ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్‌లతో నైపుణ్యాలకు నగిషీలు.. | Internship, apprentice engraving skills | Sakshi
Sakshi News home page

ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్‌లతో నైపుణ్యాలకు నగిషీలు..

Published Wed, May 7 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

Internship, apprentice engraving skills

 కళాశాలల నుంచి బయటకు వస్తున్న
 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 30 శాతం మందిలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవు! - ఉద్యోగ నియామకాలకు సంబంధించి కంపెనీలకు సేవలందించే ఓ ప్రముఖ సంస్థ సర్వేలో తేలిన విషయమిది...
 
 కాసుల వర్షం కురిపిస్తూ, ఆపై సమాజంలో ఉన్నతంగా జీవించేలా చేసే కార్పొరేట్ కొలువుల్ని సొంతం చేసుకోవాలంటే నాలుగు గోడల మధ్య తరగతి గదిలో సంవత్సరాల తరబడి పాఠ్యాంశాలను చదివితే సరిపోదు! మార్కెట్ కోరుకునే ప్రాక్టికల్ నైపుణ్యాలనూ సొంతం చేసుకోవాలి. కాలేజీలో చదువుకున్న అంశాలను, వాస్తవ పరిస్థితుల్లో అన్వయించగల నేర్పును అలవరచుకోవాలి. దీనికోసం ఇంటర్న్‌షిప్, అప్రెంటీస్‌షిప్‌లు వేదికలుగా నిలుస్తున్నాయి. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ.. ఇలా ఏ కోర్సులకు చెందిన వారైనా తమ నైపుణ్యాలకు నగిషీలు చెక్కుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.
 
 ఇంటర్న్‌షిప్:
 ఇంటర్న్‌షిప్ అంటే కళాశాల నుంచి సర్టిఫికెట్‌తో బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొని, అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సంపాదించడం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఉద్యోగాన్ని సొంతం చేసుకునే ఉద్దేశంతో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, జర్నలిజం,అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వంటి కోర్సుల్లో యువత అడుగుపెడుతోంది. వీరు కాలేజీలో పుస్తకాల్లో చదువుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది.
 
 ప్రయోజనాలు:
 ఇప్పటి పోటీ ప్రపంచంలో కేవలం అకడెమిక్ నైపుణ్యాలతో ఉద్యోగాలను కైవసం చేసుకోవడం అసాధ్యం. తరగతి గదిలో చదివిన పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించగల సామర్థ్యం చాలా అవసరం. ఈ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో.. ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ దశలో విద్యార్థి ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్న అంశాలను వివరించగలిగితే ఉద్యోగం సాధించడం ఖాయం. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలేంటన్న దానిపై ముందే అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల కెరీర్‌లో వేగంగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది.


 జాబ్ మార్కెట్‌లో ముందుండేలా చేసే బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం, ఆత్మవిశ్వాసం వంటి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. విద్యార్థి తన కోర్సు, కెరీర్‌కు సంబంధించి వస్తున్న మార్పులపై అవగాహన పెంపొందించేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. తనకు ఏ మేర నైపుణ్యాలు ఉన్నాయి? వాటిని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది.
 
 అవకాశాన్ని చేజిక్కించుకోవడమెలా?
 ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు.. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు చేస్తున్న వారిని ఇంటర్న్‌షిప్ చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు ఆన్ క్యాంపస్ మోడ్ (కళాశాలలను సందర్శించి), ఆఫ్ క్యాంపస్ మోడ్ (వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు) ద్వారా ఇంటర్న్‌షిప్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి.
 
 కంపెనీని సంప్రదించడానికి మార్గాలు:
 విద్యా సంస్థల్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఇచ్చిన లేఖ ద్వారా కంపెనీలో ఉద్యోగ నియామకాలు చేపట్టే విభాగాలను నేరుగా సంప్రదించవచ్చు. ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించే వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్న్ నియామకాలకు సంబంధించి ఈ వెబ్‌సైట్లు విద్యార్థులకు, కంపెనీలకు వారధులుగా నిలుస్తున్నాయి.
 
 నేర్చుకుంటూ సంపాదిస్తూ:
 ఇంటర్న్‌షిప్ సమయంలో కొన్ని సంస్థలు ఎలాంటి విద్యార్థి వేతనం(స్టైఫండ్) చెల్లించవు. కొన్ని మాత్రం రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు స్టైఫండ్ చెల్లిస్తాయి. కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌తోపాటు ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేస్తుంటాయి. మరికొన్ని ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ ఇస్తాయి. దీన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వనరుగా ఉపయోగించుకోవాలి. గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు సైతం ఇంటర్న్‌షిప్ ద్వారా ఎ- గ్రేడ్ ప్రతిభావంతులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
 
 గుర్తుంచుకోండి:
 అవకాశం వచ్చింది కదాని ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లే ముందు కొన్ని విషయాలపై ఆలోచించాలి. మార్కెట్లో కంపెనీకి ఉన్నపేరు, అవి చేపడుతున్న ప్రాజెక్టులు, మౌలిక వసతులు, పని అనుభవం సంపాదించుకునేందుకు అనువైన వాతావరణం తదితర విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్ లక్ష్యాలు పూర్తిస్థాయిలో నెరవేరే అవకాశముందా.. లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. టీమ్ లీడర్/హెచ్‌ఆర్/టాలెంట్ అక్విజిషన్/స్టాఫింగ్ హెడ్ ద్వారా ఇంటర్న్‌షిప్‌నకు సంబంధించిన విధి విధానాలను తెలుసుకోవాలి.
 
 వేసవి అనుకూలం:
 విద్యార్థులు వేసవి సెలవులను ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. కంపెనీలు కూడా వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఇంటర్న్స్ కోసం ప్రకటనలు విడుదల చేస్తుంటాయి. చెన్నైకి చెందిన ‘ట్వంటీ19 డాట్ కామ్ సంస్థ’.. 2013కు సంబంధించి భారత్‌లోని ఇంటర్న్‌షిప్ మార్కెట్‌పై నివేదిక రూపొందించింది. దాదాపు 15 వేల కంపెనీలను సర్వే చేసింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలు.. కంపెనీలు చెల్లిస్తున్న నెలవారీ స్టైఫండ్ రూ.5000 - రూ.15,000
 
 విద్యార్థులకు ఆకర్షణీయమైన ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంలో కొత్త కంపెనీలు ముందు వరుసలో ఉన్నా యి. తక్కువ ఖర్చుతో యువ మేధస్సును ఉపయోగించుకునే లక్ష్యంతో ఈ సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో టాప్ 5 రంగాలను పరిశీలిస్తే...
 1    2
 ఐటీ అండ్ సర్వీసెస్    ఇంటర్నెట్    
 3    4    5
 
 ఎడ్యుకేషన్    మీడియా    ఎన్‌జీవో
   వచ్చే మూడేళ్లలో చాలా కంపెనీలు తమ నియామకాలకు ఇంటర్న్‌షిప్‌ను ముఖ్యమైన మార్గంగా పరిగణించే అవకాశాలున్నాయి.కళాశాలలు కోర్సు కరిక్యులంలో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్న ప్రతి పది కంపెనీల్లో తొమ్మిది స్టైఫండ్‌ను అందిస్తున్నాయి.
 
 అప్రెంటీస్‌షిప్
 ఓ విద్యా సంస్థలో కోర్సు పూర్తిచేసిన తర్వాత పరిశ్రమ లేదా సంస్థలో కొంతకాలం పాటు శిక్షణ పొందడాన్ని అప్రెంటీస్‌షిప్ అంటారు. ఇది అకడెమిక్ నైపుణ్యాలను ప్రొఫెషనల్ నైపుణ్యాలుగా మార్చుకునేందుకు ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేసి, పట్టుదలతో అప్రెంటీస్‌షిప్‌ను పూర్తిచేస్తే తగిన ప్రతిఫలం ఉంటుంది.
 
 1961 అప్రెంటీస్ చట్టం:
 అప్రెంటీస్ ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
 1961లో అప్రెంటీస్ చట్టాన్ని తెచ్చింది. ఇది 1962 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి 1973, 1986లో సవరణలు తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) కోర్సులు చేసిన వారికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తిచేసిన వారికి అప్రెంటీస్ అవకాశాలను పెంపొందించాలి. చట్టంలో గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ స్కీమ్ కింద 126 సబ్జెక్ట్ ఫీల్డ్స్/బ్రాంచ్‌లను చేర్చారు.


 అప్రెంటీస్ చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్(బోట్) వంటి ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయి. బోట్ అనేది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డీ) పరిధిలో స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) తదితర సంస్థలు అవసరాలకు అనుగుణంగా అప్రెంటీస్‌షిప్‌లను ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేటు రంగంలోని పరిశ్రమల యాజమాన్యాలు విద్యార్థులకు అప్రెంటీస్ అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
 
 ఆర్నెల్ల నుంచి మొదలు:
 అప్రెంటీస్ కాలపరిమితి అనేది విద్యార్థి చేసిన కోర్సు, కంపెనీ పనితీరు, అవసరాలనుబట్టి ఉంటుంది. కనిష్టంగా ఆర్నెల్లు ఉంటుంది. నిర్దేశ కాలపరిమితిలో అప్రెంటీస్‌కు ఎంపికైన వారిని ట్రైనీలుగా వ్యవహరిస్తారు. అప్రెంటీస్‌షిప్ సమయంలో అభ్యర్థులకు నిర్దేశ అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ అంశాలేంటనే విషయంలో సంబంధిత ట్రేడ్ కమిటీలు, పరిశ్రమలో ట్రేడ్ నిపుణులు కలిసి నిర్ణయం తీసుకుంటారు. అప్రెంటీస్ చేస్తున్న వారికి ఆయా సంస్థల యాజమాన్యాల నిర్ణయంమేరకు వేతనాలు అందజేస్తారు.
 
