భూపటల ఉపరితలంపై వదులుగా,∙అదృఢీ భూతంగా ఉండే పొరను మృత్తిక అంటారు.∙మృత్తికలో ఉండే పొరలను ‘హారైజన్స్’ అంటారు.
మృత్తికలు ఏర్పడే స్వభావాన్ని బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు. అవి..
1. స్థానబద్ధ మృత్తికలు: స్థానిక మాతృశిల నుంచి ఏర్పడతాయి.
2. నిక్షేప మృత్తికలు: నీరు, పవనాల నిక్షేపణల వల్ల ఏర్పడతాయి. రష్యాకు చెందిన ‘దెకుబన్’, అమెరికా శాస్త్రజ్ఞుడు‘మార్పట్’లు
మృత్తికలు ఏర్పడే ప్రాంతాల లక్షణాలు, శీతోష్ణస్థితి వంటి అంశాల ఆధారంగా వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. జోనల్ (మండల మృత్తికలు): ఇవి విశాలంగా విస్తరించి ఉన్న ముఖ్యమైన మృత్తికలు. మాతృ శిలపైఏర్పడి అభివృద్ధి చెందాయి. ఉదా‘‘ చెర్నోజెమ్, ఎర్ర, లాటరైట్, ఎడారి మృత్తికలు
2. ఇంట్రా జోనల్ (అంతర మండల మృత్తికలు): నీటిలో కరిగిన లవణాలు భూమి లోపలి నుంచి ఉపరితలానికి కేశ నాళిక ప్రక్రియ వల్ల వచ్చి, నీరు ఆవిరై ఆ లవణాలు మిగిలిపోగా ఏర్పడ్డాయి.ఉదా‘‘ లవణ మృత్తికలు, పీట్, సున్నపు మృత్తికలు
3. అజోనల్ (అమండల మృత్తికలు): వివిధ లవణాలు రవాణా కావడం వల్ల ఏర్పడిన మృత్తికలు. ఉదా‘‘ ఒండ్రు మృత్తికలు, లోయస్ మృత్తికలు, లావా మృత్తికలు.నేలలు లేదా మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు.
భారతదేశం– మృత్తికలు (నేలలు)
భూ ఉపరితలంపై శిథిలమైన శిలా శకలాలు, కుళ్లిన జంతు, వృక్ష సంబంధిత పదార్థాల పలుచటి పొరనే మృత్తికలుగా నిర్వచించవచ్చు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న భారత్ వంటి దేశాల్లో మానవ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పురోగతిని నిర్ణయించడంలో మృత్తికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మంచి మృత్తికలు, ముఖ్యంగా ఒండ్రు మృత్తికలున్న ప్రదేశాల్లో అనేక గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి. వయనం, లవణాలు, కుళ్లిన జీవ సంబంధ పదార్థాల (హ్యూమస్)ను సరైన పాళ్లలో కలిగిన మృత్తికలు వ్యవసాయదారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలను అందిస్తాయి. 1893లో ఓల్కర్, 1898లో లెదర్ సాగించిన పరిశోధనల వల్ల భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు.
అవి.. 1. గంగా– సింధు ఒండలి మృత్తికలు, 2. నల్లరేగడి మృత్తికలు, 3. ఎర్ర మృత్తికలు, 4. లాటరైట్ మృత్తికలు. మృత్తికల లక్షణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 8 ప్రధాన వర్గాలుగా వర్గీకరించింది. అవి.. 1. ఒండలి మృత్తికలు 2. నల్లరేగడి మృత్తికలు 3. ఎర్ర మృత్తికలు 4. లాటరైట్ మృత్తికలు 5. శుష్క, ఎడారి మృత్తికలు 6. లవణీయ, క్షార మృత్తికలు 7. అటవీ మృత్తికలు 8. పీట్, జీవ సంబంధ మృత్తికలు.
ఒండలి మృత్తికలు
నదులు క్రమక్షయం చేసి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపితాలతో ఏర్పడినవే ఒండలి మృత్తికలు. ఇవి సాధారణంగా నదీ ప్రవాహానికి ఇరు వైపులా, నదీ మైదానాలు, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ మృత్తికలు అత్యంత సారవంతమైనవి. కాబట్టి వ్యవసాయభివృద్ధిలో ఈ మృత్తికలు కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కానీ, నత్రజని, హ్యూమస్‌లు తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి దేశంలోని మొత్తం భూభాగంలో 23.40 శాతం మేర విస్తరించి వ్యవసాయ ఉత్పత్తిలో సింహ భాగాన్ని కలిగి ఉన్నాయి.
మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని నర్మద, తపతి నదీ లోయలు, మధ్యప్రదేశ్, ఒడిశాలోని మహానది డెల్టా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని గోదావరి, కృష్ణా నదీ లోయలు, తమిళనాడులోని కావేరి డెల్టా, ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకూ ఈ నేలలు విస్తరించి ఉన్నాయి.
ఒండలి నేలల్లో డెల్టాయిక్ ఒండలి, కాల్కేరియస్ ఒండలి, తీరస్థమైన ఒండలి, తీర ప్రాంతాల్లో ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలలు ప్రధానంగా హిమాలయాల నుంచి వచ్చిన విచ్ఛిన్నావశేషం నుంచి లేదా ప్రస్తుతంlవిలుప్తమైపోయిన టెథిస్ సముద్రం వదిలి పెట్టిన సిల్ట్ నుంచి ఏర్పడ్డాయి.
గంగా మైదానంలో వీటిని రకరకాలుగా పిలుస్తారు. అవి.. 1. ఖాదర్ 2. భంగర్ 3. భాబర్ 4. టెరాయ్
ఖాదర్: బాగా మెత్తగా ఉండే కొత్త ఒండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. ఈ నేలలు లేత రంగులో ఉండి లైమ్, పొటాష్‌లను ఎక్కువగా కలిగి ఉంటాయి.
భంగర్: పాత ఒండలి మైదానాన్ని భంగర్ అంటారు. ఈ నేలలు ముదురు రంగులో ఉండి, బంకమన్నును అధికంగా కలిగి ఉంటాయి.
భాబర్: శివాలిక్ పర్వత పాదాల వెంటlముతక లేదా గులకరాళ్లతో కూడిన ఒండలి మండలాన్ని భాబర్ అంటారు.
టెరాయ్: భాబర్‌కు దక్షిణాన సిల్ట్ నేలలతో కూడిన తుంపర పల్లపు భూములను టెరాయ్ అంటారు.
భారతదేశంలో ఈ నేలలున్న ప్రాంతాలు గోధుమ, వరి ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి.
నల్లరేగడి మృత్తికలు
కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణ, నీస్, గ్రానైట్ శిలలు శైథిల్యానికి గురి కావడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్లు, అల్యూమినియం ఫుష్కలంగా ఉంటాయి. నత్రజని, పాస్ఫారిక్ ఆమ్లం, హ్యూమస్‌లు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అధిక మొత్తంలో మెత్తని ఇనుప పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల నలుపు రంగులో ఉంటాయి. వీటినే చెర్నోజమ్ నేలలని కూడా పిలుస్తారు. పత్తి పంటకు అనువైనవి కావడం వల్ల వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు. వీటిలో బంకమన్ను శాతం అధికంగా ఉంటుంది. అందువల్లే ఇవి తేమను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టే ఈ నేలలు భూసారానికి ప్రసిద్ధి చెందాయి. ఈ మృత్తికలు ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
ఎర్ర మృత్తికలు
తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక, రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఈ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ఇనుము, ఫెర్రో మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉండి, సున్నపురాయి, కంకర, నైట్రోజన్, ఫాస్ఫారికామ్లం, ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉంటాయి. కాబట్టి ఈ నేలలు ఎక్కువ పొడిగా, తక్కువ సారవంతంగా గాలి పారేటట్లు ఉంటాయి. ఇవి లోతైన పల్లపు ప్రాంతాల్లో రేగడి మన్ను, ఇసుక కలిసిన మృత్తికలుగా, ఉన్నత భూముల్లో వదులైన గ్రావిల్‌గా ఉంటాయి. భారతదేశ భూభాగంలో ఈ నేలలు 29.08 శాతం మేర విస్తరించి ఉన్నాయి. తమిళనాడు (అంతటా), కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఛోటా నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ నేలలున్నాయి.
లాటరైట్ మృత్తికలు
ఏకాంతరంగా ఉండే ఆర్ధ్ర, అనార్ధ్ర రుతువుల్లోని అధిక వర్షపాత, ఉష్ణోగ్రతా పరిస్థితుల్లో లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఆయా పరిస్థితులు మౌలిక శిల నుంచి సిలికా అనే పదార్థం ఎక్కువగా నిక్షాళనం చెందేందుకు దోహదపడతాయి. వీటిలో అల్యూమినియం, ఇనుముల హైడ్రేటె ఆక్సైడ్‌ల మిశ్రమం ఉంటుంది. ఇనుముతో కూడిన మిశ్రమం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మృత్తికలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల భూ సారం అతి తక్కువగా ఉంటుంది. ఇవి తోట పంటలకు అనువైనవి. ఈ నేలలు మన దేశంలో 4.30 శాతం భూ భాగంలో విస్తరించి ఉన్నాయి. మధ్యపదేశ్‌లోని వింధ్య, సాత్పురా పర్వతాలకు చెందిన బసాల్టిక్ పర్వత శిఖరాల మీద, ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతం, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉన్న లాటరైట్ నేలల్లో వరి, ఎక్కువ ఎత్తులో ఉన్న నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు, మల్బరీ వంటి తోట పంటలు బాగా పండుతాయి.
శుష్క, ఎడారి మృత్తికలు
శుష్క, అర్ధ శుష్క పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి, వాయు నిక్షేపిత ఇసుక దిబ్బలు (లోయస్‌లు) కూడా ఈ నేలల కిందకే వస్తాయి. ఈ మృత్తికల్లో ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ ఆమ్లం ఎక్కువ మోతాదులో ఉండి, నత్రజని, భాస్వరం, ఇనుములు తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నేలలు దేశ భూభాగంలో 8.46 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హరియాణాల్లో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. క్షారత్వాన్ని తట్టుకోగలిగే బార్లీ, పత్తి వంటి పంటలు ఈ నేలల్లో అధికంగా పండుతాయి.
లవణీయ, క్షార మృత్తికలు
ఇవి ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని శుష్క, అర్ధ శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నేలల ఉపరితలం మీద సోడియం, కాల్షియం, మెగ్నీషియంలతో కూడిన గట్టి పొరలుంటాయి. వీటినే రే, కల్లర్, ఊసర్ నేలలు అని కూడా అంటారు. లవణీయ మృత్తికల్లో సోడియం లోపం ఉంటే, క్షార మృత్తికల్లో సోడియం క్లోరైడ్ నిక్షేపాలుంటాయి.
అటవీ మృత్తికలు (పర్వత మృత్తికలు)
అడవుల నుంచి ఉత్పన్నమైన కర్బన çపదార్థ నిక్షేపణ వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటినే పర్వత మృత్తికలు అని కూడా అంటారు. ఇవి వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెంది ఉంటాయి. స్వల్ప రసాయన శైథిల్యం, స్వల్ప బృహచ్ఛలనం వల్ల పూర్తిగా పరిణతి చెందని ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి. ఈ నేలల్లో హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎత్తయిన ప్రాంతంలో ఈ నేలలు ఆమ్ల రహితమైన పోడ్జీత్‌లుగా ఉంటాయి. ఈ నేలలు దేశం మొత్తం భూభాగంలో 10.64 శాతం మేర విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు, ఉత్తరాన ఉన్న ఇతర పర్వత శ్రేణులు, తూర్పు, పశ్చిమ కనుమలు, కర్ణాటక (కూర్గ్)లో ఈ నేలలున్నాయి. తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలకు ఈ నేలలు అనుకూలం.
పీట్, జీవ సంబంధ మృత్తికలు
నేలల్లో జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఆర్ర ్ధ ప్రాంతాల్లో పీట్ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ద్రావణీయమైన లవణాలు గణనీయంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో ఈ నేలలు 150 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా కేరళలోని కొట్టాయమ్, అలెప్పీ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ వీటిని స్థానికంగా ‘కరి’ నేలలంటారు. ఒడిశా సముద్రతీర ప్రాంతాలు, బెంగాల్‌లోని సుందర వనాలతోపాటు ఉత్తర బిహార్, ఆగ్నేయ తమిళనాడుల్లో ఈ నేలలున్నాయి.
-ముల్కల రమేష్
సబ్జెక్ట్ నిపుణులు, హన్మకొండ