ఆటుపోట్లను ఆస్వాదిస్తూ ముందుకెళ్తూ విజయ శిఖరాన్ని అందుకోవడంలో దొరికే ఆనందం అనిర్వచనీయం.
ఆటుపోట్లను ఆస్వాదిస్తూ ముందుకెళ్తూ విజయ శిఖరాన్ని అందుకోవడంలో దొరికే ఆనందం అనిర్వచనీయం.. నిజమైన విజేత సాఫ్ట్‌స్కిల్స్ ఉపయోగించి.. తనకు, తన యాజమాన్యానికి, తన బృంద సభ్యులకు మేలు చేయగలడు.
ఆశావహ దృక్పథం.
బాధ్యతను ఆనందంగా స్వీకరించే గుణం.
హాస్య చతురత.
సౌశీల్యం.
ఇవి మీరు సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవరచుకునేందుకు అనుకూలమైన మానసిక స్థితిని కల్పిస్తాయి. సాఫ్ట్‌స్కిల్స్ అంటే కృత్రిమంగా పెదవులపైకి తెచ్చుకున్న నవ్వు కాదు.. హృదయపు లోతుల నుంచి బయటకొచ్చే సహజమైన ఉల్లాసం.
మంచి అలవాట్లు
భావ వ్యక్తీకరణ
నాయకత్వ లక్షణాలు
బృంద స్ఫూర్తి
సాంఘిక జీవనం
పట్టువిడుపు ధోరణితో చర్చించే గుణం
బోధనా సామర్థ్యం
సమయస్ఫూర్తి
ఇవన్నీ సాఫ్ట్‌స్కిల్స్ కిందకు వస్తాయి.
సాఫ్ట్‌స్కిల్స్ అసలు లక్ష్యం?
సాఫ్ట్‌స్కిల్స్ అసలు లక్ష్యం.. తిమ్మినిబమ్మి చేసి, బమ్మినితిమ్మి చేసి పని పూర్తయ్యేలా చూసుకోవడం కాదు. నిజమైన విజేత షార్‌టకట్స్ ద్వారా విజయం సాధించాలనుకోడు. ఆటుపోట్లను ఆస్వాదిస్తూ ముందుకెళ్తూ విజయపు శిఖరాన్ని అందుకోవడంలో దొరికే ఆనందం..అడ్డదారుల్లో దొరకదు. నిజమైన విజేత సాఫ్ట్‌స్కిల్స్ ఉపయోగించి.. తనకు, తన యాజమాన్యానికి, తన బృంద సభ్యులకు మేలు చేయగలడు. చాలా ఏళ్లుగా హెచ్‌ఆర్ మేనేజర్లతో మెలిగిన అనుభవంతో ఈ మాటలు చెబుతున్నా...!
ఒక ఉద్యోగిని నియమించుకునేందుకు కంపెనీల యాజమాన్యాలు నిర్వహించే వడపోత పరీక్షల్లో హెచ్‌ఆర్ రౌండ్ కీలకమైంది. హెచ్‌ఆర్ మేనేజర్లకు ప్రధానంగా మూడు భయాలుంటాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు అవసరమైన ప్రశ్నల్నే వారు అభ్యర్థులను అడుగుతారు. అవి:
1.ఈ ఉద్యోగం మీరు చేయగలరా?
ఉద్యోగం చేసేందుకు తగిన హార్డ్‌స్కిల్స్, టెక్నికల్ పరిజ్ఞానం, ఇతర అర్హతలు.. అభ్యర్థికి ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రశ్నలు అడుగుతారు. అవి ఈ కింది విధంగా ఉంటాయి..
నీవు ఈ ఉద్యోగానికి అర్హుడవని ఎందుకనుకుంటున్నావు?
నీ అర్హతల గురించి చెప్పు?
ఇప్పటి వరకు నీవు సాధించిన విజయాల్లో గొప్ప విజయమేంటి?
ఏదైనా ఉద్యోగ అనుభవం ఉందా?
ఈ ఉద్యోగానికి నిన్నే ఎందుకు ఎంపిక చేయాలి? వంటి ప్రశ్నలు.
2.ఈ ఉద్యోగంలో ఎంత కాలం ఉంటారు?
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు ఎడాపెడా కంపెనీలు మారడం సర్వసాధారణమైంది. ఒకప్పటిలా ‘ఒక జీవిత కాలానికి ఒకే ఉద్యోగం’ అనేది ఇప్పటి తరానికి ఊహకు కూడా అందని విషయం. ఇలా తరచూ ఉద్యోగాలు మారే వారిని హెచ్‌ఆర్ పరిభాషలో జాబ్ హోపర్స్ (job hoppers)గా పేర్కొంటారు.
ఓ అభ్యర్థిని ఉద్యోగానికి ఎంపిక చేయడం దగ్గర నుంచి అతను ఉద్యోగం చేసేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వరకు వివిధ దశలు దాటిన తర్వాతే ఆ అభ్యర్థి నుంచి సంస్థకు అసలైన ఉత్పాదక సామర్థ్యం అందుతుంది. ఈ దశల్లో అభ్యర్థిపై సంస్థ చాలా సమయాన్ని, డబ్బును వెచ్చిస్తుంది. అలాంటప్పుడు అభ్యర్థి... చాలా త్వరగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతే సంస్థకు నష్టమే కదా! ఇది హెచ్‌ఆర్ మేనేజర్లకు పెద్ద సమస్య. అందువల్ల హెచ్‌ఆర్ రౌండ్‌లో అభ్యర్థిని ప్రశ్నించే ప్రశ్నలు ఇలా ఉంటాయి...
మీ లక్ష్యం ఏమిటి?
ఐదేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటారు?
మీ కలల కొలువు (Dream Job) ఏది?
ఒకవేళ మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక కాకుంటే ఏం చేస్తారు?
3.ఈ ఉద్యోగానికి మీరు సరిపోతారా?
దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలు మీ వ్యక్తిత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. మీకు ఉద్యోగానికి సరిపోయే హార్డ్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నప్పటికీ.. మీరు జీవిత కాలం అక్కడే పనిచేసేందుకు సిద్ధపడినప్పటికీ సరైన వ్యక్తిత్వం లేకుంటే హెచ్‌ఆర్ మేనేజర్లు.. మీ అభ్యర్థిత్వాన్ని శంకిస్తారు. కాబట్టి ‘శీలేన శోభతే విద్య’ అనే నానుడిని గుర్తుంచుకొని సౌశీల్యం, వ్యక్తిత్వం, నడవడి, మంచి ఆలోచనా ధోరణిని అలవర్చుకోవాలి.
ఈ విభాగంలో ప్రశ్నలు ఇలా ఉంటాయి...
మీ స్నేహితుడిలో మీకు అస్సలు నచ్చని గుణాలను ఏకరువు పెట్టండి?
మీరు బాగా ఇష్టపడే, ప్రేరణ పొందిన వ్యక్తి ఎవరు?
బెట్టింగ్ మన దేశంలో నేరం. దీన్ని అరికట్టలేం కాబట్టి చట్టబద్ధం చేస్తే సరి..! అని మీకెప్పుడూ అనిపించలేదా?
మీరేమైనా ప్రశ్నలు అడగదలచుకున్నారా?..
ఇలా సాగుతాయి.
సాఫ్ట్‌స్కిల్స్ మెండుగా ఉన్న అభ్యర్థికి పై ప్రశ్నల్లో ఏవీ సమాధానాలు చెప్పేందుకు కష్టమైనవి కావు.. ఎందుకంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు (కమ్యూనికేషన్ స్కిల్స్); సమయస్ఫూర్తి (కామన్ సెన్స్); సహానుభూతి (ఎంపథీ).. అభ్యర్థి సొంతం కనుక!
సాఫ్ట్‌స్కిల్స్ లేకుండా హార్డ్‌స్కిల్స్ ఒక్కటే ఉన్న అభ్యర్థి సమాధానాలు ఇలా ఉంటాయి..
ప్రశ్న: నీవు ఎన్నేళ్లు ఈ సంస్థలో పనిచేయాలనుకుంటున్నావు?
సమాధానం: ఐదేళ్లు. లేదంటే ఏదో ఒక సంఖ్య.
ప్రశ్న: ఐదేళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు?
సమాధానం: సక్సెస్‌ఫుల్‌గా..
ఇలా అతనికి తెలిసింది ఒకటే రోబో మాదిరిగా సమాధానాలు చెప్పటం.
సాఫ్ట్‌స్కిల్స్ అధికంగా ఉన్న వ్యక్తి సమాధానం ఇలా ఉంటుంది.
మొదటి ప్రశ్నకు సమాధానం: ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు. నాకు తెలియకుండానే కాలేజీలో చేరినప్పటి నుంచి మీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక బలంగా ఉండిపోయింది. ఎటు చూసినా ‘టాటా కంపెనీ’ ఉత్పత్తులే కనిపించడం వల్లే కావొచ్చు..! కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే టీసీఎస్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా కల నెరవేరబోతున్నప్పుడు సంస్థలో ఇన్నేళ్లు మాత్రమే ఉండాలన్న ఆలోచనలకు తావులేదు. సంస్థను వీడిపోయే ప్రసక్తే లేదు. ఇది ఊకదంపుడు ఉనన్యాసం కాదు.. గుండె లోతుల నుంచి నిజాయితీగా వచ్చిన సమాధానం. ఈ సమాధానం చెప్పిన అమ్మాయి పదేళ్ల కిందటి నుంచి ఇప్పటికీ టీసీఎస్‌లోనే పనిచేస్తోంది.
Vivekanand Rayapeddi
Director, Royal Spoken English