అటవీ కొలువులను అందుకోండి.. | Job Point in Forest Department | Sakshi
Sakshi News home page

అటవీ కొలువులను అందుకోండి..

Published Thu, Feb 27 2014 3:02 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Job Point in Forest Department

జ్ఞానేశ్వర్ గుమ్మళ్ల,
 హైదరాబాద్.
 
పర్యావరణాన్ని, ఆర్థికాభివృద్ధిని పది కాలాల పాటు పచ్చగా ఉంచే అడవి.. కొత్త కొలువులతో యువతకు ఆహ్వానం పలుకుతోంది. సుస్థిర కెరీర్‌కు వేదికగా నిలిచేందుకు సరికొత్త నోటిఫికేషన్‌తో సిద్ధమైంది. రాష్ట్ర అటవీ శాఖ మొత్తం 2,167 ఉద్యోగాలతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, ప్రిపరేషన్ వ్యూహాలు..
 


 ఉద్యోగాల వివరాలు
 
 నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు విభాగాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
 ఉద్యోగం    పే స్కేల్    ఖాళీలు
 1. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్    10,020- 29,200    151
 2. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్    7,960- 23,650    751
 3. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్    7,520- 22,430    1,224
 4. తానాదార్    7,100- 21,250    16
 5. బంగళా వాచర్    6,700- 20,110    11
 6. టెక్నికల్ అసిస్టెంట్    9,460- 27,700    14
 
 అర్హతలు:
 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: బ్యాచిలర్ డిగ్రీ (బోటనీ,  కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్). లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (కెమికల్, మెకానికల్, సివిల్).
 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన అర్హత.
 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బంగళా వాచర్, తానాదార్: పదో తరగతి లేదా తత్సమాన అర్హత.
 వయసు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, బంగళా వాచర్, తానాదార్‌లకు 18-30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
 శారీరక ప్రమాణాలు: పురుషులు-ఎత్తు: 163 సెం.మీ; ఛాతీ-79 సెం.మీ. గాలి పీల్చినప్పుడు ఛాతీ చుట్టుకొలత 84 సెం.మీ. ఉండాలి. వుహిళలు ఎత్తు:150 సెం.మీ.
 
 రాత పరీక్ష:
 టెక్నికల్ అసిస్టెంట్ మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షల సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలుంటాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్ ఉద్యోగాలకు ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. ఉద్యోగాలను బట్టి ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో తేడా ఉంటుంది.
 
 రాత పరీక్షలో మూడు పేపర్లుంటాయి.
 పేపర్    {పశ్నల సంఖ్య    మార్కులు    సమయం
 1. ఎస్సే రైటింగ్    1    20    60 ని.
 2. జీకే    50    100    90 ని.
 3. జనరల్ మ్యాథమెటిక్స్    50    100    90 ని.
 
 ఎస్సే తెలుగు లేదా ఇంగ్లిష్ లేదా ఉర్దూలో రాయొచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలో ఎస్సే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. మిగిలిన పరీక్షలలో ఎస్సే 250 పదాలకు మించకుండా రాయాలి.
 
 ఎంపిక విధానం:
 రాత పరీక్షకు హాజరైన అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో తర్వాతి దశకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 35 శాతం మార్కులు, మొత్తంమీద కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
 రాత పరీక్షలో అర్హత సాధించిన వారి నుంచి 1:2 నిష్పత్తి లో అభ్యర్థులను ఎంపిక చేసి, ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీని తర్వాత అభ్యర్థులకు ‘నడక పరీక్ష’ నిర్వహిస్తారు. 4 గంటల సమయంలో పురుష అభ్యర్థులు 25 కి.మీ., మహిళా అభ్యర్థులు 16 కి.మీ., నడక పూర్తిచేయాలి.
 నడక పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థుల రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
 రాత పరీక్ష- సన్నద్ధత
 
 పేపర్ 1 (జనరల్ ఎస్సే): మూడు ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకొని, గంట వ్యవధిలో వ్యాసం రాయాలి. అవసరమైన మేరకు భావాన్ని స్పష్టంగా చెప్పగలిగేలా రాయాలి. మంచి ప్రారంభం, ముగింపు అవసరం. 8, 9, 10 తరగతి పాఠ్యపుస్తకాల్లోని చరిత్ర, ఆర్థిక, పౌర, భౌగోళిక శాస్త్ర అంశాలను అవగాహన చేసుకోగల స్థాయిలో వివిధ అంశాలను అధ్యయనం చేయాలి.
 సామాజిక అంశాలు: కులం- రాజకీయాలు; నిరుద్యోగం; సంస్కృతి- ఆధునిక మార్పులు; స్త్రీలు- సమాజం వంటివి.
 పర్యావరణం- అడవులు: కాలుష్యం; గ్లోబల్ వార్మింగ్; అడవుల ప్రాధాన్యత; అడవుల రక్షణ- సమస్యలు వంటివి.
 వీటితో పాటు సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. ఉదా: గ్లోబల్ వార్మింగ్(భూతాపం)కు కారణాలు వివరించండి?
 
 పేపర్ 2 (జనరల్ నాలెడ్జ్): గత తొమ్మిది నెలల నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను అధ్యయనం చేస్తే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కు దోహదపడుతుంది. ఈ పేపర్‌లో జనరల్ సైన్స్, చరిత్ర, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే మానవ శరీర ధర్మశాస్త్రం, వృక్ష, జంతు జాతులు, భారతదేశ చరిత్ర, రాజవంశాలు, కళలు, జాతీయోద్యమం, దేశాలు, సరిహద్దులు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు, ఎడారులు, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంట్, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, స్థానిక స్వపరిపాలన, గ్రామీణాభివృద్ధి, ప్రణాళికలు, జాతీయాదాయం, జనాభా.. ఇలా వివిధ అంశాలపై అవగాహనను పెంపొందించుకోవాలి. జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీకి సంబంధించి ఏడు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి.
 
 పేపర్-3 (జనరల్ మ్యాథమెటిక్స్):
 ఈ పేపర్ అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నల క్లిష్టత పాఠశాల స్థాయిలో ఉంటుంది. ఇందుకోసం సంఖ్యలు-వాటి ధర్మాలు; కసాగు; గసాభా; వడ్డీ-రకాలు; కాలం-పని; కాలం-దూరం; లాభనష్టాలు; రేఖా గణితం; వైశాల్యాలు; ఘనపరిమాణం తదితర అంశాలను చదవాలి.
 
 
 

మానసిక దృఢత్వమూ అవసరం
 అటవీ శాఖ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే 4 గంటల వ్యవధిలో పురుష అభ్యర్థులు 25 కి.మీ. దూరాన్ని, మహిళా అభ్యర్థులు 16 కి.మీ. దూరాన్ని అధిగమించాలి. వాకింగ్ టెస్ట్‌లో విజయం సాధించాలంటే అభ్యర్థులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి. దూరపు నడకకు సిద్ధమయ్యే వారు బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) 30 కంటే ఎక్కువ ఉంటే కొవ్వు శాతం తగ్గించుకుని సాధనకు ఉపక్రమించాలి. శారీరక పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి. మొదటిరోజే వేగంగా నడవాలన్న తాపత్రయం వద్దు. నెమ్మదినెమ్మదిగా వేగాన్ని, దూరాన్ని పెంచుకుంటూ పోవాలి. నడకకు సౌకర్యవంతమైన షూ ఉపయోగించాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా ఫిట్‌నెస్‌ను పెంచుతాయి. వాకింగ్ టెస్ట్‌లో విజయానికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢతాన్ని పెంపొందించుకోవడం అవసరం.
 - డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి,
 స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు.
 
 
 
 టెక్నికల్ అసిస్టెంట్
 అర్హత: ఐటీఐ (సివిల్) లేదా తత్సమాన అర్హత.
 వయసు: 18-36 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
 నిర్దేశ శారీరక ప్రమాణాలు అవసరం లేదు.
 రాత పరీక్ష: మూడు పేపర్లుంటాయి. పేపర్ 1 (టెక్నికల్ సబ్జెక్టు-100 మార్కులు- 3 గంటలు); పేపర్ 2 (జీకే- 50 మార్కులు- 90 నిమిషాలు); పేపర్ 3 (జనరల్ మ్యాథమెటిక్స్- 50 మార్కులు- 90 నిమిషాలు).
 రాత పరీక్షకు హాజరైన అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో తర్వాతి దశకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 35 శాతం మార్కులు, మొత్తంమీద కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
 
 
 పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
 గతంలో అటవీశాఖ సొంతంగా పరీక్షలు నిర్వహించింది. ఈ విడత పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశముంది. అందువల్ల ప్రణాళికాబద్ధంగా పరీక్షలను నిర్వహించగల సామర్థ్యమున్న జేఎన్‌టీయూకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేస్తాం. ఎంపిక విధానంలో ఇంటర్వ్యూను తొలగించాం. అభ్యర్థులు పైరవీకారుల మాటలను నమ్మి, మోసపోవొద్దు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నెలాఖరు కల్లా ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. అటవీ శాఖలో రాణించాలంటే కష్టపడేతత్వం అవసరం. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. అం దువల్ల మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
 
 - బి.సోమశేఖరరరెడ్డి,
 ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్.
 
 
 ముఖ్యమైన తేదీలు
 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:
 ఫిబ్రవరి 17, 2014.
 ఫీజు చెల్లింపునకు చివరి తేదీ:
 మార్చి 2, 2014.
 దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3, 2014.
 దరఖాస్తుతో పాటు ఫొటో, సంతకం, పదో తరగతి మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం (ఓబీసీ/ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు), శారీరక ప్రమాణాల ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
 పూర్తి వివరాలకు apfdrt.org
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement