ఆన్‌లైన్ ప్రిడేటర్స్
అంతర్జాలానికి అతుక్కుపోతున్న టీనేజర్లు ఏ మాయలో పడతారోనని తల్లిదండ్రులు పడే దిగులు అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా, చాటింగ్‌ల ద్వారా వారు సెక్సువల్ విక్టిమ్స్‌గా మారుతున్నారన్నది అధ్యయనాలలో తేలిన విషయం. అలా సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా పిల్లలను ట్రాప్ చేసే ఆన్‌లైన్ సెక్సువల్ ప్రిడేటర్స్ గురించి అవగాహన కల్పించేందుకు రూపొందిన ‘ఆన్‌లైన్ ప్రిడేటర్స్’ షార్ట్ ఫిలిం నెటిజన్స్ నుంచి బెస్ట్ వీడియోగా అభినందనలు అందుకుంటోంది. మలయాళ ప్రసిద్ధ దర్శకులు శ్యాంప్రసాద్ డెరైక్ట్ చేసిన ఈ చిన్ని సినిమాను పృథ్వీ, పార్వతి లాంటి సినీ నటులు ప్రమోట్ చేస్తున్నారు.
తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ నుంచి ప్రైవసీ కోరుకుంటూ, ఫోన్లో చాట్ చేస్తుంటుంది టీనేజ్ అమ్మాయి శిఖా. క్లాస్ రూమ్‌లో, ఇంట్లో, ఆట స్థలంలో... అన్ని చోట్లా ఆ అమ్మాయి ఆసక్తి చాటింగ్ పైనే. చుట్టూ ఉన్నవారంతా ఆమెలో వచ్చిన తేడాను స్పష్టంగా తెలుసుకుంటారు. హఠాత్తుగా సాఫీగా సాగుతున్న చాటింగ్ కాస్తా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. మార్ఫ్ చేసిన చిత్రాలు ఆమె ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి. అతను కోరినట్లుగా కలవకపోతే, ఈ చిత్రాలతో ఏదైనా జరగవచ్చని సందేశం పరమార్థం. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక శిఖ... అతను కోరి విధంగా కలవడానికి సిద్ధమవుతుంది.
అదృష్టవశాత్తు
ఆ అమ్మాయిని వెంబడిస్తూ వచ్చిన స్కూలు టీచరు ఆ ప్రమాదం నుంచి కాపాడుతుంది. అయితే అదృష్టం అన్ని వేళలా వరించదని, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలనే సారాంశం. అలాగే అబ్బాయిలను టార్గెట్ చేసే సెక్సువల్ ప్రిడేటర్సూ ఉండవచ్చన్నది చక్కగా చూపారు ఇందులో. స్త్రీలు, పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి రోటరీ క్లబ్ ఆఫ్ కొచ్చిన్ మెట్రోపోలిస్ చేపట్టిన ‘బోధిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ షార్ట్ ఫిలింను రూపొందిచారు డెరైక్టర్ శ్యాంప్రసాద్. మలయాళం భాషలోని ఈ షార్ట్ ఫిలింకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ వస్తుంటాయి.
- కళ