
విజ్ఞాన ఖని.. భాగ్యనగరం
ఇప్పటికే అనేక రంగాల్లో తనదైన గుర్తింపును తెచ్చుకున్న భాగ్యనగరం నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలున్న యువతకు సాదర స్వాగతం పలుకుతోంది.
ఇప్పటికే అనేక రంగాల్లో తనదైన గుర్తింపును తెచ్చుకున్న భాగ్యనగరం నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలున్న యువతకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రపంచస్థాయి పరిశోధనలకు కేంద్రంగా ఎదుగుతోంది. నాలెడ్జ్ హబ్ దిశగా ప్రస్థానం కొనసాగిస్తున్న హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పరిశోధనలు, ఇంటర్న్‌షిప్-ఫెలోషిప్ అవకాశాలపై ఫోకస్...
పరిశోధన ల్లో మేటి.. సిటీ..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ).. బెంగళూరు, ముంబై నగరాల తర్వాత అత్యధికంగా నిధులు అందజేసేది హైదరాబాద్ నగరానికే. ఇక్కడ దాదాపు 100 ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ), సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏనిమల్ బయోటెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ వంటి సంస్థల్లో నిత్యం వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తుంటారు. వీటిల్లో మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నారు. వీటితోపాటు ట్రిపుల్ ఐటీ, ఐఐటీలలో అకడమిక్స్‌తోపాటు పరిశోధనల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్(ఐ.ఎల్.ఎస్) ఉంది. ఇక్కడ క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, మెటబాలిక్ డిజార్డర్స్ తదితర వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. సిటీ అమ్ములపొదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఘన చరిత్ర ఉంది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బోటనీ తదితర అంశాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీతో పోటీపడేందుకు ధీటుగా యువతలో పరిశోధనలపట్ల ఆసక్తి పెంచేందుకు ‘నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (ఎన్‌కేఎన్)’ తోడ్పాటును అందిస్తోంది. సైన్స్, టెక్నాలజీ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ తదితర అంశాల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలకు చేయూతనిస్తుంది. ఎన్‌కేఎన్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలున్నాయి. పరిశోధనలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
సునామీ హెచ్చరికల నుంచి తోకచుక్కల గమనం వరకు..
భౌగోళికంగా హైదరాబాద్‌కు గల ప్రత్యేక స్థానం.. ప్రయోగశాలలు, పరిశోధకులకు అనువుగా ఉంటోంది. ఆ ప్రత్యేకతే.. యువతను సాంకేతిక పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటరమణ. సముద్రతీరం లేకపోయినా సునామీ హెచ్చరికల కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఉండటం భౌగోళికంగా కలిసొచ్చే ప్రాధాన్యత అంటారాయన. వాతావరణాన్ని, సముద్రాలను అధ్యయనం చేసి తుపానులు, సునామీ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి నగరంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కాయిస్) ఏర్పాటైంది.
అదేవిధంగా అంతరిక్షంలో ఆవిష్కృతమవుతున్న వింతలను.. తోకచుక్కల గమనాన్ని కనిపెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా బేగంపేటలో 1908లో నిజాం అబ్జర్వేటరీ ఏర్పాటైంది. విద్యార్థుల్లో పరిశోధనలకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అబ్జర్వేటరీ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఎన్.హసన్ తెలిపారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనలను తెలుసుకోవాలంటే ఇంగ్లిష్ అవసరమనేది హసన్ అభిప్రాయం.
ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు
- ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్‌సీఐ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఏటా 60 మంది విద్యార్థులకు సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రాం (ఎస్.ఆర్.పి)లో శిక్షణ ఇస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధనల పట్ల ఆకర్షితులయ్యేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుందని వివరించారు ఏఆర్‌సీఐ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ జి.పద్మనాభం. వేసవిలో నిర్వహించే ఇంటర్న్‌షిప్‌కు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ విద్యార్థులు అర్హులు. ఇక్కడ సీనియర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
- మరో ప్రముఖ పరిశోధన సంస్థ సీసీఎంబీ ప్రతిఏటా వేసవిలో దేశంలోని పరిశోధన, విద్యాసంస్థల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. ఎమ్మెస్సీ, బీటెక్ విద్యార్ధులకు 60 రోజుల శిక్షణలో సైంటిఫిక్, క్లాసురూం పాఠ్యాంశాలుంటాయి. తర్వాత విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశంపై ప్రాజెక్టు రిపోర్టు అందజేయాల్సి ఉంటుంది.
- ఇవేకాకుండా దాదాపు అన్ని పరిశోధన సంస్థలు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు అందిస్తూ పరిశోధకుల మెప్పు పొందుతున్నాయి. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతున్నాయి.
టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటే ఉన్నతమైన కెరీర్
‘‘గతంతో పోల్చితే మేధోవలసలు తగ్గుతున్నాయి. దేశంలోనే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనలకు భారీస్థాయిలో నిధులు కేటాయిస్తోంది. దీంతో పరిశోధన రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్ చేసుకోవడం ద్వారానే కెరీర్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు’’
- డాక్టర్ కళాచంద్‌సేన్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌జీఆర్‌ఐ
సీ++ నుంచి ఆకాశ్ వరకు..
జావా.. సీ, సీ++, లైనక్స్, ఎస్‌క్యూఎల్ సర్వర్,
యానిమేషన్, మల్టీమీడియా వంటి కోర్సుల శిక్షణ నుంచి చంద్రయాన్-1కు అవసరమైన మేధో పరిజ్ఞానం అందించేంత అవకాశాలు హైదరాబాద్ సొంతం. కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా.. సోషల్‌సెన్సైస్, లా, హ్యుమానిటీస్, ఫారెన్ లాంగ్వేజెస్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ, సెన్సైస్.. ఇలా అన్ని విభాగాల్లో నగరం దేశంలోనే తనదైన ముద్ర వేసుకుంది. సృజనాత్మకత, నూతన ఆలోచనలతో వచ్చే యువతకు సిటీలో అనేక అవకాశాలున్నాయి. కొన్నేళ్లుగా నగరంలో పెరుగుతున్న స్టార్ట్‌అప్‌లే ఇందుకు నిదర్శనం. కొత్త కంపెనీని ఏర్పాటు చేసి.. పదిమందికి ఉపాధి కల్పించాలనుకునేవారికి సిటీలో అనేక సంస్థలు అవసరమైన గెడైన్స్, సీడ్ ఫండింగ్ అందిస్తున్నాయి. వాటిలో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) వంటివి ముఖ్యమైనవి.
ముఖ్యమైన వెబ్‌సైట్స్:
www.acsir.res.in, www.ngri.org.in, www.drdo.gov.in, www.ccmb.res.in, dbtindia.nic.in, dst.gov.in, ninindia.org