పాక్‌కు భంగపాటు
అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో విచారణ సాగుతున్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మన దేశానికి నైతిక విజయం లభించింది. ఆ కేసులో తుది తీర్పు వెలువరించేంత వరకూ తదుపరి చర్యలేమీ తీసుకోవద్దని ఐసీజే పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. ఆయనపై గూఢచారిగా అభివర్ణించి, ఉగ్రవాద ఘటనలతో సంబంధము న్నదని అభియోగాలు మోపి హడావుడిగా మరణశిక్ష విధించిన పాకిస్తాన్‌కు న్యాయ స్థానంలో చుక్కెదురు కావడం మన విదేశాంగ శాఖ సమర్ధతకూ, ప్రత్యేకించి సీని యర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనా పటిమకూ లభించిన విజయం. భారత్– పాకిస్తాన్‌లు క్రీడల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడినప్పుడల్లా రెండు దేశాల్లోనూ ఉత్కంఠ, ఉద్రేకాలు పెరుగుతాయి.
ఈసారి ఆ పోటీ మైదానాల్లోకాక న్యాయ స్థానంలో జరగడం... ఆ కేసు మన పౌరుడి ప్రాణాలకు సంబంధించింది కావడం కలవరపాటును కూడా కలిగించింది. రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య సమస్య లుండటం వింతేమీ కాదు. కానీ ఆ సమస్యల పర్యవసానంగా వైషమ్యాలు ఏర్ప డటం, అవి అంతకంతకూ జటిలమవుతూ పోవడం భారత్–పాక్‌ల విష యంలోనే కనిపిస్తుంది. రెండు దేశాల్లోని ప్రభుత్వాలూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తే చాలు...సరిహద్దుల్లో కాల్పుల మోతలు మొదలవుతాయి. పాక్‌లోని పౌర ప్రభు త్వం తీసుకునే చొరవను అక్కడి సైన్యం వమ్ము చేస్తుంది. ఈసారి దాని ఎత్తు గడలకు ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కుల్‌భూషణ్ జాదవ్ బలి పశు వయ్యాడు. ఆయనను పాక్ ఏజెంట్లు అపహరించి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి తీవ్రమైన అభియోగాలు మోపారు. పాక్‌లోని బలూచిస్తాన్‌లో ఆయన ఉగ్ర వాద కార్యకలాపాలు నడిపాడని, పలువురి మృతికి కారకుడయ్యాడని ఆ అభియో గాల సారాంశం.
ఈ కేసు విషయంలో పాకిస్తాన్ చర్యలు ఆది నుంచీ నిగూఢంగానే ఉన్నాయి. కుల్‌భూషణ్‌పై మోపిన అభియోగాలను ఒక ప్రకటన ద్వారా వెల్లడించడమే తప్ప అందుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీని బయటపెట్టలేదు. ఆయనకు వ్యతి రేకంగా తమ దగ్గరున్న సాక్ష్యాలేమిటో చెప్పలేదు. మన దేశం కోరినా ఇవ్వలేదు. ఆయన ఒకప్పుడు భారత నావికా దళంలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాడని, సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడని మన దేశం అంటుంటే ఆయన ఇప్పటికీ నావికాదళ అధికారేనని అది వాదిస్తోంది. ఆయనను కలిసేందుకు మన దౌత్యా ధికారులకు అవకాశం ఇవ్వాలని డజనుసార్లు మన దేశం అర్ధించింది. కానీ పాక్ వినలేదు. విచారణ ప్రక్రియ సైతం అనుమానాలు రేకెత్తించేలా సాగింది. విచారణ జరగడం నిజమో కాదో కూడా తెలియదు.
ఇలాంటి గోప్యత ఏ విలువలకూ, ప్రమాణాలకూ అనుగుణమైనదో పాకిస్తాన్‌కే తెలియాలి. కనీసం న్యాయంగా వ్యవహరిస్తున్నట్టు కనబడినా ఇవాళ ఐసీజే ముందు దానికి తలవంపులు తప్పేవి. పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు 1963 నాటి వియన్నా ఒడంబడికకు విరుద్ధమని మన దేశం చేసిన వాదనతో ఐసీజే ఏకీభవించింది. కుల్‌భూషణ్ ఉరి తేదీని ప్రకటించలేదు గనుక ఈ దశలో తాత్కాలిక ఆదేశాలు ఇవ్వనవసరం లేదన్న పాక్ వాదన వీగిపోయింది. నిజానికి ఐసీజే తుది తీర్పు వెలువరించే వరకూ మరణశిక్ష అమలు ఉండదని పాకిస్తాన్ హామీ ఇచ్చి ఉంటే ప్రస్తుత ఆదేశాలు అవసరమయ్యేవి కాదు.
ఈ కేసులో పాకిస్తాన్ మరో రకమైన వాదన కూడా చేసింది. 2008లో ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం దేశ భద్రతతో ముడిపడి ఉన్న కేసుల్లోని నిందితులకు దౌత్య అధికారులు కలిసే అవకాశం ఉండదని ఐసీజేకు తెలిపింది. గతంలో తమ దేశ పౌరులు పట్టుబడినప్పుడు భారత్ కూడా ఇలాగే చేసిందని వాదించింది. కానీ మన దేశంలో అలాంటివారిపై వచ్చిన అభియోగా లను పౌర న్యాయస్థానాలు బహిరంగంగా విచారించాయి. పాక్ తీరు ఇందుకు భిన్నం. కుల్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకే రెండు వారాల వ్యవధి తీసుకుంది. దానికి ముందు ఆయనతో ‘ఒప్పుకోలు ప్రకటన’ చేయించింది. న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం నమోదులోనూ ఎడతెగని జాప్యం చేసింది. ఇదంతా భారత్‌ను కవ్వించడమే. ఈ విషయంలోమన స్పందనేమిటో చూడాలని పాక్ సైన్యం తహతహలాడినట్టుంది.
అయితే ఐసీజే ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలు మన దేశానికి నైతిక విజయం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. తమ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాల్లో ఐసీజే జోక్యాన్ని అంగీకరించబోమని పాకిస్తాన్ ఇప్పుడు అంటోంది. తనకు వ్యతిరేకమైన తీర్పు వచ్చినాక చేస్తున్న ఈ వాదన వల్ల దెబ్బతినేది ఆ దేశ పరువే. ఆ అభిప్రాయమేదో ముందే చెప్పి ఐసీజే విచారణను బహిష్కరించి ఉంటే వేరుగా ఉండేది. నిజానికి నిరుడు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించినప్పుడు కుల్‌భూషణ్ ప్రస్తావన తీసుకురానందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి సైనిక అధికారులు విరుచుకుపడ్డారు.
తీరా ఐసీజే ముందుకు ఈ కేసు వచ్చినప్పుడు సమర్ధవంతమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యారు. ఇంతకూ ఐసీజే తీర్పు ఇవ్వగలదు తప్ప దాన్ని అమలు చేయించలేదు. అలా అమలు చేయించే అధికారం భద్రతామండలికి ఉన్నా అది అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్లే సందర్భాల్లో మాత్రమే. ఈ కేసు ఆ పరిధిలోనికి రాదని చెప్పి అది తప్పించుకోవచ్చు. అసలు పాకిస్తానే కేసు విచారణను బేఖాతరు చేయొచ్చు. అమెరికా, చైనాలు అలా చేసిన సందర్భాలున్నాయి. అవి పెద్ద దేశాలు గనుక చెల్లు బాటు అయిందిగానీ పాక్ అలా సాహసించబోదన్న వాదనలున్నాయి. ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో భారత్ తీసుకునే చర్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తి న్యాయం కావాలని కోరే నైతిక హక్కు అది కోల్పోతుంది. ఇప్పుడు కుల్‌భూషణ్ సురక్షితంగా వెనక్కి రావడంతోపాటు ఉగ్రవాదం విషయంలో మనపై పాక్ చేస్తున్న వాదనల్లోని డొల్లతనం బయటపడటం కూడా ఎంతో అవసరం. ఈ కేసులో మరింత జాగ్రత్తగా అడుగులేసి విజయం సాధించేందుకు మన న్యాయవాదులు కృషి చేయవలసి ఉంటుంది.