సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ | Prelims Civils 2014 analysis | Sakshi
Sakshi News home page

సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ

Published Thu, Aug 28 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ

సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ

సివిల్స్ ప్రిలిమ్స్-2014 పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 9,45,000 మంది దరఖాస్తు చేయగా.. నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 వేల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఎలా ఉంది? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏయే విభాగాల్లో ప్రశ్నలు పెరిగాయి? ఎన్ని మార్కులు సాధించినవారు మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ..
 
 పేపర్-1
 (ప్రశ్నల సంఖ్య- 100, మార్కులు- 200)
 కరెంట్ అఫైర్స్, జీకే.. ప్రశ్నలు సులువే:  పేపర్-1లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌ల నుంచి 10 ప్రశ్నలు అడిగారు. జీకే నుంచి 7 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో ప్రశ్నలు ఎక్కువే. గతేడాది ప్రిలిమినరీలో జీకే నుంచి కేవలం నాలుగు ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. వర్తమాన వ్యవహారాల నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ఈ ఏడాది కొన్ని జీకే ప్రశ్నలను నేరుగా అడిగారు. ఉదాహరణకు సత్యమేవ జయతేను ఏ ఉపనిషత్ నుంచి సంగ్రహించారు? (సమాధానం: ముండక ఉపనిషత్). కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ప్రాచీన భాషలుగా ప్రభుత్వం గుర్తించిన భాషలు? (సమాధానం: కన్నడం, తెలుగు). అదేవిధంగా కొన్ని ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంది. ఉదా: ఆర్కిటిక్ కౌన్సిల్‌లోని సభ్యదేశాలు? అగ్ని క్షిపణి, బ్రిక్స్ సదస్సు, ఇటీవల వార్తల్లోకెక్కిన ప్రాంతాలు ఏయే దేశాల్లో ఉన్నాయి? వంటి ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు గుర్తించవచ్చు.
 
 జాగ్రఫీ.. ఎకాలజీకి పెరిగిన ప్రాధాన్యత:
 జాగ్రఫీలో గతేడాది దాదాపు 21 ప్రశ్నలు రాగా.. ఈ ఏడాది 20కు పైగా ప్రశ్నలు ఇచ్చారు. ఈ ఏడాది ఎకాలజీ సంబంధిత ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలను ఎకాలజీ నుంచే అడిగారు. గతేడాది ప్రశ్నలన్నీ కాంటెంపరరీగా ఉండగా.. ఈ ఏడాది ఇచ్చిన ప్రశ్నలు సివిల్ స్థాయికి తగినట్లు లేవు. కాంటెంపరరీ అంశాలపై ప్రశ్నలు తగ్గించారు. అంతగా ప్రాధాన్యం లేని అంశాలు, ప్రస్తుతం వార్తాపత్రికలు, చర్చల్లో లేని అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. ఉదాహరణకు జాతీయ రహదారులు, పర్వత ప్రాంతాలు ఎక్కడున్నాయి అనే ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్స్‌ను పరిశీలిస్తే.. ఆప్షన్స్ మరీ సూక్ష్మంగా ఉన్నాయి. అన్నింటి గురించి తెలిస్తేనే కానీ అభ్యర్థి సమాధానాలు గుర్తించలేడు.
 
  కొన్ని ప్రశ్నలు అభ్యర్థిలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలకు పదునుపెట్టేలా ఉంటే మరికొన్ని ప్రశ్నలు మంచి నాలెడ్జ్ ఉన్న అభ్యర్థి కూడా ఆన్సర్ చేయలేని విధంగా ఉన్నాయి. వర్తమాన అంశాలపై అతి తక్కువ ప్రశ్నలు అడిగారు. ఉదా: పేపర్-1లో చెచెన్యా, డార్ఫర్, స్వాత్ లోయ అనే ప్రాంతాలు.. వాటికి ఎదురుగా రష్యన్ ఫెడరేషన్, మాలి, ఇరాక్‌లను ఇచ్చి జతపరచమని అడిగారు. దీనికి ఎవరైనా సమాధానం గుర్తించవచ్చు. రీజనింగ్, సమాచారం, విశ్లేషణాత్మక నైఫుణ్యాలను పరిశీలించేలా ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదా: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న నదులేవి? అనే ప్రశ్న. కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి? హిమాలయాల్లో ప్రయాణించేటప్పుడు సహజంగా కనిపించే వృక్షాలు ఏవి? అనే ప్రశ్నలు. వీటికి ఇచ్చిన ఆప్షన్స్‌ను కొంచెం పరిశీలించి ఆలోచిస్తే సమాధానంగా తేలికగా గుర్తించవచ్చు.
 
 ఎకానమీ.. గతేడాదితో పోలిస్తే తగ్గిన ప్రశ్నలు:
 2013 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో ఎకానమీకి సంబంధించి 19 ప్రశ్నలు ఇవ్వగా.. ఈ ఏడాది 14 ప్రశ్నలు ఇచ్చారు. రెండు ప్రశ్నపత్రాల్లోనూ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, ప్రణాళికలు, పబ్లిక్ ఫైనాన్స్, జనాభా, ద్రవ్యోల్బణం, ద్రవ్యం, జాతీయాదాయం, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. కాగా ఈ ఏడాది ప్లానింగ్, అభివృద్ధి కార్యక్రమాలు, ఐఎంఎఫ్, పబ్లిక్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, విదేశీ వాణిజ్యం ప్రధాన అంశాలుగా ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 14 ప్రశ్నల్లో బ్యాంకింగ్ రంగం నుంచి ఐదు ప్రశ్నలు రాగా.. ప్రణాళికల నుంచి రెండు ప్రశ్నలు, అభివృద్ధి కార్యక్రమాలపై రెండు ప్రశ్నలు, బడ్జెట్, పన్నుల వ్యవస్థ, స్టాక్ మార్కెట్, ఐఎంఎఫ్, విదేశీ వాణిజ్యంలాంటి అంశాలపై ఒక్కొక్క ప్రశ్న వచ్చాయి. బ్యాంకింగ్ రంగంపై కరెంట్ అఫైర్స్‌లో భాగంగా బ్రిక్స్ బ్యాంక్ లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి అంశానికి సంబంధించిన కాన్సెప్ట్స్‌పై పూర్తి అవగాహనతో ఆయా కాన్సెప్ట్‌ల అప్లికేషన్స్‌పై అధ్యయనం చేసిన వారు ఎకానమీలో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది.
 
 జనరల్ సైన్స్.. పర్యావరణానికి పెరిగిన ప్రాధాన్యత:
 పేపర్-1లో ముఖ్యంగా పర్యావరణం నుంచి 15 ప్రశ్నలు, జీవ శాస్త్రం నుంచి 10 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నలు అడిగారు. గతేడాదితో పోలిస్తే పర్యావరణం, బయాలజీల నుంచి ప్రశ్నలు పెరిగాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి బాగా తగ్గాయి. పర్యావరణం విభాగంలోని ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ సంరక్షణ కార్యక్రమాలు, చట్టాలు, చట్టాల పరిధికి ఉద్దేశించినవి. మరికొన్ని ప్రశ్నలను సంరక్షణ చర్యల ఆధారంగా అడిగారు. బయోస్ఫియర్ రిజర్వ్, అంతర్జాతీయ కార్యక్రమాలు, ఒప్పందాలు, జీవవైవిధ్య పరిరక్షణ మొదలైనవాటి గురించి ప్రశ్నలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా చిత్తడి నేలలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వులు వంటివాటిపై కూడా 5 - 6 ప్రశ్నలు అడిగారు. విస్తృత సమాచార సేకరణ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. అంతరించిపోతున్న, ప్రమాదం ఎదుర్కొంటున్న జంతు జాతులపై ప్రతిసారీ ప్రశ్నలు వస్తున్నాయి. గత పరీక్షలో రాబందులపై ప్రశ్న ఇచ్చారు. ఈసారి డాల్ఫిన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్న అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అంశాలైన అగ్ని - 4, అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాలు, నానో టెక్నాలజీలపై ప్రశ్నలు వచ్చాయి.
 
 చరిత్ర.. ప్రాచీన చరిత్రపై అధిక ప్రశ్నలు:
 గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు పెరిగాయి. గతంలో 13 నుంచి 15 ప్రశ్నలు వరకు వచ్చేవి. అవి కూడా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమం నుంచి ఎక్కువగా ఇచ్చేవారు. ఈ ఏడాది చరిత్ర నుంచి 20 ప్రశ్నలు అడిగారు. ప్రాచీన భారతదేశం నుంచి 10 ప్రశ్నలు, మధ్యయుగం నుంచి 3 ప్రశ్నలు, ఆధునిక యుగం నుంచి 4 ప్రశ్నలు, స్వాతంత్య్రోద్యమం నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. చరిత్ర సిలబస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక దశలు, భారత స్వాతంత్య్రోద్యమం ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ప్రాచీన, మధ్య యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావని, వాటికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదని భావించారు. ఎక్కువగా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమంపైనే దృష్టి సారించారు. అయితే ప్రాచీన చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్న లు వచ్చాయి. మొత్తం మీద చరిత్రలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రశ్నలు లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి.
 
 పాలిటీ:
 జనరల్ స్టడీస్‌లో పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధాన అంశాల నుంచి కాకుండా.. అంతగా ఊహించని అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా: అభ్యర్థి సాధారణంగా వివిధ కమిటీలు, చైర్మన్లు వంటి అంశాలను చదువుతారు. అయితే ఏ కమిటీలో ఎక్కువ మంది సభ్యులున్నారు? అనే ప్రశ్న ఇచ్చారు. పాలిటీ నుంచి దాదాపు 8 ప్రశ్నల వరకు వచ్చాయి. గతేడాది కూడా ఇదే సంఖ్యలో ప్రశ్నలు అడిగారు. స్థానిక స్వపరిపాలన సంస్థలపై ఎలాంటి ప్రశ్నలు లేవు. అంతర్జాతీయ సంబంధాలపై బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే ఇచ్చారు. ప్రత్యేకంగా ఒక విభాగంపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు, పార్లమెంట్.. ఇలా వివిధ అంశాలపై ఒక్కొక్క ప్రశ్న అడిగారు.
 
 ఈ ఏడాది పేపర్ -1 (200 మార్కులు), పేపర్- 2 (ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌కు కేటాయించిన 15 మార్కులు మినహాయించి మిగిలిన 185 మార్కులు)లు కలిపి మొత్తం 385 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 230 మార్కులు సాధిస్తే.. మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశముందని నిపుణుల అంచనా. ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే కటాఫ్ మరింత తగ్గినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు.పేపర్-1లో బాగా తెలివైన అభ్యర్థి 70 నుంచి 80 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి 150 మార్కులు సాధించొచ్చు.బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి పేపర్- 2లో 185 మార్కులకుగాను 115 నుంచి 120 వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. గతేడాది ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కటాఫ్ - 241.
 
 పేపర్-2
 (ప్రశ్నలు 74, మార్కులు 185,
 వ్యవధి: రెండు గంటలు)
 
 డెసిషన్ మేకింగ్ నుంచి ప్రశ్నలు లేవు
 ఇటీవల పేపర్-2 గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. వివాదానికి కారణమైన రెండో పేపర్‌లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే గతంలో మాదిరిగానే 80 ప్రశ్నలు ఇచ్చారు. సివిల్స్ సిలబస్ ప్రకారం డెసిషన్ మేకింగ్ అనే అంశం నుంచి వచ్చే ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. గతేడాది ఈ అంశం నుంచి ఆరు ప్రశ్నలు (15 మార్కులకు) వచ్చాయి. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క ప్రశ్న కూడా డెసిషన్ మేకింగ్ నుంచి రాలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అంశం నుంచి వచ్చిన ఆరు ప్రశ్నలను యూపీఎస్సీ తొలగించింది. ఈ విషయాన్ని పరీక్షకు ముందే యూపీఎస్సీ తెలిపింది. అంటే రెండో పేపర్‌లో 80 ప్రశ్నలకుగాను 74 ప్రశ్నలు (185 మార్కులు) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 74 ప్రశ్నల్లో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 26 ప్రశ్నలు, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, బేసిక్ న్యూమరసీ నుంచి 18 ప్రశ్నలు అడిగారు. 74 ప్రశ్నల్లో 48 ప్రశ్నలు చాలా సులువుగానూ, 14 ప్రశ్నలు మధ్యస్తంగానూ, 12 ప్రశ్నలు కఠినంగానూ ఉన్నాయి. ఈ పేపర్‌లో అంశాలవారీగా వచ్చిన ప్రశ్నల సంఖ్యను ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
 
 బేసిక్ న్యూమరసీ
     1.    నంబర్స్    4
     2.    పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్    3
     3.    రేషియోష్ ప్రొపర్షన్ ఈక్వేషన్స్    1
     4.    టైమ్ అండ్ డిస్టెన్స్    2
     5.    సింపుల్ ఇంట్రెస్ట్    1
     6.    డేటా ఇంటర్‌ప్రిటేషన్    6
     7.    మిస్‌లేనియస్    1
         మొత్తం    18
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement