విద్యారుణాలు-రూపాయి క్షీణత ప్రభావం | education loan- rupee inflation | Sakshi
Sakshi News home page

విద్యారుణాలు-రూపాయి క్షీణత ప్రభావం

Published Thu, Nov 7 2013 1:43 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

education loan- rupee inflation

ఉన్నత విద్య (Higher Education).. వ్యక్తుల ప్రగతికే కాదు..  జాతి నిర్మాణానికి, పురోగతికి బలమైన పునాది. అలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక స్తోమత లేకపోవడమనేది అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం.. అర్హులైన విద్యార్థులందరికీ విద్యా రుణాలు అందించాలని బ్యాంక్‌లను ఆదేశించింది. ఇలాంటి విద్యా రుణాల మంజూరుకయ్యే ఖర్చును మానవ వనరుల అభివృద్ధికి పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే గత దశాబ్ద కాలంగా రుణాల మంజూరు ప్రక్రియను సరళీకృతం చేస్తూ వస్తోంది.

 

 

 కిరణ్‌కుమార్ అడుసుమిల్లి

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

 

 రుణాలకు ఎవరు అర్హులు?

 భారతదేశంలోగానీ, విదేశాల్లోగానీ ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన భారత జాతీయ విద్యార్థులకు టెర్మ్ లోన్ రూపంలో విద్యా రుణాలు మంజూరు చేస్తారు.

యూజీసీ/ఏఐసీటీఈ/ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీటు సంపాదించిన విద్యార్థులు రుణాలకు అర్హులు.

ఐఐటీ/ఐఐఎం వంటి ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు కూడా అర్హులు.

డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా షిప్పింగ్  శాఖ అనుమతి పొందిన ఏరోనాటికల్ కోర్సులు,  పైలట్ శిక్షణ, షిప్పింగ్ కోర్సులను కూడా విద్యా రుణాలకు పరిగణనలోకి తీసుకుంటారు.

కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొందిన టీచర్ ట్రైనింగ్, నర్సింగ్ కోర్సులు రుణాలకు అర్హమైనవి.

దూరవిద్యా కోర్సులు, పార్ట్ టైం కోర్సుల్లో ప్రవేశించిన వారికి విద్యా రుణాలు మంజూరు చేయరు.

 

 ఎంత ఇస్తారు?

 విద్యార్థులు ప్రవేశం పొందే విద్యాసంస్థల్లో చెల్లించాల్సిన  ట్యూషన్ ఫీజు, లేబొరేటరీ ఫీజు, పరీక్ష ఫీజు, యూనిఫాం, పుస్తకాలు, చదువుకు అవసరమైన ఉపకరణాలు, అవసరమైతే కంప్యూటర్ (ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా), కాషన్ డిపాజిట్/రిఫండబుల్ డిపాజిట్ (ట్యూషన్ ఫీజులో పది శాతానికి మించకుండా)లకు అయ్యే మొత్తాన్ని విద్యా రుణం మంజూరు చేసేందుకు పరిగణనలోకి తీసుకుంటారు. రూ. 50 వేల వరకు ద్విచక్ర వాహనం కొనుగోలును విద్యారుణంగా పరిగణిస్తారు. చదువు పూర్తిచేసేందుకు అవసరమైన ప్రాజెక్ట్ వర్క్, స్టడీ టూర్‌లకు అయ్యే ఖర్చులను కూడా మొత్తం ఖర్చులో కలపవచ్చు.

 చదువుకోసం విదేశాలకు వెళ్లేవారు ప్రయాణ ఖర్చులను రుణం మొత్తంలో భాగంగా చూపించవచ్చు. విద్యార్థి కుటుంబంతో కలిసి ఉండకుండా వేరే ఊరిలో ఉండాల్సి వస్తే హాస్టల్ ఖర్చులు లేక సొంతంగా ఉండేందుకు అయ్యే ఖర్చులన్నీ చదువుకు అయ్యే ఖర్చుగానే పరిగణించి ఆ మేరకు రుణాన్ని మంజూరు చేస్తారు.

 భారతదేశంలో చదువుకైతే రూ. 10 లక్షల వరకు, విదేశాల్లో చదువుకైతే రూ. 30 లక్షల వరకు విద్యా రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణాలకు ప్రాసెసింగ్ చార్జీలు ఉండవు. ఆషామాషీగా దరఖాస్తు చేసే విద్యార్థులను నిరుత్సాహ పరిచేందుకు విదేశాల్లో చదువుకోసం రుణాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల నుంచి రూ.5 వేలు డిపాజిట్ కట్టిస్తారు. రుణం తీసుకునేటప్పుడు ఆ డిపాజిట్‌ను వారి మార్జిన్‌గా పరిగణిస్తారు. ఏ కారణం వల్లనైనా రుణం మంజూరయ్యాక తీసుకోకుంటే ఆ డిపాజిట్‌ను ప్రాసెసింగ్ చార్జీగా పరిగణించి తీసుకుంటారు.

 

 ఎప్పుడు తిరిగి చెల్లించాలి?

చదువు పూర్తయ్యాక ఒక సంవత్సరం లేక ఉద్యోగం వచ్చాక ఆర్నెల్లు.. ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పటి నుంచి రుణ చెల్లింపులు ప్రారంభించాలి. చదువుకునే సమయంలో తల్లిదండ్రులు ప్రతినెలా క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు వడ్డీ కట్టినట్లయితే వడ్డీలో 1 శాతం తగ్గిస్తారు. రుణ పరిమాణాన్ని బట్టి 11.55 శాతం నుంచి 13.55 శాతం వరకు వడ్డీని సాలీనా వసూలు చేస్తారు. ఈ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలకనుగుణంగా మారుతూ ఉంటాయి.

విద్యా రుణాలపై తిరిగి చెల్లించే వడ్డీ మొత్తానికి సెక్షన్ 80 (ఈ) కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. 2.3.2009 తర్వాత మంజూరైన రుణాల్లో మహిళా విద్యార్థులకు ఉపయోగించిన రుణాలకు 0.5 శాతం వడ్డీ తగ్గింపు వర్తిస్తుంది.

నాలుగు లక్షల రుణం వరకు మార్జిన్ అవసరం లేదు. అంటే చదువుకి అవసరమైన మొత్తం నాలుగు లక్షలకు మించకుంటే మొత్తం డబ్బును రుణంగా పొందవచ్చు. అంతకుమించితే మాత్రం భారత్‌లో చదువుకు 5 శాతం, విదేశాల్లో చదువుకు 15 శాతం మార్జిన్ భరించాల్సి ఉంటుంది.

రూ. నాలుగు లక్షల వరకు విద్యా రుణాలకు విద్యార్థి, తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు కలిసి సంబంధిత డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తే సరిపోతుంది. ఎలాంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. రూ. 4 లక్షల నంచి రూ. ఏడున్నర లక్షల వరకు పై ఇద్దరితో పాటు ఎవరైనా హామీదారుగా ఉంటే సరిపోతుంది. ఇంకెలాంటి కొల్లేటరల్ అవసరం లేదు.

 ఏడున్నర లక్షలకు పైన రుణాలకు మాత్రం భూమి, భవనాలు వంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం.

 ఏడున్నర లక్షల లోపు రుణాలను 5.7 సంవత్సరాల వ్యవధిలోనూ, అంతకు మించిన రుణాలను 12 ఏళ్ల వ్యవధిలోనూ తిరిగి కట్టాలి.

 

 

 సమర్పించాల్సిన డాక్యుమెంట్లు:

 విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల గురించి తెలుసుకుందాం. చదవదలచుకున్న విద్యా సంస్థలో ప్రవేశం కల్పించే ఉత్తరం, పదో తరగతి నుంచి అన్ని పరీక్షల మార్కుల పత్రాలు, కాలేజీలో కట్టాల్సిన ఫీజుల వివరాలు, హాస్టల్లో కట్టాల్సిన డబ్బు వివరాలు, 2 పాస్‌పోర్ట్ ఫొటోలు (విద్యార్థి/తల్లి/తండ్రి/హామీదారు), పాన్ కార్డు (విద్యార్థి, తల్లి/తండ్రి, గత ఆర్నెల్ల బ్యాంక్ స్టేట్‌మెంట్స్, గత రెండేళ్ల ఐటీ రిటర్న్‌లు, స్టేట్‌మెంట్ ఆఫ్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్, ఆదాయపు రుజువు (ప్లే స్లిప్పులు/ఫారం 16 వంటివి) జతపరిచి రుణ దరఖాస్తు ఇవ్వాలి. కేవైసీకి సంబంధించి ఐడీ రుజువు, అడ్రస్ రుజువులు జతపర్చాలి.

 కొన్ని సందర్భాల్లో రుణం తీసుకొని చదివిన చదువు పూర్తయ్యాక, మరింత మంచి ఉద్యోగావకాశాల కోసం ఇంకా ఉన్నత విద్య చదవాలనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో అదే బ్యాంక్ నుంచి రెండో విద్యారుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి వాటిని టాప్ అప్ రుణాలుగా వ్యవహరిస్తారు. రెండో రుణానికి సంబంధించిన చదువు పూర్తయ్యే వరకు మొదటి రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపును వాయిదా వేస్తారు. రెండో కోర్సు పూర్తయ్యాక రెండు రుణాలూ ఒకేసారి తిరిగికట్టడం ప్రారంభించవచ్చు.

 

 రూపాయి విలువ తగ్గుదల, ప్రభావం

 గడచిన కొన్ని నెలలుగా డాలరుతో రూపాయి మారకం విలువ ఒడిదుడుకులకు గురవుతోంది. ఇది విదేశాల్లో విద్యాభ్యాసానికి విద్యారుణాలు ఆశించే వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకలా జరుగుతుందో.. రూపాయి మారకం విలువకు, విద్యా రుణాలకు సంబంధం ఏమిటో చూద్దాం..

