విద్యకు వెలుగు రేఖలు..ఉపకార వేతనాలు
విద్య.. మనిషి ఉన్నతికి మార్గాన్ని చూపిస్తుంది.. వెలుగు రేఖలను సొంతం చేస్తుంది..
అటువంటి మహోన్నత అస్త్రాన్ని అందరికి చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం
ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంది.. ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో
మైనార్టీల ప్రాతినిధ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పలు రకాల
స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.. వాటి వివరాలు..
మన దేశంలో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్, జోరాస్టియన్స్ (పార్శీలు)లను మైనార్టీలుగా పరిగణిస్తారు. వీరికి పాఠశాల విద్య నుంచి పీహెచ్‌డీ వరకు అన్నీ రకాల కోర్సులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నారు. ట్యూషన్ ఫీజుకు మాత్రమే పరిమితం కాకుండా మెయింటెనెన్స్ ఖర్చులు, అడ్మిషన్ ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. అంతేకాకుండా విద్య, ఉద్యోగాల కోసం శిక్షణ వంటి అవసరాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యకు కూడా చేయూతనిస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలను కూడా ఇస్త్తున్నారు.
ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్
ఎవరికి: ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం
స్కాలర్‌షిప్ కింద ప్రవేశ రుసుం (అడ్మిషన్ ఫీజు), ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.
ట్యూషన్ ఫీజు కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ. 350, మెయింటెనెన్స్ అలవెన్స్ కింద నెలకు రూ.100, 6 నుంచి 10వ తరగతి హాస్టలర్స్‌కు నెలకు రూ.600, అడ్మిషన్ ఫీజు కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ. 500 చెల్లిస్తారు. మొత్తం స్కాలర్‌షిప్‌లో 30 శాతం బాలికలకు కేటాయించారు.
అర్హత: తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.లక్ష వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కంటే కుటుంబ స్థాయికి ప్రాధాన్యతనిస్తారు. వివరాలకు పాఠశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని సంప్రదించాలి. వెబ్‌సైట్:www.minorityaffairs.gov.in
మెరిట్-కమ్-మీన్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కోసం ఆన్‌లైన్ స్కాలర్‌షిప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (osms)ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.momascholorship.gov.in
పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్‌షిప్, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ నిర్వహణా పథకాల కింద విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా స్కాలర్‌షిప్ మొత్తాన్ని జమ చేస్తారు.
టోల్ ఫ్రీ నెంబర్: 1800-11-2001
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్
ఎవరికి: 11వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం
అర్హత: తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.3 లక్షల వరకు ఉండాలి.
స్కాలర్‌షిప్ కింద ప్రవేశ రుసుం (అడ్మిషన్ ఫీజు), ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.
స్కాలర్‌షిప్‌లో 30 శాతం బాలికలకు కేటాయించారు.
మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని సంప్రదించాలి.
వివరాలకు: www.minorityaffairs.gov.in
మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్
ఈ ఫౌండేషన్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌తోపాటు విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థలకు సహాయాన్ని కూడా అందజేస్తుంది. వివరాలు..
మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్‌షిప్: మైనారిటీ వర్గానికి చెందిన బాలికల్లో విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే సంస్థ) ‘మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్‌షిప్ స్కీమ్’ను ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్‌షిప్ 11వ తరగతి చదువుతున్న బాలికల కోసం ఉద్దేశించింది. స్కాలర్‌షిప్ మొత్తం రూ.12,000. రెండు విడతలుగా 11వ తరగతి లో రూ.6,000, 12వ తరగతితో రూ.6,000 అందిస్తారు.
అర్హత: 55 శాతం మార్కులతో ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) ఉత్తీర్ణత.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షకు మించరాదు.
11వ తరగతిలో చేరినట్లు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ ధ్రువీకరించిన అడ్మిషన్ స్లిప్.
చదువుతున్న ఇన్‌స్టిట్యూట్‌కు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి.
విద్యా సంబంధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎన్‌జీవోలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇవ్వడం
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.లక్ష వరకు ఉన్న 11, 12వ తరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థినిల కోసం స్కాలర్‌షిప్స్ వివరాలకు: www.maef.nic.in
ఎన్‌ఎండీఎఫ్‌సీ రుణాలు
ఎన్‌ఎండీఎఫ్‌సీ నుంచి 3 శాతం వడ్డీరేటుతో రూ. 20 లక్షల వరకు విద్యా రుణం అందజేస్తారు. అత్యధికంగా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు ఐదేళ్ల వరకు ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున రూ. 10 లక్షలను అందజేస్తారు.
ఏడాది వ్యవధి ఉండే నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) ప్రోగ్రామ్‌లకు రూ. 3 లక్షలు, విదేశాల్లో చదవాలనుకునే ఔత్సాహికులకు ఐదేళ్లపాటు ఏడాదికి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. రూ. 50 వేలకు ఏడాదికి 5 శాతం వడ్డీ, రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు 6 శాతం వడ్డీ, రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 3 శాతం వడ్డీ విధిస్తారు.
పడో ప్రదేశ్ పథకం
విదేశాల్లో మాస్టర్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ స్థాయి కోర్సులను అభ్యసించే విద్యార్థు కోసం తీసుకున్న విద్యా రుణానికి వడ్డీ సబ్సిడీ ఇస్తారు.
ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అందజేస్తున్న విద్యా రుణ పథకంతో ఈ వడ్డీ సబ్సిడీని అనుసంధానిస్తారు.
ఇందుకోసం విదేశీ వర్సిటీల్లో మాస్టర్స్, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి.
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు.
వివరాలకు: www.minorityaffairs.gov.in
ఎన్‌ఎండీఎఫ్‌సీ రుణాలు
ఎన్‌ఎండీఎఫ్‌సీ నుంచి 3 శాతం వడ్డీరేటుతో రూ. 20 లక్షల వరకు విద్యా రుణం అందజేస్తారు. అత్యధికంగా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు ఐదేళ్ల వరకు ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున రూ. 10 లక్షలను అందజేస్తారు. ఏడాది వ్యవధి ఉండే నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) ప్రోగ్రామ్‌లకు రూ. 3 లక్షలు, విదేశాల్లో చదవాలనుకునే ఔత్సాహికులకు ఐదేళ్లపాటు ఏడాదికి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. రూ. 50 వేలకు ఏడాదికి 5 శాతం వడ్డీ, రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు 6 శాతం వడ్డీ, రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 3 శాతం వడ్డీ విధిస్తారు.
మౌలానా ఆజాద్
జాతీయ ఫెలోషిప్
ఎవరికి: ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంఫిల్‌కు రెండేళ్లు, ఎంఫిల్+పీహెచ్‌డీకి కలిపి ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందజేస్తారు. ఈక్రమంలో జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు రూ. 16 వేలు, ఎస్‌ఆర్‌ఎఫ్ అభ్యర్థులకు రూ. 18 వేలు చెల్లిస్తారు. సబ్జెక్ట్‌ననుసరించి రూ. 10 వేల నుంచి రూ. 25 వేలకు కంటింజెన్సీ ఫండ్, రీడర్ అసిస్టెన్స్, డిపార్ట్‌మెంట్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా మంజూరు చేస్తారు.
అర్హత: 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. కేవలం ఫెలోషిప్ కోసం నెట్/స్లెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్‌నకు మాత్రం యూజీసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దేశ వ్యాప్తంగా 756 ఫెలోషిప్‌లు అందజేస్తారు. వీటిని రాష్ట్రాల వారీగా కేటాయిస్తారు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి.
ఇందులో 30 శాతం ఫెలోషిప్‌లను మహిళలకు కేటాయించారు.
వివరాలకు: www.ugc.ac.in
నయా సవేరా ఉచిత కోచింగ్ అనుబంధ పథకం
ఈ పథకం కింద వివిధ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు చేయూతను అందజేస్తారు. వివరాలు..
ఉపాధి దిశగా నాలెడ్జ్ నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో గ్రూప్-ఎ, బి, సి ఉద్యోగ నియామక పరీక్షల కోచింగ్ ఫీజు, స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ క్రమంలో గ్రూప్-ఎ, బి సర్వీస్ పరీక్షలు, వివిధ టెక్నికల్/ ప్రొఫెషనల్ ప్రవేశ పరీక్షలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం శిక్షణ/ కోచింగ్ ఫీజు కింద రూ. 20 వేలు, నెలకు రూ. 3 వేలు (స్థానిక అభ్యర్థులకు రూ. 1500) స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రూప్-సి సర్వీస్‌కు కోచింగ్ ఫీజు కింద రూ. 15 వేలు, రూ. 3 వేల స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 11,12 తరగతుల్లో సైన్స్‌స్ట్రీమ్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలను అందజేస్తారు.
మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అర్హత పరీక్షలో 76 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.3 లక్షల వరకు ఉండాలి. ఎంపిక చేసిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల సమాచారాన్ని వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు.
వివరాలకు: www.minorityaffairs.gov.in
నయీ ఉడాన్
ఈ పథకం కింద యూపీఎస్సీ/ఎస్‌ఎస్‌సీ/రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర సంస్థలు పూర్తి చేసిన పరీక్షల్లో ప్రిలిమ్స్ దశను దాటిన అభ్యర్థులకు 100 శాతం ఆర్థిక సహాయం అందిస్తారు.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల వార్షికాదాయం రూ. 4.50 లక్షలకు మించరాదు.
ఎంపిక చేసుకున్న సర్వీస్‌ను బట్టి ఆర్థిక సహాయం అందజేస్తారు. గెజిటెడ్ హోదా ఉన్న పోస్టులకు రూ. 50 వేలు, నాన్ గెజిటెడ్ పోస్టులకు రూ. 25 వేలు అందజేస్తారు.
మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్
ఎవరికి: అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం దేశ వ్యాప్తంగా 20 వేల స్కాలర్‌షిప్‌లను అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్ర జనాభాను ఆధారంగా తీసుకుంటారు.
అర్హత: విద్యార్థులు సెకండరీ/గ్రాడ్యుయేషన్ స్థాయిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.స్కాలర్‌షిప్ కింద ఆర్థిక సహాయం, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.మెయింటెనెన్స్ కింద హాస్టలర్స్‌కు నెలకు రూ. 1,000 (10 నెలలపాటు), డే స్కాలర్స్‌కు రూ. 500 (10 నెలలపాటు) అందజేస్తారు. కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ. 20 వేలు మంజూరు చేస్తారు. జాబితాలోని 85 విద్యాసంస్థల్లో కోర్సు ఫీజును పూర్తిగా రీయింబర్స్‌మెంట్ చేస్తారు. వివరాలకు: www.minorityaffairs.gov.in