భవిష్యత్తుకు బాటలు పరిచే 3డీ బ్రాండ్ బయో
రెజ్యూమె.. అభ్యర్థుల విద్యార్హతలు, నైపుణ్యాలు, పని అనుభవాన్ని రిక్రూటర్‌కు తెలియజేసే ఒక సాధనం. నేటి టెక్నాలజీ యుగంలో ఈ సాధనం దాదాపు మృతప్రాయంగా మారిందని మీకు తెలుసా? మీ రెజ్యూమె కంపెనీకి చేరకముందే మీ గురించి రిక్రూటర్లు పూర్తిగా తెలుసుకుంటున్నారు. గూగుల్‌లో, లింక్డ్‌ఇన్‌లో అభ్యర్థుల పేర్లు టైప్ చేస్తే చాలు.. సమస్త సమాచారం కళ్లముందుంటోంది. హైరింగ్ మేనేజర్లు రెజ్యూమెలను పక్కనపెట్టి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో సెర్చ్ చేస్తున్నారు. కోరుకున్న అర్హతలున్న వారికోసం అంతర్జాలంలోనే గాలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేపర్ రెజ్యూమెలకు కాలం చెల్లిందనే చెప్పొచ్చు. మార్కెట్‌లో ఒక వస్తువు కనుమరుగైంది అంటే దాన్ని మించిన ప్రత్యామ్నాయం ఏదో ఒకటి వచ్చినట్లే లెక్క. రెజ్యూమెను వెనక్కి నెట్టేస్తున్న ప్రత్యామ్నాయం.. 3డీ బ్రాండ్ బయో. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఊపేస్తున్న నయా సాంకేతిక పరిజ్ఞానం.. 3డీ టెక్నాలజీ. జాబ్ సెర్చ్‌తోపాటు రెజ్యూమె, బయోడేటా, కరిక్యులమ్ విటే(సీవీ)లలోనూ ఇది రంగ ప్రవేశం చేసింది. నేటి కెరీర్ మార్కెటింగ్ సాధనాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్.. 3డీ బ్రాండ్ బయో అని నిపుణులు చెబుతున్నారు. కంపెనీలు కూడా దీన్నే కోరుకుంటున్నాయి. రెజ్యూమెలో లేని ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. ఇది రెజ్యూమె కంటే ఎక్కువ కనెక్టివ్, ఎఫెక్టివ్ అనేది నిపుణుల మాట. కొలువు సాధించడంతోపాటు కెరీర్‌లో ఎదగాలంటే ఈ బ్రాండ్‌ను సొంతం చేసుకోవాలి.
సోషల్ మీడియా
ఉద్యోగార్థులు జపించాల్సిన మంత్రం.. డిజిటల్ ఫస్ట్. ఇప్పుడు సర్వం ఆన్‌లైన్‌మయం. అంతర్జాలంలో కొలువుల గురించి తెలుసుకోవడంతోపాటు మీ గురించి కంపెనీలకు తెలియజేయాలంటే కంప్యూటర్ కీ బోర్డుపై వేళ్లు కదిలించాలి. కంట్రోల్, ఆల్ట్, డిలీట్.. ఇలాంటి వాటితో పరిచయం పెంచుకోవాలి. 3డీ బ్రాండ్ బయోతో మిమ్మల్ని ప్రపంచంలో ఎక్కడినుంచైనా చూడొచ్చు. 3డీ టెక్నాలజీ వల్ల ఇది మనిషి ఎదురుగా ఉన్నట్లు భ్రమింపజేస్తుంది. మీ ప్రొఫైల్‌తోపాటు ఆడియో, వీడియోలను సామాజిక అనుసంధాన వేదికల్లో చేర్చాలి. మీకు సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉండాలి. మీకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించండి. వాటిని సలక్షణంగా నెట్టింట్లో పెట్టేయండి. వీటిని స్నేహితులు, బంధువులు మాత్రమే కాదు.. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు కూడా చూస్తారు. మీ నైపుణ్యాలు నచ్చితే ఆహ్వానం పంపుతారు.
అడ్డు గోడను తొలగిస్తుంది
రెజ్యూమె అనేది మీ అర్హతలు, స్కిల్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మాత్రమే తెలియజేస్తుంది. అంతకుమించి మీ గురించి రిక్రూటర్‌కు తెలియదు. ఒకరకంగా ఇరువురి మధ్య ఇది ఒక అడ్డుగోడ లాంటిదే. 3డీ బ్రాండ్ బయో ఈ అడ్డుగోడను తొలగిస్తుంది. మీరేంటో ఉన్నది ఉన్నట్లుగా వివరిస్తుంది. మీ వ్యక్తిత్వం, ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులను తెలుపుతుంది. మిమ్మల్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. అందుకే రిక్రూటర్ల దృష్టిలో దీనికంత విలువ. కెరీర్‌లో పైకి ఎదగడానికి 3డీ బ్రాండ్ బయో.. పర్సనల్ బ్రాండింగ్ టూల్‌గా జీవితకాలంపాటు ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఇతరుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. జాబ్ మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవచ్చు.