 రూపాయి మారకం విలువ తగ్గినందువల్ల కొందరికి మోదం కాగా, ఎక్కువ మందికి ఖేదం కలుగుతోంది. ఇప్పటికే విద్యారుణాలను ఉపయోగించుకుని, చదువు పూర్తిచేసి ఇటీవల ఉద్యోగాల్లో (విదేశాల్లో) చేరిన వారికి ఈ రూపాయి పతనం ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతకుముందు వారు రుణం తీర్చేందుకు ప్రతినెలా వంద డాలర్లు పంపితే, ఇప్పుడు రేట్లు మారడం వల్ల 90 డాలర్లు పంపాల్సి వస్తుందనుకుంటే ఆనందమే కదా?

 

 ఇప్పుడు చదవాలనుకునే అభ్యర్థులకు మాత్రం  రూపాయి క్షీణత విలువ ఆందోళన కలిగిస్తోంది. వారు ఖర్చుచేయాల్సిన మొత్తం ఎక్కువ కావడం దీనికి ముఖ్య కారణం. ఇలా ఎందుకు జరుగుతుందో ఓ చిన్న ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం.

 

 అమెరికాలో ఏడాది చదువుకు సగటున 15,000 నుంచి 30,000 డాలర్ల వరకు ఆయా యూనివర్సిటీలను బట్టి ఖర్చవుతుంది. అక్కడ ఉండేందుకు ఏడాదికి సగటున 15 వేల డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అన్ని రకాల ఖర్చులు కలిపి ఏడాదికి సుమారు 40 వేల డాలర్లు అవసరం అనుకుంటే ఒక డాలర్ విలువ 60 రూపాయలు అనుకుంటే ఏడాదికి రూ. 24 లక్షలు అవసరం అవుతాయి. రూపాయి విలువ పది శాతం పడిపోతే (డాలర్ విలువ రూ. 66) ఏడాదికి రూ.26.4 లక్షలు అవసరమవుతాయి.

 

 అంటే కేవలం రూపాయి విలువ పది శాతం పడినందువల్ల రూ. 2.4 లక్షలు అదనంగా ఖర్చుచేయాల్సి వస్తుంది. ఆ మేరకు అదనపు రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అదనపు మార్జిన్ కట్టాల్సి ఉంటుంది. ఇవి కుదరకపోతే విదేశాలలో చదవాలనే కోరికను వాయిదావేసుకోవడంగానీ మానేసుకోవడంగానీ చేయాల్సి ఉంటుంది. చదువు పూర్తయ్యాక వచ్చే డాలర్ల జీతంతో (అదే మారకపు విలువ ఉంటే) త్వరగా రుణం తీర్చవచ్చుగానీ అది భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వర్తమానంలో మాత్రం అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.

 

 రూపాయి క్షీణత కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితుల్లో విద్యార్థులు అనుసరించదగిన వ్యూహాలేమిటో పరిశీలిద్దాం..

 ఖర్చు తగ్గించుకోవడం అనేది సులభంగా చెప్పగలిగిన సలహాయేగానీ అది ఆచరణ సాధ్యంకానిది. కళాశాలలకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకోవడం అనేది విద్యార్థి చేతిలో లేనిది. ఇక వ్యక్తిగత ఖర్చుల విషయానికి వస్తే ఏడాదికి 15 వేల డాలర్ల ఖర్చులో పొదుపు చేసే అవకాశం చాలా తక్కువ. క్యాంపస్ ఉద్యోగాల్లో వచ్చే ఆదాయం డాలర్లలో ఉంటుంది కనుక కొంచెం ఉపయోగపడినా అందరికీ అవి దొరుకుతాయన్న గ్యారంటీ లేదు.

 

 ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణీయమైన మార్గాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. భారతదేశపు వడ్డీరేట్లతో పోల్చితే విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా దేశాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువ. కొన్ని సందర్భాల్లో సగం కంటే తక్కువ కూడా ఉంటాయి. అందువల్ల విదేశాలలో విద్యాభ్యాసానికి దరఖాస్తు చేసేటప్పుడు ఆయా విశ్వవిద్యాలయాలు విద్యారుణాలు కూడా ఇప్పిస్తాయేమో కనుక్కోవాలి. మంచిపేరున్న విశ్వవిద్యాలయాల్లో స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్స్ కూడా లభిస్తాయి.

 

 అలాంటి విశ్వవిద్యాలయాలను ఎన్నుకుంటే ఖర్చులు తగ్గుతాయి. అయితే అలాంటి విద్యాలయాల్లో ప్రవేశం సంపాదించేందుకు మరికొంత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అయినా ఆ కష్టం భవిష్యత్తులో సుఖం కోసమే కనుక తప్పదు. ఇలాంటి విషయాల్లో సంబంధిత విశ్వవిద్యాలయాల్లోని ‘అడ్మిషన్ డెరైక్టర్లు’ సరైన సలహా ఇవ్వగలరు.

 

 అమెరికాతో పోల్చితే కొంత తక్కువ ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు తక్కువగా ఉండే ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్, కెనడాలను చదువుకోసం ఎంపిక చేసుకోవచ్చు.

 మాస్టర్స్ కోర్సుల విద్యార్థులు టీచింగ్ అసిస్టెంట్‌షిప్, డాక్టోరల్ కోర్సుల విద్యార్థులు రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్ చేస్తూ, కొంత వరకు డాలర్లను పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement