ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
క్రీడలు
ప్రపంచ సీనియర్ రెజ్లింగ్‌లో అమిత్‌కు రజతం
హంగేరిలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమిత్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కిలోల విభాగం ఫైనల్లో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు.
తమిళనాడుకు మెయినుద్దౌలా కప్
మెయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టైటిల్‌ను తమిళనాడు గెలుచుకుంది. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ జట్టును తమిళనాడు ఓడించింది.
అఫ్ఘానిస్థాన్‌కు శాఫ్ ఫుట్‌బాల్ కప్
దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)ను తొలిసారిగా అఫ్ఘానిస్థాన్ గెలుచుకుంది. ఖాట్మండులో సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించింది. దీంతో భారత్ హ్యాట్రిక్ సాధించే అవకాశ ం కోల్పోయింది.
శ్రీశాంత్, చవాన్‌లపై జీవిత కాల నిషేధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెప్టెంబర్13న జీవితకాలం నిషేధం విధించింది. గతేడాది జరిగిన ఐపీఎల్ ఆరో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వీరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి జట్టుకు అధిక పరుగులిచ్చారు. బుకీగా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు అమిత్‌సింగ్‌పై ఐదేళ్ల నిషేధం విధించారు. స్పాట్ ఫిక్సింగ్ గురించి తెలిసినా బీసీసీఐకి సమాచారం ఇవ్వని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ త్రివేదిపై ఒక ఏడాదిపాటు బీసీసీఐ నిషేధం విధించింది.
ఐఓసీ కొత్త అధ్యక్షుడిగా బాచ్
జాక్వస్ రోగే స్థానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన 59 ఏళ్ల థామస్ బాచ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో కనీసం ఎనిమిదేళ్లు కొనసాగే అవకాశముంది.
జాతీయం
లైబీరియా అధ్యక్షురాలు సర్లీఫ్ భారత్ పర్యటన
లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ భారత్ పర్యటనలో సెప్టెంబర్ 11న నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ కోసం లైబీరియాకు భారత్ 144 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తుంది. రుణం, ఇంధన ఒప్పందాలతోపాటు ఉమ్మడి కమిషన్ ఏర్పాటు, విదేశీ సేవల సంస్థల మధ్య అవగాహన ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ శాంతి సుస్థిరతలను.. ప్రత్యేకంగా ఆఫ్రికా ఖండంలో మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. షర్లీఫ్ తన పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీలతో సమావేశమై చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు లైబీరియా మద్దతు ఇవ్వడాన్ని ప్రధాని మన్మోహన్ కొనియాడారు.
సర్లీఫ్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి
2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి (2011) గ్రహీతైన సర్లీఫ్ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి ప్రజాయుతంగా ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు కావడం విశేషం.
ఈ అవార్డును భారత ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి, అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తోంది. ఈ అవార్డు కింద * 25 లక్షలు బహూకరిస్తారు. ఈ అవార్డు 2011లో ఇలాభట్‌కు లభించింది. ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సేవా) అనే సంస్థను నిర్వహిస్తున్నారు.
అమితాబ్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 2013 గ్లోబల్ డైవర్సిటీ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 12న లండన్‌లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అమితాబ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. తన నాలుగు దశాబ్దాల నట జీవితంలో 180కు పైగా భారతీయ చిత్రాల్లో నటించిన అమితాబ్ భారతీయ చలనచిత్ర రంగాన్ని అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి అని ప్రశంసపత్రంలో పేర్కొన్నారు.
కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది.
నీనా దావులూరికి మిస్ అమెరికా కిరీటం
తెలుగు అమ్మాయి నీనా దావులూరి (24) మిస్ అమెరికాగా ఎంపికైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సెప్టెంబర్ 16న ముగిసిన పోటీలో నీనా విజేతగా నిలిచింది. 53 రాష్ట్రాల నుంచి 53 మంది పాల్గొన్న ఈ పోటీల్లో నీనా మిస్ న్యూయార్క్‌గా పోటీ పడింది. ఈ కిరీటం గెలిచిన తొలి భారతీయ సంతతి యువతి నీనా. ఆమె కుటుంబం కృష్ణా జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఈ గెలుపుతో నీనాకు 50,000 డాలర్లు (భారత కరెన్సీలో 35 లక్షల రూపాయలు) స్కాలర్‌షిప్ రూపంలో అందనున్నాయి.