 నాన్ టెక్నికల్‌లోనూ:
 అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కేవలం టెక్నికల్ కోర్సులకే పరిమితం కాలేదు. ఫ్యాషన్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్‌మెం ట్, టూరిజం వంటి నాన్ టెక్నికల్ కోర్సుల్లోనూ ట్రైనింగ్ కోర్సులను ప్రభుత్వ పరంగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (ఈఎఉ-ఖీ) నిర్వహిస్తోంది.
 కాలేజీలో వివిధ సంస్థలు నిర్వహించే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ప్రతికూల ఫలితాలు వచ్చిన వారికి అప్రెంటీస్ మంచి మార్గం. దీని ద్వారా నైపుణ్యాలను పెంచుకొని మంచి కెరీర్‌లో స్థిరపడొచ్చు.
 
 శిక్షణ పొందిన చోటే ఉద్యోగం:
 ఏదైనా సంస్థలో అప్రెంటీస్‌షిప్ ట్రైనీలుగా చేరిన అభ్యర్థు లు నిర్దేశ కాలపరిమితిలో మంచి ప్రతిభ కనబరిచి, యాజమాన్యం దృష్టిలోపడితే అదే సంస్థలో శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అవకాశం పొందాలంటే అప్రెంటీస్‌లో చేరిన రోజు నుంచే పనిపట్ల అంకితభావం, స్కిల్స్ పెంచుకునేందుకు ఉత్సాహాన్ని కనబరచాలి.
 
 విద్యార్థి దశలోనే వృత్తిపర అనుభవం
  ఇంజనీరింగ్ థియరీ సబ్జెక్టులను బాగా ఒంటబట్టించుకునేందుకు ప్రాక్టికల్స్ ఉపయోగపడతాయి. వాస్తవ పరిస్థితుల్లో ఇలాంటి ప్రాక్టికల్స్ చేసేందుకు ఇంటర్న్‌షిప్స్ వేదికలుగా నిలుస్తున్నాయి. వీటి ద్వారా ఒకరికి విద్యార్థి దశలోనే విలువైన వృత్తిపర అనుభవం సొంతమవుతుంది. ఆత్మస్థైర్యం ఇనుమడిస్తుంది. ప్రస్తుత పోటీ వాతావరణంలో ఎంఎన్‌సీలలో ఇంటర్న్‌గా అవకాశం చేజిక్కించుకోవడం కష్టమే అయితే నిరుత్సాహపడకుండా చిన్న కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు సంకోచించకూడదు. మీరుంటున్న చుట్టు పక్కల అపారమైన ప్రాక్టికల్ పరిజ్ఞానం అందించే చిన్న యూనిట్లు చాలానే ఉంటాయి. ఉదాహరణకు మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులకు ఉపయోగపడే యూనిట్లు ప్రతి నగరంలోనూ ఆటోనగర్‌లో ఉంటాయి. ఇంటర్న్‌షిప్ అనుభవాన్ని ప్రస్తావించిన రెజ్యూమె బలంగా ఉంటుంది. ఉద్యోగానికి ఎందరు దరఖాస్తు చేసుకున్నా రిక్రూటర్స్‌కు మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.
 - ఇ.శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్,
 కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏఎన్‌యూ.
 
 ఇంటర్న్‌షిప్ పాలిటెక్నిక్‌లో కీలక దశ
  పాలిటెక్నిక్ కోర్సుల్లో మూడో ఏడాది (ఐదు లేదా ఆరో సెమిస్టర్)లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌ను మూల్యాంకనం చేస్తారు. ఇది పాలిటెక్నిక్ విద్యార్థి దశలో కీలకమైన దశ అని చెప్పొచ్చు. కళాశాలలో నేర్చుకున్న పాఠ్యాంశాలను ఇంటర్న్‌షిప్ వర్క్‌లో ప్రాక్టికల్‌గా ఎలా అన్వయించాలో నేర్చుకునేది ఇక్కడే. ఇంటర్న్‌షిప్‌లో కంపెనీ ప్రతినిధులతో కలిసి పనిచేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్, అప్లికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వంటివాటిని అలవరచుకోవచ్చు.
 - కె.రాములు, ప్రిన్సిపాల్,
 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాద్.
 
 అకడెమిక్ రికార్డును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాం. ఏడాదికి దాదాపు 50 మందిని ఇంటర్న్స్‌గా తీసుకుంటున్నాం. ఇంటర్న్స్‌కు నిర్దేశిత ప్రాజెక్టును అప్పగిస్తున్నాం. అందులో వారు చూపిన ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ ఇస్తున్నాం. భవిష్యత్తులో తాము పనిచేయబోయే రంగానికి సంబంధించి ఒక కంపెనీలో ఎలాంటి పని వాతావరణం ఉంటుంది? వృత్తిపర అడ్డంకులను ఎలా అధిగమించాలి? కెరీర్‌లో ఎదగాలంటే ఎలాంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి? తదితర అంశాలను విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకుంటారు. ప్రతి విద్యార్థి తమకు అందుబాటులో ఉన్న సమయంలో కనీసం ఒక ఇంటర్న్‌షిప్ చేస్తే ప్రస్తుత పోటీ వాతావరణంలో ముందు వరుసలో ఉంటారు.
 - బి.అశోక్‌రెడ్డి, ప్రెసిడెంట్,
 గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement