నేటి నుంచి ఐసెట్ వెబ్‌ఆప్షన్లు
Published Sun, Sep 15 2013 1:39 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
సాక్షి, హైదరాబాద్: ఐసెట్ వెబ్ ఆప్షన్లకు ఈ నెల 15 నుంచి అవకాశం కల్పించినట్లు అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. 15, 16 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 60 వేల ర్యాంకు వరకు... 17, 18 తేదీల్లో 60,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇక 19న ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు అప్షన్లను మార్చుకోవచ్చని వివరించారు. వీరికి 21న సాయంత్రం 6 గంటల తరువాత సీట్లను కేటాయిస్తామన్నారు. ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో https:// apicet.nic.in అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
రేపటి నుంచి ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్..
బయో టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ (బైపీసీ స్ట్రీమ్) అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 16 నుంచి 21 వరకు హెల్ప్‌లైన్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు రఘునాథ్ తెలిపారు. వారికి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 17 నుంచి 22 వరకు నిర్వహిస్తామని, 24న సీట్లను కేటాయిస్తామన్నారు. ఇక స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు 16, 17 తేదీల్లో సాంకేతిక విద్యా భనవ్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను https://apeamcetb.nic.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు.
ఇంజనీరింగ్‌లో ఆప్షన్లు మార్చుకున్న వారు 47 వేల మంది...
ఇంజినీరింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకున్న వారిలో శనివారం సాయంత్రం వరకు 47 వేల మంది తమ ఆప్షన్లను మార్పు చేసుకున్నట్లు రఘునాథ్ పేర్కొన్నారు. శుక్రవారం 26 వేల మంది, శనివారం 17 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు కూడా ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. వీరికి 17న సీట్లను కేటాయిస్తామని వివరించారు.
Advertisement
Advertisement