ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్‌! | Master of Business Administration PGDM | Sakshi
Sakshi News home page

ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్‌!

Published Tue, Jan 10 2017 4:43 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్‌!

ఎంబీఏ / పీజీడీఎం.. ఏది బెస్ట్‌!

ఎంబీఏ.. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ పీజీడీఎం.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ రెండూ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను అందించేవే. కార్పొరేట్‌ కొలువులకు మార్గం చూపేవే. భవిష్యత్తు బిజినెస్‌ లీడర్లను తీర్చిదిద్దేవే. కానీ.. అదే సమయంలో.. రెండిటి మధ్య వ్యత్యాసం ఉందనే అభిప్రాయం.. ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భిన్నాభిప్రాయాలు.. నైపుణ్యాల పరంగా కొన్ని తేడాలనే వ్యాఖ్యలు. ఇవి.. మేనేజ్‌మెంట్‌ విద్య ఔత్సాహికులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇక.. ఐఐఎం సహా పలు బి–స్కూల్స్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది.  ఈ నేపథ్యంలో ఎంబీఏ, పీజీడీఎం ఏది మంచిదో తెలుసుకుందాం..

 థియరీకి ప్రాధాన్యమిచ్చే ఎంబీఏ
కరిక్యులం పరంగా ఎంబీఏ అధిక శాతం థియరీ ఓరియెంటేషన్‌తో ఉంటుంది. నిర్దిష్టంగా సంబంధిత యూనివర్సిటీ రూపొందించిన సిలబస్‌ను, బోధన విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.  ఇక.. పీజీడీఎం ప్రాక్టికల్‌ ఓరియెంటేషన్, ఇండస్ట్రీ అవసరాలకు సరితూగే ఇతర నైపుణ్యాలను అందించే విధంగా ఉంటుందనే అభిప్రాయం.

 స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలు అందించే పీజీడీఎం
నైపుణ్యాల సముపార్జన కోణంలో ఎంబీఏ, పీజీడీఎంల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే.. ఎంబీఏ పూర్తిగా.. అన్ని నిర్వహణ నైపుణ్యాలు అందించే విధంగా ఉంటోంది. పీజీడీఎం ఇందుకు భిన్నమని చెప్పొచ్చు. ఇందులో అభ్యర్థులకు నిర్దిష్టంగా ఒక సబ్జెక్ట్‌లో స్పెషలైజ్డ్‌ నైపుణ్యాలను అందిస్తుంది. కారణం రెండేళ్ల వ్యవధిలో ఉండే పీజీడీఎంలో మొదటి నుంచే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. కానీ ఎంబీఏలో స్పెషలైజేషన్‌ అంటే రెండో ఏడాదిలో మొదలవుతుంది. అంతేకాకుండా ప్రాజెక్ట్‌వర్క్‌ పేరుతో ఏదో ఒక విభాగంలోనే పని చేయాల్సి ఉంటుంది.

 బోధన పరంగానూ తేడాలు
బోధన పరంగానూ ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. ఎంబీఏ సాధారణంగా ఏడాదిలో రెండు టర్మ్‌లుగా రెండు సెమిస్టర్లుగా మొత్తం నాలుగు సెమిస్టర్లలో ఉంటుంది.  పీజీడీఎంను అందిస్తున్న అటానమస్‌ ఇన్‌స్టిట్యూట్‌లు ట్రైమెస్టర్‌ విధానంలో బోధిస్తున్నాయి.

  ఇన్‌స్టిట్యూట్‌ ఆధారంగా డిగ్రీకి గుర్తింపు
ఎంబీఏ, పీజీడీఎం విషయంలో ఇండస్ట్రీ వర్గాల గుర్తింపు, జాబ్‌ మార్కెట్‌లో ఆదరణ వంటివి సర్టిఫికెట్‌ అందించిన ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న ప్రామాణికతపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. ఎంబీఏను పరిగణనలోకి తీసుకుంటే సెంట్రల్‌ యూనివర్సిటీలు, యూనివర్సిటీల క్యాంపస్‌ కళాశాలలకు ఇప్పటికీ మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక.. పీజీడీఎం విషయానికొస్తే ఐఐఎంల తర్వాత దేశంలో గరిష్టంగా యాభై ఇన్‌స్టిట్యూట్‌లకు మాత్రమే  పరిశ్రమ వర్గాల నుంచి, జాబ్‌ మార్కెట్‌లోనూ గుర్తింపు లభిస్తోంది.

 ఎంబీఏకు తత్సమానమే.. కానీ..
పీజీడీఎం కోర్సును ఎంబీఏకు తత్సమాన కోర్సుగా పేర్కొంటున్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ ఈ తత్సమాన గుర్తింపు పొందాలంటే సదరు పీజీడీఎం వ్యవధి కచ్చితంగా రెండేళ్లు ఉండాల్సిందే. ఇటీవల కాలంలో జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఏడాది వ్యవధిలోనే పీజీడీఎం కోర్సులను బోధిస్తున్నాయి. ఈ వ్యవధి ఆసాంతం ఒక రంగానికి సంబంధించి (ఉదాహరణకు.. రిటైల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర)న నైపుణ్యాలనే అందిస్తున్నాయి. ఇలాంటి ధోరణి కారణంగా విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సదరు రంగంలో సంక్షోభం ఏర్పడితే మరో రంగంలో రాణించే నైపుణ్యాలు ఉండవు. అదే విధంగా సంబంధిత రంగంలో ప్రస్తుతమున్న క్రేజ్, డిమాండ్‌ భవిష్యత్తులో లేకపోతే ఇబ్బందే. కాబట్టి పీజీడీఎంలో చేరే అభ్యర్థులు కచ్చితంగా రెండేళ్ల వ్యవధి కోర్సునే ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఉన్నత విద్యలో ఇలా
మాస్టర్‌ డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అంటే రీసెర్చ్‌ అని తెలిసిందే. ఈ విషయంలో ఇటీవల కాలంలో ఎంబీఏ, పీజీడీఎం రెండు సర్టిఫికెట్లకు సమాన అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో కేవలం ఎంబీఏ ఉత్తీర్ణులకే పీహెచ్‌డీ అవకాశం కల్పించే యూనివర్సిటీలు ఇటీవల కాలంలో ఎంబీఏకు తత్సమాన హోదాతో ఏఐసీటీఈ, ఆల్‌ ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీస్‌ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్స్‌ నుంచి పీజీడీఎం చేసిన వారిని సైతం రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌లలో అర్హులుగా పేర్కొంటున్నాయి.

ఇన్‌స్టిట్యూట్, కరిక్యులం ప్రధానం
ఎంబీఏ, పీజీడీఎం దేన్ని ఎంపిక చేసుకున్నా విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న గుర్తింపు, కరిక్యులం పరంగా అమలు చేస్తున్న విధానాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వ యూనివర్సిటీలైనా, అటానమస్‌ సంస్థలైనా విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ ట్రెండ్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే రెండు కోర్సులకూ సమాన అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆందోళన చెందక్కర్లేదు.
– ప్రొఫెసర్‌. వి. వెంకట రమణ, ఎస్‌ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement