్లెట్ టేస్టర్!

Published Tue, Sep 9 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

తీపిని పంచే కెరీర్.. చాక్లెట్ టేస్టర్!

తీపిని పంచే కెరీర్.. చాక్లెట్ టేస్టర్!

చాక్లెట్లు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదు మధురమైన చాక్లెట్లను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఇవి లేకుండా కొన్ని వేడుకలకు నిండుదనం రాదు. మిఠాయిల స్థానంలో చాక్లెట్లను కానుకగా ఇచ్చే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి. భిన్న రకాల చాక్లెట్లను రుచి చూడడమే కాదు, వాటి తయారీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. చాక్లెట్ల వ్యాపారం నానాటికీ విస్తరిస్తుండడంతో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇందులో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి.
 
 కొరత లేని అవకాశాలు
 భారత్‌లో చాక్లెట్ల తయారీ కార్పొరేట్ స్థాయితోపాటు కుటీర పరిశ్రమగా కూడా కొనసాగుతోంది. చాక్లెట్ టేస్టర్‌కు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. నాణ్యమైన ముడి సరకును సేకరించడం, చాక్లెట్‌ను తయారు చేయడం, స్వయంగా రుచి చూసి, అత్యుత్తమదాన్ని ఎంపిక చేయడం, ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా వివిధ దశల్లో వీరు సేవలందించాల్సి ఉంటుంది. జనం అభిరుచికి, మార్కెట్ అవసరాలకు తగిన సరకును ఉత్పత్తి చేయడం టేస్టర్ల ప్రధాన బాధ్యత. మొదట సంస్థల్లో ఉద్యోగం ద్వారా అనుభవం గడించి, సొంతంగా చాక్లెట్ తయారీని చేపట్టవచ్చు. దీనికి డిమాండ్ తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి అవకాశాలకు కొరతే ఉండదు. నిపుణులకు విదేశాల్లో అధిక వేతనాలతో కూడిన అవకాశాలు లభిస్తున్నాయి. సృజనాత్మకతతో కొత్త రుచులను వినియోగదారులకు పరిచయం చేయగలిగితే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి.
 
 కావాల్సిన స్కిల్స్: చాక్లెట్ టేస్టర్‌గా వృత్తిలో రాణించాలంటే ఈ రంగంపై వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. వివిధ ఫ్లేవర్లను రుచి చూసి, వాటిలో స్వల్ప తేడాలను కూడా పసిగట్టి చెప్పగలిగే నైపుణ్యం అవసరం. అందుకు నాలుకపై రుచి మొగ్గలు సరిగ్గా పనిచేయాలి. ఈ రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. తయారు చేసే చాక్లెట్లలో ఆశించిన రుచి వచ్చేదాకా ఓపికతో పనిచేయాలి. టేస్టర్లు.. ముడి సరకు పంపిణీదారులు, డిజైన్ ఏజెన్సీలు, వినియోగదారులో తరచుగా మాట్లాడాల్సి ఉంటుంది. కనుకు వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విధుల్లో భాగంగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి.
 
 అర్హతలు:
 చాక్లెట్ టేస్టర్‌గా మారేందుకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. అయితే, మనదేశంలో న్యూట్రీషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, అప్లయిడ్ సైన్స్(హానర్స్) గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో భాగంగా చాక్లెట్ మేకింగ్, టేస్టింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. కొన్ని హోటల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు కూడా దీనిపై కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ఉద్యోగాల విషయంలో ప్రాముఖ్యత ఉంటుంది.
 
 వేతనాలు:
 ఇండియన్ మార్కెట్‌లో చాక్లెట్ టేస్టర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, పనితీరు, నైపుణ్యాలను బట్టి వేతనం పెరుగుతుంది. విదేశాల్లో చాక్లెట్ నిపుణులకు అధిక జీతభత్యాలు అందుతాయి.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
     యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
     వెబ్‌సైట్: www.du.ac.in/du/
     యూనివర్సిటీ ఆఫ్ మైసూర్
     వెబ్‌సైట్: www.unimysore.ac.in
     ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కేటరిం గ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రీషన్-గోవా
     వెబ్‌సైట్: www.ihmgoa.nic.in
     చాకోలెట్ అకాడమీ
     వెబ్‌సైట్: www.chocolateacademy.com
 
 ఎంటర్‌ప్రెన్యూర్‌‌సగా మారొచ్చు
 ‘‘చాక్లెట్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. పెరిగిన డిమాండ్‌తో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇటీవల చాక్లెట్ మేకింగ్‌ను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం హాబీగానే కాకుండా మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీటి త యారీలో సృజనాత్మకత, నైపుణ్యాన్ని జోడిస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది.
 
 మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి. దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌‌సగా మారవచ్చు. ఉద్యోగం చేయదలచుకుంటే చాక్లెట్ టేస్టర్‌గా పేరున్న కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగిగా జీవితం ప్రారంభించవచ్చు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో వీరికి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోనూ ఇటీవలే ఈ ట్రెండ్ మొదలైంది. షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్స్‌లో చాక్లెట్ క్రీమ్‌ను ఇవ్వడం పరిపాటిగా మారింది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో కెరీర్‌గా బాగుంటుందని చెప్పొచ్చు’’
 -నీతూ జైన్, చాకోలెట్ మేకింగ్ శిక్షకురాలు, సికింద్రాబాద్
 
 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్లు
 ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     ఫ్లైయింగ్. అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
     అకౌంట్స్. అర్హతలు: 60 శాతం మార్కులతో కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా 50 శాతం మార్కులతో కామర్స్‌లో పీజీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉండాలి.
     మెటీరియాలజీ. అర్హతలు: సైన్స్ స్ట్రీమ్/మ్యాథ మెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/అప్లయిడ్ ఫిజిక్స్/ఓషియనో గ్రఫీ/మెటీరియాలజీ/అగ్రికల్చరల్ మెటీరియాలజీ/ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్/జియో ఫిజిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీలో 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి.
 సెలక్షన్ తేది: సెప్టెంబర్ 14
 వెబ్‌సైట్: http://careerairforce.nic.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
 ట్యూబర్‌క్యులోసిస్
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్-న్యూఢిల్లీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
     సీనియర్ రెసిడెంట్
 విభాగాలు: టీబీ అండ్ చెస్ట్ డిసీజ్, మైక్రోబయాలజీ, ఎనస్థీషియా, మాలిక్యులర్ మెడిసిన్/జెనెటిక్స్, థోరాసిక్ సర్జరీ, పాథాలజీ  
     జూనియర్ రెసిడెంట్
 పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 ఎంపిక: సెప్టెంబర్ 16న నిర్వహించనున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా...
 వెబ్‌సైట్: www.nitrd.nic.in
 
 నేను ఆర్‌‌ట్స విద్యార్థిని. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. బయాలజీ కోసం ఏయే పుస్తకాలు చదవాలి?
     - వి.నవీన్, మూసాపేట
 ఏ పోటీ పరీక్షలోనైనా జనరల్ స్టడీస్ అత్యంత కీలకమైంది. ఈ సబ్జెక్టును క్షుణ్నంగా చదివినవారు పోటీలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఇందులో వివిధ అంశాలుంటాయి. అందరికీ అన్ని అంశాలపై పట్టు ఉండకపోవచ్చు. కానీ పట్టుదలతో కృషిచేస్తే 95 శాతం మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. జనరల్ స్టడీస్‌లో కీలకమైన ఒక విభాగం బయాలజీ. పాఠశాల స్థాయిలో 6 నుంచి 10వ తరగతి వరకు జీవశాస్త్ర అంశాలను క్షుణ్నంగా చదివితే ఈ సబ్జెక్టుపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతోపాటు దినపత్రికలు, సైన్‌‌స మేగజైన్‌‌స చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదివితే కొండ గుర్తుల అవసరం లేకుండా సమాధానాలను గుర్తించవచ్చు.
 
  ఒక పాఠ్య భాగాన్ని ప్రిపేరయ్యేటప్పుడు  తరచుగా మరచిపోయేందుకు అవకాశమున్న అంశాలను పాయింట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయాలి. ఎక్కువసార్లు చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకుంటే జవాబులను గుర్తించే విషయంలో గందరగోళానికి తావుండదు.  ఉద్యోగ భర్తీలకు సంబంధించిన ప్రకటన వచ్చాకే సన్నద్ధతను ప్రారంభించడం ఒకప్పటి విధానం. మారిన పోటీ పరిస్థితుల దృష్ట్యా ఎంత ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం కోసం తపించే ప్రతి ఒక్కరూ కనీసం ఏడాది టైమ్ టేబుల్ వేసుకొని, నిరంతరం ఒక క్రమపద్ధతిలో కష్టపడాలి. వివిధ అంశాలను తమదైన శైలిలో ప్రిపేరైన వారికి ఉద్యోగం కచ్చితంగా సొంతమవు తుంది. ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నత కొలువు కోసం ప్రయత్నించేవారైతే మరింత శ్రమించాలి.   
  ఇన్‌పుట్స్: టి.సుధాకర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement