పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు? | Industrial Development, Regulatory Law Goals? | Sakshi
Sakshi News home page

పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు?

Published Wed, Aug 2 2017 3:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:03 PM

పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు?

పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు?

ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర; దేశీయ, విదేశీ పెట్టుబడులు; సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటి విషయంలో ప్రభుత్వ వైఖరిని సంబంధిత దేశ పారిశ్రామిక విధానంలో వివరిస్తారు.

ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలి. నిర్దేశిత లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్రను పారిశ్రామిక విధానం వివరిస్తుంది.

స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశానికి సరైన, కచ్చితమైన పారిశ్రామిక విధానం లేదు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఆవశ్యకతను గుర్తించి 1948, ఏప్రిల్‌ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది.

మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం
ఈ తీర్మానంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ తీర్మానంతో మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది.

మొదటి వర్గం (ప్రభుత్వ ఏకస్వామ్యం): ఈ వర్గంలోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మూడు రకాల కార్యకలాపాలను నిర్వహించే పరిశ్రమలను ఈ వర్గంలో చేర్చారు. అవి..

1.దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి, నియంత్రణ.
2.అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ.
3.రైల్వేలు వాటి నిర్వహణ, యాజమాన్యం
రెండో వర్గం (మిశ్రమ రంగం): ఇందులో ఆరు కీలక, మౌలిక పరిశ్రమలను చేర్చారు. అవి.. 1. బొగ్గు, 2. ఇనుము, ఉక్కు, 3. విమానాల ఉత్పత్తి, 4. నౌకా నిర్మాణం,

5.టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్‌లెస్‌ పరికరాల ఉత్పత్తి, 6. ఖనిజ నూనెలు.
ఈ తీర్మానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వర్గంలోని పరిశ్రమల్లో కొత్త వాటిని ప్రైవేటు రంగంలో స్థాపించడానికి వీల్లేదు. ఇకపై వీటిని ప్రభుత్వ రంగంలోనే స్థాపిస్తారు. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వాటిని కొనసాగించవచ్చు. అవసరమనుకుంటే పదేళ్ల తర్వాత నష్టపరిహారం చెల్లించి వాటిలో దేన్నయినా ప్రభుత్వం జాతీయం చేయొచ్చు.

డో వర్గం (ప్రభుత్వ నియంత్రణ): ఈ వర్గంలో జాతీయ ప్రాముఖ్యం ఉన్న 18 పరిశ్రమలను చేర్చారు. వీటిని ప్రభుత్వం నిర్వహించనప్పటికీ వీటి నియంత్రణ, అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి వీటి ఉత్పత్తులు కొనసాగాలి. ఇందులో ఆటోమొబైల్స్, భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, పంచదార, కాగితం, సిమెంట్, వస్త్ర, ఊలు మొదలైన పరిశ్రమలను చేర్చారు.

నాలుగో వర్గం (ప్రైవేటు రంగం): పై మూడు వర్గాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. వీటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే వీటిపై ప్రభుత్వం సాధారణ అజమాయిషీ కలిగి ఉంటుంది.

1951–పారిశ్రామికలైసెన్సింగ్‌ విధానం
(పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం)
మన దేశంలో ప్రైవేటు రంగ పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడం, వాటిని నియంత్రించడం అనే రెండు ప్రధాన ఉద్దేశాలతో 1951, అక్టోబర్‌లో పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానాన్ని (పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం) పార్లమెంటు చట్టం ద్వారా రూపొందించారు. ఈ చట్టం 1952, మే 8 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టం లక్ష్యాలు
1.ప్రణాళికా లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తులు ఉండేలా చూడటం.
2.పెద్ద పరిశ్రమల పోటీ నుంచి చిన్న పరిశ్రమలను రక్షించడం.
3.ఏకస్వామ్యాలను నిరోధించడం.
4.సంతులిత ప్రాంతీయాభివృద్ధి.
5.వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం.
6.దేశీయ మార్కెట్లో సప్లై, డిమాండ్‌ల మధ్య సహ సంబంధాన్ని తీసుకురావడం.
7.సామాజిక మూలధనాన్ని అభిలషణీయంగా ఉపయోగించుకోవడం.

ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమలు ప్రారంభంలో 37 ఉండగా, తర్వాత కాలంలో 70కి పెంచారు. ఇందులోని పరిశ్రమలు రిజిస్టర్‌ చేసుకొని లైసెన్స్‌ పొందాలి.

1953లో రూ.1 లక్ష కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన పరిశ్రమలను దీని పరిధిలోకి తెచ్చారు. అయితే లైసెన్సింగ్‌ అ«థారిటీపై పరిపాలన పరమైన భారం, ఒత్తిడి మూలంగా 1956లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించారు.

1956లో విద్యుత్‌ను ఉపయోగించి, 50 మంది శ్రామికులతో ఉత్పత్తిని చేపట్టే పరిశ్రమలు (లేదా) విద్యుత్‌ను వాడకుండా 100 మంది శ్రామికులతో ఉత్పత్తిని నిర్వహించే పరిశ్రమలను ఈ చట్టం పరిధిలోకి చేర్చారు.

ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల పెట్టుబడి పరిమితిని 1960లో రూ.10 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 1963లో రూ.25 లక్షలకు పెంచారు. 1970లో రూ. కోటికి పెంచారు. 1978లో రూ.3 కోట్లకు పెంచారు. ఆ తర్వాత పెట్టుబడి పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు.

1988–89లో ప్రభుత్వం లైసెన్సింగ్‌ విధానంలో విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రూ.15 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల్లో రూ.50 కోట్లకు పైబడిన పెట్టుబడి గల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్‌ పొందాల్సి ఉంటుంది. లిబరలైజేషన్‌ పాలసీ (సరళీకృత విధానం)లో భాగంగా లైసెన్స్‌ల రద్దు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది.

రెండో పారిశ్రామిక విధాన తీర్మానం–1956
1956, ఏప్రిల్‌ 30న భారత ప్రభుత్వం రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1956 నాటికి మన దేశంలో అనేక రాజకీయ, ఆర్థిక మార్పులు సంభవించాయి.

1956 నాటికి మొదటి పంచవర్ష ప్రణాళికను పూర్తి చేసుకోవడం, రెండో ప్రణాళికలో భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమ సమాజ స్థాపనను లక్ష్యంగా నిర్ణయించుకోవడం మొదలైనవి 1956 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకటనకు కారణమయ్యాయి.

మూడు జాబితాలు:
1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎ, బి, సి అనే మూడు జాబితాలుగా వర్గీకరించారు.

జాబితా–ఎ: ఇందులో 17 పరిశ్రమలను చేర్చారు. దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు దీనిలో ఉన్నాయి. వీటిలో ఆయుధాలు, అణుశక్తి, విమాన రవాణా, రైల్వే రవాణా పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మిగతా 13 పరిశ్రమలను ఈ తీర్మానం తర్వాత నుంచి ప్రభుత్వమే స్థాపిస్తుంది. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్నవి కొనసాగవచ్చు. అవసరమైతే వీటిని ప్రైవేటు రంగంలో కూడా నెలకొల్పే అవకాశం కల్పించారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను జాతీయం చేసే ప్రతిపాదన లేదు.

జాబితా–బి: అన్ని రకాల ఖనిజాలు, లోహాలు, యంత్ర పనిముట్లు, మిశ్రమ లోహాలు, ఎరువులు, రబ్బరు, బొగ్గు తదితర 12 పరిశ్రమలను ఇందులో చేర్చారు. ప్రభుత్వం నూతన సంస్థలను స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం కొత్త సంస్థలను స్థాపించడానికి, ఉన్న వాటిని విస్తృతం చేసుకోవడానికి ఏ ఆటంకం ఉండదు.

జాబితా–సి: ఎ, బి జాబితాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. ఈ జాబితాలోని పరిశ్రమల అభివృద్ధి ప్రైవేటు రంగం చొరవపై ఆధారపడి ఉంటుంది. పారిశ్రామికీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ జాబితాలోని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా నియంత్రిస్తుంది.

1970, 1973, 1975ల్లో పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించినా, వాటికి 1956 తీర్మానమే ప్రాతిపదికగా నిలిచింది. ఈ తీర్మానాల్లో మౌలిక మార్పులు లేకుండా కేవలం కుటీర, చిన్నతరహా పరిశ్రమల నిర్వచనాల్లో, లైసెన్సింగ్‌ విధానంలో, విదేశీ మూలధనం విషయంలో స్వల్ప మార్పులు చేశారు.

జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధానం–1977
1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం, తన శైలిలో 1977 డిసెంబర్‌ 23న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. గాంధేయ విధానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు.

చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
నూతన పారిశ్రామిక విధానం–1991

1980 నుంచి మొదలైన సరళీకృత విధానం, నిర్ణయాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు.

పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా 1991, జూలై 24న దీన్ని ప్రకటించారు.

ప్రపంచ మార్కెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేసి, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి దిగుమతులను పెంచి, వేగవంతమైన అభివృద్ధిని సాధించడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం.

సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.

ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో లైసెన్సింగ్‌ విధానంలోని నిబంధనలను గణనీయంగా సడలించారు.
1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యాలు

సాధించిన ఆర్థిక ప్రగతి ఫలాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఉపయోగించడం.
ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగించే అంశాలను సరిచేయడం.
ఉత్పత్తి, ఉద్యోగితల్లో సుస్థిర వృద్ధిని నిలుపుకోవడం.
అంతర్జాతీయంగా ఎదురయ్యే పోటీని తట్టుకోవడం.


అక్కెనపల్లి మీనయ్య
ఎకనామిక్స్‌ (హెచ్‌వోడీ)– రిటైర్డ్‌
నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
నల్లగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement