సామాజిక సైట్లతో కొలువు వేట ఫలించాలంటే!
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు... ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. ఇలాంటి సైట్లతో ఉపయోగం ఎంత ఉందో, అపాయం కూడా అంతే ఉంది. వీటిపై ప్రస్తుతం విసృ్తతమైన చర్చ జరుగుతోంది. అందుకే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేటి ఉద్యోగార్థులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొలువుల వేటలో సామాజిక అనుసంధాన సైట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగ సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తును తీసుకోవడం, ఇంటర్వ్యూను పూర్తిచేయడం వరకు ఈ సైట్ల ద్వారా జరుగుతున్నాయి. కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగుల కోసం సామాజిక సైట్ల ద్వారానే గాలిస్తున్నాయి. అందుకే అభ్యర్థులు కొలువు కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాలి.
ఆన్‌లైన్‌లో క్రియాశీలకంగా: మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆన్‌లైన్‌లో క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీ అర్హతలు, నైపుణ్యాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. కంపెనీలకు మీ గురించి తెలియడానికి ఆన్‌లైన్ ప్రొఫెల్ ఎంతగానో ఉపయోగపడుతుం ది. ఒకవేళ ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ ప్రొఫైల్ కెరీర్‌లో మీ ఎదుగుదలకు సాయపడుతుంది.
పోస్టుల్లో నిర్లక్ష్యం వద్దు : ఆన్‌లైన్‌లో మీరు ఏదైనా అంశాన్ని పోస్టు చేస్తే దాన్ని చాలా మంది చదువుతారు. మీపై ఒక అంచనాకు వస్తారు. కాబట్టి మీరు పోస్టు చేసే ప్రతిదీ తప్పుల్లేకుండా ఉండేలా జాగ్రత్తపడండి. పోస్టు చేసేముందు క్షుణ్నంగా చదువుకోండి. అక్షర, అన్వయ, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోండి. పోస్టుల్లో తప్పులుంటే.. మీరు నిర్లక్ష్యమైన మనిషి అని ఇతరులు తుది నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీకు అవకాశాలు సన్నగిల్లుతాయి.
గూగుల్‌లో పేరు: అంతర్జాలంలో ఏదైనా సమాచారం కావాలంటే అందరూ వెంటనే చేసే పని.. గూగుల్ సెర్చ్‌లో వెతకడం. కంపెనీకి రెజ్యూమెను పంపడానికి ముందు గూగుల్‌లో మీ సమాచారాన్ని పొందుపర్చండి. మీ పేరు టైప్ చేయగానే మీకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షం కావాలి. రిక్రూటర్లు కూడా గూగుల్‌లో మీ వివరాలను, ఫోటోలను పరిశీలిస్తారు. అభ్యంతరకరమైన సమాచారం, ఫోటోలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి.
కనెక్ట్.. అందరితో వద్దు: ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోవడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తుంటాం. ఎక్కువ మందితో కనెక్ట్ అయితే నష్టమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ అవసరాలకు సరిపోయే వారితోనే కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. వారి అవసరం మీకు, మీ అవసరం వారికి ఉండాలి. అప్పుడే ఇద్దరికీ మేలు జరుగుతుంది.
ట్విట్టర్‌తో జాగ్రత్త: ట్విట్టర్‌లో పోస్టు చేసే వ్యాఖ్యలు వివాదాలను సృష్టిస్తుండడం చూస్తూనే ఉన్నాం. రిక్రూటర్లు కొలువుల భర్తీకి ట్విట్టర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. కనుక మీరు ఏదైనా ట్వీట్ చేసేముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సంస్థ గురించి, యాజమాన్యం గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయకండి. అభ్యర్థులు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది.
హాస్యం.. శ్రుతి మించొద్దు: అతి ఎప్పటికీ అనర్థమే. మీకు నవ్వు తెప్పించే విషయం మరొకరికి కోపం తెప్పించొచ్చు. రిక్రూటర్/ హైరింగ్ మేనేజర్ మహిళ అయితే.. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసభ్యకరమైన జోక్స్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పోస్టు చేయకండి. అలాగే కులం, మతం వంటివాటిపై కూడా జోక్స్ సృష్టించొద్దు. ఒకవేళ ఇలాంటివి మీకు ఇష్టమైతే వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం సంగతి తర్వాత.. వాటి నుంచి బయటపడడమే చాలా కష్టం. సామాజిక సైట్లను సరిగ్గా వాడుకోగలిగితే ఇష్టమైన ఉద్యోగం సులువుగా సంపాదించుకోవచ్చు.