రవితేజ... ఐఈఎస్ | Ravi Teja IES Success Speaks | Sakshi
Sakshi News home page

రవితేజ... ఐఈఎస్

Published Thu, Oct 2 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

రవితేజ... ఐఈఎస్

రవితేజ... ఐఈఎస్

 అఖిల భారత సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల తర్వాత అత్యున్నత స్థాయిలో నిలిచేవాటిలో ఒకటి ఇండియన్ ఇంజనీరింగ్
 సర్వీసెస్ (ఐఈఎస్). ఐఈఎస్‌కు ఎంపికవ్వాలని భావించని ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండరు. కానీ దాన్ని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. పట్టుదల, అంకిత భావం, విషయ పరిజ్ఞానం, లోతైన అధ్యయనం ఉన్నవారికే ఇది సొంతమవుతుంది. అలాంటి వారిలో ఒకరు రవితేజ అన్నందేవుల. బీటెక్‌లో అనారోగ్యం వెంటాడి, ఏడాది దూరం చేసినా వెరవలేదు. మొక్కవోని దీక్షతో ముందుకు సాగి  ఐఈఎస్ (2013) రాశారు. జాతీయ స్థాయిలో 49వ ర్యాంకర్‌గా మెరిసిన రవితేజ సక్సెస్ స్పీక్..
 
 సక్సెస్ స్పీక్స్
 మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. నాన్న ఏవీ కృష్ణారావు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జూనియర్ ఇంజనీర్. అమ్మ పద్మకుమారి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని. తమ్ముడు రాజీవ్ చైతన్య బీటెక్ చదువుతున్నాడు.
 
 ఏడాది చదువుకు దూరం:
 2008లో వరంగల్‌లో ఏఐఈఈఈ ద్వారా బీటెక్‌లో ఈఈఈ విభాగంలో చేరాను. రెండో సంవత్సరంలో అనారోగ్యం వెంటాడింది. ఏడాది పాటు చదువుకు దూరమయ్యాను. ఇంజనీరింగ్ చేయలేననుకున్నాను. కానీ అమ్మ, నాన్న ప్రోత్సాహంతో తేరుకున్నాను. ఐఈఎస్‌కు ఎంపికయ్యాను.
 
 సెక్షన్-1 ప్రిపరేషన్ ఇలా:
 జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ కోసం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ) పేపర్‌లను సాధన చేశాను. వీటికి సంబంధించి గత ఐదేళ్ల పరీక్ష పేపర్లను పునఃశ్చరణ చేశా. చాలావరకు ఉపయోగపడింది. గేట్‌లో 3 గంటలకు 65 ప్రశ్నలుంటే, ఇందులో 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. కాబట్టి సమాధానాల సాధనలో వేగం, కచ్చితత్వంపై దృష్టి పెట్టాను.
 
 ఫిక్స్‌డ్ వెయిటేజ్:
 ఇంజనీరింగ్ పేపర్-1,2లతో పాటు, సెక్షన్-2లోని కన్వెన్షనల్ పేపర్ల సిలబస్ గేట్ సిలబస్ పరిధి కంటే విస్తృతంగా ఉంటుంది.
 
 ఉదాహరణకు ఎలక్ట్రికల్ మెటీరియల్స్, కమ్యూనికేషన్ (అనలాగ్, డిజిటల్) ఆప్షన్ సబ్జెక్టు అయినప్పుడు ఈ అంశాల పరిధిని పెంచి చదవాల్సి ఉంటుంది. కచ్చితంగా ఎక్స్‌పెరిమెంటల్ తరహాలో గేట్ కంటే పైస్థాయిలోప్రశ్నలుంటాయి. గతంలో గేట్ రాసిన అనుభవం మేలు చేసింది. గేట్‌లా ప్రతీ అంశం నుంచి కచ్చితంగా ఇన్ని మార్కులని ఉండవు. కానీ ఒక్కో సబ్జెక్ట్‌కు 40 మార్కులని ఉంటుంది. ప్రతీ సబ్జెక్టుకు ఫిక్స్‌డ్ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ప్రణాళికతో చదివితే కచ్చితంగా మంచి మార్కులను సాధించడానికి ఆస్కారముంది.
 
 
 కన్వెన్షనల్ పేపర్:
 చదవడంతో పాటు రాయడం సాధన చేయాలి. బీటెక్‌లో పరీక్షలు ఎలా రాస్తామో అదే తరహాలో అనుసరిస్తే సరిపోతుంది. సహజ విశ్లేషణతో అర్థవంతంగా రాయాలి. బుక్‌లో ఉన్నదున్నట్లు కాకుండా సొంత శైలిలో రాశాను. గత ప్రశ్నపత్రాలతోపాటు ప్రామాణిక పుస్తకాలను చదివాను.
 
 గత ప్రశ్నపత్రాలే కీలకం:
 నా విజయంలో గత ప్రశ్నపత్రాల అధ్యయ నం చాలా వరకు ఉపయోగపడింది. బీటెక్ ఫ్యాకల్టీ సలహాలు, సూచనలు పాటించాను. ఆన్‌లైన్ పరీక్ష  సిరీస్‌లను అనుసరించాను.
 
 ఇంటర్వ్యూ సాగిందిలా:
 ఇంటర్వ్యూ 15-20 నిమిషాల పాటు సాగింది. నలుగురు నిపుణులు పలు అంశాలపై ప్రశ్నలను అడిగారు. ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుపెట్టు కోవాల్సింది ఒకటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు డిటైల్డ్ అప్లికేషన్ ఫార్మ్ (డీఏఎఫ్) లో వ్యక్తిగత వివరాలు, అలవాట్లు, విద్యా విషయాలు పొందుపరిచి యూపీఎస్సీకి పంపించాలి. అందులో ఏవైతే రాశామో వాటిని ప్రతిబింబించేలా ఇంటర్వ్యూలో ప్రశ్నలను అడుగుతారు. అభిరుచులు, అలవాట్ల గురించి అడిగారు. డీఏఎఫ్‌లో నేను ఏం రాశానో అదే చెప్పాను. ఒకటి రాసి, మరోలా సమాధానం చెబితే కొంతమేర విజయావకాశాలు సన్నగిల్లినట్లే. కాబట్టి డీఏఎఫ్ రాసే ముందు ప్రత్యేక దృక్పథం అవసరం.
 
 రోజుకు 6-8 గంటలు:

 రోజుకు 6 నుంచి 8 గంటల పాటు చదివాను. గేట్‌కు ప్రిపేరవడం ఎంతో ఉపకరించింది. బీటెక్ నుంచి నేరుగా రాయాలనుకునేవారు లోతుగా అధ్యయనం చేయాలి. కోచింగ్ తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇందుకు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోనూ మంచి కోచింగ్ కేంద్రాలున్నాయి.
 
 సివిల్స్ రాస్తా:సివిల్స్‌పై దృష్టిపెడతాను. వచ్చే ఏడాది నుంచి ప్రిపరేషన్ ప్రణాళిక వేసుకుంటాను.
 అకడెమిక్ ప్రొఫైల్
 టెన్ ్త (2006): 546/600
 ఇంటర్ (2008): 948/1000
 గేట్(2013): 2వ ర్యాంక్(జాతీయస్థాయి)
 ఏఐఈఈఈ (2008): 351వ ర్యాంక్
 బిట్‌శాట్ (2008): 320వ ర్యాంక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement