నైపుణ్యాల పరీక్ష.. ఒలింపియాడ్స్ | Skills test .. olympiads | Sakshi
Sakshi News home page

నైపుణ్యాల పరీక్ష.. ఒలింపియాడ్స్

Published Thu, Sep 12 2013 1:07 PM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM

Skills test .. olympiads

దేశంలోని ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సెన్సైస్ పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు.. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను పరీక్షించేందుకు ఉద్దేశించినవి  ఒలింపియాడ్స్. విద్యార్థుల్లో ఆయా సబ్జెక్ట్‌లలో అన్వయం, విశ్లేషణ, సునిశిత పరిశీలన, సృజనాత్మకత, నిర్ణయాత్మక సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఒలింపియాడ్స్‌కు అంకురార్పణ జరిగింది.
 
 ఒలింపియాడ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే ఒలింపియాడ్స్‌కు హాజరుకావాలంటే మన దేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) నిర్వహించే ఒలింపియాడ్స్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
 
 మొత్తం ఐదు దశలుగా ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్, ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ (ప్రీ డిపార్చర్ కమ్ ట్రైనింగ్ క్యాంప్), ఇంటర్నేషనల్ ఒలింపియాడ్.
 
 ఐదు సబ్జెక్ట్‌లు:
 మొత్తం ఐదు సబ్జెక్ట్‌ల్లో ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్. ఇందులో మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈ)ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను  మాత్రం హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్‌బీసీఎస్‌ఈ) పర్యవేక్షిస్తుంది.
 
 ఎన్‌ఎస్‌ఈ ఇలా:
 సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈ)ను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ సబ్జెక్ట్‌లలో ప్రశ్నల క్లిష్టత సీబీఎస్‌ఈ 12వ తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి సిలబస్ ఆధారంగా జూనియర్ ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఫిజిక్స్ ప్రశ్నపత్రం మాత్రమే హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఉంటుంది. అది కూడా 300 మంది విద్యార్థులు ఎంచుకుంటే మినహా మిగతా అన్ని సబ్జెక్ట్‌లకు ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది.
 
 240 మార్కులు:
 జూనియర్ ఒలింపియాడ్‌తో సహా అన్ని విభాగాలకు ప్రశ్నపత్రం 240 మార్కులకు ఉంటుంది. సబ్జెక్ట్‌లను అనుసరించి పరీక్షా విధానం వేర్వేరుగా ఉంటుంది. ఫిజిక్స్ పేపర్ లో పార్ట్-ఏ, బీ రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏ కు 180 మార్కులు కేటాయించారు. పార్ట్-ఏ ను తిరిగి ఏ1, ఏ2గా విభజించారు. ఇందులో ఏ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇవి సింగిల్ కరెక్ట్ ఆప్షన్ ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్). ఏ2లో 10 ప్రశ్నలు వస్తాయి. వీటికి ఇచ్చిన ఆప్షన్స్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి.
 
 ఇందులో సరైన సమాధానాలన్నిటినీ గుర్తించాలి. పార్ట్-బీలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి 60 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాలకు మాత్రం 80 ప్రశ్నలు ఇస్తారు. ఇవి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఆస్ట్రానమీ విభాగంలో మాత్రం అధిక శాతం ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి వస్తాయి.
 
 20 శాతం ప్రశ్నలు బేసిక్ ఆస్ట్రానమీ నుంచి ఇస్తారు. జూనియర్ ఒలింపియాడ్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యత ఉంటుంది. రెండో దశకు అర్హత సాధించే క్రమంలో సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రతి విద్యార్థి 40 శాతం కనీసం స్కోర్ (మినిమమ్ అడ్మిసబుల్ స్కోర్) సాధించాలి.
 
 నమోదు ఇలా:
 మీరు చదివే స్కూల్/కాలేజీ ద్వారా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్‌ఎస్‌ఈ)కు పేరును నమోదు చేసుకోవచ్చు. లేదా ఐఏపీటీ వెబ్‌సైట్‌లో ఎన్‌ఎస్‌ఈ పరీక్షా కేంద్రాలు, సంప్రదించాల్సిన అధికారుల సమాచారం అందుబాటులో ఉంది. తద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
 
 నేషనల్స్:
 నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను తర్వాతి దశ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ (ఐఎన్‌ఓఎస్)కు ఎంపిక చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్ట్‌లను అనుసరించి ఇండియన్ నేషనల్ ఫిజిక్స్/కెమిస్ట్రీ/ బయాలజీ/ ఆస్ట్రానమీ/ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌గా వ్యవహరిస్తారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మందికి రెండో దశలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించిన పరీక్షా కేంద్రాలు, ఆ సబ్జెక్ట్‌లో దేశ వ్యాప్తంగా హాజరైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రెండో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అన్ని విభాగాలకు సంబంధించి 309 మంది మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్‌ల వారీగా: ఫిజిక్స్-49; కెమిస్ట్రీ-55; బయాలజీ-11; ఆస్ట్రానమీ-72; జూనియర్ సైన్స్- 122; మొదటి దశలో అనుసరించిన సిలబస్‌నే ఈదశలోనూ వినియోగిస్తారు. ప్రశ్నలు నాన్-కన్వెన్‌షన్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలింపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులను గుర్తించాలి.
 
 సైద్ధాంతిక + ప్రయోగాత్మక:
 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌కు హాజరయ్యే క్రమంలో ఈ మూడో దశ.. ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్‌సీ)ను కీలకమైందిగా భావించవచ్చు. రెండో దశ ఐఎన్‌ఓఎస్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మూడో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్ట్ నుంచి 35 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
 
 జూనియర్ సైన్స్ విభాగం నుంచి 45 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఓసీఎస్‌సీకి ఎంపికైన విద్యార్థులకు హెచ్‌బీసీఎస్‌ఈలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రెండు నుంచి నాలుగు వారాల పాటు ఓరియెంటేషన్ క్యాంప్ ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగాత్మక శిక్షణనిస్తారు. వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు.
 
 సైద్ధాంతిక, ప్రయోగాత్మక అనే రెండు నైపుణ్యాలాధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు. ఇందులో సైద్ధాంతిక నైపుణ్యానికి 60 శాతం, ప్రయోగాత్మక నైపుణ్యానికి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ మెరిట్ ఆధారంగా ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు.
 
 వీరికి పుస్తకాలు, క్యాష్ రూపంలో రూ.5 వేల మెరిట్ అవార్డులు ఇస్తారు. అంతేకాకుండా వీరికి ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొనే అవకాశం లిభిస్తుంది. వీరికేకాకుండా థియరీ, ఎక్స్‌పెరిమెంటల్ పరంగా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు బహుమతులను కూడా అందజేస్తారు.
 
 ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్:
 అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు ఎంపికైన విద్యార్థుల శిక్షణకు ఉద్దేశించిన దశ.. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. ఈ దశలో అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు హెచ్‌బీసీఎస్‌ఈలో శిక్షణనిస్తారు. ఇందులో హెచ్‌బీసీఎస్‌ఈ ఫ్యాకల్టీ, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణులు కూడా పాల్గొంటారు. ఇందుకోసం ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్‌కు రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజులు శిక్షణనిస్తారు.
 
 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల విద్యార్థుల ముందు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలింపియాడ్స్‌కు వెళ్లే టీమ్‌లో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో ప్రతి జట్టు నుంచి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు.
 
 బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి జట్టు నుంచి నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. జూనియర్ సైన్స్ విభాగంలో 12 మంది విద్యార్థులు (6 గురు చొప్పున రెండు జట్లు), ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒలింపియాడ్స్‌ను రెండు రోజులపాటు నిర్వహిస్తారు. మొదటి రోజు థియరటికల్ ప్రాబ్లమ్స్, రెండో రోజు ఎక్స్‌పెరిమెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమాధానాల కోసం ఐదు గంటల సమయం కేటాయిస్తారు. కెమిస్ట్రీ ఒలింపియాడ్ కూడా థియరటికల్, ఎక్స్‌పెరిమెంటల్ ప్రశ్నల కలయికగా రెండు రోజుల పాటు ఉంటుంది.
 
 ఆస్ట్రానమీలో మాత్రం నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. థియరటికల్ ఎగ్జామ్ (15 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 2-3 దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సమయం ఐదు గంటలు), డేటా అనాలిసిస్ ఎగ్జామ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించాలి, సమయం నాలుగు గంటలు), అబ్జర్వేషనల్ ఎగ్జామ్ (ఆకాశం/ప్లానిటోరియంలో.. నక్షత్రాలు, వివిధ అంశాలను పరిశీలిస్తూ సమాధానం ఇవ్వడం తరహా), టీమ్ కాంపిటీషన్. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్‌లో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. టెక్ట్స్ ఎగ్జామ్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్‌ల నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి, సమయం మూడు గంటలు), థియరటికల్ ఎగ్జామ్ (సమయం మూడు గంటలు), ఎక్స్‌పెరిమెంటల్ ఎగ్జామినేషన్ (సమయం మూడు గంటలు).
 
 మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది
 మన రాష్ట్రం నుంచి దాదాపు 24,000 మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్‌కు హాజరవుతున్నారు. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షను దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాస్తున్నారు. దేశం మొత్తం మీద మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్‌కు హాజరువుతున్నారు. ఇందుకోసం 2012-13 విద్యా సంవత్సరంలో 351 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక విద్యార్థి సంబంధిత సబ్జెక్ట్‌లో తన అవగాహన స్థాయిని తెలుసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిభను అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తాయి.
 
 ఇందులో ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్‌లో ఉంటాయి. ఒక సమస్యకు సంబంధించి సూత్రాన్ని గుర్తుతెచ్చుకోవడానికి జ్ఞాపక శక్తి సరిపోతుంది. కానీ దాన్ని సమస్యకు అన్వయించి, సాధించడానికి మాత్రం మూల భావనలపై పట్టు అవసరం. ఇదే అంశం ఆధారంగా ఒలింపియాడ్స్‌లో ప్రశ్నలు ఉంటాయి. ఒక రకంగా జ్ఞాపక శక్తి కంటే నైపుణ్యాలను ఒలింపియాడ్స్‌లో పరీక్షిస్తారు. వివిధ రకాల ప్రయోగాలతో సైన్స్‌ను ఒక కొత్త కోణంలో, ఆసక్తికరంగా నేర్చుకునే విధంగా హెచ్‌బీసీఎస్ శిక్షణ ఉంటుంది. సునిశిత పరిశీలన, ప్రయోగాత్మకంగా, అనువర్తనం వంటి స్కిల్స్ పెంపొందించేలా ఈ శిక్షణ ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బెంచ్‌మార్క్ ఎగ్జామ్‌గా ఒలింపియాడ్స్‌ను పరిగణించవచ్చు.
 -ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ప్రొఫెసర్ ఇన్‌చార్జ్
 నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్.
 
 ఎన్‌ఎస్‌ఈ
 అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ: 12వ తరగతి/ దిగువ తరగతులు చదువుతుండాలి. వయసు: 1994 జూలై 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి (ఆస్ట్రానమీ విద్యార్థులకు వయసు: 1995, జనవరి 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి).
 జూనియర్ సైన్స్: పదో తరగతి/దిగువ తరగతి
 వయసు: 1999,జనవరి 1న/తర్వాత జన్మించినవారు
 
 షెడ్యూల్: నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్: నవంబర్ 24, 2013.
 ఎన్‌రోల్‌మెంట్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2013.
 నేషనల్ ఒలింపియాడ్స్: ఫిబ్రవరి 1-2, 2014.
 ఫలితాల వె ల్లడి: మార్చి 1, 2014
 ఓసీఎస్‌సీ షెడ్యూల్: ఏప్రిల్-జూన్, 2014.
 వివరాలకు:www.olympiads.hbcse.tifr.res.in, www.iapt.org.in
 
 రిఫరెన్స్ బుక్స్
 Indian National Physics Olympiad Theory Problems and Solutions (2006 - 2009)
 Biological Sciences D.J. Taylor, N.P.O. Green and G.W. Stout.
 Principles of Bio-chemistry A.L. Lehninger, D.L.Nelson and M.M.Cox
 The Nature of Life John Postlethwait and Janet Hopson
 Textbooks of Physics and Mathematics by NCERT, upto Class XII.
 Concepts of Physics H.C.Verma
 Astronomy: Principles and Practice M.N. Roy and R.C. Clark
 Indian National Chemistry Olympiad Theory Examination Papers (2002 - 2007),
 Savita Ladage and Swapna Narvekar.
 Challenge and Thrill of PreCollege Mathematics Author: V Krishnamurthy,
 C R Pranesachar, K.N. Ranganathan, and B J Venkatachala.
 Experimental Problems in Chemistry, Savita Ladage, Swapna Narvekar and Indrani Sen.
 
 అవార్డులు
 ప్రతి సెంటర్‌లో టాప్ 10 శాతం మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు.
 ప్రతి రాష్ట్రం/సబ్జెక్ట్ నుంచి టాప్ ఒక శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు.
 ప్రతి సబ్జెక్ట్‌లో జాతీయ స్థాయిలో టాప్ ఒక శాతంలో ఉన్న విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లతోపాటు బహుమతులను కూడా ప్రదానం చేస్తారు.
 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్‌లో టాప్ 35లో నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు.
 
 ఐదు సబ్జెక్ట్‌లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,
 ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్‌లలో ఐదు దశలుగా ఒలింపియాడ్స్‌ను నిర్వహిస్తారు. అవి..
 
 నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్(240మార్కులు)
 
 ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్
 
 ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్
 
 ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్
 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్
 
 ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement