ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 10 వేల ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీట్ల పెంపు నిమిత్తం ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వ/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రేడ్ చేయాలన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) జనవరి 9న ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన మేరకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ఆయా కాలేజీలను కేంద్ర ప్రాయోజిత పథకంతో అప్‌గ్రేడ్ చేస్తారు.
సుమారు రూ.10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల సీట్లు పెరుగుతాయి. పథకం అమలుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా భరిస్తాయి. మొత్తమ్మీద చూస్తే దాదాపు 10,000 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నందున ఒక్కో సీటు కోసం సగటున రూ.1.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలో ప్రస్తుతం 381 మెడికల్ కాలేజీలు ఉండగా అందులో 49,918 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో డాక్టర్-పేషంట్ నిష్పత్తి ప్రస్తుతమున్న 1:2000 నుంచి 1:1000కు తగ్గనుంది. మరో 58 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతోపాటు జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్‌కు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. దీనివల్ల మరో 5,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆశాజనకంగా హైరింగ్
ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలు మెరుగుపడతాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో జోరు దీనికి కారణం కానున్నదని వివరిం చింది. గత ఏడాది నవంబర్‌లోలాగానే గత నెలలో కూడా ఉద్యోగ నియామక కార్యకలాపాలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీలో హైరింగ్ కార్యకలాపాలు గరిష్టంగా మెరుగుపడ్డాయంటున్న ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం... బీపీవో హైరింగ్ 33 శాతం పెరిగింది.
ఫార్మా 16 శాతం, టెలికం 7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఐటీ, బీపీవో, ఫైనాన్స్ రంగాల్లో డిమాండ్ పెరగ్గా, బ్యాంకింగ్, బీమా, సరఫరా చెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు తగ్గాయి. ఇక హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో హైరింగ్ కార్యకలాపాలు బాగా మెరుగుపడగా, చెన్నైలో మాత్రం 4 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా కొత్త కొలువులు పెరుగుతాయి.
ఆన్‌లైన్ దిశగా.. ఐసీఎస్‌ఐ
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఫౌండేషన్ ఎగ్జామ్‌ను ఈ ఏడాది జూన్ నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వచ్చే రెండు-మూడేళ్లలో మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి మార్చాలని యోచిస్తోంది. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ-లెర్నింగ్, ఈ-ట్రైనింగ్ సౌకర్యాలను ప్రవేశపెట్ట్టనుంది. ఐసీఎస్‌ఐలో 35 వేల మంది సభ్యులు, నాలుగు లక్షల మంది కంపెనీ సెక్రటరీ విద్యార్థులున్నారు.
ఐటీఐతో పాలిటెక్నిక్‌లోకి
ఐటీఐ కోర్సును 60 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం పాలిటెక్నిక్‌లో చేరాలనుకునే విద్యార్థులు సాంకేతిక విద్యా శిక్షణ సంస్థ సిలబస్‌ను అనుసరించి నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు రాత పరీక్షలో అర్హత సాధించాలి.
హోమియో కోర్సుల్లో అల్లోపతికి నో
దేశంలోని హోమియోపతి కళాశాలల సిలబస్‌లో అల్లోపతి సబ్జెక్టులను ప్రవేశపెట్టేందుకు అనుమతించబోమని కేంద్ర హోమియోపతి కౌన్సిల్ (సీసీహెచ్) మంగళవారం స్పష్టం చేసింది. హోమియో కోర్సులతో పాటు సమీకృత అల్లోపతి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని, అలాగైతే డిగ్రీలు పొందిన తర్వాత హోమియోతోపాటు అల్లోపతి వైద్యాన్ని ప్రాక్టీసు చేసేందుకూ అవకాశం ఉంటుందని పలువురు హోమియో వైద్యులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో సీసీహెచ్ ఈ మేరకు తేల్చి చెప్పింది. దేశంలోని హోమియో కళాశాలలన్నింటినీ ఫిబ్రవరి 15లోగా తనిఖీ చేయాలని సీసీహెచ్ నిర్ణయించింది.