డబ్ల్యుహెచ్‌ఓ ఎస్‌ఈఏఆర్‌ఓ రీజినల్ డెరైక్టర్‌గా పూనమ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంస్థ (ఎస్‌ఈఏఆర్‌ఓ) రీజినల్ డెరైక్టర్‌గా భారత ప్రతినిథి, మాజీ ఐఏఎస్ అధికారి డా.పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సెప్టెంబర్ 12న ఎన్నికయ్యారు. ఆమె ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ పదవి దక్కింది.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ (63)ని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రకటించింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తారు.
2013-14లో వృద్ధి 5.3 శాతంగా పీఎంఏసీ అంచనా
2013-14 ఆర్థిక అంచనాల నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఏసీ) సెప్టెంబర్ 13న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.3 శాతంగా పేర్కొంది. దీన్ని ఏప్రిల్‌లో 6.4 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగం 4.8 శాతం, పారిశ్రామిక రంగం 2.7 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది.
సేవల రంగంలో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇది 2012-13లో 7 శాతం. మార్చి చివరి నాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంటుందని వివరించింది. వాణిజ్య లోటు 185 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఆందోళన కలిగిస్తున్న కరెంట్ అకౌంట్ లోటు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని పేర్కొంది. ఇది జీడీపీలో 3.8 శాతం. విత్తలోటును జీడీపీలో 4.8 శాతంగా ఉంచడం ఒక సవాలుగా పీఎంఏసీ పేర్కొంది.
అగ్ని-5 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఖండాంతర క్షిపణి అగ్ని-5 పరీక్ష విజయవంతమైంది. 5000 కి.మీ దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి పరీక్షను ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి సెప్టెంబర్ 15న పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని పరీక్షించడం ఇది రెండోసారి. తొలిసారి ఏప్రిల్ 19, 2012న విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి 1000 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. దీని బరువు 50 టన్నులు. పొడవు 17.5 మీటర్లు. వెడల్పు 2 మీటర్లు. ఈ క్షిపణిని 2015 నాటికి సైన్యంలో చేర్చే ముందు మరో మూడు, నాలుగు పరీక్షలు నిర్వహిస్తారు. చైనా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని చాలా భూ భాగం అగ్ని-5 పరిధిలోకి వస్తాయి.
తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత
కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (94) హైదరాబాద్‌లో సెప్టెంబర్ 16న మరణించారు. వామపక్ష ఉద్యమంలో, ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో 13 చిత్రాలు నిర్మించారు. కృష్ణమూర్తికి 2007లో రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
విద్యావేత్త వినోద్ రైనా మృతి
ప్రముఖ విద్యావేత్త వినోద్ రైనా సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో మరణించారు. ‘ఉచిత, నిర్భంధ విద్యాహక్కు చట్టం-2009’ రూపకల్పనలో ఆయన ప్రధానపాత్ర పోషించారు. పిల్లల హక్కుల పరిరక్షణ నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసిన ‘పిల్లల విద్యాహక్కు పర్యవేక్షణ’ నిపుణుల బృందంలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ)లో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ‘భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సహ స్థాపకుల్లో రైనా ఒకరు.
అంతర్జాతీయం
ప్రపంచ ఆహారంలో మూడో వంతు వృథా
ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మూడో వంతు (1/3) వృథా అవుతున్నా యని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) సెప్టెంబర్ 11న తన నివేదికలో తెలిపింది. ‘ఆహార ధాన్యాల వృథా - సహజ వనరులపై ప్రభావం’ పేరుతో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తొలిసారిగా వెలువరించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయంగా తిండిని వృథా చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పర్యావరణ కోణంలో వివరించారు.
ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం, మనిషి నిర్లక్ష్యం కారణంగా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మూడో వంతు వృథాగా మారుతున్నాయని తెలిపింది. ప్రతిరోజూ 820 మిలియన్ల మంది ఆకలితో ఉంటున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వృథాగా పోతున్న ఆహారం విలువ 750 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో చేపలు, సముద్ర సంబంధిత ఆహారాన్ని చేర్చలేదు. వృథా అవుతున్న ఆహారాన్ని 1.3 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఉత్పత్తి చేసిన ఆహారంలో తినకుండాపోతున్న దానివల్ల ప్రతి ఏటా వాతావరణంలోకి 3.3 బిలియన్ టన్నుల గ్రీన్‌హౌస్ వాయువులు చేరుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆహార వృథాలో 54 శాతం ఉత్పత్తి, నూర్పిడి తర్వాత నిర్వహణ, నిల్వ స్థాయిల్లో వృథా అవుతోంది. మిగిలిన 46 శాతం ప్రాసెసింగ్, పంపిణీ, వినియోగ స్థాయిలో వృథాగా పోతోంది.
సౌర కుటుంబం ఆవలికి వెళ్లిన వాయేజర్ - 1
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వ్యోమ నౌక వాయేజర్-1 సౌర కుటుంబం దాటి నక్షత్రాంతర రోదసీ (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లో ప్రవేశించింది. సౌర కుటుంబం దాటి అవతలికి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వస్తువు వాయేజర్-1. సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసీని అధ్యయనం చేసేందుకు 1977లో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. 36 ఏళ్లుగా సాగుతున్న యాత్రలో వాయేజర్-1.. 1900 కోట్ల కి.మీ ప్రయాణించింది. ఈ యాత్రకు సంబంధించిన సమాచారాన్ని సెప్టెంబర్ 12 సంచికలో ‘సైన్స్’ పత్రిక ప్రచురించింది.
రే డాల్బీ కన్నుమూత
అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, డాల్బీ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు రే డాల్బీ (80) శాన్‌ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 12న మరణించారు. ఆయన డాల్బీ వాయిస్ రిడక్షన్ విధానాన్ని రూపొందించి రికార్డింగ్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చారు. డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్‌ను అభివృద్ధి చేసి సినిమా, హోం ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త ఆవిష్కరణలకు కారణమయ్యారు.
చవకైన రాకెట్‌ను ప్రయోగించిన జపాన్
జపాన్ చవకైన రాకెట్ ‘ఎప్సిలోన్’నూ కైసూ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 14న ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ‘స్ప్రింట్-ఎ’ అనే తొలి స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షానికి పంపింది. గ్రహాల పరిశీలనకు ఈ టెలిస్కోప్ తోడ్పడుతుంది. ‘ఎప్సిలోన్’ రాకెట్‌ను 40 మిలియన్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. ఈ వ్యయం జపాన్ ప్రధాన రాకెట్ ‘హెచ్ 2ఎ’లో మూడో వంతు మాత్రమే. ‘హెచ్ 2ఎ’ రాకెట్‌లో మూడో వంతు సైజులో అంటే 24 మీటర్ల పొడవు గల ‘ఎప్సిలోన్’ను ఒక వారంలో ప్రయాణానికి సిద్ధం చేయొచ్చు. ఇది ‘హెచ్ 2ఎ’ తీసుకునే సమయంలో ఆరో వంతు మాత్రమే.
యూరోపియన్ పార్లమెంట్ ప్రైజ్‌కు స్నోడెన్ ఎంపిక
అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 సంవత్సరానికి యూరోపియన్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు ‘సఖరోవ్ మానవ హక్కుల బహుమతి’కి ఎంపికయ్యాడు. ఆయన అమెరికా ప్రభుత్వ గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. స్నోడెన్ అమెరికా విడిచి రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.
అగ్ని-5 పరీక్ష విజయవంతం
Published Thu, Sep 19 2013 2:19 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement