సరైన సమయపాలనతో 100 పర్సంటైల్! | CAT Topper P Krishna Koundanya Interview on How to Crack CAT | Sakshi
Sakshi News home page

సరైన సమయపాలనతో 100 పర్సంటైల్!

Published Thu, Jan 30 2014 2:37 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సరైన సమయపాలనతో 100 పర్సంటైల్! - Sakshi

సరైన సమయపాలనతో 100 పర్సంటైల్!

ఎవరికైనా రోజుకు ఉంది 24 గంటలే! కానీ, ఒకరు అందలంపై ఉంటే మరొకరు అట్టడుగున ఉంటారు. చక్కటి సమయ పాలన ఉన్నవాళ్లు శిఖర గమ్యానికి చేరితే, అది లేనివాళ్లు పాతాళానికి పడిపోతారు. కాలం కత్తి లాంటిది.. దానికి పదునుపెడితే ఎంతటి లక్ష్యాన్నయినా సాధిస్తుంది. అంతటి విలువైన సమయాన్ని ఒడిసిపట్టి, సద్వినియోగం చేసుకోవడం వల్లే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించానంటున్నారు పి.కృష్ణ కౌండిన్య...
 
 
 అమ్మానాన్న ఇద్దరూ విద్యావంతులు. నాన్న ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. సోదరి ఇంజనీరింగ్ చదువుతోంది. నా చదువు హైదరాబాద్‌లోనే సాగింది. ప్రస్తుతం ముంబై ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నా.
 
 ఎవరికైనా సాధ్యమే!
 ప్రణాళిక ప్రకారం కృషిచేస్తే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించడం కష్టమేమీ కాదు. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడం అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఎవరికి వారు తమ బలాలు, బలహీనతలను గుర్తించి, లోపాలను సరిదిద్దుకుంటే విజయం తథ్యం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ.. ఎందులో రాణించాలన్నా ఇంగ్లిష్ అవసరం. కొత్త పదాలను తెలుసుకోవడం, వ్యాకరణంపై పట్టు సాధించడం క్యాట్ ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడింది.


 
 కాలమే కీలకం!
 కాలేజీలో చదువుతూనో లేదంటే ఉద్యోగం చేస్తూనో ఉన్నత చదువులకు సిద్ధమయ్యే సందర్భంలో టైం మేనేజ్‌మెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా మంది తమకు తెలియకుండానే కాలాన్ని వృథా చేస్తారు. గంటలో పూర్తయ్యే పనికి రెండు, మూడు గంటలు తీసుకుంటారు. రేపు మాపంటూ వాయిదా వేస్తుంటారు. అలా కాకుండా దేనికెంత సమయం అవసరమో చూసుకుని ప్రణాళికను సిద్ధం చేసుకొని, దాన్ని పక్కాగా అమలు చేస్తే ఇంకా చాలా సమయం చేతిలో ఉంటుంది. నేను కాలేజీ తరఫున బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లకు వెళ్తుంటా. గిటారు వాయిస్తుంటా. పాటలు కూడా కంపోజ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు స్టేజ్ షోలు ఇస్తుంటాను. అయినా చదువుకు ఆటంకం కలగకుండా సమయాన్ని మేనేజ్ చేసుకుంటున్నాను. క్యాట్ ఔత్సాహికులు తమ ప్రిపరేషన్‌లో ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో గుర్తించి, రోజూ సాధన చేస్తే మంచి స్కోర్ సాధించడం సులువే!


 
 ప్రశ్నల ఎంపికలో జాగ్రత్త:
 క్యాట్ పరీక్ష సమయంలో ముందుగా తేలికైన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే మొదటే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తే ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. నా వరకూ నేను క్యాట్ బాగానే రాసినా, 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. అయితే మంచి స్కోర్ వస్తుందని మాత్రం తెలుసు. ఎంతబాగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. దీనికి మించిన మార్గం మరొకటి లేదు. దినపత్రికలు, నవళ్లు చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై అవగాహన పెరిగింది. ఇది ఉన్నతమైన క్యాట్ స్కోర్ సాధనకు సహకరించింది.


 
 వారి కష్టమే నాకు స్ఫూర్తి:
 అమ్మానాన్న కష్టపడే తత్వం నాకు స్ఫూర్తి. ఇదే నన్ను విజయానికి దగ్గర చేసింది. అత్యుత్తమ మేనేజ్‌మెంట్ విద్యకు వేదికైన అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీయే చేయాలన్నది నా కోరిక. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ పరిజ్ఞానం మధ్య సమన్వయం బాగుంటుంది. కెరీర్‌లో పైకి ఎదిగేందుకు ఈ రెండూ అవసరమన్నది నా భావన.
 

‘‘నాకు క్యాట్‌లో 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. అయితే మంచి స్కోర్ వస్తుందని మాత్రం తెలుసు. మంచి స్కోర్ సాధించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. దినపత్రికలు, నవలలు చదవడం వల్ల ఇంగ్లిష్ భాషపై అవగాహన పెరిగింది. ఇది చక్కటి క్యాట్ స్కోర్‌కు సహకరించింది’’.
 -పి.కృష్ణ కౌండిన్య
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement