శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే.. ఒలింపియాడ్స్ | Scientific approach to increase the olimpiyads | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే.. ఒలింపియాడ్స్

Published Thu, Sep 4 2014 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే.. ఒలింపియాడ్స్

శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే.. ఒలింపియాడ్స్

 దేశంలో ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సెన్సైస్ పట్ల ఆసక్తిని పెంచడానికి ఒలింపియాడ్స్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం ఐదు విభాగాల్లో ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ (పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం).
 
 ఐదు దశలుగా
 ఒలింపియాడ్స్ ఐదు దశలుగా ఉంటుంది. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్, ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్, ట్రైనిం గ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. వీటిల్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచ ర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) పర్యవేక్షిస్తుంది.
 
 మొదటి దశ
 నేషనల్ ఒలింపియాడ్స్ దిశగా మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈఎస్). సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాల్లో ఎన్‌ఎస్‌ఈఎస్ నిర్వహిస్తారు. ఇందులో జ్ఞాపక శక్తి కాకుండా.. విద్యార్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో సీబీఎస్‌ఈ 11, 12వ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. కానీ ఆస్ట్రానమీలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలిమెంటరీ ఆస్ట్రానమీ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ సైన్స్ విభాగంలో.. సీబీఎస్‌ఈ పదో తరగతి స్థాయి సిలబస్ ఉంటుంది. ఇందులో సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా విధానం సబ్జెక్టును బట్టి వేర్వేరుగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కలయికగా ఇంగ్లిష్ భాషలో ఉంటుంది.

 సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం రెండు గంటలు. ఫిజిక్స్ పేపర్ మొత్తం 180 మార్కులకు ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ, బి రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఎలో మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 50 ప్రశ్నలు అడుగుతారు. తిరిగి పార్ట్-ఎ.. ఎ1, ఎ2 అనే రెండు సెక్షన్లుగా ఉంటుంది. ఎ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఎ2లో ఉండే 10 ప్రశ్నలకు ఇచ్చే ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటిని గుర్తించాలి. పార్ట్-బిలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగంలో పరీక్షలను మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ప్రతి పేపర్‌లో 80 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ దశను స్క్రీనింగ్ టెస్ట్‌గా పరిగణనిస్తారు.
 
 ఎంఐ ఆధారంగా
 మెరిట్ ఇండెక్స్ (ఎంఐ) ఆధారంగా రెండో దశకు అర్హత కల్పిస్తారు. ఈ క్రమంలో ప్రతి విభాగంలో టాప్ పది మంది విద్యార్థుల 80 శాతం సగటును దాని సమీప తక్కువ పూర్ణాంకానికి మెరిట్ ఇండెక్స్‌ను సమం చేస్తారు. దానికంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులను రెండో దశకు అనుమతిస్తారు. ఉదాహరణకు ఏదైనా సబ్జెక్ట్‌లో మొదటి పది మంది విద్యార్థుల సగటు స్కోర్ 92 అనుకుంటే. అందులోని 80 శాతం సగటు స్కోర్ 73.6. దీన్ని సమీప పూర్ణాంకం 73కు పరిమితం చేస్తారు. ఈనేపథ్యంలో 73 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించిన విద్యార్థులను రెండో దశకు అనుమతిస్తారు.
 
 మినహాయింపు
 గతేడాది అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో (ఐదు విభాగాలు) పాల్గొన్న విద్యార్థులు మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సదరు విద్యార్థులు నేరుగా రెండో దశ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు మినహాయింపునిచ్చారు. ఇందుకోసం నేషనల్ కో-ఆర్డినేటర్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
 
 ఐఎన్‌ఓఎస్
 ఎన్‌ఎస్‌ఈఎస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ.. ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ (ఐఎన్ ఓఎస్)కు ఎంపిక చేస్తారు. ఎన్‌ఎస్‌ఈఎస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థుల్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మంది చొప్పున విద్యార్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇందులో కూడా సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఉంటాయి. కాకపోతే ప్రశ్నలను నాన్-కన్వెన్‌షన్ పద్ధతిలో అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలింపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను రాయడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులివ్వాల్సి ఉంటుంది.
 
 మూడో దశ.. ఓసీఎస్‌సీ
 ఐఎన్‌ఓఎస్‌లో అర్హత సాధించిన విద్యార్థులను మూడో దశ ఓరియంటేషన్ కం సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)కు ఎంపిక చేస్తారు. దీన్ని కీలక దశగా భావించవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు దేశం తరపున అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్టు నుంచి 35 మంది విద్యార్థులను ఓసీఎస్‌సీకి ఎంపిక చేస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి మాత్రం 45 మందికి అవకాశం కల్పిస్తారు.
 
 హెచ్‌బీసీఎస్‌ఈలో శిక్షణ
 ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హోమి బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ)లో శిక్షణనిస్తారు. ఇది రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగత్మక శిక్షణనివ్వడంతోపాటు వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. ఈ క్రమంలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, నగదు రూపంలో పురస్కారాలను అందజేస్తారు. అంతేకాకుండా ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలంపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. వీరికేకాకుండా  ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు కూడా బహుమతులను అందజే స్తారు.
 
 ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్  ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్
 అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు సన్నద్ధం చేసేలా విద్యార్థుల శిక్షణ కోసం ఈ దశను ఉద్దేశించారు. ఇందులో హెచ్‌బీసీఎస్‌ఈ ఫ్యాకల్టీలు, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణులు కూడా పాల్గొంటారు. ఈ క్రమంలో కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్ రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజుల పాటు శిక్షణనిస్తారు.
 
 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్
 అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు విద్యార్థుల ముందు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలంపియాడ్స్‌కు వెళ్లే జట్టులో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, నిపుణులు ఉంటారు.
 ఒలింపియాడ్‌కు హాజరయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాథమిక స్థాయి పరీక్ష కాబట్టి జూనియర్ విభాగానికి ఎక్కువ ఆదరణ ఉంది. దాదాపు 30 వేల మంది నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌కు హాజరవుతుంటే.. 15 వేల మంది విద్యార్థులు జూనియర్ విభాగంలో పరీక్ష రాస్తున్నారు. విద్యార్థి తన వైజ్ఞానిక ఆలోచన, సమస్యా సాధన వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. తార్కిక శక్తి పెరుగుతుంది. ఇటువంటి పరీక్షల్లో రాణించాలంటే అవగాహన, ఇతర సబ్జెక్ట్‌లతో అనువర్తనం వంటి సామర్థ్యాలు ఉండాలి. జ్ఞాపక శక్తి ఆధారంగా కాకుండా హయ్యర్ ఆర్డర్ థింకింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. అంటే అనువర్తనం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం వంటి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఒలింపియాడ్‌లో ఏ దశలోనైనా ఎంత నేర్చుకున్నారు అనే దానికంటే ఏవిధంగా దాన్ని అన్వయించగలుగుతున్నారనే అంశానికి ప్రాధాన్యత ఉంటుంది.
 
 చదవాల్సిన పుస్తకాలు:
 Indian National Physics Olympiad-The-ory Problems and Solutions(2006-2009)
 Indian National Physics Olympiad - Theory Problems (1998 - 2005)
 Indian National Chemistry Olympiad - Theory Papers with Solutions (2002-04)
 Indian National Chemistry Olympiad - Theory Papers with Solutions (2005-07)
 Indian National Biology Olympiad - Theory Papers (2002-2004)Indian National Biology Olympiad - Theory Papers (2005 - 2007)
 Question Papers of Indian National Astronomy Olympiad (1999 - 2008)
 Problem Primer for Olympiads
 Functional Equations
 Inequalities: An Approach Through Problems
 Challenge and Thrill of Pre-College Mathematics
 Experimental Problems in Chemistry
 గత పేపర్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement